Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 31


    ఆశ్చర్యంగా ఆమె మొహంలోకి చూసింది సృజన. కామాక్షి మొహంజ్వరం వచ్చినట్లు కందిపోయి ఉంది.
    "చాక్లెట్లు అయిపోయాయి కామాక్షి! ఇవాళే మళ్ళీ తెచ్చాడు ఉస్మాన్! అందుకే నిన్నరాలేదు!" అంది సృజన.
    వణుకుతున్న చేతులతో ఒక చాక్లెట్ రేపర్ చింపి ఆత్రంగా దాన్ని నోట్లో పెట్టేసుకుంది కామాక్షి. కొద్దిగా నమిలి తర్వాత పట్టలేని నిరాశతో దాన్ని తుపుక్కున ఉమ్మేసింది.
    "ఇంకాపు సృజన! రోజూతినే చాక్లెట్లే కావాలి నాకు ఇవి తెచ్చారేం? ఛండాలంగా ఉన్నాయి!"
    "మొన్న నీకు ఇచ్చింది కూడా ఇవే చాక్లెట్లు కామాక్షి! కాడ్ బరీస్!"
    "ఏంకాదు! నువ్వుత్త అబద్దాలకోరు!" అంది కామాక్షి గొంతు పెద్దదిచేస్తూ తన మాటలు ఎవరన్నా వింటారేమో అన్న భయం ఆమెకు ఉన్నట్లు లేదు ఇప్పుడు. ఆమె శరీరం వశంలో లేకుండా వణుకుతోంది వళ్ళంతా చెమటలుపడుతున్నాయి.
    "కామాక్షి" అంది సృజన ఆరాటంగా ఆ అమ్మాయి ప్రవర్తన విచిత్రంగా కనబడుతోంది సృజనకి.
    మొండిగా అంది కామాక్షి. "నాకు ఈ దరిద్రపుగొట్టు చాక్లెట్లు వద్దు మొన్న తిన్నవే కావాలి!"
    "వాటికీ వీటికీ తేడా ఏం లేదు కామాక్షి అన్నీ ఒక్కటే!" అంది సృజన మళ్ళీ నచ్చచెప్పబోతూ.
    "నీ మొహం! వాటి రుచే వేరు! అవి తింటే వెంటనే మత్తుగా ఉంటుంది. తర్వాత నిద్రొచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంక ఈ నొప్పీగిప్పీ ఏం తెలియవు. నాకు ఆ మాత్రం తేడాతెలియదా? నేనేం చిన్నపాపాయిని కాదు. సెవెన్త్ క్లాస్ చదువుతున్నాను. తెలుసా!"
    ఆమె ఏం మాట్లాడుతుందో మొదట అర్ధంకాలేదు సృజనకి. అర్ధమయ్యాక ఒక్కసారి గుండె లయతప్పినట్లయింది.
    చాక్లెట్లు తింటే మత్తెక్కుతోందా? అంటే?
    అప్పుడు హఠాత్తుగా గమనించింది సృజన తన వెనుక ఎవరో నిలబడిఉన్నట్లు!
    చటుక్కున వెనుదిరిగి చూసింది.
    భూతంలా నిలబడివున్నాడు ఉస్మాన్ అక్కడ! అతని మొహంలో క్రౌర్యం తో కూడిన నవ్వు కనబడుతోంది.
    అంటే!....
    "అవును!" అన్నాడు ఉస్మాన్ గర్వంగా!
    "ఆ చాక్లెట్లు వేరు! ఈ చాక్లెట్లు వేరు! వాటిలో డ్రగ్స్ కలిపింది మేమే!"
    కామాక్షి ఒక్క పరుగున ఉస్మాన్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆశ కనబడుతోంది ఆమె కళ్ళలో.
    "నాకు ఆ చాక్లెట్లు పెట్టవా?" అంది ఆత్రంగా.
    "అయిలేవు ఉన్నవి తినరాదూ?" అన్నాడు ఉస్మాన్ పరిహాసంగా.
    "నాకు ఇవి వద్దు! ఆ చాక్లెట్లేకావాలి!" అంది కామాక్షి అతన్ని తాకుతున్నంత దగ్గరగా నిలబడి తలఎత్తి అతని మొహంలోకి జాలిగా చూస్తూ.
    నిర్లక్ష్యంగా ఆమెని దూరంగా నెట్టేశాడు ఉస్మాన్.
    వెంటనే జారి అతని పాదాల దగ్గరపడిపోయింది కామాక్షి చేతులతో అతని కాళ్ళని చుట్టేసింది.
    "ఆ చాక్లెట్లు తినకపోతే నాకు జ్వరమొచ్చేస్తోంది! పిచ్చెక్కేటట్లు ఉంది! చచ్చిపోతాను!" అంది ఏడుపు గొంతుతో.
    విహ్వలంగా ఇదంతా చూస్తున్న సృజన మోకాళ్ళు బలహీనంగా అయిపోయాయి.
    "నాకు చాక్లెట్లు కావాలి! ప్లీజ్!" అంటోంది కామాక్షి. "అవి తింటే నొప్పి తెలియదు నాకు ఆకలి తెలియదు మత్తుగా హాయిగా ఉంటుంది" అంది ముక్కు ఎగబీలుస్తూ జలుబు చేసినట్లు వస్తోంది ఆమె గొంతు.
    మళ్ళీ పెద్దగా నవ్వాడు ఉస్మాన్. "చాక్లెట్లు లేవుగానీ నొప్పి తెలియకుండా హాయిగా మత్తెక్కించే మరో మందు ఉంది నాదగ్గర!" అన్నాడు ఊరిస్తున్నట్లు.
    ఆ మాటలు వింటుంటే సృజనకి తన తండ్రి గుర్తువచ్చాడు. తమకోసం స్వీట్సో, మరేదో బహుమతో తీసుకొచ్చినప్పుడు అదేవిటో చెప్పకుండా కాసేపు ఊరికే ఊరించి బతిమాలించుకుని తర్వాత దాన్ని మురిపెంగా బయటపెట్టే తండ్రి!
    ఆయనతో పోలిస్తే ఈ నీచుడు....
    ఉస్మాన్ మాటలు వినగానే కామాక్షి మొహంలో ఆశా, అవమానం రెండూ తొంగిచూశాయి.
    "మందా? ఏం మందు?" అంది ఆరాటంగా.
    "బ్రౌన్ షుగర్!" అన్నాడు ఉస్మాన్.
    జేబులోంచి చిన్న పొట్లం తీశాడు అతను. దానిలో ఒక క్వార్టర్ బ్రౌన్ షుగర్ ఉంది. ఒక క్వార్టర్ అంటే నూరుమిల్లీ గ్రాములు. డ్రగ్స్ అన్నిటిలోకి అతిదారుణమైన డ్రగ్ బ్రౌన్ షుగర్ చాలా చవక కూడా అది.
    ఒకసారి అలవాటు పడితే ఇంక దాని కబంధహస్తాల్లో నుంచి బయటపడడం అసాధ్యం!
    అతి పల్చటి అల్యూమినియం రేకులాంటిది తీసుకున్నాడు ఉస్మాన్. బ్రౌన్ షుగర్ నిదానిలోకి ఒంపాడు. అగ్గిపుల్ల వెలిగించి, దాన్ని ఆ అల్యూమినం ఫాయిల్ కింద ఉంచాడు.
    ఆ వేడికి బ్రౌన్ షుగర్ కరిగి అల్యూమినం ఫాయిల్ మీద అటూ ఇటూ ఉరకడం మొదలెట్టింది.
    సిగరెట్ ఒకటి అంటించాడు ఉస్మాన్. దాన్ని పెదిమల మధ్య పెట్టుకుని రేకుమీద పాదరసంలా జారుతున్న బ్రౌన్ షుగర్ ని సిగరెట్ తో వెంటాడుతూ గట్టిగాదమ్ములాగాడు.
    బ్రౌన్ షుగర్ అలా లోపలికి తీసుకునే పద్దతిని "ఛేచింగ్" అంటారు. మామూలు గాస్మోక్ చెయ్యడంకన్నా ఈ పద్దతి అతి తీవ్రమైనది.
    "కావాలా?" అన్నాడు ఉస్మాన్ కామాక్షితో.
    సృజన వారించే లోపలే ఉస్మాన్ చేతిలోని సిగరెట్ అందుకుంది కామాక్షి. "చాక్ లెట్ లాగా మత్తుగా ఉంటుందా?" అంది ఆశగా.
    "గమ్మత్తుగా ఉంటుంది! ఊ! లాగించు" అన్నాడు ఉస్మాన్ వికటంగా.
    "కామాక్షీ వద్దు!" అంటూ ఆమె దగ్గరికెళ్ళి పోయింది సృజన.
    లేని బలం తెచ్చుకుని సృజనని నెట్టేసింది కామాక్షి. సిగరెట్ ను పెదిమల మధ్య ఉంచి అల్యూమినియం ఫాయిల్ లోని బ్రౌన్ షుగర్ ని పీల్చడం మొదలెట్టింది.
    మొదటిదమ్ము పీల్చగానే ఎంతో రిలీఫ్ కలిగినట్లయింది ఆమెకు. "ఓహ్!" అంది ఎంతో తృప్తిగా, లోతుకుపోయిన ఆమె కళ్ళు అరమూతలుపడిపోయాయి.
    తర్వాత రెండో దమ్ము....
    మూడోదమ్ము.....
    ఆ తర్వాత ఇంక ఈ బాధలూ, బాదరబందీలూ ఏమీ తెలియని స్థితిలోకి వెళ్ళిపోయింది కామాక్షి. మృదువైన వెల్వెట్ తెరలను తొలగించుకుంటూసుదూరంలో కనబడుతున్న స్వప్నలోకంలో పరుగులు పెడుతున్నట్లు ఫీలవుతోంది తను.
    కానీ ఎంతసేపు ఆ ఫీలింగు?
    తాత్కాలికం! ఆ మత్తులో నుంచి, మగతలో నుంచి కాసేపట్లో మెలకువ వచ్చేస్తుంది. మెలకువ వచ్చీరాగానే మళ్ళీ మరొక డోస్ కావాలి. అది కాగానే మరొకడోస్. ఆ తర్వాత మళ్ళీ.....అలా అనంతంగా .....ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేదాకా....పిశాచం పిడికిల్లో చిక్కుకుపోయినట్లు.....బ్రౌన్ షుగర్ ఛేజ్ చేస్తూ దానిచేత ఛేజ్ చెయ్యబడుతూ....నరకానికి వన్ డే దారిలాంటిది ఆ అలవాటు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS