"సర్లే! నీతో ఇదెప్పుడూ వున్నదేగానీ ముందు ఇంటికి పద....స్నానంచేసి భోజనం చెయ్యి! మీ అమ్మ ఎదురుచూస్తోంది" అంది.
"ఆ తర్వాతా?" అడిగాడు.
"సినిమాకెళదామా?" అడిగింది.
"నవీనన్నా!" అంటూ ఇందాకటబ్బాయి పరుగెత్తుకొచ్చాడు. ఇక్బాల్ కి ఏక్సిడెంటయింది. ఆటో టర్నోవరయింది" అన్నాడు వగరుస్తూ.
"ఎక్కడ? ముందు పద" అంటూ హడావుడిగా పరిగెడ్తూ ధృతి భుజంతట్టి చెప్పాడు. "ఎవరికో డబ్బులిచ్చి కుర్చీలో కూర్చుని ఏం చేస్తారూ అని దేవుడు అనునిత్యం కొత్త కొత్త సినిమాలు ఆడిస్తూనే వుంటాడు. నేనది చూసుకుని వస్తా నువ్వు ఇంటికెళ్ళు" ఇవి నాకు చాలా మామూలే అన్నట్లుందతని స్వరం.
ఒకేరోజు పుట్టిన మనుషులు ఒకే రకంగా ఆలోచిస్తారేమో! అటువంటి 'ఇద్దరు' వ్యక్తులు తన జీవితంలో ప్రముఖపాత్ర వహించడం యాదృచ్చికం అనుకుంది ధృతి.
* * *
ప్రేమ్ ఏదో పనిమీద వైజాగ్ వెళ్ళాడు. అతనులేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
"బాబుగారికి ప్రేమ్ బాబు వుంటే బాగా పొద్దుపోయేది. లేకపోతే ఎంతసేపూ ఆ ఆఫీస్ పనులే. అర్దరాత్రిదాకా ఏవో లెక్కలవీ చూసుకుని, నిద్రమాత్రలేసుకుని పడుకుంటారు. ఈ రోజు ఇప్పటిదాకా లేవలేదు" అన్నాడు సుబ్బరాజు ధృతితో.
"అరె! తొమ్మిదయిపోయింది. ఇంకా లేవలేదా?" అడిగిందామె కంగారుగా.
'లేదు' అన్నట్లు పెదవి విరిచి అతను వెళ్ళిపోయాడు.
ఆఫీస్ కి తయారవుతోందే కానీ ఆమె కళ్ళు ఆత్రంగా ఆయన కారు కోసం కిటికీలోంచి చూస్తూనే వున్నాయి. టైమయిపోతోంది కానీ ఆయన జాడలేదు. ఇంకా వుండబట్టలేక ఆమె ఆయన ఇంటివైపు నడిచింది.
"సుబ్బరాజూ!" పిలిచింది.
సుబ్బరాజు ఎక్కడా కనిపించలేదు. నెమ్మదిగా లోపలికి నడిచింది. వంటింట్లో కూడా సుబ్బరాజు కనిపించలేదు. గది ముందునుంచి నడిచొస్తూ వుండగా ధర్మానందరావుగారు గదిలో మంచంమీద పడుకుని కనిపించారు. ఒక్క నిమిషం అక్కడ నిలబడి చూసి వెళ్ళిపోదామా అనుకుంటుండగా "దాహం" అని వినిపించింది. ఆమె వెనక్కి తిరిగింది. మళ్ళీ "దాహం" అన్నారు కళ్ళు మూసుకునే. గబగబా నడిచి పక్కనే వున్న జగ్ లోనుండి నీళ్ళు వంచి గ్లాసులో పోసి అందించింది.
ఆయన కళ్ళు మూసుకునే నోరు తెరిచారు. కొద్దికొద్దిగా నీరు నోట్లో పోస్తుండగా ఆయన శరీరం వేడిగా తగిలింది ఆమె చేతికి.
"చాలు సుబ్బరాజూ! ఫ్యాను ఆపెయ్యి" అన్నారు నీరసంగా మళ్ళీ పడుకుంటూ.
ధృతి ఫ్యాను ఆపుచేసి నిండుగా రగ్గు కప్పింది. ముందు గదిలోకి వచ్చేసరికి సుబ్బరాజు డాక్టర్ని వెంటబెట్టుకుని వస్తూ కనిపించాడు.
"అమ్మాయిగారూ! వచ్చారా? మీకు అప్పజెప్పి రావాల్సిందని తెగ బాధపడిపోయాననుకోండి" అన్నాడు.
ధృతి మళ్ళీ లోపలికి నడిచింది.
డాక్టరుగారు పరీక్షచేసి "గంటగంటకీ టెంపరేచర్ నోట్ చేయండి. ఈ మందులు తెప్పించి వాడండి. అవసరమైతే ఫోన్ చేయండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.
"సుబ్బరాజూ! హార్లిక్స్ కలుపుకురా" అని చెప్పి ధృతి ఆయన పక్కనే కూర్చుండిపోయింది.
ఆ ముందురోజే ఆయన చురుకుతనాన్నీ, ఉత్సాహాన్నీ మెచ్చుకున్నందుకు దిష్టి కొట్టిందేమోననిపించిందామెకు. ఆయన ఆ రోజంతా మూలుగుతూనే వున్నాడు. ఒక్కరోజులోనే చాలా వృద్దాప్యం ముంచుకొచ్చేసినట్లు కనిపించారు. ధృతి టెంపరేచర్ నోట్ చేస్తూ, టైమ్ ప్రకారం మందులు వేస్తూ అక్కడే కూర్చుంది. ఆయన మూసిన కన్ను తెరవలేదు. మధ్యమధ్యలో "కాస్త కణతలు నొక్కు మంచినీళ్ళివ్వు" అని అడుగుతున్నారు. సుబ్బరాజు బలవంతంమీద ధృతి మధ్యలో వెళ్ళి భోంచేసి వచ్చి మళ్ళీ అక్కడే కూర్చుంది.
"ఇంత జ్వరం ఎప్పుడూ రాలేదమ్మా! అయ్యగారిని చూస్తుంటే నాకు బెంబేలుగా వుంది. మీరు లేకపోతే ఏమయిపోయేవాడినో" అంటూ సుబ్బరాజు తెగ కంగారుపడిపోయాడు.
రాత్రయిపోయింది. సుబ్బరాజు క్రింద కూర్చుని మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు.
ధృతి లేచి పుస్తకాల అర దగ్గరికి నడిచింది. వివేకానంద ఉపన్యాసాలూ, జిడ్డు కృష్ణమూర్తిగారి ఉపన్యాసాలూ వరుసగా వున్నాయి. ఎర్రని అట్టతో పెద్ద బౌండు పుస్తకం ఒకటి చివరగా కనిపించింది. ఆమె దాన్ని అందుకుని పేజీలు తిరగెయ్యసాగింది. మొదట్లో అన్నీ తెల్లకాగితాలే కనిపించాయి. తరువాత తరువాత చేతివ్రాతతో రాసిన అక్షరాలు కనిపించాయి. అప్పటికి కానీ అమెకర్ధంకాలేదు ఆయన 'డైరీ' అని ఆ విషయం తెలియగానే ఆమె మూసేసి పెట్టెయ్యబోయింది. కానీ ఒక పేజీలో 'ధృతి' అని తన పేరు కూడా రాసి కనిపించింది. ఒక్కనిమిషం అం ఎకల్లు సహజమైన ఉత్సుకతతో ఆ అక్షరాలనే చూస్తుండిపోయాయి. వాటి క్రింద ఆయన ఏం రాశారోనని చూడాలనిపించింది. తప్పు, వద్దు అంది మనసు. ఫరవాలేదు నా గురించేగా అనిపించింది. మళ్ళీ గొప్ప సంఘర్షణలో పడిపోయింది కాసేపు. చివరికి ఏమయితే అయిందిలే అని చదవడానికే నిశ్చయించుకుంది. "సుబ్బరాజూ! మంచినీళ్ళు" ఆయన గొంతు వినిపించగానే చటుక్కున డైరీ యధాప్రకారంగా పెట్టేసి, ఒక్కంగలో మంచం దగ్గరకెళ్ళింది. ఆయనకి మంచినీళ్ళు తాగిస్తుండగా ఆయన కళ్ళు తెరిచారు. ధృతిని చూసి ఆశ్చర్యంతో 'నువ్వా' అన్నారు.
"అవును పొద్దుటినుండీ ఇక్కడే వున్నాను" అంది.
జ్వరం జారిన గుర్తుగా ఆయన మొహంమీద చిరుచెమటలు అలుముకున్నాయి. ఆమె అనాలోచితంగా తన కొంగుతో వాటిని తుడిచింది.
"సుబ్బరాజు వున్నాడు, నువ్వెళ్ళి పడుకో" అన్నారు.
