"ఏమైంది?"
"ఆ ఇచ్చింది ఇచ్చినట్టే తన్నుకుపోయారు. అయ్యప్ప చీటికి డబ్బు కట్టాల కదా. వడ్డీతో సహా నాలుగు వందలు కట్టాల్సి వచ్చింది. బలవంతంగా లాక్కున్నారు."
" మరి అప్పు చేసినప్పుడు తీర్చాలి కదా"
" అదే నేను కూడా చెప్పేది. నీ కూలి డబ్బులు ఏమయ్యాయి?" అని అడిగాడు.
" ఈ వారంలో మూడు రోజులు వెళ్ళాను. తొంభై రూపాయలు ఉప్పుకీ- పప్పుకీ సరిపోయింది. ఈ వారంలో నువ్వు ఓ రూపాయి అయినా ఇచ్చావా?"
" ఇవ్వలేదు- ఒప్పుకుంటాను. నేనేమైనా తినేస్తున్నానా? వెధవ చార్మినార్ సిగరెట్ కాలుస్తాను. అంతేగదా- శనివారం ఎవరైనా ధర్మాత్ములు తగిలి గొంతు తడిపితే సంతోషం. లేకుంటే చెవులు జాడించుకుంటూ వచ్చేస్తాను. ఈ చీటీలు కట్టడానికే డబ్బు సరిపోతోంది."
" పండక్కో, పచ్చానికో డబ్బు అవసరమొచ్చి తీసుకుంటాం. ఆ వడ్డీలు భరించలేనివే అయినా మనలాంటివాళ్ళకి అంతకన్నా తక్కువ వడ్డీకి డబ్బులెవరిస్తారు? సరేలే- ఇంతకీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎలా?" తమ కుటుంబం పరిస్ధితి తెలుసుకాబట్టి అమె విసుక్కోలేదు.
ఎట్లా తిరిగినా సమస్య దగ్గరికే వచ్చి అగాలి.
" మళ్ళీ మళ్ళీ డాక్టరంటావ్- బుద్దిలేదూ ? అయినా అంత తొందరగా...." విసుగూ, కోపంతో అంతవరకు అనేశాడుగానీ అక్కడికొచ్చేటప్పుడు తన తప్పు తెలిసిపోయింది. కానీ అప్పటికే సమయం మించి పోయింది.
"అంటే అంత త్వరగా నేను చావననేగదా నీ ఉద్ధేశ్యం?" ఆ మాటలకి అమె వలవలా ఏడ్చేసింది. ఎందుకో మరి తన నిస్సహాయతకు భర్త అంతమాట అనేసరికి ఏడుపు తన్నుకొచ్చేసింది అమెకి.
ఇక అక్కడ్నుంచి మాటామాటా పెరిగింది. ఇద్దరూ ఒకర్నొకరు చూపించుకునే స్ధితికి వచ్చారు. తన కష్టాలకి మూలం నువ్వు అంటే నువ్వని తిట్టుకున్నారు.
ఎదుటివ్యక్తి చేతకానితనంవల్లే బ్రతుకు ఇలా పొగబారిపోయిందని నిందించుకున్నారు. మగాడు కాబట్టి అతనే అమెను ఎక్కువగా అవమానించాడు.
అతను ఓ దశలో అవేశాన్ని అపుకోలేకపోయాడు. చాచి లెంపకాయ కొట్టాడు. అమె కళ్ళు తిరిగి తూలిపడింది. అటు చెయ్యిదెబ్బ, ఇటు గోడదెబ్బ అన్నట్టూ అమె తలా, చెంపా వాచిపోయాయి.
అమె సివంగిలా లేచింది. అతని చొక్కాని పట్టుకుని ఊపి దూరంగా తోసేసింది.
అతను తమాయించుకున్నాడు. ఇక అక్కడ వుంటే పరిస్దితి చేయి దాటిపోతుందని గ్రహించాడు. నోటికొచ్చిన బూతుమాటలు తిట్టి బయటికి నడిచాడు.. అమె ఏడుస్తూ అలా వుండిపోయింది.
మధ్యాహ్నం భోజనం చేయలేదు ఉమ. దాసు ఎక్కడికెళ్ళాడో తెలియదుగాని తిరిగి చూడలేదు. సాయంత్రమైంది. అప్పటికి అమె భారం తగ్గింది.
" భాధ కూడా సమసిపోయిందిగాని తను వున్న పరిస్ధితులు మాత్రం కలవరపరుస్తున్నాయి. అమె లేచి తనివితీరా స్నానం చేసింది.
తెల్లవారి జరిగిన గొడవంతా ఒట్టి పూలిష్ గా అనిపించింది.
గంజిపెట్టి తోమిన కాటన్ చీర కట్టుకుంది. రాగిపిండి రొట్టెలను నాలుగు చేసింది. మినప వడియాలు చేసి అవి చాలా రుచికరంగా అనిపీంచాయి. బహుశా ఆకలి తెచ్చినా రుచి అదేనేమో అనుకుంటూ అబగా తింది. రెండు రొట్టెలు మాత్రం దాసుకి దాచిపెట్టి ఉంచింది.
