కారులో కూర్చొని చూస్తున్న అరుణ్, సంధ్య పెళ్ళిపీటలమీదికి రావడం చూసి, 'ఈ ఆడవాళ్ళకి పెళ్ళంటే ఎంత ఇష్టమో!' అనుకొన్నాడు కోపంగా.
"నీ స్నేహితురాలి కూతురు ముచ్చటపడి ఆ ముగ్ధమోహనుణ్ణి పెళ్లాడుతూందిగా? తెచ్చిన చీరా, పూలు వాపస్ తీసుకుపోవడం ఎందుకు? కుంకుమపెట్టి ఇచ్చేసిరా!" కోపంగా చెప్పాడు తల్లికి.
జానకమ్మకి మాత్రం గుండెలమీద బరువు తీసేసినట్టుగా అయింది. జరుగుతున్న పెళ్లి చెడగొట్టి, ఒక వయసు పిల్లను వెంట తీసుకువెడితే ఎదురయ్యే చిక్కులు ఆమె మనసు చురుగ్గానే ఊహించేసింది. అరుణ్ బిజినెస్ లో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. కోటీశ్వరుడి కూతురు ప్రతిమ అతడి భార్య అయి రాబోతూంది త్వరలో. ఆ సంబంధం అరుణ్ కి పడాలని తను ఎంతో శ్రమపడింది. చివరికి తన శ్రమ ఫలించి ప్రతిమ తన కోడలై రాబోతూంది. ఈ సమయంలో అరుణ్ సంధ్యని వెంటబెట్టుకువెడితే, ముఖ్యంగా అతడిక్కడ ప్రదర్శిస్తున్న హీరో పోర్షన్ గురించి తెలిస్తే, ఎన్ని అపార్ధాలైనా తలెత్తుతాయి.
భగవంతుడి దయవలన ఆ గండం గడిచిపోయింది.
జానకమ్మ తేలిగ్గా ఊపిరి పీల్చుకొంది.
"..... కళ్యాణం చూతము రారండీ! శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ!" భజంత్రీలు ఉత్సాహంగా పాట అందుకొన్నాయి.
జానకమ్మ క్రిందికి దిగింది. పట్టుచీరున్న అట్టపెట్టెతో, "డ్రైవర్ ఆ పళ్ళబుట్టా, పూలబుట్టా పందిట్లోకి ఇలా పట్రా!" అని చెప్పి పందిట్లోకి దారి తీసింది.
అరుణ్ కారులోనే కూర్చొని కోపంగా చూస్తున్నాడు సంధ్యను. 'ఏమో అనుకొన్నాను! వట్టి తెలివితక్కువదానివి. లేకపోతే ఇలాంటి పెళ్ళికి ఒప్పుకొనేదానివా? చిన్ననాటి స్నేహితురాలివన్న మమకారంతో ఏదో చేతనైన ఉపకారం చేద్దామనుకొన్నాను. కాదని కాలదన్నితే నేనేం చేస్తానిక? నీ ఖర్మ!' మహాజోరుగా తిట్ల వర్షం కురిపించేశాడు మనసులోనే.
పెళ్ళయ్యాక ఓ ముత్తయిదువుచేత బొట్టుపెట్టించి, చీరా, పూలూ, పళ్ళు సంధ్యకి అందించాలని, పెళ్ళి వాళ్ళ సరసన కూర్చుంది జానకమ్మ.
"శాస్త్రిగారూ! ఇక అట్టే ఆలస్యం చేయకండి! ముందు ఆ మూడు ముళ్ళు వేయించేస్తే నా తలమీది బరువు క్రింద పడిపోతుంది!" తొందర పెట్టింది నర్సమ్మగారు.
"శాస్త్రోక్తంగా పెళ్ళి జరిపిస్తున్నప్పుడు అంతా సక్రమంగా నడిపించకపోతే ఎలా, అమ్మా? నాకసలు మనసు కుదరదు! నా పద్ధతిలో తు. చ. తప్పకుండా చేయించాల్సిందే. నీ తొందర బంగారం కాకపోతే ముహూర్తానికి ముందు ఎలా చేయిస్తాం మాంగల్యధారణ? ఇంకో పదినిమిషాలుంది ముహూర్తం!" తను చదువబోయే మంత్రాలకు బలం తెచ్చుకొంటున్నట్టుగా నశ్యం జుర్రున ఎగబీల్చి మంత్రాలని మొదలుపెట్టాడు శాస్త్రి.
ముత్తయిదువలు పసుపుదారంలో మాంగల్యాలు గ్రుచ్చి తెచ్చారు. శాస్త్రిగారు కొబ్బరికుడుకలో వాటిని ఉంచి, మరో కొబ్బరికుడుక వాటిమీద మూసి పందిట్లో కూర్చొన్న ముత్తయిదువలందరిచేత తాకిస్తున్నాడు.
ఇంతలో పెళ్ళికొడుకు పీటలమీద విరుచుకుపడిపోయాడు పెద్ద కేకతో.
పెళ్ళికొడుకు అనాకార శరీరానికి తోడు ఫిట్స్ కూడా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిపోయింది.
అతడి కళ్ళు చక్రాల్లా తిరిగిపోతున్నాయి! నాలిక పళ్ళక్రిందపడి నలిగి నురగతోపాటు రక్తంకూడా వచ్చేస్తూంది. అతడి కళ్ళు చక్రాల్లా, మొత్తం శరీరమే దెబ్బతిన్న పాములా మెలికలు తిరిగిపోతూంది.
చాలా బీభత్సంగా ఉందా దృశ్యం!
"చిన్నప్పుడెప్పుడో వచ్చిన సొమ్మరోగం సరిగా పెళ్లిపీటలమీదే రావాలా? ఓరి దేవుడో! ఇప్పుడేం చేయను?" నర్సమ్మగారు లబలబలాడుతూంటే, సంధ్య ఇంట్లోకి పరిగెత్తి తాళంచెవులగుత్తి తెచ్చి అతడి చేతిలో ఉంచి పిడికిలి మూసింది. ఆ పిల్ల ఆసంఘటనకి బిత్తరపోకుండా, మామూలుగా నర్సమ్మగారికి సాయం పట్టింది, సింహాన్ని ఇంట్లోకి చేర్చడానికి.
"ఈ అవతారానికి తోడు సొమ్మరోగం కూడా నన్నమాట. ఇలాంటి వాళ్ళు ఎప్పుడో దీనితోటే పోతారు. అమ్మాయ్! నీ జీవితం నాశనం చేసుకోవద్దు! నర్సమ్మ వంశోద్ధారకుడి కోసమేగా నిన్ను చేసుకొంటూంది? ఆ వంశోద్ధారకుడు మరో సింహమో, సింహమ్మో అయితే అప్పుడు చూడు నీకెంత నరకంగా ఉంటుందో? పాపం, ఆ అబ్బాయి గొప్ప మనసుతో నీకు సాయపడదామనుకొన్నాడు. తిరస్కరించడం చాలా పొరపాటని ఇప్పుడనిపిస్తూంది నాకు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోలేదుగా? వెళ్ళిపో!" అంటూ సలహా ఇచ్చాడు ఒక ముసలాయన.
