Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 30


    "అమ్మాయిగారూ, అమ్మమ్మగారు ఫోను చేశారు. మిమ్మల్ని ఉన్నపలాన బయలుదేరి రమ్మన్నారు. ఎంత వేగంగా రాగలిగితే అంత వేగంగా రమ్మన్నారు. మనం బయలుదేరి వెళదాం. సామానులు అవీ పేక్ చేసి శివయ్య తెస్తాడు." అన్నాడు మణి.
    "అవునమ్మాయి గారూ." అన్నాడు శివయ్య.
    స్వప్నకి చిరాకేసింది ఆ కబురు వినగానే. ఏమిటే అమ్మమ్మ ధోరణి! హాయిగా పిక్నిక్ కాని అడిగే వచ్చాడు కదా? ఇంత అర్జెంటుగా ఫోనేమిటి? ఏం కొంప మునిగింది? అనుకుంది.
    మిగతా అందరూ మతిపోయినట్టుగా అయిపోయాడు. ఉత్సాహం అణిగిపోయింది. పొంగే పాలపై చన్నీరు చిలకరించినట్లు అయింది. నిరాశగా నిస్పృహగా చూశారు అంతా ఆమె వైపు.
    "బయలుదేరు దామా అమ్మా?" వినయంగా అడిగాడు మణి.
    "విషయం చెప్పలేదా?"
    "లేదమ్మగారూ! ఆ మాటకొస్తే ఫోన్ చేసింది అమ్మమ్మగారు కాదు. వెంకట్రామయ్యగారు. ఆయన గొంతులో ఏదో గాబరా, ఆందోళన, దుఃఖం కనిపించాయి నేను వివరంగా అడగలేక పోయాను. అయినా ఆయన అంత వ్యవధి కూడా యివ్వలేదు. విషయం కాస్తా చెప్పేసి చప్పున బయలుదేరి రమ్మన్నారు!" అన్నాడు మణి.
    "వెంకట్రామయ్యగారు ఫోన్ చేశారా?" అడిగింది స్వప్న.
    "అవునమ్మా! వెంటనే బయలుదేరాలి మనం. ఇప్పటికే పది నిముషాలు ఆలస్యమైంది?" అన్నాడు మణి సమాధానంగా.
    చిరాగ్గా చూసింది స్వప్న. ముహూర్తం మించిపోతున్నట్టు, అమృత ఘడియలు వెళ్ళిపోతున్నట్టు, అవతల ఆలస్యమైతే ఉరితీసేస్తారనో అన్నట్టుగా త్వరపెడుతున్న మణిని చూసి విసుక్కుంది.
    అయినా చేసేది లేక ప్రయాణమైంది. అంతా అనుసరించారామెని. ఆ సమయానికే వాళ్ళ లగేజీ అంతా పేక్ చేసింది శివయ్య కూతురు లచ్చిమి, ఆమెతో ఆ పనిచేయించింది వినయ.....ఇద్దరికీ థాంక్స్ చెప్పింది స్వప్న.
    కార్లు రెండూ బయలుదేరాయి.
    ఊరి పొలిమేర హద్దుల్లో కార్లకి ఎదురుగా నడిచి వస్తోన్న ఓ స్త్రీని చూపించి "అమ్మాయిగారూ! ఆమే మీ మామయ్య భార్య సుందరమ్మగారు!" అన్నాడు మణి.
    అంతలో కారు దాటేసిందామెని.
    ఆ క్షణంలో సగంలో ఆమె కారువైపూ, స్వప్న ఆమె వైపూ చూసేరు. ఇద్దరి కళ్ళూ కలుసున్నాయి ఆ క్షణంలోనే.
    పవిత్రంగా మూర్తీభవించిన మాత్రుత్వంలా, ఆత్మ విశ్వాసంలా కనిపించిందామె స్వప్నకి. ఆమె ఏమీ మాటాళ్ళేదు. కారు వేగం పుంజుకుంది.
    
                                          21
    
    అమ్మమ్మగారు ఫోన్లోమాటాడి "అయ్యో!" అంటూ నేలపై పడిపోగానే వెంకట్రామయ్యకి గుండె బేజార్చేపోయింది. "పెద్దమ్మగారూ! అమ్మగారూ! అమ్మమ్మ గారూ!" అంటూ గాబరాగా పిలిచాడు.
    అయితే అమ్మమ్మగారు స్మృతి తప్పిపోయారు. అతని పిలుపులకి పలకలేదు. దాంతో మరీ గాబరా పడ్డాడు వెంకట్రామయ్య. వెంటనే కేకలు వేశాడు. దాంతో వంటింటి నుంచి ఆయా, బయట నుంచి తోటమాలి పరిగెత్తుకు వచ్చారు. అక్కడ ఆ స్థితిలో వున్న ఆమెని చూసి గుండె చెరువై పోయింది వాళ్ళకి. ఆదుర్దా పిలిచి, పిలుపందుకు సమాధానం యివ్వని కృష్ణవేణమ్మగారిని చూసి ఆందోళనగా అటూ యిటూ వెళ్ళేరు.
    ఆయా వెళ్ళి రవితో విషయం చెప్పింది. "ఏమైంది బాబూ! అమ్మగారు ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయారు. సమయానికి అమ్మాయిగారు కూడా లేరు. ఆజిత్తుల మారి ముందా కొడుకు వెంకట్రామయ్య ఏం చేస్తాడో ఏమో చప్పున రండి బాబూ!" అంది ఏడ్చేస్తూ.
    రవికి అంతా వింతగా అనిపించింది. ఇంత దాకాజెమినీ సర్కస్ లో పెద్దపులిలాగా వుండే అమ్మమ్మగారి కేవలం యిది, అనుకుంటూ గబగబా వచ్చేడు. స్వాతి కూడా అతన్ననుసరించి వచ్చింది.
    హాల్లో పరిస్థితి చూడగానే అతనికి హాల్లో అశుభం కనిపించినట్టయింది. చప్పున అంతకి అరగంట పూర్వం అశుభం కనిపించినట్టయింది. చప్పున అంతకి అరగంట పూర్వం నరసింహం చెప్పిన మాటలు గుర్తుకివచ్చేయి. వెంటనే అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళేడు. ఆమె స్మృతిలో లేదు.
    అతనికి వెంటనే తన కర్తవ్యంగుర్తుకి వచ్చింది.
    "ఆయా అమ్మమ్మగారిని మెల్లిగా బెడ్ పై పడుకోబెట్టండి." అన్నాడు. వెంటనే ఆ ఏర్పాట్లు చేసింది. తర్వాత ఫోన్ వద్దకి వెళ్ళేడు. ఇంకా క్రెడిల్ కాకుండా వేలాడుతున్న ఫోన్ అందుకుని వెంటనే వెంకట్రామయ్యని అడిగేడు "ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది?"
    అతను పెదవి విరిచాడు.
    రవి ఎక్స్ ఛేంజ్ కి రింగ్ చేశాడు. ఎంక్వయిరీస్ నుంచి ఆ ఫోన్ ఎక్కడినుంచి వచ్చిందో అడిగి తెలుసుకుని అక్కడికి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాడు. అతనికి తల తిరిగి నట్టయింది తమాయించుకుని ఆమె డెడ్ బాడీని అక్కడికి చేర్చే ఏర్పాటు చేయమని వెంటనే వచ్చి అమమ్మగారిని చూడమని కోరేడు. తర్వాత వెంకట్రామయ్యకి స్వప్న ఎక్కడికి వెళ్ళిందో కనుక్కుని అక్కడికి లైట్ నింగ్ కాల్ బుక్ చేసి తక్షణం ఉన్న దాన్ని ఉన్నపళంగా బయలుదేరి రమ్మని విషయం చెప్పొద్దని చెప్పి బయటికి వెళ్ళేడు.
    ఆశ్చర్యంగా, వింతగా, కోపంగా, అవమానకరంగా, పరిస్థితి చేజారి అధికారం అతని వైపుకి పరుగు తీస్తున్నట్టు చూశాడు వెంకట్రామయ్య. అయితే రవి ఆయనకేసి బదులుగా చూసిన చూపు ఆయన్ని మరి ఊహించేందుకు అవకాశం యివ్వలేను. వినయ విధేయతలు గల గుమాస్తాలాగా ప్రవర్తించేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS