"ఏం లేదు!" అందేగాని సంధ్యకేమిటో గుబులుగానే ఉంది తను కలగన్నట్టుగానే చిత్రంగా అరుణ్ వచ్చాడు! పెళ్ళి తప్పించి తనతో తీసుకువచ్చాడు. కాని, ఏమిటో బిక్కుబిక్కుమన్నట్టుగా ఉందిక్కడ! పల్లెలో పుట్టి, పల్లెలో పెరిగినపిల్ల! ఇక్కడ పెద్ద పెద్ద మేడలూ, ఈ ధనిక వాతావరణం ఇదంతా చూచేసరికి గుండెలో ఏమిటో అదురు చోటు చేసుకుంది.
"లే, సంధ్యా! ముఖం కడుక్కొని ఫ్రెష్ గా తయారవ్వు! నిన్ను చూడడానికి ప్రతిమ వస్తానంది."
"ప్రతిమా? ఎవరామె?"
"ఎవరంటే?.....ఎవ...." కొంచెం తడుముకొని, "నా స్నేహితురాలు! నువ్వు చిన్ననాటి స్నేహితురాలివైతే, తను కొంచెం పెద్దయ్యాక అయిన స్నేహితురాలు!" అన్నాడు. గుమ్మంలో ప్రతిమని చూసి, "అరె! ప్రతిమ అప్పుడే వచ్చేసిందే!" అన్నాడు.
"ఏదీ, నీ చిన్ననాటి స్నేహితురాలు?"
పసుపు బట్టల్లో, కళ్యాణ తిలకంతో ఉన్న సంధ్యని చూసి షాక్ తిన్నట్టుగా అయింది ప్రతిమ. 'అరుణ్ తన చిన్ననాటి స్నేహితురాలిని చూసి రావడానికి వెళ్లి - పెళ్ళి చేసుకువచ్చాడా?' అనుకొంది వివర్ణమైన ముఖంతో.
అరుణ్ బీరువాలోంచి టవల్ తీసి సంధ్యకి అందించి, "ముఖం కడుక్కురా, సంధ్యా! మల్లమ్మా, సంధ్యకి బాత్ రూం చూపు!" అని పని మనిషికి చెప్పాడు. సంధ్య వెళ్లాక ప్రతిమవైపు తిరిగాడు "సంధ్యని చూచి వస్తానని చెప్పి పెళ్లికూతుర్ని తీసుకువచ్చాననుకొంటున్నావా?" అనడిగాడు నవ్వుతూ.
"నువ్వు..... నువ్వు నన్నింత మోసం చేస్తావనుకోలేదు!" అంది ఉక్రోషంగా, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూంటే.
ప్రతిమ చేసిన నిందారోపణకి ఒక్కక్షణం తెల్లబోయినట్టుగా అయ్యి, తరువాత నవ్వేశాడు. "పరిస్థితులు ఇలా వస్తాయనుకోలేదు! మరి ఏం చేయను?"
"ఏమిటా పరిస్థితులు?" చుర్రుమంది.
"మేం వెళ్ళేసరికి సంధ్య పెళ్ళి జరుగబోతూంది! వాడో వెర్రి వెంగళప్ప! పెళ్లిపీటలమీద ఫిట్స్ కూడా వచ్చాయి వాడికి! అలాంటి వాడితో సంధ్య పెళ్ళిజరగటానికి వీల్లేదన్నాను! ఆమెకు నచ్చజెప్పి, ఆ పెళ్ళి నుండి తప్పించి తీసుకువచ్చాను!"
"తీసుకు వచ్చానంటే..... నువ్వామెను పెళ్ళి చేసుకోలేదా?"
"అపార్ధాలు, కన్నీళ్ళు మీ ఆడవాళ్ళకు పైనే ఉంటాయి కదా?" అని పకపక నవ్వాడు అరుణ్.
"బ్రతికించావ్! ఎంత భయపడిపోయాను!" అంది గుండెలమీద చేతులు తేలిగ్గా వేసుకొని.
సంధ్య టవల్ తో ముఖం తుడుచుకొంటూ వచ్చింది.
"అద్దం, పౌడరు, దువ్వెన పైన నా గదిలో ఉంటాయి పద!" సంధ్యని పైకి తీసికెళ్ళాడు అరుణ్.
ప్రతిమ వాళ్ళతోపాటు పైకి వచ్చింది.
"ఇదిగో ఇది పౌడరు! ఇది స్నో! ఇది....!"
"ఇవన్నీ నాకు వద్దు! కుంకుమ ఏదో చూపు!"
"కుంకుమ మగపిల్లాడి డ్రెస్సింగ్ టేబిల్ దగ్గర ఎందుకుంటుంది? క్రింద దేవుడి దగ్గరుండాలి! తెస్తానుండు!" అరుణ్ క్రిందికి వెళ్ళి కుంకుమభరిణి తీసుకువచ్చాడు.
గుండ్రంగా, కొంచెం పెద్దగా కుంకుమ దిద్దుకొంది సంధ్య. జడవిప్పి దువ్వుకొని వేసుకొంది. అంతా అయిదు నిమిషాల్లో టాయ్ లెట్ అయిపోయింది.
కొంతమంది ఎంత నిరాడంబరంగా ఉన్నా వాళ్ళ అందం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూంటుంది. సంధ్య చెవులకు బంగారు రింగులు తప్ప ఏ ఆభరణాలూ లేవు. కనుముక్కు తీరు ఎంతో బాగుంది, జుట్టు ఒత్తుగా, రింగులు రింగులుగా ఉంది. దేవాలయం దగ్గర బిచ్చపుపిల్లను చూసి సంధ్యను చూసినట్టుగా ఉందన్నాడు అరుణ్. ఆమె అయిదారేళ్ళ వయసులో అలా ఉందేమోగాని, ఇప్పుడు మాత్రం అలా లేదు. ఆలోచనలో ఉన్న ప్రతిమను,
"ఏదైనా మాట్లాడు, తనకి సిగ్గు!" అన్నాడు అరుణ్.
"తనకి సిగ్గయితే నాకుండదా?"
"నువ్వు పట్న వాసపు పిల్లవి!"
"పట్నవాసపు పిల్లలకి సిగ్గుండదా ఏమిటి?"
