Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 29

    "రాధా తల్లీ కాదూ - నేను పిల్లీ కాదు... మీరంతా వెళ్ళండి" బాధపడుతూ అన్నాడు గోపి.
    "అదేటి బాబూ! రాధ నెలతప్పింది కదా?" ఒకడు అడిగాడు.
    "లేదు... లేదు-అదంతా కల-అది అబద్దం... విధి ఆడిన వింత నాకం! అసలు ప్రపంచమనే ఈ నాటకరంగంలో మనమంతా"గోపి ఏదో చెప్పబోయేంతలో గూడెం వాళ్ళంతా బెంబేలెత్తిపోయి డప్పులు నేలమీద విసిరికొట్టి పొలోమని పారిపోయారు.
    "ఏంటో నాన్నా... వీళ్ళతో ఇదే చిక్కు! ఏం వచ్చినా ఇంటిముందు మేళం పెట్టేస్తారు" విసుగ్గా అన్నాడు గోపి.
    "అవునుగానీ తమ్ముడూ! ఇంత దారుణానికి పాల్పడిన ఆ రాయుడిని ఊర్కే వదిలేస్తావా" శంకరం అడిగాడు.
    "హు!.... ఇప్పుడే ఆ రాయుడిని చితకతన్ని వచ్చా! అంతేకాదు. వాడు మనశ్శాంతిగా జీవించుకుండా చేస్తా. వాడి బ్రతుకు దుర్భరం చేస్తా. రాధ పోయిన కడుపుమీద ఒట్టేసి చెప్తున్నా" అన్నాడు గోపి పిడికిళ్ళు బిగించి కళ్ళెర్రజేస్తూ.
                                                              24
 
    ఊరు చివర...
    పొలం దగ్గర.
    రాయుడు పొలంలో కూలీలు హుషారుగా పని చేస్తున్నారు. ఆడాళ్ళూ, మగాళ్ళూ ఎగబడి పని చేస్తున్నారు.
    ఆడాళ్ళు పిక్కలపైకి చీరకట్ట, గుండెలమీద పైట తొలగించి వయ్యారంగా పని చేస్తుంటే, మగకూలీలు వాళ్ళ ఒంపుసొంపులను చూస్తూ, సంతోషంతో గిలగిల్లాడిపోతూ ఉత్సాహంగా పని చేస్తున్నారు.
    మగవాళ్ళు ఒక మూలనుండి భూమిని దున్నుతుంటే ఆడాళ్ళు మరో మూలనుండి విత్తనాలు జల్లుతున్నారు.
    ఇంతలో వాళ్ళంతా ఉలిక్కిపడేలా పెద్దగా కేక వినిపించింది.
    "ఆగండి!"
    ఆ అరువునకు మగాళ్ళ పాగాలూ, ఆడాళ్ళ కొప్పులూ ఊడిపోయాయ్.
    అందరూ కేక వచ్చిన దిక్కుకు తలలు త్రిప్పి చూశారు.
    పొలంగట్టుమీద అరడజను రౌడీలు పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని నిలబడ్డారు. అందరూ అడ్డచారల బనీసులూ, గళ్ళలుంగీలూ యూనిఫాంలో ఉన్నారు.
    వాళ్ళు రాయుడు పంపిన రౌడీలు!
    "ఏందయ్యా... దేనికి అపమంటున్నారూ?" అంటూ రౌడీలను అడిగాడు వాళ్ళలో ఒకడు.
    "మీరు పొలంలో పని చెయ్యడానికి వీల్లేదు. వెంటనే ఇక్కడినుండి వెళ్ళిపోండి."
    హుంకరించాడు ఒక రౌడీ.
    "ఎందుకు వీల్లేదు? ఇది రాయుడిగారి పొలం! ఆయనతో చెప్పామంటే మిమ్మల్ని ఆయన రౌడీల్తో చితకామతకా తన్నిస్తారు తెల్సా?
    ఆ మాట వినగానే ఆ అరడజను రౌడీలూ పగలబడి నవ్వారు.
    "ఓరి సన్నా సెదవల్లారా... మేము రాయుడిగారి రౌడీలమే. ఆయనే మమ్మల్ని పంపించరు.
మిమ్మల్ని అందర్నీ పొలంనుండి తరిమికొట్టమని" అన్నాడు ఒక రౌడీ మీసాలు దువ్వుతూ.
    "ఎందుకూ?" బిక్కమొహం వేస్తూ అడిగాడు ఒక కూలి.
    "ఏమో... మాకు తెలీదు. మిమ్మల్ని ఇక్కడినుండి తరిమికొట్టమని రాయుడుగారు చెప్పారు అంతే. మీరు వెంటనే ఇక్కడినుండి వెళ్ళండి" ఒక రౌడీ నేలమీద కర్రతో గట్టిగా కొడుతూ అన్నాడు. మిగతా రౌడీలు కూడా నేలమీద కర్రల్తో కొట్టారు.
    "అన్యాయం! అక్రమం!! మమ్మల్ని ఇలా అర్ధాంతరంగా పనిలోంచి తీసేస్తే మా పెళ్ళాం, పిల్లలూ ఏమైపోతాం. ఏం తింటాం?" గట్టిగా అరిచాడు ఒక కూలీ.
    "ఏంట్రా వెళ్ళమంటుంటే... అన్యాయం, అన్యాయం అంటూ కూసేస్తున్నావ్? అంటూ ఓ రౌడీ ఆ కూలీ నెత్తిన దుడ్డుకర్రతో గట్టిగా కొట్టాడు.
    "హమ్మో!"
    ఆ కూలీ పెట్టిన కేకతో ఆ ప్రదేశం మారుమ్రోగింది.

                                                                   * * *
    "బాబూ!"
    ఎవరో దీనంగా పిలిచారు.
    రిక్షా గూడులో కూర్చుని తాపీగా బీడీ కాల్చుకుంటున్న గోపి తలత్రిప్పి చూశాడు.
    ఒక వృద్ధుడు చిరుగులున్న ముతక బట్టలతో దీనంగా నిల్చుని ఉన్నాడు.
    "ఏంటి తాతా?" అప్యాయంగా అడిగాడు గోపి.
    "రిక్షా కడ్తావా బాబూ?" కంఠం వణుకుతుండగా అడిగాడు ఆ వృద్ధుడు.
    "రిక్షా ఉన్నది సవారీ కట్టడానికే కద తాతా" అని రిక్షా దిగి దులిపి "రా తాతా కూర్చో" అన్నాడు గోపి.
    "బాబూ" సందేహిస్తూ నిలబడ్డాడు తాత.
    "ఏంటి తాతా?"
    "నేను డిప్పకాయల వారి వీధికి వెళ్ళాలి బాబూ."
    "అలాగే తాతా. రా.... రిక్షా ఎక్కు."
    "అక్కడ నా కొడుకు జబ్బుచేసి మంచంపట్టి ఉన్నాడు బాబూ. వాడిని నేను చూడడానికి వెళ్ళాలి బాబూ."
    "అలాగే తాతా. త్వరగా రిక్షా ఎక్కుతాతా. ఎప్పుడెప్పుడు రిక్షా తొక్కుతానా అని నా మనసు ఉరకలు వేస్తున్నది తాతా" హుషారుగా అన్నాడు గోపి.
    "కానీ... కానీ నా దగ్గర అర్థరూపాయే ఉంది బాబూ." సందేహిస్తూ, దీనంగా అన్నాడు తాత.
    "మరేం ఫరవాలేదు తాతా. రిక్షా ఎక్కు!" తాత భుజంమీద హుషారుగా తట్టాడు గోపి.
    ఆ దెబ్బకి తాత ముందుకు తూలాడు. గోపి తాత ముందుకు తూలిపోకుండా పట్టుకున్నాడు.
    తాత తన భుజాన ఉన్న తుండుగుడ్డ తీసి దాని చివరన వేసి ఉన్న ముప్పై ఆరు ముడుల్ని అయిదు నిముషాలపాటు ఎంతో ఓపిగ్గా విప్పి, దాంట్లోంచి అర్థరూపాయి నాణాన్ని తీశాడు.
