Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 30

   
    తన ఒళ్ళో చిన్న సింహాన్ని ఊహించుకొంటూంటే సంధ్య ముఖం భయంతో వివర్ణమైంది. అలాంటి మనుషులకు తల్లికావడమంటే ఎన్ని జన్మల పాపఫలమో అనిపిస్తూంది. నర్సమ్మత్త తననిన్నాళ్లూ చూసిందానికి సింహాన్ని చేసుకోడానికి సిద్ధపడిందేగాని, మరో సింహానికి జన్మనివ్వడానికి సిద్ధంగా లేదు.

    "అత్తమ్మా! నేను..... నేను సింహాన్ని చేసుకోను. నేను జానకమ్మత్తతో పెళ్ళిపోతాను!" ఎలాగో ధైర్యం కూడదీసుకొని అంది సంధ్య.

    "ఏమిటీ? వెళ్లిపోతావా? వెళ్ళిపోవడానికే మేపానా ఇన్నాళ్ళూ?"

    "నువ్వు నాకిన్నిరోజులు నీడనిచ్చావు! అనాధనై నీ ఇల్లు చేరితే పెద్దదిక్కువై నిలిచావు. దానికి నా మనసునిండా చెప్పలేనంత కృతజ్ఞత ఉంది. సింహాన్ని పెళ్ళాడి నా కృతజ్ఞతను వెళ్ళడించుకొందామనే అనుకొన్నాను. కాని, మళ్ళీ తండ్రిని పోలిక పిల్లో, పిల్లాడో నాకు పుడతారన్న ఆలోచన నాకింతవరకూ రాలేదు. ఇలాంటి మనిషికి మాత్రం నేను జన్మనివ్వడానికి సిద్ధంగా లేను!"

    "తిక్కవాడికి తిక్కవాడే ఎందుకు పుడతాడు? నీలాంటి పిల్లో, పిల్లాడో పుట్టకూడదా? అదంతా నాకు తెలియదు, నువ్వు మా సింహాన్ని పెళ్లాడాల్సిందే!"

    "నన్ను బలవంతపెట్టకు, అత్తమ్మా!"

    "బలవంత పెట్టడం కాదు! నీ కాళ్ళు చేతులు కట్టి మరీ పెళ్ళి జరిపిస్తాను!"

    "నేను జానకమ్మత్తతో వెళ్ళిపోతున్నాను. నా ప్రవర్తనవల్ల నీ మనసుకు కష్టం కలిగిస్తున్నందుకు నన్ను క్షమించు!" అంటూ జనకమ్మతో కదిలింది.

    "ఒరే, యాదగిరీ! అది వెళ్ళిపోకుండా పట్టుకోరా! గదిలోవేసి, తలుపులు వేసి వారంరోజులు తిండి లేకుండా మాడిస్తే అప్పుడొస్తుంది దారికి ఇన్నాళ్ళు నర్సమ్మత్త మంచితనమే చూసింది. ఇప్పుడు నరసింహావతారం చూస్తుంది!" అంటూ తమ్ముడికి పురమాయించింది, ఓ వైపు కొడుక్కి ఉపచారాలు చేస్తూనే.

    "పద! ఇంతమంది బంధువులు చూస్తూండగా ఎలా పారిపోతావే వాళ్లతో?" యాదగిరి సంధ్య చెయ్యి పట్టుకొని లాగసాగాడు ఇంట్లోకి.

    ఇంతసేపు మౌనంగా కారులో కూర్చొన్న అరుణ్ కారు దిగి, గంభీరంగా పందిట్లోకి అడుగుపెట్టాడు.

                        *        *        *

    "మీరు ఊరునుండి వస్తూనే ఫోన్ చెయ్యమన్నారండి, ప్రతిమమ్మగారు!"

    అరుణ్ వాళ్ళు ఇల్లు చేరుతూనే నౌకరు చెప్పాడు.

    "ప్రతిమ ఇక్కడికి వచ్చిందా?"

    "గంట ముందే వచ్చి వెళ్ళారండీ!"

    అరుణ్ ఫోన్ చేశాడు ప్రతిమకు.

    ".....ఇప్పుడే! ఒక్క నిమిషంకూడా సరిగా కాలేదు ఇంట్లోకి అడుగుపెట్టి!"

    "..................."

    "చూసి రావడంకాదు! సంధ్యని మాతో తీసుకువచ్చాం!"

    "..................."

    "నువ్వు చూస్తావని!"

    "................."

    "రా ఇప్పుడే!" అని ఫోన్ పెట్టేశాడు.

    జానకమ్మ ప్రయాణపు బడలికతో వస్తూనే పడుకుంది.

    సంధ్య ఏం తోచనట్టుగా కూర్చీలో కూర్చుంది.

    "లే! ముఖం కడుక్కొని బట్టలు మార్చుకో!" అన్నాడు అరుణ్ వచ్చి. సంధ్య కదలకపోవడం చూసి మళ్ళీ అన్నాడు. "మందలోంచి తప్పిపోయిన లేడిపిల్లలా ఉన్నావేమిటి? ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నావా?"

    "బాధపడడానికి ఇప్పుడేం జరిగింది?" దిగులుగా నవ్వింది సంధ్య.

    "మరి అలా బెదిరిపోయినట్టుగా ఉంటే...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS