స్మశానంలో కపాలం కంతలు కూడా మెరుస్తున్నాయని భ్రమించే వాడికి....ఆ కంతల్లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న మిణుగురు పురుగులు గుర్తుకురావు ఆ క్షణాన.
అలాంటిదే షాకింగ్ హెలూసినేషన్ అంటే!! డానికే భార్గవ కూడా లోనయ్యాడు. ఇంటిచుట్టూ టార్చ్ తో తిరిగి వచ్చి, కిటికీలు సైతం మూసి పడుకున్నాడు భార్గవ. కళ్ళు మండుతున్నా...నిద్ర రావటం లేదు. బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఇంకెంతకూ నిద్ర రాదని... పైకప్పు కేసి చూస్తూ పడుకున్నాడు.
పైన సీలింగ్ ఫ్యాన్ నిశ్చలంగా....
తాడును తోడుగా తెచ్చుకుంటె... హెల్ప్ చేయడానికి ఎప్పుడూ సిద్దమే అన్నట్లు... ఆలోచనల్తోనే కనురెప్పలు బరువెక్కి మూతపడుతున్న సమయాన...
చప్పున గుర్తొచ్చింది...
"ట్వంటీ లాక్స్....ఎమ్ బీషన్!" అంతే- మళ్ళీ అతనికి నిద్ర పట్టలేదు.
* * * * *
ఎలాంటి స్పర్శలూ ఎరుగని కొత్త పెళ్ళికూతురులా మొదటి రాత్రి భర్త ఒడిలో అదో రకమయిన సిగ్గు నిండిన తృప్తిలో మమేకమై పడుకుంది సుగాత్రి శరత్ ఒడిలో.
గింగుర్లు తిరిగిన ఆమె ముందు వెంట్రుకలు మొహంపై పడి మరింత అందాన్ని తెచ్చిపెడుతుంటే...వాటిని సుతారంగా ప్రక్కకు తొలగిస్తూ ఆమె కన్రెప్పలపై ముద్దాడాడు శరత్.
ఎన్నో రాత్రులు పంచుకున్న దాంపత్యం.... మళ్ళీ సిగ్గులు ఒలకబోస్తున్నట్లు... ఆ సిగ్గుల్లో నిశ్శబ్దాన్ని పంచుకొని__
"సుగా....ఈరోజే నీకో న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. నా నిర్ణయాన్ని నువ్వు అంగీకరించి ఆనందిస్తే, మనింట్లో నువ్వు కోరుకునే బాబు వుంటాడు....
చెప్పాలనుకున్నా ఇంకా నిన్ను అసంతృప్తి పర్చటం ఇష్టంలేక, ఈ రోజే నీకొక నిర్ణయాన్ని చెబుతున్నాను. నువ్వు ఒప్పుకుంతే ఆనందిస్తాను. నువ్వు ఒప్పుకోకపోతే నేను చేసేదేం లేదేమో కాని....
"చెప్పండీ! మొన్నట్నించీ సందిగ్ధంలోనే ఉన్నారింకా. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మన క్షేమం కోసమే కదా! అలాంటిది మీ నిర్ణయానికెప్పుడైనా వ్యతిరేకించానా?"
"ఏమో ఈసారి వ్యతిరేకం తెలిపితే?" అన్నాడు శరత్ ఆమెను ఒడిలో పొదివి పట్టుకొని.
"నేను వ్యతిరేకించేంతటి నిర్ణయాన్ని మీరెప్పుడైనా తీసికొన్నారా?" ఆమె అంది. "ఇంతకు ముందుతీసుకున్న నిర్ణయాలేవైనా వుంటే అవన్నిటికీ ఇప్పుడు తీసుకున్నది వేరు. లైఫ్ ప్రాబ్లెం...పుట్టబోయే బాబు కోసం తీసుకున్న విచిత్రమైంది కాబట్టే.... నీలో వ్యతిరేకమైన స్పందన కలగవచ్చు" ఆమె చేతిని తన చేతుల్లోకి తీసికొని స్పర్శిస్తూ అన్నాడు.
"ఏదైనా ఒకసారి చెప్పాలనుకున్నప్పుడు మధ్యలో బాబీగాడు వచ్చాడు. మరోసారి ఆ విషయం చెప్పేటప్పుడు నేనే మీ నాన్న జబ్బువల్ల చెప్పనివ్వలేదు ఇది మూడవసారి. మీరు చెప్పాలనుకుందేదో మధనపడక నాతో పంచుకోండి ఇప్పుడెవరూ లేరుగాని....మీరు నిదానంగా చెప్పండి. ఆ నిర్ణయమేదో నాకు అర్ధమయ్యేలా..."
కాని వాళ్ళిద్దరికీ తెలీదు ఒక ఇన్ స్పెక్టర్, మరో ఇద్దరు వ్యక్తులు వాళ్ళ గదివైపు వేగంగా నడుచుకు వస్తున్నారని....
"నువ్వు మంచి మనసుతో ఆలోచిస్తే నిజంగా నా నిర్ణయంలో లోపమేం కనబడదు. నీకే కాదు ఎవరికైనా."
"మొహం చూస్తే సీరియస్ గా చెపుతున్నారు. అసలు విషయమేదో నోట్లోనే నాన్చుతున్నారు. ముందది చెప్పండి ప్లీజ్" అంది సుగాత్రి.
కొద్ది క్షణాల తర్వాత__
అతడేదో చెప్పబోయేంతలో.... తలుపు మీద ఠక ఠక కొట్టిన శబ్దానికి విభ్రమంగా చూసారిద్దరూ తలుపువేపు. ఈ సమయాన ఎవరు వచ్చి వుంటారని? తమ ఏకాంతాన్ని భంగం చేస్తున్నందుకు విసుగ్గా లేచింది సుగాత్రి.
మళ్ళీ ఠక ఠక కొట్టిన శబ్దం...
ఈయన నిర్ణయమేమిటో... ఎలాంటిదో అర్ధం గాకపోయినా, చెప్పాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి? ఆ అడ్డంకులు తమ క్షేమంకోరా? లేక మరేదైనా...?? అది చెప్పాలనుకున్నప్పుడు అడ్డంకులు కూడా చాలా విచిత్రంగా వస్తున్నాయి. ఈ నిర్మలమైన సమయంలో... ఆయన నిర్ణయం ఎలాంటిదైనా బాగా అర్ధం చేసుకునేంతటి ఏకాంతం!!
సుగాత్రి ఆలోచిస్తూనే లేచి చీర సర్దుకొని, జుత్తు సవరించుకొంది. నైట్ డ్రెస్ సరిచేసుకొని తలుపు తీసిన శరత్ అవాక్కయయాడు. సుగాత్రి కూడా బయటికి వచ్చింది ఆశ్చర్యానుమానాలతో.
"శరత్ మీరే కదా" అన్నాడు ఎస్.ఐ లాఠీ వూపుతూ.
"యస్, అయాం శరత్...వాట్ హా పెండ్" అన్నాడు ఆదుర్దాగా. ఎస్.ఐ. ప్రక్కకు తప్పుకోగానే వెంట వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకతను ముందుకు వచ్చి-
"సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్. మీతో చిన్న పని పడింది. మాకు కొన్ని వివరాలు కావాలి" ఆ యువకులు ఇద్దరూ సాదా డ్రెస్సుల్లోనే వున్నారు.
"ఇంతకీ మీరెవరు?" అడిగాడు శరత్. సుగాత్రి కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది భయంగా.
"అయామ్ అమితేష్....ఇంటర్ పోల్ డిటెక్టివ్!! హీ ఈజ్ మై అసిస్టెంట్ వేణు....."
అమితేష్ విష్ చేశాక, వేణు కూడా కరచాలనం చేశాడు. అతడి కరచాలనంలో ఒక విచిత్రం....ఓ రెండు నిమిషాల వరకూ శరత్ కళ్ళలోకి చూస్తూ....శరత్ చేయిని విడువలేదు. శరత్ కు అతని ప్రవర్తన ఆ క్షణంలోనే వింతగా అన్పించి, చివరికి ఇబ్బందిగా వేణు చేతినుంచి తన చేతిని విడిపించుకున్నాడు కొంచెం బలవంతంగానే!! తర్వాత పెదవి విరుస్తూ...ఏదో సైగ చేశాడు వేణు అమితేష్ కు. అది గమనించిన సుగాత్రి కేం అర్ధంకాలేదు.
వాళ్ళు నలుగురూ వరండాలోకి వచ్చాక__
"భార్గవ మీకు తెల్సుకదా! ఆయన్ని ఒక ఆడపిల్ల చంపుతానని హెచ్చరిస్తోంది. అఫ్ కోర్స్! అలాంటి అబ్నాక్షియస్ కాల్ మొట్టమొదట మీ ఆఫీస్ లో వుండగానే వచ్చింది కదా" అడిగాడు అమితేష్.