    "ఇదిగో బాబూ! ఇది ఉంచు" వణికే చేతిని గోపివైపు చాపాడు తాత.
    "తాతా!..."
    గట్టిగా అరిచాడు గోపి.
    తాత ఉలిక్కిపడ్డాడు.
    "నేను ముందే చెప్పాను కదా బాబూ అర్ధరూపాయ్ కంటే ఎక్కువ ఇవ్వలేనని? ఇప్పుడు ఇంత గావుకేక పెడ్తే నేనేం చేసేది బాబూ?... పోనిలే బాబు నేను నడుచుకునే పోతాను."
    "తాతా" మళ్ళీ గట్టిగా అరిచాడు గోపి.
    "ఏంటి బాబూ ఈ ముసలాడి గుండె ఆగిపోయేలా ఆ అరుపులు? నేను నడుచుకునేపోతానని అంటున్నాగా?" విసుగ్గా మొహంపెట్టి అన్నాడు తాత.
    "తాతా... తాతా... తాతా" గోపి జుట్టు పీక్కుంటూ అన్నాడు. నన్నెంత అపార్థం చేస్కున్నావ్ తాతా! నా తండ్రితో సమానమైన నిన్ను నడుచుకుని వెళ్ళనిస్తానా తాతా. నేను ఇందాక అంత గట్టిగా ఎందుకు అరిచానంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వబోయావ్ కదా. అందుకని తాతా. కష్టాల్లో ఉన్న మనిషిని ఆదుకోని జన్మ ఓ జన్మేనా తాతా?" ఆవేశంగా అన్నాడు గోపి.
    "బాబూ" ఆనందభాష్పాలు రాలుస్తూ అన్నాడు తాత.
    "నిన్ను ఫ్రీగా తీస్కెళ్తాను తాతా. ఫ్రీగా తీస్కెళ్తాను."
    "బాహ్హాబూ"
    "రా తాతా... రిక్షా ఎక్కు."
    "బాబూ! మరీ అంత ఫ్రీగా రిక్షా ఎక్కడం అంటే నాకేంటో చాలా ఇబ్బందిగా ఉంది బాబూ. పోనీ ఈ అర్థరూపాయ్ ఉంచు బాబూ."
    "తాతా! అదే నేను నీ కొడుకునైతే ఇలా అర్ధరూపాయ ఇచ్చి నన్ను అవమాన పరుస్తావా తాతా? వద్దు తాతా వద్దు! నిన్నే కాదు తాతా నీ ఫామిలీ మొత్తానికి నేను ఫ్రీగా రిక్షా కడ్తా తాతా. ఫ్రీగా రిక్షా కడ్తా."
    "బాబూ... నువ్వు మనుషుల్లో దేవుడు బాబూ! మనుషుల్లో దేవుడివి!" ఆనందభాష్పాలు ధారగా కారుస్తూ అన్నాడు తాత.
    "నువ్వింక రిక్షా ఎక్కకుండా తాత్సారం చేస్తూ కూర్చుంటే అవతల మీ అబ్బాయ్ గుటుక్ మని అన్నా అంటాడు. త్వరగా రిక్షా ఎక్కు తాతా."
    గోపి తాత నడుందగ్గర రెండుచేతులూ చుట్టేసి ఆయన్ని పైకిలేపి రిక్షా సీట్లో ఎత్తి కుదేశాడు.
    తాత మూలిగాడు.
    "హబ్బా! నా నడుం విరగ్గొట్టావు కదా బాబూ. ఊ... ఉస్-"
    గోపి పకపకా నవ్వాడు.
    "కాస్త ఓపికపట్టు తాతా... నేను నిన్ను క్షణాల్లో మీ అబ్బాయ్ ముందు దించుతాను" అన్నాడు.
    తర్వాత గోపి సీటుదులిపి రిక్షా ఎక్కాడు.
    రిక్షా తొక్కుదామని అనుకుంటుండగా జనం పొలోమని పరిగెత్తుకుంటూ వచ్చి రిక్షాచుట్టూ మూగిపోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS