Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 30


    మావాడలో ఇదొక జాఢ్యం. అయినదానికీ కానిదానికీ మైక్ సెట్ పెట్టేస్తారు. రజస్వల అయినదానికి కూడా ఇలా మైక్ సెట్ పెట్టి ఫలానా పిల్ల వయసుకు వచ్చేసిందని టాంటాం వేసేస్తారు. ఇక మరుసటి రోజు కూతోడులాంటి వాడు ఆ పిల్ల కనిపించగానే ఆటపట్టించే కార్యక్రమాన్ని మొదలుపెడతాడు.
    
    "ఏం శకుంతలా! నువ్వు పెద్దమనిషయ్యావని వూరంతా మైక్ సెట్ పెట్టి చెప్పించావే. కూతకొచ్చిన కోడిపెట్టలా చాలా చలాకీగా ఉన్నావ్. పుంజులన్నీ ఇక తరుముతుంటాయ్ లే"
    
    ఇలాంటివి మొదలవుతాయి. రైతుల ఇళ్ళల్లో ఇప్పుడు యిలాంటి ఫంక్షన్స్ చేయడం లేదు. మరి మావాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో యేమోనని ఆలోచిస్తూ పడుకున్న నాకు తలుపు తెరిచిన చప్పుడయింది.
    
    "ఎవరూ?"
    
    "నేనక్కాసక్కూబాయిని, పెదరెడ్డి కొడుకు నీతో ఏదో పనుందని వచ్చాడు. వెనక పొలంలో వున్నాడు" అని చెప్పింది.
    
    ఒక్క క్షణం నాకేమీ పాలుపోలేదు.
    
    గోకుల్ యిలా వచ్చాడా? కప్పుకున్న దుప్పటిని లాగేసి బయటికి వచ్చాను.
    
    ఏడుగంటలైందేమో, మసకచీకట్లు ముసురుకుంటున్నాయి. శకుంతల ఇల్లు మాత్రం సీరియస్ సెట్ బల్బులతో మిణుగురు పురుగులు వాలిన చెట్టులా వుంది. మా ఇంటినుంచి వెనుక వైపుకి నడిచాను. దూరంగా పొలంలో  ఎవరో నిలబడి వున్నట్లనిపించి అటు వెళ్ళాను. సందేహంలేదు. అతను గోకులే.
    
    "అమ్మ రమ్మందా?" అనడిగాను గోకుల్ దగ్గరికి వెళ్ళి నిలబడి.
    
    "లేదు. నాకే చూడాలనిపించింది జ్వరం తగ్గిందా?" మెల్లగా గొంతు తగ్గించి అడిగాడు.
    
    "ఫరవాలేదు" అన్నాను.
    
    "నీకు జ్వరమని మధ్యాహ్నమే తెలిసింది. టౌన్ కెళ్ళి మాత్రలు తెచ్చాను. ఇదిగో ఈ మాత్రలు రెండు ఇప్పుడు వేసుకో" అని మాత్రలు చేతిలో పెట్టాడు.
    
    అప్పుడొచ్చింది నాకేడుపు. నన్ను చూసిన ప్రతివాడూ కన్నుగీటాడే తప్ప యిలా నాపై అభిమానం చూపించలదు. ఆ ప్రేమకీ, ఆ ఆత్రుతకీ చలించి పోయాను. ఏం మాట్లాడడానికి తోచలేదు.
    
    మౌనంగా ఇంటికొచ్చాను. ఉన్న ఒకే ఒక లైటు ఆర్పేసి చీకట్లో పడుకున్నాను.
    
    ఇదంతా ఎక్కడికి దారితీస్తుందో అన్న ఊహతో వళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆ చిన్ని హృదయం నాకోసం యెంతగా విలవిల్లాడి పోతూ వుందో తెలుస్తుంది. ఆ లేత శరీరం నన్ను కమ్మేసుకోవాలని ఎంతగా ఆరాటపడిపోతూ వుందో అర్ధమవుతూ వుంది. ఇవన్నీ చిన్నపిల్లాడి చేష్టలే అని అనుకోవడం కేవలం ఆత్మద్రోహం తప్ప మరేమీ కాదు. అంతకు ముందున్న నా అభిప్రాయాలన్నీ మారిపోయాయి. మరి దీని కంతకీ ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియడం లేదు. అలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో తెలియదు.
    
    మరుసటిరోజు వళ్ళు బాగయింది గానీ రెడ్డింటికి వెళ్ళలేదు. ఇక ఎప్పటికీ వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. దగ్గరగా వుండి ఆ లేత మనసులో అలజడిని సృష్టించడం మహాపాపమని అనిపించింది.
    
    రెండురోజులు తర్వాత గోకుల్ ఇంట్లో లేడని తెలుసుకున్నాక వాళ్ళింటికి వెళ్ళాను.
    
    రెడ్డిసాని వచ్చి "ఏమిటే చెప్పాపెట్టకుండా పని ఎగగొట్టావు? ఇప్పటికయినా ఒళ్ళు కుదుటపడిందా లేదా? పనిలోకి ఎప్పుడొస్తావు? డాక్టర్ కి చూపించడానికి డబ్బులున్నాయా? లేకుంటే యిస్తాను" అని గుక్క తిప్పుకోకుండా అడిగింది.
    
    "ఏదో మాయదారి రోగం నడుం పట్టేసింది. ఒళ్ళంతా నొప్పులూ పనీపాటా చేస్తే మళ్ళీ తిరగబెడుతుందని డాక్టర్ చెప్పాడు. అందుకేనమ్మా నేనిక పనిలోకి రాను. వేరెవరినయినా చూసుకోండి" అని కంఠతా పెట్టింది ఒప్పచెప్పినట్టు చెప్పేశాను.
    
    ఆ తర్వాత రెడ్డిసాని పనిలో వుండమని ఎంతెంతో చెప్పిందిగాని నేను వినలేదు. ఇక వీలుకాదని నిర్మొహమాటంగా చెప్పి వచ్చేశాను.
    
    గోకుల్ కంటపడకూడదని ఇంటినుంచి బయటికొచ్చిన పాపాన పోలేదు.
    
    అతని సెలవులు అయిపోయాయని, హాస్టల్ కి వెళ్ళిపోతాడని తెలిసింది. అతను వెళ్ళిపోయాక తిరిగి ఎవరికయినా కూలికి వెళదామని నిర్ణయించుకున్నాను.
    
    ఆరోజు సాయంకాలమయింది.
    
    ఈమధ్య పనులకు వెళ్ళకపోవడంతో మధ్యాహ్నం నిద్రపోవడం బాగా అలవాటయింది. నిద్రలేచి స్నానం చేసేప్పటికి చీకట్లుపడ్డాయి. ఇంట్లో ఏమీ తోచకపోవడంతో వీధిలోకొచ్చి నిలబడ్డాను.
    
    శకుంతలా, మరో ముగ్గురు నాలుగురాళ్ళ ఆట ఆడుతున్నారు. అటువేపుకి నిలిచి చూస్తున్నాను.
    
    మధ్యలో ఇంట్లోవాళ్ళు పిలవడంతో శకుంతల వెళ్ళిపోయింది. నన్ను రమ్మని పిలిచారు.
    
    నాలుగురాళ్ళ ఆట ఆడి చాలా రోజులయింది. పెళ్ళికి ముందు మా ఊర్లో ఆడేదాన్ని.
    
    అవన్నీ గుర్తు తెచ్చుకోవడం కోసం ఆటలో చేరాను. టైమ్ ఎనిమిది కావడంతో ఆట ముగించాం.
    
    ఇక ఇంట్లోకి వెళ్ళబోతూండగా మా ఇంటి పక్కనుండే రంగడు పిలిచాడు.
    
    'అక్కా! అక్కా!'
    
    ఏమిటన్నట్లు చూస్తూ నిలబడ్డాను.
    
    వాడు పరుగెత్తుకొచ్చినట్లున్నాడు ఆయాసంతో పేగిపోతున్నాడు.
    
    'ఏమిట్రా'
    
    'మరీ....మరీ పెదరెడ్డి కొడుకు నీకిది ఇవ్వమన్నాడు' అని జవాబు కోసం ఎదురుచూడకుండా తన చేతిలో మడతలు పెట్టి వున్న కాగితాన్ని నా చేతుల్లోకి కుక్కి వెళ్ళిపోయాడు.
    
    ఏదో తెలియని భయంలాంటిది నన్ను నిలబెట్టేసింది. జీవితంలో మొదటి ఉత్తరం పెద్ద బాంబును చేతుల్లో వుంచుకున్నట్లుంది. ఎలాగో మెల్లగా తమాయించుకుని ఇంట్లోకి వెళ్ళాను.    

    తలుపు గడిపెట్టి మడతలు విప్పాను.
    
    సంబోధన ఏమీ లేదు.
    
    'నా నుంచి తప్పించుకోవడానికి మా యింట్లో పని మానేశావని తెలుసు. అందుకే తిరిగి నువ్వు మా ఇంటికొచ్చే వరకు నేను ఈ ఊరికి రాను' అని మాత్రం రాసి వుంది.
    
    కింద సంతకం కూడా లేదు.
    
    దాన్ని చించెయ్యడానికి మనసొప్పలేదు.
    
    అత్తగారింటికి వస్తూ తెచ్చుకున్న ట్రంకుపెట్టెలో పెట్టడానికి ఏదో సెంటిమెంట్ అడ్డొచ్చింది.
    
    రహస్యంగా వుంటుందని ఆ ఉత్తరాన్ని రెండు అన్నం మెతుకులు తెచ్చి దేవుడి పటం వెనుక అతికించాను. ఆ పటాన్ని నా భర్త తీయడు కాబట్టి నాకొచ్చే ప్రమాదం ఏమీలేదు.
    
    అన్నం ముందు కూర్చున్నా తినబుద్ది కాలేదు. ఆకలినీ, నిద్రనీ మరిపించే ఇలాంటి అనుభవాలు జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనేమో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS