Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 30

          

                                           -: పుష్పపుట హస్త లక్షణము :-

   శ్లో!!    సంప్లిష్టౌ సర్పశీర్షౌచేద్భవేత్పుష్పపుటః కరః !!

    తా: రెండు సర్పశీర్ష  హస్తములను  మణికట్టు మొదలు చిటికెన వ్రేలివరకుగల అరచేతి అంచులను చేర్చిపట్టిన పుష్పపుట హస్తమగును.

    వినియోగములు :-

    కర్పూరహారతి, బిడ్డలు-పండ్లు  మొదలగువానిని తీసుకొనుట, సంధ్యాకాలమందు అర్ఘ్యప్రధానము చేయుట, మంత్రపుష్ప  మిచ్చుట వీనియందు ఈ హస్తము వినియోగించును.

                           -: ఉత్సుంగహస్త లక్షణము :-

   శ్లో!!    అన్యొన్య బాహుమూలస్థౌ  మృగశీర్ష  కరౌయది !
    ఉత్సుంగనామహస్త్కోయంకీర్తి తోభరతాగమే !!

    తా: రెండు మృగశీర్ష  హస్తములను పరస్పరము  మూపులకు సోకునట్లు పట్టిన  ఉత్సుంజ్గ హస్తమగును. దీనికి అధిదేవత గౌతముడు.
   
    వినియోగములు :-

    కౌగలింత, సిగ్గు, భుజకీర్తులు మొదలగువాటిని  చూపుట. బాలురను శిక్షించుట వీనియందు ఈ హస్తము వినియోగింపబడును.

                             -: శివలింగ హస్త లక్షణము :-

   శ్లో!!    వామ్కేర్ధచంద్రే విన్యస్తః శిఖర శ్శివలింగకః !!
    వినియోగస్తుతసైవ శివలింగ ప్రదర్శనే !!

    తా: ఎడమచేత అర్ధచంద్ర హస్తము కుడిచేతితో  శిఖరముబట్టి  ఎడమచెయ్యిపై  నుంచినచో శివలింగహస్తమగును.

    వినియోగములు :-

    ఇది శివలింగము చూపుటకు వినియోగించును.

                            -: కటకావర్ధన హస్త లక్షణము :-

   శ్లో!!    కటకాముఖయోః పాణ్యోస్స్వస్తికాన్మణీ బంధయోః !
    కటకావర్ధనాఖయాస్స్యాదితి నాట్యవిధోవిధుః !!

    తా: కటకాముఖము యొక్క  మనికట్లు  స్వస్తికముగ  చేర్చిపట్టిన కటకావర్ధన హస్తము వచ్చును. దీని కధిదేవత యక్షరాజు.
   
    వినియోగములు :-

    పట్టాభిషేకము, పూజ, పెండ్లిదీవెన  వీటికి  ఈ హస్తము వినియోగించును.

                            -: కర్తరీ స్వస్తికహస్త లక్షణము :-

  శ్లో!!    కర్తరీ స్వస్తికాకారః  కర్తరీ స్వస్తికో భవేత్ 

    తా: కర్తరీ స్వస్తిక హస్తము వచ్చుటకు కర్తరీముఖ హస్తములు స్వస్తికాకారముగ పట్టబడి కర్తరీ స్వస్తిక హస్తము వచ్చును.

    వినియోగములు :-

    తా: చెట్టుకొమ్మలు, పర్వత శిఖరము. వృక్షములు వీనియందు వినియోగించును.

                                            -: శకటహస్త లక్షణము :-

   శ్లో!!    భ్రమరౌమధ్యమాజ్గుష్టా ప్రసారాచ్చకలో  భవేత్ !
    రాక్షసాభినయోచ్కాయంనియోజ్యోభరతాదిభిః !!

    తా: రెండు భ్రమరహస్తముల బొటనవ్రేలిని, నడిమివ్రేలిని  చాచిపట్టిన శకటహస్తమగును.

    వినియోగములు :-

    ఇది రాక్షసులు మొదలైనవారికి చెల్లును.

                                            -: శంఖహస్త లక్షణము :-

   శ్లో!!    శిఖరా న్తర్గతాజ్గుష్టా  ఇతరాజ్గుష్టసంగతః !
    తర్జన్యోధ్యాస్తతః  శ్లిష్టాశ్శంఖహస్తః ప్రకీర్తితః !
    శంఖాదిషునియోజ్క్యోయమిత్యేవం భరతాదయః !!

    తా: శిఖర హస్తమందలి  అంగుష్టముతో  రెండవచేతి అంగుష్టము చేర్చి తక్కిన వ్రేళ్ళను ఆ శిఖరహస్తముపైకి  చేర్చిపట్టిన  శంఖహస్తము వచ్చును.

     వినియోగములు :-

    ఇది శంఖము యందు, శంఖము నూదుటయందు  వినియోగించును.

                            -: చక్రహస్త లక్షణము :-

   శ్లో!!    యత్ర్కార్ధ చంద్రౌ తిర్యఇచ్చావన్యోతల సంస్పృశౌ !
    చక్రహస్తస్సవిజ్ఞేయశ్చక్రార్థేవినియుజ్యతే !!

    తా: అర్ధచంద్ర హస్తములు అడ్డముగ రెండు అరచేతులు చేర్చిపట్టిన  చక్రహస్తము వచ్చును.

    వినియోగములు    :-

    ఇది చక్రమునందును, చక్రాకార  వస్తువులయందును  వినియోగించును.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS