"యముండ" అన్నాడు కోపంగా యమధర్మరాజు.
"అబ్బ.....ఆ గెటప్ చూస్తేనే యమధర్మరాజుదని అర్ధమైంది. కానీ ఏ కంపెని, భలే సూటయింది" అన్నాడు.
"రేయ్!" యమధర్మరాజు కోపంగా గద ఎత్తాడు.
"యమధర్మరాజా!" ఆందోళనగా పిలిచి అతడ్ని వారించాడు నారదుడు.
అ వ్యక్తీ 'ఏంటో! ఏ కంపెని అని అడిగితే అంత కోపంగా అరుస్తాడు. నా భార్య మెడకున్న పసుపుతాడు గట్టిది. హమ్మో....ఎంత గట్టిగా అరిచాడు?" అనుకుంటూ గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు అతను.
"చూసారా మహర్షి ! ఆ మానవుడికి ఎంత కండకావరం. నన్నే పరిహసించుచున్నాడు."
"యమా! అది అతడి తప్పు కాదు. మన వేషధారణ విచిత్రంగా తోచినది. మనమును భూలోకవాసులకు మల్లె వేషమును మార్చుకోన్నచో....."
"మహర్షి!" గట్టిగా అరిచాడు యమధర్మరాజు.
"సమవర్తి! ఏంటా గావుకేక? నా తుంబుర పగిలిపోయినదేమోనని ఆందోళన కలిగినది. శబ్దం తగ్గించుము. చుట్టుపక్కల చిన్నపిల్లలుండిన భయపడిపోవుదురు."
"మహర్షి!' ఈ తడవ మెల్లగా అన్నాడు.
"ఇది చాలు సమవర్తి!'
"మనం అల్పమానవులకు మల్లె వేషధారణ చేయవలెనా?"
"వారు అల్ప మానవులు కాదు సమవర్తి. అనన్య మేధావులు. మనం పుష్పక విమానంలో ఆకాశ యానం చేస్తే వాళ్ళు విమానాలు, రాకెట్లు, కనిపెట్టారు. మనం మంత్రములతో చేసేవన్నీ వారు యంత్రములచేత చేయుచున్నారు. మనం దివ్యదృష్టితో వీక్షిస్తే వాళ్ళు రాడార్ కెమెరాలతో విక్షిస్తున్నారు. వారి చిత్తశుద్ది, మేధాశక్తిని తక్కువ అంచనా వేయకుడు. ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకోనుడు సమవర్తి" విపులంగా వివరించబోయాడు నారదుడు.
"ఏమేమి! మీకా మానవులు గొప్పగా కనిపించుచున్నారా? ఈ లోకమునకు రాగానే మీరేమి మహర్షి ఇలా మారిపోయారు?"
"నేను సకల లోక సంహారిని, అన్నీ విశేషములు తెలుసుకొనుట నాకత్యంత ఇష్టమైన విషయం."
"అవునవును. మరొక ప్రితికరమైన విషయం కూడా వున్నది. అదియే కలహాములు పెట్టుట. దానికి లోకకల్యాణం అని పేరు పెట్టుట" యమధర్మరాజు గుర్రుగా నారదుడి వంక చూస్తూ అన్నాడు.
సరిగ్గా అదే సమయంలో--
గరుడాచలం టాంక్ బండ్ దగ్గర వున్న బస్టాప్ లో నిలబడ్డాడు. పూలచొక్కా టక్ చేసి గాగుల్స్ పెట్టుకుని స్టయిల్ గా ఉన్నాడు.
దాదాపు గంట నుంచి ఆ బస్ స్టాప్ దగ్గర కాపు కాసాడు. తన మనసును క్వింటాళ్ల కొద్ది దోచుకున్న ఆంగ్లో ఇండియన్ లేడి కనిపిస్తుందన్న నమ్మకంతో.
ఓ కేనటిక్ వచ్చి ఆగింది. జీన్స్ ఫ్యాంట్, టీషర్ట్ నెత్తిన హెల్మెట్.
అచ్చు తన హిరోయిన్ లానే అనిపించింది గరుడాచలానికి వెంటనే చేతిని అడ్డుపెట్టి ఆపాడు.
"హలో....." అన్నాడా శాల్తి స్కూటర్ దగ్గరికి వెళ్లి.
"హయ్" అందా హెల్మెట్ అమ్మాయి హెల్మెట్ తీయకుండానే.
"ఏంటో నిన్నటి నుంచి నా మనసు మనసులో లేదు" అన్నాడు గరుడాచలం.
హెల్మెట్ అమ్మాయి సీరియస్ గా చూసింది.
"మళ్ళీ లిప్ట్ కావాలి ఇస్తారా?" అడిగాడు ఆశగా ఆమె వైపు చూస్తూ.
"వెనుకే హీరో హొండా మీద మా అయన వస్తున్నాడు. అతన్ని అడిగి ఇస్తాను" అంది కోపంగా.
ఉలిక్కిపడ్డాడు. "మొగుడంటుందేమిటి? కొంపదీసి వచ్చేసాడా ఏమిటి?" అనుకున్నాడు గరుడాచలం.
అప్పుడే హీరో హొండా మీద కండలు తిరిగిన బాడితో ఓ శాల్తీ వచ్చి "వాట్ డియర్ ఏమైంది?" అడిగాడు హీరో హొండా ఆపి.
అప్పుడా హెల్మెట్ అమ్మాయి తన మొహాని కున్న హెల్మెట్ తీసి గరుడాచలం వైపు చూపిస్తూ ఏడుపు మొహం పెట్టి.....
"నన్ను చూస్తుంటే మనసు మనసులో లేదుట. బండి ఆపి లిప్ట్ అడిగి మరి చెబుతున్నాడు" అంది.
ఆ కండలున్న శాల్తీ సీరియస్ గా చూసి గరుడాచలం దగ్గరికి వచ్చాడు.
గరుడాచలానికి విషయం అర్ధమైంది.
తను పొరబడ్డాడు. కానీ తను పోరాబడ్డానన్న విషయం ఆ కండలున్న శాల్తికి చెప్పి నమ్మించడం ఎలా?
అలా ఆలోచించే సమయంలోనే ఆ కండలున్న శాల్తి గరుడాచలం కాలర్ పుచ్చుకున్నాడు.
"కొంపదీసి నా దవడ పగలగొడతావా ఏంటి?" కోపంగా అన్నాడు.
"అయితే నీ దవడ పగలగొట్టాలన్నమాట" అంటూ ఫట్ మని దవడ పగలగొట్టాడు కండల శాల్తి.
"అమ్మో....చచ్చానా.....పింజారి వెధవా, నీ కండలను కాకులు గద్దలకు వేయ నాన్న చెప్పనియరా అక్కుపక్షి" మొత్తుకుంటూనే వున్నాడు.
కండలున్న శాల్తి రేచ్చిపోతూనే వున్నాడు.
ఇంతలో "ఎక్స్ క్యుజ్ మీ. ఏం చేస్తున్నారతన్ని?" అంటూ ఓ స్టోన్ లాంటి టోన్ వినిపించింది.
ఆ కంఠం విని పులకించిపోయాడు అంత బాధలోనూ గరుడాచలం.
కండలున్న శాల్తీ కొట్టడం ఆపి తన భార్యను తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
అప్పటిదాకా ఆ సీన్ ని ఎంజాయ్ చేసిన జనం తలో దిక్కుకు వెళ్లిపోయారు.
రెండు దవడలు వాచిపోయి గరుడాచలం తలెత్తాడు.
ఎదురుగా తన హిరోయిన్ ఆంగ్లో ఇదియన్ లేడి.
"ఓహ్....గరుడా!" అంది అతనికి దగ్గరగా వచ్చి.
అంతే, ఆమె గుండెల మీద తల పెట్టి వెక్కివెక్కి ఏడ్చేశాడు గరుడాచలం.
సంగీత్ దగ్గరవున్న ఓ రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆంగ్లో ఇండియన్ లేడి, గరుడాచలం.
"వాట్ గరుడా! నా కోసం ఇంత సాహసం చేశావా?" అంది అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆంగ్లో ఇండియన్ లేడి పీలూ.
"అవును మేడమ్!" అన్నాడు ఆనందభాష్పాలు రాలుస్తూ గరుడాచలం.
"మేడమ్ ఏమిటి గరుడా! పీలూ.....పిలూ డియర్ అని పిలువు చాలు" అంది అతని చుబుకాన్ని పట్టి ఇటూ అటూ వూపుతూ.
"నిజ్జమా....నా కళ్లకు నువ్వు దేవతలా కనిపిస్తున్నావు?" తన్మయత్వంలోకి వెళ్ళిపోయి అన్నాడు గరుడాచలం.
"యూ .....నాటి.....ఎంత బొద్దుగా వున్నావు గరుడా" అంది రెండు చికెన్ పిజ్జాలు ఆర్డర్ చేసి.
"పిజ్జాలంటే ఏంటి పీలూ...." అడిగాడు గరుడాచలం. అతనికేలా చెప్పాలో అర్ధం కాలేదు పీలూకి.
"నువ్వు ఇంత పూర్ వనుకోలేదు. నీకు పిజ్జా అంటే తెలియదా?" ఆశ్చర్యంగా అడిగింది పీలూ.
