"నేను వస్తాను. జాగ్రత్త!" అంది సృజన గుసగుసగా.
ఒక్కసారిగా సృజన కాళ్ళు పట్టేసుకుంది కామాక్షి. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
"సృజనా! సృజనా!, నువ్వు నాకు ఎన్ని చాక్లెట్లు ఇచ్చావో అన్ని జన్మలెత్తి నీ రుణం...." ఆ తర్వాత ఇంక నోటంబడి మాటరాక వెక్కెక్కి ఏడవడం మొదలెట్టింది కామాక్షి.
"ష్! ఎవరన్నా వింటారు! మళ్ళీ వస్తాను! జాగ్రత్త! అని చెప్పి, గబగబా బయటికి వచ్చేసింది సృజన."
అప్పటికి ఇంకా గాఢ నిద్రలోనే ఉంది అహల్య. ఆ పట్టు పరుపుమీదే, అహల్యకు తగలకుండా ముడుచుకుపడుకుంది సృజన.
నిద్రలోనే సృజన మీద చెయ్యివేసి దగ్గరికి లాక్కుంది అహల్య.
అప్పుడు చూసింది సృజన.
చామనచాయ చెయ్యి అహల్యది.
ఆ ఒక్క చేతికే పదిహీను బంగారు గాజులున్నాయి. ఒక్కొక్క గాజూ అహల్యచేతిలో నాశనమైపోయిన ఒక్కొక్క జీవితానికి ప్రతీకలా ఉంది.
అది చూస్తుంటే దిగులుగా అయిపోయింది సృజన మనసు. ఆ దిగులుతోనే కలత నిద్ర పట్టింది.
ఆ కలత నిద్రలో కల!
"బోర్నవిటా తాగిపడుకోమ్మా! మా నాన్న కాదూ! ఇది తాగు!" అమ్మ గొంతు మృదువుగా వినబడుతోంది.
బోర్న్ విటా జగ్ అందిస్తుంటే అమ్మ చేతికి ఉన్న గాజులు ఒకదాని కొకటి తగిలి చిరుసవ్వడి చేస్తున్నాయి. ఆ సవ్వడి ఎలా ఉంది.
అమ్మ తనను గారాబంగా "సృజనా! సృజీ! ఓ సృజీతల్లీ!" అని మురిపెం చేస్తున్నట్లు-----
కలతనిద్రలోనే సృజనకంటినుంచీ ఒక బాష్పకణంజారి అహల్యచేతికి వెచ్చగా తగిలింది.
అహల్యకు మెలకువ వచ్చేసింది. సృజన కూడా వెంటనే లేచింది.
సాయంత్రం అయ్యాక సృజనకి తనుస్వయంగా మల్లెపూలజడవేసింది అహల్య.
"మంచిబట్టలు కట్టుకో అమ్మా! పొద్దున టైలరు తెచ్చిన పట్టుపరికిణి కట్టుకో!" అంది ఆప్యాయంగా. ఇష్టం లేకపోయినా కొత్త పట్టు పరికిణి జాకెట్ తొడుక్కుని, గులాబీరేకులా ఉన్న నైలాన్ ఓణీ వేసుకుంది సృజన. తర్వాత ఏమీ చెయ్యడానికి తోచక నెమ్మదిగా చిలక ఉన్న పంజరం దగ్గరికొచ్చి నిలబడింది.
తమ ఇంట్లో అయితే ఇది తమ హోంవర్కు చేసుకునే వేళ! ఇక్కడ....
తన దగ్గరకు వచ్చి నిలబడిన సృజన వైపు తల వంకరగా పెట్టి చూసి "పెట్టీకోట్.....పెట్టీకోట్... పెట్టీకోట్....." అంది చిలక వడివడిగా.
"తప్పు! అమ్మ అను! అమ్మ! పోనీ నాన్న!" అంది సృజన.
అలాంటి మాటలు తను జన్మలో విని ఉండనట్లు బిత్తరపోయి చూసి.
"బావ" అంది చిలక.
విచారంగా చూసింది సృజన.
"ఏమిటీ! డానికి బూతులు నేర్పిస్తున్నావా?" అన్నాడు అటువచ్చిణ ఉస్మాన్ వెకిలిగా నవ్వుతూ.
ఆ మాటలు వినగానే సహించలేనంత కోపం వచ్చింది సృజనకి. 'అమ్మ, నాన్నా, తమ్ముడూ, చెల్లీ' ఇవన్నీ బూతుల్లా కనబడుతున్నాయావీడికి!
ఆగ్రహంతో వణికిపోతూ "షటప్! యూ డర్టీ డెవిల్!" అంది రౌద్రంగా.
అంతచిన్నపిల్ల తనని అంత పెద్ద గొంతుతో తిడుతుందని ఊహించలేదు ఉస్మాన్. అతని కళ్ళు క్రోధంతో ఎర్రబడ్డాయి. తర్వాత పిడికిళ్ళు బిగించి, అతి కష్టంమీద తనని తాను కంట్రోలు చేసుకుని, ఒకకాలు ఈడ్చుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
7
రెండ్రోజుల తర్వాత----
అలికిడికాకుండా కామాక్షి గదిలోకి అడుగుపెట్టింది సృజన. ఆమె చేతిలో చాక్లెట్ బార్స్ ఒక అరడజను ఉన్నాయి.
ఆమె కామాక్షి గదిలోకి వెళ్ళడంచాటునుంచి గమనిస్తున్నాయి రెండు జతల కళ్ళు.
"ఉస్మాన్!" అంది అహల్య.
ఉస్మాన్ దగ్గరికి వచ్చాడు.
దాదాపు అతని చెవిలో నోరుపెట్టి అడిగింది అహల్య. "సృజన ఆ కామాక్షికి చాక్లెట్లు ఎప్పటికప్పుడూ చేరవేస్తూనే ఉందా?" అవును అహల్య బాయ్! అన్నాడు ఉస్మాన్. అతని మొహంలో వికృతమైన నవ్వు చోటుచేసుకుంది. ఇప్పుడు దొరికింది తనకిఅవకాశం! ఇంక ఆ పిల్లమీద తను ఉన్నవీ లేనివీ చెప్పి ఈ అహల్యమనసు విరిచేస్తాడు!
లేకపోతే, తనని పట్టుకుని తిడుతుందా ఆ పిల్లముండ!
దాని అంతు తేలుస్తాడు తను! ఈ ఉస్మాన్ ని తిట్టిబతికి బట్టకట్టిన వాళ్ళు లేరు ఇంతవరకూ!
ఆరోపణగా చెప్పడం మొదలెట్టాడు.
"నువ్వు అంత ఖరీదు పెట్టి అంతంత మంచిచాక్లెట్లు తెప్పించినావ్ కదా అహల్య బాయ్! వాటన్నిటినీ ఎప్పటికప్పుడు ఆ కామాక్షికి రవాణా చేసేస్తోందా ఈ ఛోకిరీ! అహల్య బాయ్! నువ్వు ఒక్కమాట అను! నేను ఆ సృజననూ, కామాక్షినీ కలిపి...."
"అరే ఛుప్!" అంది కోపంగా. "నువ్వు సలహాలు ఇవ్వడం ఎప్పటి నుంచి శురువుచేసినవ్! చెప్పింది చెయ్యిచాలు! ఇవాళ ఇంకొన్ని చాక్లెట్లు తీసుకురా! పని ఉంది!"
"చాక్లెట్లు తెచ్చి సృజనకిస్తే ఆమె కామాక్షికిస్తది! ఇకనువ్వు కామాక్షిని పస్తులుంచి ఫాయిదా ఏముంది అహల్య భాయ్!" అన్నాడు ఉస్మాన్ అయోమయంగా చూస్తూ.
తొణక్కుండాఅంది అహల్య. "ఇవ్వన్నీ! ఇస్తూనే ఉండనీ! సరిగ్గా వారం---విన్నావా....సరిగ్గా వారం రోజులు తిరిగాక తెలుస్తుంది సృజనకి! బతికుండగా మళ్ళీ మర్చిపోకుండా పాఠం నేర్పిస్తా ఇద్దరికీ!" ఒక్క దెబ్బతో రెండు పిట్టలకీ పాఠం!" అంది. ఆమె కళ్ళలోకరుణ అన్నది ఛాయామాత్రంగా కూడా కనబడటంలేదు.
అది వినగానే ఉస్మాన్ కళ్ళు ఉత్సాహంతో మెరిశాయి.
"ఏంచేస్తావక్కా!" అన్నాడు గారపళ్ళు బయటపెడుతూ.
"చెప్పడమెందుకు చూస్తావుగా!" అంది అహల్య.
సరిగ్గా అదే సమయంలో సృజన, అహల్య తనకు ఇచ్చిన, చాక్లెట్లను కామాక్షికి ఇస్తూ "తిను!" అంటోంది జాలిగా.
వారంరోజులు గడిచిపోయాయి.
ఆరోజు మధ్యాహ్నం మెల్లిగా లేచి షెల్ఫ్ లో వున్న చాక్లెట్లు కొన్ని తీసుకుని, కామాక్షి ఉన్న గదివైపు వచ్చింది సృజన. అలికిడి కాకూడదని అడుగులో అడుగు వేసి నడుస్తున్నా ఆమె పాదాలకు ఉన్న వెండి పట్టాల చిరుమువ్వలు మరుసవ్వడి చెయ్యడం మానలేదు. అహల్య చేయించింది వాటిని సృజనకోసం. గదిలోకి వచ్చీరాగానే సృజన చేతిలోని చాక్లెట్లు విసురుగా లాగేసుకుంది కామాక్షి. "నిన్న తేలేదేం? చచ్చిపోతున్నాను నేను" అంది అసహజంగా.
