'ఆ మున్సుబూ -- మా బావమరిది - దీనికంతకూ కారణం. పంచాయితీ కాంట్రాక్టుల పేరుతొ దోచుకు తింటున్నామని- మా బావమరిదే స్వయంగా డప్పు వాయించి మరీ చెబుతున్నాట్టండీ. ఎంక్వయిరీ పెట్టించమని ఈ వెధవలంతా పెట్టిన మహజరు లో ఆశుంటాయి గాడి సంతకం గూడా వుంది మరి. వీడికి పిలిచి మన బిజినెస్ లో వాటా యిచ్చింది మనకొంప తీయడానికిటండీ?' అంటూ గోల పెట్టాడు కోనేటిరావు.
'చీట్లాటేమిటి - మరొక టేమిటి- వ్యసనమనేది. ప్రతి వెధవనూ ఆత్మబంధు వులా కనిపించేటట్లు చేస్తుంది గదండి. మనకు యిలా వెన్నుపోటు పోడిపించాలనే మీ బావమరిదిని దువ్వి - అన్ని విద్యలూ నేర్పి. పెంపుడు కుక్కగా మార్చి, మన మీద ఉసిగొలిపాడు చివరకు. అయినా అతగాడి మీద -- ఎంతయినా చెల్లెలి మొగుడు గదా - నువ్వలా చెయ్యి చేసుకోడం బాగుండలా -' అన్నాడు రఘుపతి గారు.
'చెల్లెలి మొగుడు గనకనే అంతటితో వదిలి పెట్టా. లేకపోతె చేక్కేవాణ్ని బాడిసతో వెధవను.'
'చెక్కుదు గాని కానీ క్రిమినల్ కేసు విషయం ఆలోచించు.
'మనమే ముందు తగిలిద్దాం ఆ మున్సుబ్బు నూ వీణ్ణి కలిపి.'
సాక్ష్యం కావాలి గదా?'
'మీరున్నారు . మాష్టారున్నారు. ఒంటెద్దు బండి వెంకన్న - రామిగాడూ - చాలదంటారా? తగిలించండి . అంతు తేల్చుకుందాం.'
బెల్లం కొట్టిన రాయిలా కూర్చొని ఈ మాటలన్నీ వింటున్న స్వామికి విషయం తలకేక్కుతున్నకొద్ది రక్తపు పోటు వచ్చి నట్లయింది. 'ముందు పోలీసు రిపోర్టు యివ్వాలనుకుంటూ ఒంటెద్దు బండిలో వాళ్ళు హడావుడి గా తరలిపోయారు. మరొక అరగంట కు భీమారావు వచ్చాడు. 'పంతులూ ' అంటూ కేకపెడుతూ . ఇంత గొడవ జరిగి కొడుకు వెళ్ళిపోయిం తర్వాత సీతమ్మ గారికి గుండెంత హెచ్చింది. ప్రాణం ఉండబట్టక 'ఏం అఘాయిత్యం జరుగుతుందో యింకా' అనుకుంటూ తర్వాతి బస్సులో , ఆమె కూడా బయలు దేరి జ్ఞానవరం వచ్చింది. నూజీవీడు వచ్చి, భారతిని హింసించి తీసుకుపోయిన భీమారావు బావగారి మీద కక్ష గట్టి కత్తులు నూరుతూ , ఏదో గుబులు వచ్చినట్లయి ఒక్కసారిగా లేచి - రఘుపతి గారింటికి వచ్చాడు.
'పంతులూ ?' ఎంత దౌర్జన్యం కేకలో.
బయట కొచ్చాడు స్వామి. పావని కిటికీ రెక్క దగ్గర నిలబడింది ఎగిరి పడుతున్న గుండెలకు అదిమి పట్టుకుంటూ.
'ఏమిటండి?' అన్నాడు బెరుకు బెరుకుగా.
ఏం చూసుకుని అంత తలతిరుగుడు నీకు?'
'ఏమిటండి మీరనేది?'
'నడుం విరగతంతే అప్పుడు తెలుస్తుంది ఏమంటున్నది?'
'మీరు నన్ను , అపార్ధం చేసుకుంటున్నారు భీమారావు గారు.'
'నోర్మూయ్! చవట రాస్కెల్ , నీ పెళ్ళాన్ని ఎవడన్నా సినిమా అంటూ లాక్కెడితే యెలా వుంటుందిరా/ నువ్వు ఆడుతున్న నాటకం నాకు తెలీదంటావా? మామీడనే పోలీసు కేసు పెట్టిస్తున్నారట. నీ బోడీ సాక్ష్యం తప్ప -- ఊళ్ళో ఎవరూ దిక్కు లేకపోయారు ఆ వెధవలకు చస్తావు పిరికి సన్నాసి జాగ్రత్త.'
భీమారావు ఏం తిడుతున్నాడో - స్వామికి అర్ధం కావడం లేదు. పరిస్థితి విషమించిందని మాత్రం అర్ధం చేసుకున్నాడు.
'నాలుగు డబ్బులు చేతి కందగానే కళ్ళు బయర్లు కమ్మయిరా? కా గుడింతం చెప్పుకుంటూ బ్రతకవలసిన కుంకవి నీకెందుకురా అంత పొగరు?'
చొక్కా పుచ్చుకు గుంజాడు భీమారావు. గుండెలు బాదుకుంటూ సీతమ్మగారు రెండు చేతులు జోడించి ఉగ్రరూపం తో ఊగుతున్న భీమారావు కు నమస్కరించి, విడిపించింది. 'అయ్యా! నా మాట నమ్మండి. మీ గొడవలు నా కావసరం లేదు. మీ రాజకీయాలు అవసరం లేదు. ఈ కాంట్రాక్టులూ క్రిమినల్ కేసులూ అంత కంటే అవసరం లేదు. సాధ్యమైనంత త్వరలో మీ కంటికి కనిపించకుండా పోతాను. నన్ను క్షమించండి' అంటూ చొక్కా విడిపించుకుని లోపలికి పోయి ముసుగు పెట్టుకు పడుకున్నాడు స్వామి. ఆశక్తితో ఆత్మహత్యచేసుకుంటున్న ఆవేశం లో ప్రాణ వాయువులను బయటకు తోడుతున్న అవమానంతో నీరసించి విరిగింది అతని మనస్సు.
ఆ పూట యింట్లో ఎవరికీ భోజనాలు లేవు.
మధ్యాహ్ననికి 'డి.యస్.పి వచ్చాడు' బయలుదేరు అంటూ చెమటలు కక్కుకుంటూ రఘుపతి గారు వచ్చి స్వామి కప్పుకున్న దుప్పటి యివతలకు లాగాడు. 'ఎందుకొచ్చావు నాయనా ఈ దిక్కుమాలిన ఊరు మరొకటి దొరక్క పోయిందా?' అనుకుంటూ రోదించింది సీతమ్మగారి మనస్సు.
'నేను రాలేనండి" అంటూ లేచి కూర్చున్నాడు లేని వోపికతో.
'కొంప మునుగుతుందయ్యా.'
'నేనేం చేయగలను?'
ముందు భీమారావే మున్సబు సాయంతో దొమ్మీకి వచ్చి మన కోనేటి రావును కొట్టి నట్లు సాక్ష్యం చెప్పాలి.'
వంటి నిండా కట్లు కట్టుకున్న కోనేటిరావు కనిపించాడు బయట.
'నేను చెప్పేలేనండి అబద్దం! అసలు నాకెందుకీ గొడవలు?'
'మమ్మల్నిలా ముంచుతావన్న మాట? చెప్పవన్న మాట సాక్ష్యం?' ఆపద వచ్చినపుడు ధర్మరాజు అంతటి వాడు చెప్పాడయ్యా అబద్దం - నాకు చెప్పకీ నీతులు.'
'చెప్పను'
'సరే - చూద్దాం'
విసురుగా బయటకు నడిచారు రఘుపతి గారు.
14
ఊరి కంతటికీ మూకమ్మడిగా పిచ్చెక్కినట్లని పించింది. ఎన్ని పార్టీలున్నా ఎంతటి కక్షలున్నా బలాబలాలు అంతవరకూ తేల్చుకోవలసిన పరిస్థితి రాలేదు అంతకు ముందెన్నడూ 'సాక్షానికి రాను' అని ఖచ్చితంగా చెప్పాడు స్వామి. కాని వెళ్లక తప్పంది కాదు. 'దొరగారు మండిపోతున్నారు. రాకపోతే మిమ్మల్ని అరెస్టు చేసి తీసుకు వెళ్ళవలసి వస్తుంది. మంచిగా రండి' అంటూ ఒక పంగనామాల సబిన్స్ పెక్టరు వచ్చి ఎంతో మంచిగా హితవు చెప్పాడు.
'నాకేం తెలియదండి. నేను నూజివీడు వెళ్ళాడు ఈ గొడవ జరిగినప్పుడు నేనిక్కడసలు లేనండి" అన్నాడు తలవంచుకునే.
విష్ణు చక్రం తిప్పినట్లు యజ్ఞోపవీతాన్ని గిరగిరా త్రిప్పారు రఘుపతి గారు. 'కొంప ముంచిన' అల్లుడి మీద కోపం కొద్దీ.
పళ్ళు పటపట కొరికాడు కోనేటి రావు.
అరెస్టులు మాత్రం జరగలేదు. ' మీరు స్వయంగా వచ్చి విచారించకపోతే మా తలలు నేల రాలిపోతాయి మహాప్రభో!' అంటూ మొర పెట్టుకొని తనను పిలిపించి రఘుపతి గారి మీద పదిమంది ముందూ గుడ్లురిమాడు. డి.యస్. పి దొరగారు.
ఆరాత్రి సీతమ్మ గారి మీద కూడా విరుచుకు పడ్డారు రఘుపతి గారు.
'వాడు వేర్రిబాగులవాడు అన్నగారూ! వాడి బ్రతుకు వాణ్ణి బ్రతకనివ్వండి.' అంటూ రోదిస్తున్న సీతమ్మ గారిని చూసి మంటెండల్లో ఎండు తాటాకులా మండిపోయారు రఘుపతి గారు.
'వాడుటమ్మా వెర్రి బాగులవాడు. చాలు చాల్లే ఊరుకో. ఆమాట కొస్తే మేమూ అసలు వెర్రి ముండాకొడుకులం. నన్నూ కోనేటిరావునూ జెయిలుకు పంపించాలని కదూ వాడిలా నమ్మించి మా కొంపలు తీసింది? ఏమిటి నేను అతగాడికి చేసిన అపకారమంట. కన్న కూతుర్ని కాళ్ళు కడిగి చేతబెట్టాను. యింట్లో పెట్టుకున్నాను. వేలకు వేలు లాభమోచ్చే బిజినెస్ లో భాగమిప్పించాను. అంతేనా? అంత చేసినందుకు -- ఆహా బాగా బుద్ది చెప్పాడమ్మా. కుక్కకుంటుంది యింత కంటే విశ్వాసం!'
'లెక్కల ప్రకారం మీరింకా పదిహేను వేలివ్వాలట.వెంటనే పంపించమన్నారండి కోనేటిరావుగారు.' అంటూ కబురు తీసుకొచ్చాడు ఒంటెద్దు బండి వెంకన్న.
నెత్తిన పిడుగు పడినట్లయింది స్వామికి.
తనదగ్గర బిజినెస్ తాలూకు డబ్బు రెండు వేల పైచిలుకు మాత్రమే వుంది. ఈ సంగతి విని సీతమ్మ గారు భయంతో వణికిపోయింది. చివరకు అది గుండెపోటుగా పరిణమించింది. ఉన్న రెండు వేల పై చిలుకు యిచ్చి పంపాడు. 'మిగిలింది పంపకపోతే మాట దక్కదంటూ మళ్ళీ కబురు పెట్టాడు కోనేటిరావు సీతమ్మ గారి గుండె పగిలింది.
అర్ధరాత్రికి చెమటలు పట్టి గాలి ఆడని పరిస్థితి వచ్చింది. డాక్టరు గారు ఎంత పెద్ద చదువు చదువుకుంది ఎంత సమర్దుడయింది స్వామికి తెలుసు. బిజినెస్లో లాభం వచ్చిందన్నాడు నాలుగు రోజుల క్రితం. ఎంత వచ్చిందో , అందులో తన వాటా ఎంతో, ఆ వాటా తాలూకు న్యాయంగా రావలసిన డబ్బు తనకు ముట్టే మర్గమేమిటో - స్వామికి తెలియదు. అంతకు మించి తనమీద - నిష్కారణంగా కోనేటిరావు మోపుతున్న నిందకు తాను సమాధానం చెప్పలేడు.

'అడుక్కుతింటాడు చూడు అటువంటి దౌర్భాగ్యుణ్ణి నమ్మి - నీ గొంతు కోశానే తల్లీ- వాజమ్మ - అదృష్టం వస్తే మోకాలు అడ్డుపెట్టే వాజమ్మ -- పోతేపోనీ -- నువ్వే మగబిడ్డ ననుకుంటా -- పట్టెడన్నం పెట్టుకోలేక పోతానా?' రఘుపతి గారి సాధింపులకు సమాధానం చెప్పే శక్తి స్వామికి లేకపోయింది.
'అయ్యా నేను వాజమ్మ నే మీఅమ్మాయికి తగిన వాణ్ణి కాదు. అది నిజమే. కాని మీరీ విషయం పెళ్ళి కాకముందు ఆలోచించాల్సింది.' అన్నాడు స్వామి చివరకు.
'అదే బాబూ నే చేసిన పొరపాటు. ఈమాత్రం జ్ఞానోదయం ఆనాడు కలిగి వుంటే అమ్మాయి బ్రతుకిలా నాశనమయ్యేది కాదు.'
'ఎందుకు నాన్నా యిప్పుడా మాటలు. మన ఖర్మ యిలా కాళిందికాలింది.'
'కాలింది గనకనే కడుపుకోత భరించలేక ఏడుస్తున్నా.'
ఆ పరిస్థితుల్లో మామగారి దగ్గర డబ్బు వుందని తెలిసి అడగ లేకపోయాడు. స్వామి. నూజివీడు మిషన్ హాస్పిటల్ కు సీతమ్మ గారిని -- అంతటి రాత్రి తీసుకు పోయే మార్గం ఒకటే వుంది.
ఆ కుగ్రామం లో కారున్నది ఒక్క కోనేటి రావుకు. అనేక కారణాల మీద దానిని బావమరిది భీమారావు పేరు మీద పెట్టాడు కోనేటిరావు. కక్షలు బుసలు కొట్టి, తలలు పగిలే పరిస్థితి రావడంతో 'ఆకారు నాదే అసలు' అంటూ మొరాయించుకు కూర్చున్నాడు భీమారావు. యింత రభస జరిగింతర్వాత భీమారావు ను అ సహాయం ఎలా అడగగలడు.' అడగకూడదనుకున్నాడు. కాని సీతమ్మ గారి పరిస్థితి దిగజారిన కొద్ది అతని మనస్సు అయోమయమై పోయింది ఎవరు నిద్రపోతున్నారో తెలియదు. అలికిడి లేని పరిస్థితి.
'స్వాములు' నీరసంగా పలికింది సీతమ్మగారు.
'అమ్మా'
'దగ్గరకురా'
'సీతమ్మ గారి కళ్ళలో నీళ్ళు పొంగి కారి దిండు మీద పడుతున్నాయి.
'ఏమిటమ్మా బాధ.'
'నీ దగ్గర ఒక్క విషయం దాచానురా'
'పోనీలేమ్మా.'
