Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 30


    
    "ఏమిటక్కా మనసు పావడా ఓణీమీద పోయింది" సరస్వతి నవ్వుతూ అడిగింది.
    
    చప్పున ఏం చెయ్యాలో తోచలేదు లిఖితకి. పందెం విషయం చెబితే ఇంకేమైనా వుందా? మొత్తం ఊరంతా ఈ విషయం కలరా వ్యాధిలా వ్యాపించిపోతుంది.
    
    అంతలో సబిత అక్కడికి వచ్చింది. వెదకపోతున్న తీగ కాలికి తగలినట్టు అనిపించింది లిఖితకు ఆమెను చూస్తూనే.
    
    "కార్తీక సోమవారం కదా- సాయంకాలం పావడా ఓణీ వేసుకొని శివుడ్ని దర్శించుకుందామని అలా చేస్తానని ఈ మధ్యే దేవుడికి మొక్కుకున్నాను"
    
    "అలానా" సరస్వతి తప్పయిపోయినట్టు చెంపదెబ్బలు వేసుకుంది. దేవుడంటే అంత భయం మరి జనానికి.
    
    ఈ విషయం విని మాటల మధ్యలో జితేంద్రకు చెప్పే అవకాశాలు ఎక్కువ సో.... ఇంకేం..... సమస్యలు లేవు దేవుడి మొక్కు అని చెప్పడం వల్ల వూర్లో జనం కూడా ఇక నోరు మెదపరు. టైలర్ పావడా కుట్టిస్తే చాలు.
    
    అందుకే వెళుతూ "సాయంకాలం మూడుగంటలకి కరెక్టుగా ఇచ్చేయ్" అని మరోమారు చెప్పింది.
    
    ఏదో రిలీఫ్ గా వుంది లిఖితకు. లాంగ్ పెండింగ్ లో వున్న దేవుడి మొక్కు తీర్చుకున్నప్పుడు వుండే రిలీఫ్ అది.
    
    తిరిగి వచ్చి షెడ్ లో కూర్చుంది.
    
    వీధిలో అటూ ఇటూ పోతున్న జనాన్ని చూస్తోంది.
    
    స్త్రీలు జట్లు జట్లుగా గుళ్ళకు బయలుదేరి వెళుతున్నారు.
    
    వాళ్ళ ముఖాల్లో భక్తి కన్నా, ఇంట్లోంచి బయటపడి ప్రపంచంలోకి వెళుతున్నామనే ఆనందమే ఎక్కువగా వుంది. ఆ సమయంలో కూడా కొంతమంది భర్తలు భార్యల్ని వెన్నంటి పోతున్నారు.
    
    అలా మధ్యాహ్నం వరకూ గడిపింది. మధ్య మధ్యలో జితేంద్ర ఆలోచనలు ఆమెకి తెలియకుండానే బుర్రలో దూరిపోయాయి.
    
    భోజనం ముగించుకుని కొంతసేపు రెస్ట్ తీసుకుంది.
    
    సాయంత్రం మూడు గంటలకే లేచి టైలర్ దగ్గరికి వెళ్ళింది.
    
    అతను రెడీగా కుట్టిపెట్టాడు.
    
    "ఈరోజు పావడా ఓణీలో గుడికి వెళుతున్నావట కదా" అక్కడున్న చంద్రకళ అడిగింది.
    
    "ఆ" అంది దీర్ఘం తీస్తూ.
    
    తను ఊహించినట్టే వూరంతా తెలిసిపోయిందన్న మాట. జితేంద్రకు కూడా తెలిసే వుంటుంది. ఎప్పుడో ఎక్కడో వుండి తనని చూస్తాడు. పందెంలో ఓడిపోయినందుకు అతను కోరిన విధంగా తను డ్రస్ చేసుకుంది. దీంతో తనకీ, అతనికీ మధ్య ఇంకేం వుండదు. మొత్తానికి తొందరలో ఈ లంపటాన్ని వదుల్చుకోవాలి. లేకపోతే ఇలా ఎన్ని రోజులు! ఇంతకీ ఏమిటి అతనికి కావాల్సింది? తను చెప్పడు మరి ఇంకెలా తెలుసుకోవడం.
    
    ఒకవేళ నిలదీసి అడిగితే ఏం సమాధానం చెబుతాడో!
    
    మొత్తానికి ఇక నుంచీ ఇంతకు ముందులా అతనితో చొరవగా వుండకూడదు. కాస్తంత కఠినంగా వ్యవహరించాలి. లేకపోతే ఇది చాలా దూరం వెళ్ళేటట్టుంది.
    
    అందుకే ఇకనుంచీ అతనితో కటువుగా వుండాలి అని గట్టిగా నిర్ణయించుకుంది.
    
    పావడా తీసుకుని అక్కన్నుంచి వచ్చేసింది.
    
    ముందుగా రెండు జడలు వేసుకుంది.
    
    ఇదంతా చూసిన తల్లి "ఏమిటే పెళ్ళి కాని పిల్లలా రెండు జడలు" అని అడిగింది.
    
    "దేవుడి మొక్కు" అంది.
    
    అందరిలాగే ఆమె కూడా ఏమీ మాట్లాడలేకపోయింది.
    
    చీర విప్పి లంగా మీదనే పావడా కట్టుకుంది. నీలం పూలున్న తెల్లటి పావడా చక్కగా వుంది. జాకెట్టు వేసుకున్నాక తెల్లటి జార్జెట్ గుడ్డను ఓణీగా వేసుకుంది.
    
    ముఖానికి లైట్ గా పౌడర్ రాసుకుని, నుదుటి మీద తిలకంతో దోసపండు ఆకారంలో బొట్టు పెట్టుకుంది.
    
    పెళ్ళికాక ముందు ఆమె అలాంటి బొట్టే పెట్టుకునేది.
    
    మరోసారి అద్దంలో చూసుకుంది.
    
    తనకు తనే కొత్తగా కనిపిస్తోంది. నిజంగా పెళ్ళి కాక ముందు ఓ సాయంకాలం తయారైనట్టుంది.
    
    జార్జెట్ పైట మరీ పల్చగా వుండటంతో గుండెలు మరింత ఎత్తుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సగం కన్పిస్తున్న బొడ్డు చంద్రవంకను తెప్పించి అతికించుకున్నట్టుంది. ఒక మడతతో సన్నగా వున్న నడుం సెక్సీగా కనిపిస్తోంది. బెడ్ స్ప్రైడ్ కాబట్టి తన దళసరితనంతో మరే భాగాన్ని ప్రదర్శించడం లేదు. పాదాలకు వున్న వెండిగజ్జెలు ఆమె బంగారు రంగు పాదాలను మరింతగా మెరిపిస్తున్నాయి.
    
    కొబ్బరికాయ, పూలను సజ్జలో సర్దుకుని ఆమె శివాలయానికి బయల్దేరింది.
    
    శివాలయం రెండు కిలోమీటర్ల దూరం వుంటుంది. వూర్లోంచి తార్రోడ్డు కిలోమీటరు వుంటే అక్కన్నుంచి పక్క వూర్లోకి శివాలయం మరో కిలోమీటరు దూరముంటుంది.
    
    ఆమె తార్రోడ్డు చేరుకునేప్పటికి అక్కడ జనం బాగానే వున్నారు. బస్టాప్ దగ్గర రెండు టీ అంగళ్ళు వున్నాయి. బస్సుల కోసం వెయిట్ చేస్తున్న జనం ఆ అంగళ్ళలోని తినుబండారాలని తింటూ ఆర్టీసీ బస్సుని ఎక్కుతున్నారు.
    
    ఆమెకి ముందు చాలామంది శివాలయానికి వెళుతున్నారు. వాళ్ళ వెనకే నడుస్తోంది లిఖిత.
    
    గుడికి వెళ్ళేటప్పటికి అయిదయింది. అక్కడ కూడా జనం బాగానే వున్నారు.
    
    క్యూలో నిలబడి అటూ ఇటూ చూస్తోంది ఆమె. జితేంద్ర ఎక్కడా కనిపించలేదు.
    
    ఏమయ్యాడు జితేంద్ర? తనని ఈ డ్రస్ లో చూడకపోతే తన శ్రమంతా వృధా అయిపోతుంది. మరోసారి ఇలా డ్రస్ చేసుకోవడం తనకి ఇష్టంలేదు. అయినా పందెం ప్రకారం తను డ్రస్ చేసుకుంది. చూడకపోతే అది అతని తప్పు తనకేం సంబంధం లేదు. కాబట్టి అతను వచ్చినా రాకపోయినా తనకు వచ్చిన నష్టమేమీ లేదనుకుంది ఆమె.
    
    క్యూలో కెళ్ళి దర్శనం ముగించుకుని వచ్చేటప్పటికి సాయంకాలమైంది.
    
    రాత్రి కాటుకు ఒళ్ళంతా కమిలిపోయినట్టు సాయంకాలం నల్లరంగులోకి మారుతోంది. రాత్రంతా పహారా వేయడానికి మబ్బులు టార్చిలైటు వేసుకున్నట్టు అక్కడక్కడా చుక్కలు వెలుస్తున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS