"ఎలా గుర్తుపట్టరు? పొండి అంకుల్ నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు" బుంగమూతి పెట్టి అంది శీతల్. లోలోపల మాత్రం 'తమిళ పిక్చర్ లో హీరోలాగా మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నానేమో!' అనికూడా అనుకుంది. వీడసలే గుంటనక్క. ఆవులించకుండానే పేగులు లెక్క పెడతాడు. నేను మరీ అమాయకంగా ప్రవర్తిస్తే అనుమానిస్తాడు. వీడి ముందు మోతాదు మించకుండా నటించాల్సిందే' అని మరో మాటకూడా ఆ వెంటనే అనుకుంది.
"నిన్ను ఇలాగే బయటికి తీసుకెళ్ళను కదా!"
"మరి?"
"మరో పదినిమిషాల తర్వాత మిస్ రూజ అనే ఆమె ఇక్కడికి వస్తుంది. ఆమె మేకప్ అద్భుతంగా చేస్తుంది. ఎక్కువ సమయం తీసుకోకుండానే నీ రూపు రేఖలు, డ్రస్ పూర్తిగా మార్చేస్తుంది."
"అంటే నాకు పిల్లిగడ్డం, చీమిడి కారుతున్నట్లువున్న మీసాలు, చెవులు కప్పేస్తూ దుబ్బుక్రాపు..."
"అబ్బే అలాంటిది కాదు."
"మారువేషాలలో పంజాబీబాబు వేషం అయితే బెటర్, ముఖం సగం కప్పేస్తూ గడ్డం ఉంటుంది. నెత్తిన తలపాగా ఉంటుంది."
"అవన్నీ కాదు నీవు చెప్పేవన్నీ మగవేషాలు."
"అయితే ఇప్పుడు నేను వేసేది మగ వేషం కాదా! నాకు మగాడిలా వేషం వేసుకోటం ఎంత సరదానో, ఓసారి యిదేమాట డాడీతో అంటే డాడీ కోప్పడ్డారు అంకుల్! నావన్నీ పనికిమాలిన ఆలోచనలుట పిచ్చి మాటలు పెట్టుడు మీసాలు మెలిపెట్టుకుంటే మీసం మొత్తం వస్తుందిట" నవ్వుతూ చెప్పింది శీతల్.
లోకేశ్వరరావు నవ్వాడు.
"నేను ఆడపిల్లగానే ఉంటానన్నమాట!"
"ఆ!"
"మరి మారువేషం అంటే?"
"నీవే చూస్తావు కదా" అంతవరకే చెప్పాడు లోకేశ్వరరావు. శీతల్ మాట్లాడలేదు. ఆలోచిస్తూ వుండిపోయింది. సరీగ పది నిమిషాల తర్వాత మిస్ రూజ వచ్చింది. మిస్ రూజను చూడంగానే తుమ్మితే ఊడి కిందపడే ముక్కు గుర్తొచ్చింది శీతల్ కి.
మిస్ రూజ రాంగానే లోకేశ్వరరావుకి నమస్కారం పెట్టింది.
లోకేశ్వరరావు ప్రతి నమస్కారం పెట్టలేదు. ఈ విషయం శీతల్ గమనించింది.
"ఊ...ఊ...నేను చెప్పినట్టు మేకప్ చెయ్యి లోకేశ్వరరావు ముక్తసరిగా ఒక్క మాటలో చెప్పి అక్కడ కూర్చున్నాడు.
మిస్ రూజ మేకప్ బాక్స్ తెరిచింది.
శీతల్ ముఖం అప్పజెప్పి కూర్చుంది.
మిస్ రూజ తనతో ఏ విషయం మాట్లాడకుండా వుండటానికి లోకేశ్వరరావు కాపలాగా అక్కడ కూర్చున్నాడని శీతల్ గ్రహించి మేకప్ గురించి మాత్రమే మధ్యమధ్య మిస్ రూజతో మాట్లాడుతూ వుండిపోయింది.
పావుగంట తర్వాత మేకప్ పూర్తి అయింది.
మరో పావుగంట లోపే డ్రస్ మార్చటం కూడా జరిగింది. రూపం పూర్తిగా మారిపోయిన శీతల్ ని చూసి "గుడ్, నీ నైపుణ్యమంతా మా శీతల్ మీదే చూపించావ్!" అంటూ మిస్ రూజాని మెచ్చుకున్నాడు లోకేశ్వరరావు.
"ఇప్పుడు మీ రూపం పూర్తిగా మారిపోయింది. వెళ్ళి నిలువుటద్దం ముందు నుంచుని చూసుకోండి" మేకప్ బాక్స్ లోకి సామాన్లు సర్దుకుంటు చెప్పింది మిస్ రూజ.
నిలువుటద్దం గోడ్రెజ్ బీరువాకి ఫిక్స్ చేసింది పక్క రూమ్ లోనే వుంది.
పక్క రూమ్ లోకి పరుగెత్తినట్లే వెళ్ళింది శీతల్.
"మార్వలెస్" శీతల్ నఖశిఖ పర్యంతం తన్ని తాను చూసుకున్న తర్వాత అనుకుంది.
శీతల్ పక్క గదిలోంచి రావటం చూసి "ఎలా వుంది నీ రూపం?" లోకేశ్వరరావు అడిగాడు.
"చా...లా అద్భుతంగా నన్ను నేనే గుర్తుపట్టలేనంత గొప్పగా, పరమాద్భుతంగా వుంది. ముందు మిస్ రూజాని అభినందించాలి. రూజ ఏది?" శీతల్ అడిగింది గది నలువైపుల కలయజూస్తూ.
"వెళ్ళిపోయింది. మళ్ళీ నీ మేకప్ పూర్తిగా తుడిచి నిన్ను నిన్నుగ చేయటానికి మరో రెండున్నర గంటల తర్వాత వస్తుంది. పదినిమిషాల తర్వాత మనం బైలుదేరుతున్నాము" లోకేశ్వరరావు నవ్వుతూ చెప్పాడు.
"అంకుల్!"
"ఊ!"
"మనం ఇప్పుడు ఎక్కడి దాకా వెళతాము?"
"మెయిన్ బజారులోనే తిప్పుతాను. నడిచి తిరుగుతాము సరేనా?"
"వ్వాట్?"
"అంత ఆశ్చర్యం ఎందుకు శీతల్? నీవే చూస్తావు కదా! నా పక్కన ఈ వేషంలో నీవు, చిన్నసైజు మార్వాడీలా తయారయిన రమాపతి వస్తారన్నమాట. సరదాగా నడిచి, సరదాగా షాపింగ్ చేసి వచ్చేద్దాము."
"నా పక్కన మార్వాడీ వేషంలో రమాపతి ఎందుకు?" అనుమానంగా అడిగింది శీతల్ మాటల మధ్యలో ఇలా అనుమానాలు వెళ్ళడించకపోతే లాభం లేదని.
"కారణాలు అడక్కూడదు. వస్తే నష్టం లేదుకదా?"
"ఉహూ!"
"బజారులో తెలిసినవాళ్ళు ఎదురైతే పొరపాటుకూడా మాట్లాడించకూడదు."
ఇలాంటివే మరి కొన్ని కండిషన్లు పెట్టాడు లోకేశ్వరరావు. అన్నింటికి సరేనంది శీతల్.
