Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 30

 

    "పార్వతి! ఆకలేస్తోందే....అన్నం పెట్టావా?" అన్నాడు బ్రతిమిలాడుతూ.

    "ఇన్నాళ్ళు నేను చేసిన పొరపాటు అదే! జాలిపడి అన్నం పెట్టాను. తాగోస్తే అన్నం పెట్టాను, కడుపు మాడిస్తే గానీ రెండోసారి ఇలా తాగిరారు" అంది పార్వతి సీరియస్ గా.

    "అమ్మో....అంతపెద్ద శిక్ష వేయబోకే! ఈ ఒక్కసారికి క్షమించి అన్నం పెట్టు" అంటూ ఆమె గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు.

    "మీరు గెడ్డం పట్టుకున్నా పెట్టను....కాళ్ళు పట్టుకున్నా పెట్టాను అంటూ మంచం పైన అటుతిరిగి పడుకుంది.

    "సరే. నాకేనా రోషం లేంది! నేనూ పడుకుంటాను" అనుకుంటూ మంచం పైన పడుకున్నాడు.

    పార్వతి ఎంతోసేపు అలా వుండలేకపోయింది. మొగుడు మీద ప్రేమ పుట్టుకొచ్చింది. పాపం...అన్నం తినకుండా ఆకలితో ఎలా పడుకుంటాడు అని జాలిపడి, మెల్లిగా లేచి వంటగదిలోకి వెళ్ళింది. ప్లేటులో అన్నం, కూర పెట్టుకుని హల్లోకి వచ్చి టేబుల్ పైన పెట్టింది.

    "నా శివపార్వతికి నేనంటే ఎంతప్రేమో...." అన్నాడు అలాగే పడుకుని.

    ఆమెకు నవ్వాగలేదు. నిశ్శబ్దంగా నవ్వి, దగ్గరకొచ్చి చెవిపట్టుకుని మెలితిప్పి.....

    "ఇంకోసారి తాగోస్తే మాత్రం పెట్టను. ఇదే ఆఖరిసారి....." అంది బింకంగా.

    "అలాగే పార్వతీ! ఇంకెప్పుడూ తాగిరాను. తాగొచ్చినా నిన్ను అన్నం పెట్టమనను....నేనే పెట్టుకుని తింటాను, సరేనా?" అన్నాడు మత్తుగా.

    నెత్తిమీద గట్టిగా మొట్టికాయ వేసింది పార్వతి.

    "అబ్బా" అంటూ చేత్తో రుద్దుకున్నాడు సోమసుందరం.
                                                        *    *    *    *

    "అన్నయ్యా....! నువ్వు ఎలక్షన్ లో పోటీచేస్తేనే బావుంటుంది అన్నయ్యా!" అన్నాడు సోమసుందరం.

    "మనకెందుకురా ఆ రాజకీయాలు! మన పనులు మనం చేసుకుంటే చాలు. నాకు పదవి మీద వ్యామోహం లేదు...." అన్నాడు సర్వోత్తమరావు.

    "నీకోసం కాదన్నయ్యా! మా అందరికోసం. నువ్వు పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తావు. అప్పుడు ఊరంతా మన చేతుల్లోనే వుంటుంది. పంచాయితీ పనులన్నీ బినామిపేర్లతో మనమే చేసుకోవచ్చు. మన పిల్లలు ఇంకా చిన్నపిల్లలు, ఆడపిల్లలు కూడా వున్నారు. ఎంతో సంపాదించాల్సిన సమయం ఇది అన్నయ్యా!" అన్నాడు సోమసుందరం.

    "సర్వోత్తమరావు ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా వున్నాడు.

    ఇదే అదననుకుని సోమసుందరం మరికాస్త గట్టిగా చెప్పాడు.

    "ఆలోచించు అన్నయ్యా! ఇది మనకి మంచి అవకాశం. అవకాశం ఒక్కసారే వస్తుంది. మళ్ళా ఎలక్షన్లు అయిదేళ్ళకు వస్తాయి. మనం ఎవర్ని మోసం చేయటంలేదు కదా! ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అంతే" అన్నాడు ధైర్యంచేసి.

    "అరె....నన్ను విసిగించకు. ఆలోచిద్దాంలే. ముందు నువ్వు ఆ రోడ్డుపనులు చూడు" అన్నాడు సర్వోత్తమరావు సీరియస్ గా.

    సోమసుందరం ఒకవిధంగా ఆనందపడ్డాడు. ఆలోచిద్దాం అంటే దాదాపు అయన ఒప్పుకున్నట్లే అనుకుని.

    "అలాగే అన్నయ్యా! నేను వెళుతున్నాను...." అని చెప్పి వెళ్ళిపోయాడు.

    సర్వోత్తమరావు ఆలోచిస్తున్నాడు. పోటీచేస్తే తప్పకుండా గెలవటం ఖాయం. గెలవటంవల్ల లాభం ఏంటి? అధికార దుర్వినియోగం చేయటం ఇష్టంలేదు. అధికారంలో వుండి అవినీతికి పాల్పడితే ఉన్న పరువు పోతుంది.

    అసలు అవినీతికి పాల్పడాల్సిన అవసరం వస్తుందా? ఎందుకొస్తుంది? మనం నీతిగా వుంటే చాలుకదా! ఇంకా ఊరిని బాగుచేయ్యొచ్చు, బోల్డంత మంచి పేరు సంపాదించుకోవచ్చు. కాంట్రాక్టు పనులకు, ప్రేసుదెంటుగిరికి ముడిపెత్తకూడదు, అది వేరు , ఇది వేరు.

    ఆలా చూసినప్పుడు మనం ఎటువంటి అక్రమాలకూ పాల్పడవలసిన అవసరంలేదు. ఏమో చూద్దాం, ఇంకా సమయం ఉందికదా! అన్నయ్యేమో పోటీ చెయ్యొద్దు అంటున్నాడు. వీడేమో పోటీ చేయమంటున్నాడు. అసల ఒకరి మాట మీద ఆలోచించడం దేనికి? మన సొంత నిర్ణయం తీసుకోవాలి.

    "నమస్కారం సర్వోత్తమరావుగారూ! ఏంటి తీరిగ్గా కూర్చున్నారు?' అంటూ వచ్చాడు ఆ ఊరి బడిపంతులు పరంధామయ్య పంతులు.

    "ఏం లేదు పంతులుగారు! ఊరికే ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాను. ఒరేయ్ అబ్బీ....రెండు కాఫీ తీసుకురా" అన్నాడు సర్వోత్తమరావు.

    "అమ్మాయి పెళ్ళిమాత్రం అమోఘంగా చేశారండి...." అన్నాడు పంతులు ప్రశంశాపూర్వకంగా.

    "ఏదో పైవాడి దయ" అన్నాడు సర్వోత్తమరావుక్లుప్తంగా.

    "కాఫీ తీసుకోండి" చెప్పాడు సర్వోత్తమరావు.

    "అయ్యా! మన పాఠశాల పైకప్పు అంతా పోయింది. వచ్చేది వానాకాలం. పిల్లలకు ఇబ్బంది. ఎలాగైనా మీరు ప్రెసిడెంటుగారికి చెప్పి పైకప్పు మంజూరు చేయించారంటే పిల్లలకు మేలుచేసినవారవుతారు....." అన్నాడు పంతులు.

    "అలాగా! మీరు మరి గోపాలరావుతో చెప్పలేదా?' అన్నాడు ఆశ్చర్యంగా.

    "ఇప్పటికి లక్షసార్లు చెప్పాను. మీకు జీతాలివ్వటమే దండగ....మీరు చెప్పే చదువులకి మళ్ళా పైకప్పులు కూడా వేయించాలా అంటున్నారండి" అన్నాడు దిగిలుగా.

    "అలాగా! పంచాయితీ సోమ్మేకదా! అయన సొంత డబ్బులతో వేయించమనటంలేదు కదా?" అన్నాడు ఆశ్చర్యంగా సర్వోత్తమరావు.

    "పంచాయితీ సోమ్మేనండి! రికార్డుల్లో పైకప్పు వేయించినట్లు రాసుకుంటారు. ఆ సొమ్ము బీరువాల్లో దాచుకుంటారు" అన్నాడు పంతులు.

    "ఎంత మోసం...." అన్నాడు సర్వోత్తమరావు జేబులోనుంచి పొగాకు కాడ బయటకు తీస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS