ఆమె అదిరిపడింది. ముందసలు అతడు జోక్ చేస్తున్నాడేమో అనుకుంది. కానీ కొంతసేపటికి అతడు నిజంగా ఇదంతా చెపుతున్నాడని అర్ధమైంది. ఆమె తన మనసులో కల్లోలాన్ని బయటపడనివ్వకుండా సంభాషణ కొనసాగించింది. వినాయక నిమజ్జనంలో మత వైషమ్యాల్ని ఎలా రెచ్చగొట్టాలో-అక్కడనుంచి అంచె లంచెలుగా ఎలా గొడవలు పెద్దవి చెయ్యవచ్చో దీనికి ముఖ్యమంత్రే తెరచాటున వుండి నాటకం నడిపిస్తే, రాష్ట్రం విడిపోయాక వచ్చే లాభాలేమిటో వివరించాడు. అతడు మాట్లాడుతున్నంతసేపూ ఆమె ఆలోచిస్తూనే వుంది. అతడికి ఈ పథకం తాలూకు యోచన ఆకస్మాత్తుగా వచ్చినదా లేక ఎప్పట్నుంచో వున్నదా అని ఆమె ఆలోచన. ఎప్పట్నుంచో వున్నదయితే తనతో ఒక్కసారయినా చర్చించే వాడే ఇంత భయంకరమైన ఆలోచన అతడికి ఎలా వచ్చిందా అని ఆమె మధనపడుతూనే వుంది.
టేప్ లో మాటలు విన్నాక ఆమె అనుమానం నివృత్తి అయింది. అయితే దీనివల్ల ఆమె మానసిక వ్యధ మరింత ఎక్కువైంది. ఇంతవరకూ చౌరసియాకీ తనకీ మధ్య మామూలు ఆకర్షణలకి అతీతమైన సంబంధం ఏదో వుమ్దనుకుంటూ వచ్చింది. కానీ ఎవరో వచ్చి ఏవో ఫోటోలు బయటపెడతామనేసరికి అతడు దానికి భయపడి తనకు అసలు విషయం చెప్పకుండా ఈ విధంగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం ఆమె మనసుని కమ్చీతో కొట్టినట్టయింది. అతడు తనతో అన్ని విషయాలూ చర్చించి, 'ఈ ఫోటోలు బయటపడితే ఎలా' అని అడిగి వుంటే అది వేరే సంగతి. నిజానికి ఆ ఫోటోలు బయటపడితే పోయే అతడి పరువుకన్నా తనది ఎక్కువ. అతడు కోటేశ్వరుడూ, పెద్ద మాఫియా లీడరూ అయివుండవచ్చు. కానీ తాను రాజకీయాల్లోనూ, వెండితెరమీదా పబ్లిక్ ఫిగర్. ఆమెకు అకస్మాత్తుగా పెద్ద పెట్టున దుఃఖం అది. తనని ప్రేమించేవాళ్ళు లేక, తాను కష్టంలో వున్నప్పుడు మాట సాయంచేసేవాళ్ళు ఒక్కరన్నా లేరని తెలుసుకున్నప్పుడు కలిగే దుఃఖం అది. మనిషికి డబ్బూ, పదవి, హోదా- ఏదీ ఇవ్వలేనిది అది.
టేప్ రికార్డర్ లో సత్తార్ అన్న మాటలు ఆమెకు వాస్తవంగా అనిపించాయి. భర్తని బెదిరించడం కోసం మర్డర్ చేయించింది. మర్డర్ ని మాఫీ చేయించటం కోసం అరవింద్ చౌరసియాకి తనని అర్పించుకుంది. అతని సాయంతో రాజకీయపు టెత్తులు వేసింది. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీతో పరిచయం పెంచుకుంది. దాన్ని చూపించి ముఖ్యమంత్రిని బెదిరించింది. ముఖ్యమంత్రిని తొలగించడం కోసం అలజడులు సృష్టించాలనుకుంటూంది. అలా మరో మెట్టుపైకి ఎదగాలనుకుంటూంది. తన పతనానికి మనసు ఇక్కడివరకూ అంగీకరిస్తోంది. సత్తార్ మరో మెట్టు క్రిందికి జారమంటున్నాడు. బస్సుని తగలబెట్టే ఆందోళనకారుడికీ, సరిహద్దు దాగి ఇవతల కొచ్చే టెర్రరిస్టుకీ తేడా లేదనుకుంటున్నాడు. నిజమే అయివుండవచ్చు.
పతనం ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడకు వెళ్తోంది?
మనిషికి మనసుతో సత్సంబంధాలు లేవు. అలాగే మనిషికి మరో మనిషితో, ప్రభుత్వంతో, దేశంలో సత్సంబంధాలు లేవు. ఇదంతా ఎందువల్ల జరుగుతోంది? కేవలం నిజాయితీ లోపించడం వల్లేనా? తన జీవితానికి అనువుగా వుండేట్టు మొదట సిద్దాంతాలు నిర్మించుకుని, ఆ తరువాత ఆ సిద్దాంతాలే తమని మానసికంగా అనుక్షణం బాధపెడుతూ వుంటే నిరంతరం కుమిలిపోయే మనుష్యులకి దారేది? తన ప్రియుడి గదిలోనే టేప్ రికార్డర్ పెట్టగలిగిన అవినీతిపరురాలు తను. ప్రియుడు ఇలా చేస్తాడని బాధపడటం దేనికి? మానవ సంబంధాలు పాడయిపోతున్నాయని వాపోవడం దేనికి??
ఈ వలయం నుంచి బయట పడటం ఎలాగో ఆమెకి అర్ధం కాలేదు. చౌరసియా ఎలాగైనా వత్తిడి తెస్తాడు. తన భర్త దానికి వప్పుకోకపోవచ్చు. దేశం మీద ప్రేమ వుండికాదు. ప్రభుత్వం ఉరి వేస్తుందేమో అన్న భయంతో! అతడికి టెర్రరిస్టు లతో చేతులు కలిపేటంత ధైర్యం లేదు.
ఆమె తప్పంతా భర్తమీదకు తోసెయ్యడానికి నిర్ణయించుకుంది. తను అడుగుతుంది. భర్త కాదంటాడు. ఆ విషయం వెళ్ళి చౌరసియాకు చెపుతుంది. మిగతా విషయాలు వాళ్ళు చూసుకుంటారు. తను మాత్రం ఈ సమస్య నుంచి బయటపడుతుంది.
ఇలా ఆలోచించి ఆమె బయల్దేరింది. భర్త దగ్గరకు వెళ్తూవుండగా ఆమె మనసంతా అదోలా అయిపోయింది. ప్రియుడి సందేశాన్ని భర్తకి అందించడం....బహుశ ఏ స్త్రీకీ ఇప్పటివరకూ ఈ స్థితి సంభవించి వుండదు.
ఆమె రెడ్డి దగ్గిర ఈ విషయాన్ని జాగ్రత్తగా కదిపింది. అరవింద్ చౌరసియా ప్రసక్తిరాలేదు. 'బయట శక్తులు కొన్ని సాయం చేయడానికి సిద్దంగా వున్నాయి. రాష్ట్రాన్ని కల్లోలం చేసి విడగొట్ట కల్గితే కొన్ని కోట్లు లాభం....' అన్నట్టు చెప్పింది.
రెడ్డి మొహం ఉద్వేగంతోనూ, ఆనందంతోనూ నిండిపోయింది. "నిజమా?" అన్నాడు ఎగ్జయిటెడ్ గా అతడు అప్పుడే ఆంద్రదేశాధినేత అయినట్టు వూహించుకున్నట్టు మొహం చూస్తుంటేనే తెలుస్తూంది.
కామిని మొహం రక్తం చుక్కలేనట్టు పాలిపోయింది.
ఆమె దీన్ని వూహించలేదు. తన భర్త భయాన్ని అతడి స్వార్ధం డామినేట్ చేసిన క్షణాలివి. రెండు చోట్లా తను ఓడిపోయినట్టు ఆమె గ్రహించింది. ఆమెలో ఒక కసి బయల్దేరింది. ఆ రకమైన సాడిజంతోనే, "ఇదంతా నీకు ఎవరు సాయపడతారని అడగవేం?" అంది.
"అవును అడగడం మర్చిపోయాను. ఎవరు?"
"అరవింద్ చౌరసియా."
అతడి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. "చౌరసియా మనకి సాయపడతాడా?" అని అరిచాడు ఉద్వేగంగా.
ఆమెలో కసి తారాస్థాయికి చేరుకుంది. ఈ ప్రజలమీద, నిర్లిప్తతమీద, మానవ సంబంధాలమీదా, నిజాయితీ ముసుగులో ఆడే నాటకాల మీదా- అన్నీ కలిపి- ఎదురుగా వున్న అతడిమీద.
"అవును నీకు ఎందుకు సాయపడడు? నువ్వు తన ప్రియురాలి భర్తవి కదా" అంది ఆఖరి అణ్వాస్త్రం వదులుతున్నట్టు! ఆమె ఆ క్షణం అంతా చెప్పెయ్యడానికే నిశ్చయించుకుంది. యుద్ధం అయిన తరువాత కన్నా ముందే ఎవరు శత్రువులో, మిత్రులో తెలుసుకోవడం మంచిది కదా!
అతడు ఆ మాటలకి తలెత్తి చూశాడు. అతడి మొహంలో రకరకాల భావాలు చోటుచేసుకున్నాయి. కామిని అతడివైపే చూస్తోంది. ఆనకట్ట తెగితే, ఒక్కసారిగా నదీజలం ప్రవహించినట్టు అతడిలో ఆవేశం కట్టలు తెంచుకుని, తనని అక్కడికక్కడే మర్డర్ చేస్తాడని ఆమె భావించింది. అయితే అతడి మొహంలో వస్తూన్న మార్పులు 'ఆవేశం' తాలూకువి కావు. 'సంభ్రమం' తాలూకువి.
"నిజమా? నీకూ చౌరసియాకు అంత దగ్గిర సంబంధం వున్నదా?" అన్నాడు సంభ్రమంగా.
ఒక గ్రీష్మ పవనం ఒంటిని మండించినట్టు ఆమె కదిలి పోయింది. అతడు ఆవేశంలో తనని తగలబెట్టినా ఆమె అంత ఆశ్చర్యపోయేది కాదేమో తనని నిలువునా సమాధి చేస్తానని రెచ్చిపోయినా అంత బాధపడేది కాదేమో ఈ విషయం తాను చెప్పగానే అతడు 'ఆనందించటం' ఆమెకు గొడ్డలిపెట్టులా తగిలింది.
జేవురించిన మొహంతో, "మీ భార్యకు ఇంకొక వ్యక్తితో సంబంధం వుందని చెపుతున్నాను. అయినా మీకు ఆవేశం కలగటం లేదా?" అంది.
అతడు సింపుల్ గా "నేను రాజకీయ నాయకుడిని కదా" అన్నాడు- "రాజకీయ నాయకుడు ఎవరూ అనవసరమయిన విషయాలకు ఆవేశం తెచ్చుకోడు."
ఆ మాటలకూ ఆమె మరింత ఇరిటేట్ అయి, "నువ్వసలు మగాడివేనా? నీలో నెత్తురు ప్రవహిస్తోందా? నీ భార్యకు ఇంకొక వ్యక్తితో సంబంధం ఉందంటే-అది అనవసరమయిన విషయమా?" అని అరిచింది.
"ఆవేశపడకు కామినీ. అసలు విషయం చెప్పు చౌరసియా నీతో ఏం చెప్పాడు? నా ప్రసక్తి ఎందుకొచ్చింది? ఈ రాష్ట్రపు కాబోయే ముఖ్యమంత్రితో చౌరసియాకు ఏం పని?" అన్నాడు ఆత్రంగా.
"అతడితో కలిసి నువ్వు ఈ రాష్ట్రాన్ని విడగొట్టెయ్యాలని ఫీలర్స్ పంపాడు.....నాతో!"
"అతడిని నమ్మవచ్చంటావా? లేక నన్ను ట్రాప్ చేసి కటకటాల వెనక్కి తొయ్యటానికి ముఖ్యమంత్రితో కలిసి అతను వేసిన ట్రిక్కా అది?"
"అతడితో కలిసి నేను ఒకే పక్కమీద గడిపిన ఎన్నో రాత్రుల సాక్షిగా అతడిని నమ్మవచ్చు" అంది.
"నువ్వు చెపుతే ఇక అందులో డౌటు లేదులే నువ్వు కలుపుతావా మా ఇద్దర్నీ- లేక నువ్వు చెప్పావని నేనే అతడిని కలుసుకుని ఈ ప్రపోజల్ పెట్టనా?" అన్నాడు.
"అంటే....అంటే....అతడితో కలిసి రాష్ట్రంలో టెర్రరిజాన్ని వ్యాపింపజెయ్యటం నీ కిష్టమే నన్నమాట."
"అందులో తప్పేం వుంది? స్వతంత్ర ఆంద్రదేశానికి నేను రాజునవుతాను."
ఆమె ఇంకా ఆగలేకపోయింది. ఛివాలున లేచి అతడి కాలర్ పట్టుకుని దగ్గిరకి లాగుతూ, "నీ మొహంమీద ఉమ్మెయ్యాలని పిస్తూంది నాకు. ఎంత దిగజారిపోయావు నువ్వు? నా భర్త ఒకచేతకాని దద్దమ్మ అనుకున్నప్పుడు బాధ కలగలేదు. అటువంటి వాడిని హోం మినిష్టర్ ని చేయటం కోసం ఢిల్లీలో అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకున్నప్పుడు బాధ కలగలేదు. 'నీలో వయసు బాగా తెలుస్తూంది. నీకు మేకప్ చేసే అమ్మాయిని నాకు పరిచయం చెయ్యి' అని చౌరసియా అన్నప్పుడూ బాధ కలగలేదు. కాని ఇప్పుడు....ఇప్పుడు ఒక చిన్న దేశానికి రాజు కావాలన్న ఆశతో, దేశంనుంచి రాష్ట్రాన్ని విడగొట్టటం కోసం, తన భార్య ప్రియుడితో చేతులు కలిపేవాడు నా భర్త అనుకుంటే నాకు బాధ కలుగుతోంది-" అంది.
అతడు తాపీగా, "ఇంతేనా? నువ్వు చెప్పవలసింది ఇంకేమైనా వున్నదా?" అని అడిగాడు. తరువాత లేచి ఆమెవైపు చూస్తూ అన్నాడు. "నువ్వు చాలా గొప్ప దానివని నీ అభిప్రాయం. నువ్వేకాదు నీలాటి స్త్రీలు చాలామంది అలానే అనుకుంటూ వుంటారు. తాము ప్రపంచాన్నీ, అందులోని చాలామంది మొగవాళ్ళనీ చూశామని అనుకుంటారు. నీలాటి స్త్రీలు రాజకీయాల్లో ఎక్కువగా వున్నా, బయట ప్రపంచంలో కూడా చాలా మంది వుంటారు. వీళ్ళు ఎక్కడా ఇమడలేరు. ఒక్క స్నేహితుడితో ప్రారంభమైన మీలాటి వాళ్ళ జీవితం ఎన్నో మజిలీల్లో ఆగుతుంది. ఒక్కొక్క మజిలీ మీరు ఒక్కొక్క అనుభవంగా భావించి, ఎదిగిపోయామని అనుకుంటారు. ఒక మొగవాడు తనకి ఒక స్త్రీ దొరకటం గొప్ప వరంగా భావిస్తాడు. అలాటి తొట్టిగ్యాంగు, నీచమైన గ్యాంగు అంతా మీ చుట్టూ చేరి మీకు లేని గొప్పదనాన్ని కలిగిస్తారు. వీళ్ళంతా మీ శరీరం మీది వ్యామోహంతో మీ చుట్టూ చేరతారు. కొంతమంది మిమ్మల్ని ప్రేమిస్తారు కూడా. కానీ ఆ ప్రేమంతా వాళ్ళు తమ బాధలు మీతో చెప్పుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అలాటి మొగవాళ్ళు మీకు నచ్చరు. అప్పటికే మీ గురించి నలుగురికీ తెలుస్తుంది. నలుగురికీ తెలిసిందని మీకూ తెలుస్తుంది. మీ మనసుతో మీకు మంచి సంబంధాలు వుండవు. విసుగూ, చిరాకూ ఎక్కువ అవుతుంది. మొగవాడికి ఒక అనుభవం అతడి అకౌంట్ లో ఒక నెంబరుగా చేరుతుంది. ఆడదానికి ఒక అనుభవం మొహంమీద ఒక ముదతను ఎక్కువ చేస్తుంది. ఇంత చిన్న విషయం తెలుసుకునేసరికి మీ చుట్టూ వున్నవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. మనసుతో ఇక నాటకాలు ఆడలేక, 'నన్ను నన్నుగా ప్రేమించే.....'అన్న కొత్త స్లోగను మొదలుపెడతారు. మిమ్మల్ని మీరుగా ప్రేమించటానికి మీలో ఏమీ లేదని, మిగిలింది వట్టి చెరుకుపిప్పి అనీ గ్రహించరు. అప్పటికీ మీక్కాస్త హోదా వస్తుంది. దాన్ని మీ ఫ్రస్టేషన్ కోసం ఉపయోగించుకుంటారు. మీరు ఉద్యోగినులైతే క్రింది ఉద్యోగస్తులను చంపుతారు. రచయిత్రులైతే రచనల్లో చూపిస్తారు. రాజకీయాల్లో అయితే మంత్రుల మధ్య తెంపులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. రోజుకి పది గంటలు ఫోన్ దగ్గిరే గడపటం మీ జబ్బుకి మొదటి లక్షణం మీ మొహంమీద ఆనందకరమైన, శుభప్రదమైన నవ్వు వచ్చి చాలా కాలమవటం రెండో లక్షణం. ఈ రెండు లక్షణాలూ నీ కున్నాయని నీకూ నాకూ తెలుసు. ఇప్పుడు చెప్పు ఇదంతా విన్నాక కూడా నీ కింకా కడుపులో తిప్పుతున్నట్టు వుందా?"
