నీదాకా వస్తే?
ఉదయం పదిన్నర గంటలు అయ్యింది.
అప్పుడే ఆఫీసుకి అందరూ వస్తూ ఎవరెవరి డిపార్ట్ మెంటుల్లోకి వాళ్లు వెళ్లి అటెండెన్సులో సంతకాలు పెట్టి సీట్లలో కూర్చుంటున్నారు.
ఆ ఆఫీసులో అది "ఎ"డిపార్టుమెంటు.
అప్పారావు అటెండెన్సులో సంతకం పెట్టి డిపార్ట్ మెంటంతా కలియ జూశాడు.అప్పటికే డిపార్ట్ మెంటులోని వాళ్లంతా వచ్చేశారు ఒక సుశీల తప్ప.
సుశీల రాకముందే తను చూసిన విషయం డిపార్టుమెంట్లోని అందరికీ చెప్పెయ్యాలి!... కాస్త ఆలస్యం జరిగితే ఇంకేమైనా ఉందా?!... కొందరు క్యాంటీనుకి, కొందరు మార్నింగ్ షో సినిమాలకీ వెళ్లిపోతారు.
అప్పారావు అందర్నీ పిలిచాడు.
అప్పారావు అలా పిలిచాడంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. అందుకే అందరూ హుషారుగా అతని దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చారు.అలా పరుగు పెట్టడంలో కాళ్లు తట్టుకుని ఒకరిద్దరు బోర్లా పడిపోయారు.
"మీ కంగారు మంటెట్టా... కాస్త చూస్కుని పరిగెత్తండ్రా ..."అన్నాడు వాళ్ల ఉత్సాహానికి సంబరపడిపోతూ అప్పారావు.
"సర్లె... సర్లె... ఆ చెప్పేదేదో త్వరగా చెప్పు... లేకపోతే నీ కడుపులోని కుళ్లిపోతుంది..."ఆనందు అసిస్టెంట్ సెక్షనాఫీసరు ఆనందరావు కిందనుండి లేచి మోకాళ్లు రుద్దుకుంటూ.
"మరేమో...నిన్ననేమో...నేనేమో...సాయంత్రమెమో... ఆఫీసయ్యాకేమో... ఆరుగంటలకేమో..."
"ఈ..."అన్నారు చుట్టూ మూగినవాళ్లు పళ్ళు బిగబట్టి, అతనలా నాన్చడం తట్టుకోలేక.
"నువ్వు త్వరగా చెప్తావా లేకపోతే నీ పీక పిసికేయమా?..."అన్నాడు యుడిసి సుబ్బారావు.
వాళ్ల బాధ చూస్తుంటే అప్పారావుకి మరింతగా ముచ్చటేసింది వాళ్లని ఏడిపించాలని.
"అలాగే చెప్తా... చెప్పేస్తా...మరేమో... నిన్నసాయంత్రం నేను అబిడ్స్ లో సుశీలని...సుశీలని...హిహి..."అన్నాడు చెప్తున్నది ఆపి అందరివంకా చూస్తూ.
"ఆ...సుశీలని?... ఏం చేశావు చెప్పు?"
"ముద్దెట్టుకున్నావా?..."
"చెయ్యిపట్టుకున్నావా?..."
"సినిమాగానీ డిన్నర్ కిగానీ ఇన్ వైట్ చేశావా?'
అందరూ ఆతృతగా అప్పారావు మీద పడి జుట్టుపీకేస్తూ, చొక్కా నలిపేస్తూ అడిగారు.
"హి..."అన్నాడు ఏమీ చెప్పకుండా అప్పారావు సిగ్గుపడ్తూ.
"ముద్దు పెట్టుకున్నావా?" ఆనందరావు అప్పారావు కాలర్ పట్టుకుని కుతూహలంగా అడిగాడు.
"ఉహు... అబిడ్స్... అంత జనంలో అదెలా కుదుర్తుందీ?..."అన్నాడు అప్పారావు ముసిముసిగా నవ్వుతూ.
"మరేం చేశావో త్వరగా చెప్పి తగలడు..."అన్నాడు యల్డీసీ రామనాథం ఆత్రంగా,అప్పారావు చేతిని వెనక్కి విరిచేసి మెలిబెడ్తూ.
"అబ్బో... అబ్బో... ఎంతాత్రమో!... మీకేంతాత్రమో!!.."ఆనందంతో తలమునకలయ్యింది అప్పారావుకి.
"ఆత్రమా నీ బొంద... త్వరగా చెప్పి తగలడు... ఇప్పుడు సుశీలొచ్చిందంటే నీకు చెప్పడానికి కుదర్దు..."అన్నాడు వీరావేశంతో స్టెనో వీరాంజనేయులు.
ఆ మాట వింటూనే అప్పారావు నాలుక కొరుక్కుని చెంపలేస్కున్నాడు.
"అవును కదూ?... ఆ విషయమే మర్చిపోయా"
"ఊ... మరి హ చెప్పు... ఏం చేశావో చెప్పు..."అన్నారు ఉత్సాహంగా అప్పారావు పీక పిసుకుతూ.
"మీరిలా నా బట్టలు నలిపేసి నా వెయ్యి మెలిబెట్టేసి,నా పీక పిసికేస్తుంటే నేనేం చెప్పనంతే..."అన్నాడు అప్పారావు చిర్రుబుర్రులాడ్తూ.
అందరూ అతనికి దూరంగా జరిగి చెంపలేస్కున్నారు.
"సారినోయ్... ఇప్పుడు చెప్పు... సుశీలని ఏం చేశావ్?" ఆనందరావు అప్పారావు చొక్కా కాలర్ని మనులోనే కసిగా నలిపేస్తూ అడిగాడు.
"నేనేం చేస్తాను?"అన్నాడు అప్పారావు చిలిపిగా.
వాళ్లందరికీ అతనిమీద పీకల్దాకా కోపం వచ్చింది.
"మరిందాకట్నుండి సుశీలని... సుశీలని... అంటూ మెలితిరిగి పోతున్నావుగా... ఏం చెయ్యనివాడివి అలా మెలితిరిగిపోవడం ఎందుకూ?" అందరూ గట్టిగా అరిచారు.
"నేనేం చెయ్యలేదుగానీ... అబిడ్స్ లో సుశీలని ఒకబ్బాయితో తిరగడం చూశాను..."
"ఊ... తర్వాత?" వీరాంజనేయులు ఉత్సాహంగా అడిగాడు.
"వాళ్లు ఒక రెస్టారెంటులో దూరారు..."
"ఒకవేళ ఆ అబ్బాయి సుశీల అన్నయ్యేమో!!"అడిగాడు రాముడు అనే మంచి బాలుడు.
అతని ప్రశ్నకు అందరూ ఘొల్లుమని నవ్వారు.
"నీ మొహం... అన్నయ్య లెక్కడైనా చెల్లెళ్లని సినిమాలకీ, రెస్టారెంట్లకీ తీస్కెళ్తారా?..."అందరూ రాముడ్ని తిట్టిపోశారు.
"ఒకవేళ ఆ అమ్మాయికి కాబోయే భర్తేమో!!..."మళ్లీ అన్నాడు రాముడు.
