చెన్నమ్మ మాటలు చాలా తగ్గించింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ వుంటుంది. ఫోన్ వస్తే చాలు చెన్నమ్మ తీస్తుంది.
ఆరోజు ఫోన్ తీసింది సుబ్బి....
"ఎవరూ..?"
"నేను, బోడిని..!"
"ఎవరూ?"
"సుబ్బిని..!"
"సుబ్బీ....నేను, సతీష్ మాట్లాడుతున్నా..! నువ్వు నేనొక చోటు చెప్తా.....వస్తావా?"
ఉబ్బి భయంతో ఫోను పెట్టేసింది- చెన్నమ్మ చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి.
మళ్ళీ ఫోను మోగింది.
"బోడీ.... నీకు నేను పౌడరు కాదు- ఎన్నో తెచ్చి పెడతా! అతేకాదు, ఈరోజు ఆంటీతో చెప్పి సినిమాకి తీసికెడతా! నేనొక్కడినే కాదులే....చాలామంది కలిసి వెడదాం-ఏమిటీ....మాట్లాడు" 'రా.... వస్తా' బోడీ వెనక్కి తిరిగింది-చేతిలో ఫోనుతో!
చెన్నమ్మ ఫోను లాక్కుంది.
"రా, నీ కాళ్ళు విరగ్గొడతా.... దొంగ సచ్చినోడ!" ఫోను పెట్టేసింది.
సుబ్బి ముఖం దించుకుంది. బిగుతుగా నున్న జాకెట్టు సరి చేసుకుంది.
"రాత్రి రాజయ్య వస్తాడు" అంది నెమ్మదిగా చెన్నమ్మ.
"నాకు భయంగా వుంది" సుబ్బి నసిగింది.
"ఉష్... గది తుడూ- అలా కూచుంటే ఎలా?' -చెన్నమ్మ అరిచింది సుబ్బిపై, పక్కనే జానకి.
"ఏమే బోడీ..... ఆ గౌను వేసుకుంటావా?" అంది.
ఎందుకో.... గౌను అనే మాట వినబడగానే సుబ్బి ముఖం వాడిపోయింది.
"వద్దమ్మా..." అంది.
బోడీ వీపుమీద గుద్దులు పడ్డాయి.
"ఏమే, నేను లేనప్పుడు ఆ గౌను వేసుకుని, నా గదిలో పౌడరు రాసుకుని. సెంటు రాసుకుని అద్దంలో గంటలు గంటలు నిలబడతావా- ఫోనొస్తే తీయవా?!" అమ్మగారి మాటలు ఒక్కటీ అర్ధంకావటం లేదు.
అలా చూస్తావేంటి బోడి ముఖం వేసుకుని! ఈ ఇంట్లో పెద్దదిక్కల్లే చెన్నమ్మ వుంది కాబట్టి, నీ ఆటలు కడుతున్నాయి -ఏం చెన్నమ్మా"
"అవునమ్మా.... రాత్రి మీరు పొద్దుపోయేవరకు రాలేదు కదమ్మా- ఈ బోడి మీ అద్దం ముందు నిలుచుంది. వద్దే అంటే వినదమ్మా- ఈ బోడికి అసలు భయభక్తులు లేవూ!" అంది పని చేసుకుంటూ.
బోడికి ఏమీ అర్ధం కావటంలేదు. చెన్నమ్మ మాటలా యివి- తన మీద నేరాలు చెన్నమ్మ చెప్తోందా...అమ్మగారికి! -ఏమిటిది?
"వయసొస్తోంది కదమ్మా. షోకులెక్కువయిపోయాయి దీనికి!" అంది కూరలో పోపు పెడుతూ.
"చెన్నమ్మా- నువ్వు మంచిదానివి కనక ఆరోజు ఆ రాజీవ్ ఇచ్చిన పరికిణీ గుడ్డ దీనికి కుట్టించమన్నావు- దీని ముఖానికి అదొక్కటే తక్కువ. ఆ రాజీవ్ ఈ దిక్కులేని పిల్లని నాకు అంటగట్టాడు. ఏదో తిండి తిని పడుండక, పౌడర్లు, సెంట్లా? ఈ మాటు నా గదిలో కొస్తే కాళ్ళు విరగ్గొట్టు చెన్నమ్మా!" అంది బాగ్ లోంచి లిప్ స్టిక్ తీసి రాసుకుంటూ.
"అలాగేనమ్మా..!" అంటూ చెన్నమ్మ కాఫీ- కప్పులో పోస్తూ.
సుబ్బికి నిజంగా ఏమీ అర్ధంకాలేదు- చెన్నమ్మ ఎందుకిలా చెప్తోంది? అంటే....తల్లిలేని వాళ్ళకి లోకంలో ఇంకెవరూ లేనట్టేనా? నాకే అమ్మ వుంటే ఈ కర్మేమిటి? చెన్నమ్మ తల్లిలాటిదనుకున్నా- కాదా..!!
జానకి ఫ్రెండింట్లో లంచ్ కి వెళ్ళింది. మాధవరావు ఆఫీసు పనిమీద ఊరెళ్ళాడు. రేపొస్తాడు. సుబ్బి బట్టలుతుకుతూ కన్నీళ్ళు తుడుచుకుంది.
చెన్నమ్మ సుబ్బి తల నిమిరి, "ఇటురా..!" అంది. సుబ్బి అలాగే కూచుంది.
"నామీద కోపం! నా మాటలు ఇంక నమ్మవు... అవునా!" -సుబ్బి చెన్నమ్మ ఒడిలో తలదాచుకు వెక్కివెక్కి ఏడ్చింది.
"ఇందాక ఆ మాటలు అలా చెప్తేనే నేను నీకు చేసే సహాయానికి పునాది!" అంటూ చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది.
సుబ్బి ముఖం విప్పారింది.
అలా వెళ్ళిన జానకి ఇలా వచ్చేసింది హడావిడిగా.
"ఏమిటో... అసలుది మరచిపోయాను" అనుకుంటూ.
"చెన్నమ్మా... ఆ పరికిణీ బట్ట ఇటు తీసుకురా, అక్కడే పైన షెల్పులో పెట్టా!"
ఎర్ర పరికిణీ నీలం అంచుతో ఎంతో బాగుంది. బోడి ఆ బట్టవైపే చూస్తోంది.
"జాగ్రత్తగా పేక్ చేయి- మడత నలుగనీయకు. లోపల ప్లాస్టిక్ సంచీవుంది చూడు. కొత్తది- దాంట్లో పెట్టు" అంది.
నీకు తెలుసుగా చెన్నమ్మా, నా స్నేహితురాలు హిమబిందు. ఆరోజు మనింటికి భోజనానికి రాలేదూ- వాళ్ళే- ఆ పిల్ల దీనంతే వుంటుంది... ఇధప్పుడే ఆర్నెల్లయింది అయి- అది ఇప్పుడయింది! ఈరోజు బంతి భోజనం- ఈ పరికిణీ బట్ట ఇచ్చేస్తా ఆ పిల్లకి! -ఇది వెయ్యి రూపాయలపైన ఉంటుంది" అంది.
బాగ్ లోంచి దువ్వెన తీసి మెడదాకా వున్న జుట్టు దువ్వుకుని అందమైన మెరూన్ వెల్వెట్ బాండ్ జుట్టుకు పెట్టుకుంది.
సుబ్బి చూస్తోంది- కారు కదిలిపోయింది.
చెన్నమ్మ "నీయమ్మ- డబ్బున్నవాళ్ళకే ఈ రోగాలన్నీ..! థూ..." అని లోపలకెళ్ళిపోయింది.
సుబ్బి వస్తున్న నవ్వును ఆపుకొందుకు- నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంది.
రెండు నెలల్లో సుబ్బికి కొంచెం జుట్టు పెరిగింది. చిన్న క్రాపు వస్తోంది. ఎప్పుడెప్పుడు జుట్టు పెరుగుతుందా, ఎప్పుడెప్పుడు దొడ్లో ఉన్న బంతిపూలు పెట్టుకోవచ్చా...అని చూస్తోంది సుబ్బి.
జానకి, మాధవరావు భోంచేస్తున్నారు.... చెన్నమ్మ వడ్డిస్తోంది.
"అమ్మగారూ-ఒక్కమాట చెప్తా....వింటారా?" అంది ఏదో రహస్యం చెప్తున్నట్టు.
"ఈ పిల్లకి వయసొచ్చింది, చదువా లేదు అందుకని...."
"పెళ్ళి చేసేయమంటావా..?" అన్నాడు మాధవరావు.
"అవునయ్యా- లేకపోతే.."
జానకి ఫక్కున నవ్వింది- "దీనికెన్నేళ్ళనీ- పెళ్ళి చేయడానికీ!" అంది.
ఏం... పన్నెండేళ్ళుంటే చాలదా? మా అమ్మకి తొమ్మిదేళ్ళు, మా అయ్యకి పధ్నాలుగేళ్ళు అట పెళ్ళప్పటికి, మా అమ్మ చెప్తుండేది- పధ్నాలుగేళ్ళు రాకుండా పిల్లల తల్లులయేవారు కాదా!" అంది సాంబారు వడ్డించి.
"అది మీ అమ్మకాలం- ఇప్పుడు అలా చేస్తే మనల్ని జైల్లో పెడతారు.... నిన్ను కూడా జైల్లో పెడతారు తెలుసా?" అన్నాడు మాధవరావు.
* * *
రాజీవ్ మనిషిలో పూర్తి మార్పు గమనిస్తోంది సుమతి.
అసలు సుమతిని ఏ విషయానికీ మాట్లాడనివ్వడం లేదు.
"మీ అమ్మలాగే నువ్వూ తయరవుతున్నావే..!" అంటూ శశికాంత్ ని ఆరోజు కోపంగా కొడుతుంటే సుమతి మనసు విలవిల్లాడిపోయింది. వీడడిగిందేమిటి....స్నేహితులతో జూ కెడతానని! అందుకు అంత కొట్టాలా - అయినా వెడితే ఏం?
"నువ్వు అనవసరంగా కల్పించుకోవద్దు- వాడు నా కొడుకు, నా యిష్టం!" అన్నాడు. ఆ తర్వాత బెడ్ రూములో వున్న రెండు మంచాలూ ఒకటి పక్క రూములో వేశాడు- తను పైన గదిలో పడుకుంటున్నాడు.
"పడగ్గది భార్యాభర్తలిద్దరిదీ - మంచాలు విడిగా వేసుకుంటే చూసేవాళ్ళు నవ్వుతారు" అంది సుమతి.
"చూసేవాళ్ళ కోసం ఇంతవరకు బతికాను, ఇంక బతకను" అన్నాడు రాజీవ్. ఇల్లంతా సర్దాడు- ఆ మంచం వేసిన గదిలో చిన్న ఫోన్ పెట్టాడు. రాజీవ్-భోజనం కూడా సుమతితో కలిసి తినటం లేదు. "ముందు నేను తిన్నాక తర్వాత నువ్వు తిను" అంటూ పదిన్నరకే డైనింగ్ టేబుల్ దగ్గర కూచుని భోంచేస్తున్నాడు. సుమతి నోరెత్తితే చాలు-"నీ మాట వినక్కర్లేదు- భార్య మాట విని బాగుపడ్డవాడు లేడులే- అయినా మనిద్దరం, నీవంటావు చూడు- సంఘం కోసం అనీ, ఆ సంఘం కోసం ఒకే ఇంట్లో ఉంటున్నామంతే! నువ్వంటావు చూడు- చూసేవాళ్ళ కోసం అని...అందుకే!" రాజీవ్ విసురుగా వెళ్ళిపోయాడు.
రాజీవ్ మనసులో బాగా నాటుకుపోయింది- ఇకనుంచి తను ఎవర్నీ నోరెత్తనీయకుండా, 'నేనే ఈ ఇంటి యజమానిని, నేను చెప్పినట్టు మీరంతా వినాల్సిందే!' అనే భావం బాగా అలవాటు చేస్తే కానీ, తనమాటకి భయపడరని! మంచితనాన్ని చేతకానితనంగా, అసమర్ధతగా చూస్తున్నారని అర్ధమయిపోయింది.
"అలా మాట్లాడకు, నాన్నగారికి కోపం వస్తుంది" అని శశికాంత్ అనటం, "అయ్యకి కోపమొస్తుందేమోనమ్మా, తొందరగా కూర చెయ్యాలీ..." అని పనిమనిషి అనటం, "నాకేం తెలియదు, ఆయన్నడుగు" అని సుమతి అనటం వింటుంటే రాజీవ్ కి నవ్వొస్తున్నా, తన ప్రకృతికి విరుద్దమైన తీవ్ర స్వభావం అలవరచుకోవటం తమాషాగానే వుంది.
"ఫోన్ మోగుతోంది, తియ్యండి" అంది లోపల్నుంచి వస్తూ సుమతి.
"అంటే.... పేపరు చూడ్డం మానేసి ఫోను తియ్యాలీ?- నువ్వేం చేస్తున్నావ్? నిద్రనుంచి ఇప్పుడే లేస్తున్నావా?" -ఈ గొడవలో ఫోన్ కట్టయిపోయింది.
ఉన్నట్లుండి తనపై పగ సాధిస్తున్నాడు రాజీవ్ అని సుమతి మనసులో బాధపడిపోతున్నా ఎవరికీ చెప్తుందీ- భర్త రోజురోజుకీ తనకి దూరమై పోతున్నాడనే దుఃఖం ఆపుకోలేక పోతోంది.
