మా వెంకటరమణ వచ్చిందిగానీ, ఆయన స్నానానికి నీళ్ళు తోడిందిగానీ, అన్నం వడ్డించిందిగానీ, ఆయన వచ్చి నా పక్కన పడుకుందిగానీ ఏమీ గుర్తు లేదు. ఏది ఏమైనా పెదరెడ్డింటికి ఇక వెళ్ళకూడదన్న నిర్ణయానికి రావడానికి ఎంతకాలం గడిచిందో తెలియదుగానీ నా నిర్ణయానికి వత్తాసు పలికినట్లు అప్పుడే కోళ్ళు కూసాయి.
మెల్లగా వేరేవాళ్ళకి పనులకు వెళ్ళడం ప్రారంభించాను. నేను పెదరెడ్డింటి దగ్గర పనిమానేశాను అని తెలియడంతో మళ్ళీ ఊళ్ళో వాళ్ళ వేధింపులు ప్రారంభమయ్యాయి.
ఇలాంటివి ఎప్పుడూ జరుగుతున్నా రైతుల్ని మేమేం చెయ్యగలం? డబ్బుగానీ, పరపతిగానీ ఏం లేని మాలాంటివాళ్ళం నిశ్శబ్దంగానయినా వుండిపోవాలి, లేదా లొంగైనా పోవాలి. నేను మొదటి మార్గం ఎన్నుకున్నాను. ఎవరెంత వేధించినా మౌనంగా వెళ్ళడం అలవాటు చేసుకున్నాను.
మౌనం అర్ధాంగీకారం అని భావించి ముందు కెళ్ళబోయిన మూర్ఖుల్ని ఛీ కొట్టాను. పెదరెడ్డితో చెబుతానని బెదిరించాను.
పగలు అంటరానివాళ్ళు అని ప్రతిక్షణం అవమానించే వీళ్ళు రాత్రయితే అదే అంటరానివాళ్ళ పొందు కోసం పడే అవస్థను చూస్తే ఎంత కోపం వచ్చేదో.
చాలామంది వీలుదొరికినప్పుడల్లా ధర్మాన్ని కాపాడమని దేవుడు తమ నెత్తులమీదే బాధ్యత పెట్టినట్లు, నీతిని అమలు చేయడానికే తామున్నట్లు మనుశాస్త్రాలు, గీతోపదేశాల్ని వినిపించే వీళ్ళు పసిపిల్లల దగ్గర, నిస్సహాయులయిన స్త్రీల దగ్గర ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఊహించలేము.
మీ రైతులలో కూడా చాలామంది అంతే. మేం తాకిన గ్లాసుల్ని కడిగి ఇంట్లోకి తీసుకెళతారు. చేయి తగిలితే అక్కడ సబ్బు వేసి కడుక్కుంటారు. ప్రతి విషయంలో మీకిలాంటి బుద్దులు మామూలే అని మాట్లాడతారు. అలాంటివాళ్ళే చాటుసరసాలకు కుక్కల్లా వెనక పరిగెత్తుతారు. పుంజుల్లా తరుముతారు.
నయాన్నో, భయాన్నో వాళ్ళ బారి నుండి నన్ను నేను రక్షించుకుంటూ వస్తున్నాను.
గోకుల్ వెళ్ళిపోయిన క్షణం నుండి నా ధ్యాసంతా అతనిమీదే. ప్రతిదీ అల్పంగా తోచేది. అతని ఊహలు తప్ప మిగిలినదంతా చెత్తగా అనిపించేది. అతనితో ఎక్కడెక్కడ తిరగాలన్న ఆలోచన కలిగేది. అతనితో ప్రతిదీ పంచుకోవాలన్న ఆరాటం ఎక్కువయింది.
ప్రేమంటే ఇదేననుకుంటా, అయిదు నిముషాల్లో పెళ్ళి జరిపించేసి కొత్తగా వచ్చిన ఆ వ్యక్తిమీద ప్రేమ ఎలా కలుగుతుంది? అందుకే పెళ్ళిలో కలగంది ఇదొక్కటే. నా భర్తపట్ల ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ కలగలేదు. పగలు పెళ్ళయిపోయి, రాత్రికంతా పక్కలకి లాక్కునే ఆ పురుషుడిపట్ల అవయవాల ఆకలి తీరుతుందేమో తప్ప ప్రేమదాహం తీరదు.
మొత్తానికి నాకు నేనే కొత్తగా అనిపించే ఆ సమయం యెంత థ్రిల్లింగ్ గా వుండేదో చెప్పలేను.
ఓరోజు మా అవడకు పచ్చబొట్లు పొడిచే మనిషి వచ్చాడు. ఐదు రూపాయిలిస్తే మన శరీరం మీద ఓ బొమ్మో అక్షరాల్లో పొడుస్తాడు. చచ్చిపోయే వరకు అవి మనతోనే వుంటాయి.
పచ్చబొట్టు మనిషి చుట్టూ స్త్రీలు చేరిపోయారు. పచ్చబొట్లు పొడిపించు కోవడం చాలా అసహ్యం నాకు చక్కటి శరీరం మీద ఆ గుర్తులతో అందవికారం చేసుకోవడం అయిష్టం నాకు. మామూలు ఉత్సాహం కొద్దీ నేనూ చోసోతూ నిలబడ్డాను.
శకుంతల మొదటగా అయిదు రూపాయలిచ్చి పచ్చబొట్లు పొడవమంది.
"ఏం బొమ్మ? తేలు, సింహం, పులి" పచ్చబొట్లు వేసే మనిషి అడిగాడు.
కాదు ఎల్.ఎమ్ అన్న అక్షరాలు, శకుంతల సిగ్గుతో చెప్పింది. ఆ సిగ్గును చూస్తూనే ఆ అక్షరాల తాలూకు మనిషెవడో తెలిసిపోయింది అందరికీ
అతనెవరోగానీ ఆమె మనసు పడ్డవాడు.
మా వాడలోని స్త్రీలు ఇలాంటి సంబంధాలన్నిటినీ బహిరంగంగా చెస్తుంటారు. ఏమీ దాపరికాలుండవు. రైతు స్త్రీలలాగా చాటుగా, మాటుగా భయం భయంగా చేయరు. మీకు జాతి తక్కువ, నీతి తక్కువని రైతులంటారు గానీ అది చాలా తప్పు.
మా వాడలోని ప్రతి స్త్రీ రోజూ కూలికెళ్ళి సంపాదించుకుంటుంది. తన పోషణ తనే పోషించుకుంటుంది. అందువల్ల ఇంట్లోని మిగిలిన వాళ్ళకు భయపడదు. తన ఇష్టం వచ్చినట్లు బతుకుతుంది. అందుకే అంత ధైర్యంగా తన ప్రియుడి పేరును పచ్చబొట్టు పొడిపించుకుంటుంది. సాయంకాలాలు ఫస్ట్ షోకి వెళ్ళి అతనిపక్కనే కూర్చుని సినిమా చూస్తుంది. ఏ అర్ధరాత్రి వరకో ఏ మామిడితోటలోనో గడిపి ఇంటికి చేరుకుంటుంది.
"ఎల్.ఎమ్. అంటే ఎవరే?" పక్కనున్న పిల్ల చిలిపిగా ఆమె నడుం మీద మోచేతితో పొడిచి అడుగుతోంది.
నాకెందుకోగానీ జీవితంలో మొదటిసారి పచ్చబొట్టు పొడిపించుకోవాలని పించింది. జి.కె. అన్న అక్షరాలు చేతిపై కనిపిస్తుంటే గోకుల్ ని ముంజేతికి కట్టేసుకున్నట్లు వుంటుందనిపించింది.
కానీ అంత సాహసం చేయలేకపోయాను.
ఇంటికి తిరిగొచ్చాను.
రాత్రి భిజనం తీసుకురావడానికి రాఘవరెడ్డి ఇంటికి బయలుదేరాను. మామూలు టైమ్ కన్నా కొంచెం ముందు బయలుదేరడంతో దారిలో పోకిరీ కుర్రవాళ్ళు ఎవరూ ఎదురుపడలేదు.
పెదరెడ్డింటి దగ్గర వీధి వరండాలో నిలబడ్డ రెడ్డిసాని నన్ను చూసి పిలిచింది.
"ఏమిటమ్మా?"
"కనిపించడమే మానేశావే, రా కూర్చో"
ఓ మెట్టుకింద కూర్చున్నాను.
"చూశావా వాడెంత కఠినంగా అయిపోయాడో, నెలరోజులయింది ఇంటికొచ్చి, ప్రతివారం శనివారం వచ్చి సోమవారం వెళ్ళేవాడు. అలాంటిది నాలుగు వారాలయింది. నా బిడ్డను చూడాలని ఎంత కలవరంగా వుందో తెలుసా? ఫోన్ లో మాట్లాడడమే తప్ప నెలరోజులుగా నా చిన్నికృష్ణుడి ముఖం చూడలేదు. మొన్న వల్ల నాన్న వెళ్ళి వచ్చాడు. నా కళ్ళు పెట్టుకొని చూసి రండి అని చెప్పి ఏడ్చాను. ఎందుకో వాడు మొండి పట్టుదలపోయి నట్లున్నాడు. లేకుంటే నాకన్న తండ్రి ఇంటికి రారా అని వేడుకుంటున్నా రావడం లేదు" అని భోరున ఏడ్చింది.
నిజం చెప్పద్దూ మొత్తం జరిగిందంతా చెప్పేయాలనిపించింది నాకు. కొడుకు మీద ఆమె మమకారం నాకు తెలుసు. కొడుకు తప్ప మరో ప్రపంచం లేదామెకు. అలాంటి కన్నతల్లికి కొడుకును దూరం చేసిన పాపం నన్ను ఊరికే వదలదనిపించింది.
"నువ్వూ వాడితో బాగా మాట్లాడతావుగదా. నువ్వైనా చెబుదువురా- అప్పుడన్నా వస్తాడేమో. ఇకక్డ నిన్ను చూడకుండా అమ్మ చచ్చిపోతూ వుందిరా అని చెప్పు- రారా" అంటూ ఆమె ఏడుస్తూనే నన్ను ఫోను దగ్గరికి లాక్కెళ్ళింది.
ఆమె బాధ చూసి నాకూ ఏడుపు ఆగడం లేదు. కానీ ఎలానో బిగపట్టుకుంటున్నాను.
ఫోన్ లో గోకుల్ మాట్లాడటం ప్రారంభించాక ఆమె నాచేతి కిచ్చింది.
"అమ్మా.... అమ్మా...."
అవతల గోకుల్ అరుస్తున్నాడు.
"నేను చాముండిని" ఆ మాట అన్నాక ఇక ఏడుపు ఆపుకోలేక పోయాను. క్రితం జన్మలో విడిపోయి తిరిగి ఈ జన్మలో మొదటిసారి మాట్లాడుతున్నట్లుంది. నాకు పోగొట్టుకున్న విలువైంది దొరికినట్లయింది. పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాక ఆత్మీయులతో మాట్లాడుతున్నట్టుంది.
