సుందరం బడినుంచి నాగేశ్వరరావు వెంటలేకుండా ఇంటి కొచ్చేవాడుకాడు. ఇద్దరూ సామాన్యంగా కలిసే బడికి వెళ్ళేవాళ్ళు. పరీక్షలూ అవీ దగ్గరికి వస్తే ఇద్దరూ కలిసే చదివేవాళ్ళు. సుందరం రాత్రి అన్నంతిని పుస్తకాలు పట్టుకుని నాగేశ్వర్రా వింటికి వెళ్ళేవాడు. రాత్రిపూట అక్కడే పడుకునేవాడు.
సుందరానికీ నాగేశ్వర్రావుకూ కలిగిన స్నేహం బలమైనదని సీతమ్మగారు సులభంగా ఊహించింది. ఎప్పుడన్నా నాగేశ్వరరావు తమ ఇంటికొస్తే ఆవిడ వాణ్ణి అప్యాయంగానే చూసేది. కాని తనకొడుకు నాగేశ్వర్రావింట్లో వాళ్ళు ఎట్లా చూస్తారో ఆవిడకు తెలీదు. నాగేశ్వర్రావు స్నేహం తన కొడుక్కు అంగరక్షగా ఉంటుందని ఆవిడ తెలుసుకున్నది.
ఇప్పుడు యుద్ధం విషయం మాట్లాడే వాళ్ళెవరూ లేరు. దేశమంతటా దైవభక్తి హెచ్చిపోయింది. ప్రతిరోజూ ఎవరో ముసలాయన భజనకీర్తనలు పాడుతూ బయలుదేరేవాడు. అనేక మంది పిల్లలు ఆయనవెంట పాడుతూ తిరిగేవాళ్ళు. ఆయన ఉత్త అరచేతిలోనుంచి చిన్న చిన్న ఎండుకొబ్బరి ముక్కలు తీసి తనవెంట వచ్చే పిల్లలకు వున్నట్లుండి పెడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడూ దవనం ముక్కలుకూడా తీసి ఇచ్చేవాడు. ఆయనగొంతు వెలుగు రాచుకు పోయినట్లుండేది. ఆయన ఎవరినీడబ్బు యాచించినట్టు కనపడేవాడు కాడు. వీధివెంట పోతూ పోతూ తనఇష్టం వచ్చిన ఇంటో ప్రవేశించేవాడు. అక్కడ ఏ కొబ్బరికాయలో ఇస్తే అవి అక్కడే పంచిపెట్టేవాడు. సుందరం, నాగేశ్వర్రావు ఈయన వెంట దాదాపు రోజూ తిరిగేవాళ్ళు.
చీకటి పడ్డతరువాత ఇంకొక రకం భజనలు బయల్దేరేవి. కొందరు కుర్రాళ్ళు దీవస్సెమ్మాలు పట్టుకుని ఇల్లిల్లూ తిరిగి, "అడుగో రాముడు వస్తున్నాడు. వచ్చీ వాకిట నిలుచున్నాడూ," అని పాడేవాళ్ళు. ప్రతి ఇంటోనూ దీపానికినూనే, కాని డబ్బులూపడేవి.
నాగేశ్వర్రావింటో ప్రతి శనివారం రాత్రి భజన కూడా ఏర్పాటుచేశారు. ఒకటి రెండు తరంగాలూ, రామదాసు పాటలూ పాడేవాళ్ళు. ఈ భజన సుందరానికి బాగుండేది.
ఒకనాడు సాయంకాలం సుందరం బడినుండి నాగేశ్వరావుతో బాటు ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డుమీద ఒకగుర్రం ఎదురువస్తూ కనిపించింది. దానిమీద కాళ్ళు తెగిపోయిన వాడొకడు పడుకుని ఉన్నాడు.
"వాడు యుద్దంలో పనిచేసిన సిపాయిరా,"అన్నాడు నాగేశ్వరరావు .
"నిజంగానా?" అన్నాడు సుందరం ఆశ్చర్యంగా, ఆ గుర్రాన్నీ మొండివాణ్ణి సుందరం అదివరకు రెండుమూడు సార్లు చూశాడుగాని వాడు సిపాయని ఎరగడు.
"అవును. పాపం, యుద్ధంలోనే వాడికాళ్ళు పోయినై, వాడికి పింఛనిచ్చి ఆ గుర్రాన్ని కూడా ఇచ్చేశారు. ఆ గుర్రం మీద అట్లాగే తిరుగుతూ అడుక్కుంటాడు."
"కాళ్ళు లేవుగా? ఎట్లా ఎక్కుతాడో?"
"ఎవరో ఎక్కిస్తారేమో. ఆ గుర్రంచూడు, ఎంత విశ్వాసం గలదో! ఎవరన్నా ఎదురువస్తే ఆగుతుంది. ఎప్పుడూ పరుగెత్తదు. అడుక్కున్న దాన్లోనే వాడు తనుతిని గుర్రానికి పెట్టాలి. ఏం పెడతాడు, పాపం?"
"గుర్రం చాలా తింటుందా?"
"తినకేంరా? పచ్చిగడ్డీ ఎండుగడ్డీ తింటుంది. ఉలవలు తింటుంది. అదీకాక దాన్ని రోజూ మాలిస్ చెయ్యాలి."
అవును. సుందరానికి జ్ఞాపకం వచ్చింది. మునసబు గారికి గుర్రబ్బండీ ఉంది. ఆ గుర్రాన్ని కాసావాడు రోజూ మాలిస్ చెయ్యటం సుందరం చూశాడు. గుర్రం గడ్డిమీద తప్ప పడుకోదు. పక్కకు వేసేగడ్డి అది తినదుట....
కొన్నాళ్ళకు హైస్కూల్లో ఒక మీటింగుపెట్టారు. ప్రతిక్లాసుకూ నోటీసు వచ్చింది. ఉమామహేశ్వర పండితుడు ఉపన్యాసాన్ని చాలామంది మేష్టర్లూ రెండువందల మంది విధ్యార్ధులూ విన్నారు. పండితుడు హిందూ మతాచార ధర్మాలను గురించి మాట్లాడాడు, జుట్టూ, బొట్టూ, కట్టూ_ ఇవి జాతీయతకు చాలా ముఖ్యమని మనం కిరస్తానీవాళ్ళని అనుకరించి క్రాపింగులూ అవీ పెట్టుకుని జాతీయతనూ, మతాచారాలనూ పోగొట్టుకో కూడదనీ ఆయన చెప్పాడు.
ఆయన ఉపన్యాసం విని ఉద్రేకం వచ్చి చాలామంది విద్యార్దులు క్రాపింగులు తీసేసి తలలు గుండ్లు చేయించి పిలకలు పెట్టించేశారు. అట్లా చేసినవారిలో సుందరం క్లాసుమేష్టరు సాంబయ్యగారు ఒకరు.
ఆయన క్లాసులోకి వస్తూనే తలపాగా తీసి బల్లమీదపెట్టి పిల్లల్నిచూసి నవ్వాడు. పిల్లలంతా ఆయన బోడితల చూసి గొల్లున నవ్వారు.
"అంతా గుండుకాదులేరా. ఇదుగో గోష్పాదం" అంటూ ఆయన తల వెనక్కు తిప్పి పిలక చూపించాడు.
"అవునురా, మన వేడిదేశాని కిదే హాయి. నిక్షేపంగా ఎన్ని సార్లయినా స్నానం చెయ్యొచ్చు మంగలికి అర్దాణాడబ్బులు పారేస్తే డెక్కేస్తాడు తల. ఎందుకొచ్చిన క్రాపులు?.... తమాషా చూశారూ? ఈ ఇంగ్లీషువాళ్ళు మనమీద అధికారం చేస్తున్నారు గనక మనం క్రాపులు పెడుతున్నాం. మనం వాళ్ళమీద అధికారం చేశామనుకో, ఈ దొర ముండాకొడుకులంతా చచ్చిపట్టు బుర్రలు గీకించి పిలకలు పెట్టరూ?"
ఆ రోజు పాఠంలేదు. సాంబయ్యగారు. "వరల్డ్ మాప్" తెప్పించి అందులో ఎర్రరంగు వేసిఉన్న భాగాలన్నీ చూపించి బ్రిటిషు సామ్రాజ్యంలో సూర్యాస్తమానం ఎందుకు కాదో చెప్పాడు. ఈ ఇంగ్లీషువాళ్ళు యుద్దమప్పుడు ఇండియాకు స్వరాజ్యమిస్తామని ఎటువంటి కబుర్లు చెప్పారో ఇప్పుడెట్లా ఠలాయిస్తున్నారో చెప్పాడు.
"గెలిచిన కోడి కప్పెక్కి కూసిందట. వాళ్ళెందుకిస్తార్రా మనకు స్వరాజ్యం? ఇవ్వరు. యుద్దంలో గెలవటానికి నోటికొచ్చిన అబద్దాలన్నీ ఆడారు. వాళ్ళ అక్కర తీరపోయింది. మన దేశం నుంచి వాళ్ళు కోట్లకుకోట్ల రూపాయలు దోచుకుపోతున్నారు... ఒక్క డబ్బేనా? మన దేశంలో ఎన్నో దేవాలయాలూ, కోటలూ. దేవుళ్ళ విగ్రహాలూ ఉన్నాయి. అందులో ఉండే వజ్ర వైడూర్యాలన్నీ కాజేశారు! దోపిడే అనుకోండి. వాళ్ళు వదులుతారూ? వదల్రు. ఇదంతా మనసులో పెట్టుకోండి. పైకిఅనకండి. ఎందుకొచ్చిన పీడ?"
