Previous Page Next Page 
మమత పేజి 29

 

    "నువ్వు మాత్రం మారలా?'
    'మారాను రోజులు మనిషిని ఎల్లకాలం ఒకే మాదిరిగా బ్రతనిస్తాయంటావా? కాని నీలో వచ్చిన మార్పుకి నాలో వచ్చిన మార్పుకి తేడా లేదంటావా?'
    నిట్టూర్చాడు స్వామి.
    'ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ నేనే వద్దామనుకున్నా. వచ్చి వుంటే అంత శిక్ష నాకు విధించే వాడివి కాదు. ఆడజన్మ ఎత్తటంతో రవ్వంత సిగ్గు అడ్డం వచ్చింది. బ్రతుకే మండిపోయి తర్వాత ఆమాత్రం ఎందుకు తెగించలేక పోయానా అని బాధ పడ్డాను. నా ఉత్తరానికి కనీసం జవాబన్నా  ఎందుకు రాయలేదు బావయ్యా?'
    'ఏ ఉత్తరం ?'
    'నీకు తెలీదూ? నిజం చెప్పు?'
    'తెలుసు'
    'మరెందుకు జవాబు వ్రాయాలా?'
    'అప్పటికింకా ప్రపంచాన్ని అర్ధం చేసుకోలేకపోయాను.'
    'ఇప్పటికీ అర్ధం చేసుకున్నావా?'
    'కొంతవరకూ.'
    'ఆ కొంతవరకూ ఏమిటో కాస్త చెబుదూ?'
    'ఏం చెప్పను'
    'నువ్వు ఏం చెప్పినా వింటాను ఎంతసేపయినా.'
    'పదకొండయింది '
    'అవనీ'
    'ఆయనేప్పుడోస్తాడు?'
    'ఎందుకు?'
    'చూద్దామని.'
    'నవ్వొచ్చింది నన్ను చూడటానీ కనుకున్నాను.'
    'నిన్నూ ఆయన్నూ.'
    'ఆయనలో చూడతగ్గ విశేషం ఏం లేదు. ఆయన కాళ్ళూ, చేతులు విరగ్గోట్టించాలని చూస్తున్నాడు నాన్న. సినిమా పని నీకు తెలిసే వుండాలి. రెండో అట వదిలిన గంటకు గానీ యింటికి చేరడు.'
    'చూసి - వెళ్దామనుకున్నా- కాని'
    'మీ ఆవిణ్ణి ఎప్పుడు చూపెదతావ్? ప్రేమించి పెళ్ళి చేసుకున్నావట. ఆవిడలో నీకు అంతగా నచ్చింది ఏముందో చూద్దామనిపిస్తుందోక్కసారి.'
    'అబ్బే అదేం లేదు.'
    'నాకు తెలుసులే' నవ్వింది శ్రీదేవి లేస్తూ.
    'ఎందుకు కంచం కడుగుతున్నావ్?'
    'భోం చేయాలి.'
    'ఎవరు?'
    'నువ్వే'
    'అమ్మ అక్కడ అన్నం వండుతుంది.'
    'నేను యిందాకనే వండాను.'
    'నాకోసం కాదుగా'
    'నీకోసం వండే అదృష్టం నాకు దక్కనిచ్చావా నువ్వు.?'
    నిట్టూర్చాడు స్వామి లేస్తూ.
    'ఎందుకు లేస్తున్నావ్?'
    'వెళ్ళాలి శ్రీదేవి.'
    'నువ్వు వెళ్ళేవాడివని తెలుసు బావయ్యా. కాని ఏ పచ్చడి మెతుకులో , రాకరాక అందరూ వెలివేసినా చిన్ననాటి ఆపేక్షను గుర్తు పెట్టుకుని వచ్చావా మరి పట్టెడన్నం తింటే తృప్తి నాకు.'
    'మరొకసారి వస్తా'
    'నువ్వు మరొకసారి రాకపోయినా బాధ లేదు. ఈ పూట నా చేతి అన్నం తినకుండా మాత్రం వెళ్ళనివ్వను. అడగరాని వరం అడగలేదు బావయ్య.'
    తలెత్తి చూశాడు స్వామి.
    నవ్వింది శ్రీదేవి. అదే సొట్ట. ఆ బుగ్గ మీద. స్వామి మనస్సు తడిగుడ్డ పిండినట్టు అయింది.
    'నీ యిష్టం శ్రీదేవి.'
    'నా జీవితంలో ఏదీ నా యిష్ట ప్రకారం జరుగలేదు బావయ్యా. చివరికీ ఏం జరిగినా -- అ పరిస్థితికి యిష్ట పడటం నేర్చుకుంటున్నా.'
    భోజనం వడ్డిస్తూ చిన్ననాటి కబుర్లు చెబుతుంది శ్రీదేవి. గది నాలుగు ప్రక్కలా పరికించి చూశాడు స్వామి. పెద్ద హాలును తడికలతో విడగొట్టారు. ఒకటే గది . బయట ప్రళయం వచ్చినా గాలీ వెలుతురూ గదిలోకి ప్రవేశించే ప్రమాదం లేదు.  గోడల నిండా సినిమా ఎడ్వర్టయిజ్ మెంట్ల తాలుకూ వాల్ పోస్టర్లు పొగచూరి కనిపించాయి.
    'నెయ్యి లేదు బావయ్యా. వెల్లుల్లి పాయకారం. కాని- చెంబేడు మంచినీళ్ళున్నాయి అర్మరక్షణకు.'
    'ఫరవాలేదు. కాని శ్రీదేవి -- అటువంటి యింట్లో పుట్టావు. యిలా బ్రతకవలసిన అవసరం?- ఈ పరిస్థితికీ అర్ధం.'
    'వళ్ళు మదించి - అన్నాడు నాన్న. కడుపున చెదబుట్టింది - అంది అమ్మ. పశుకామం అన్నారు పదిమంది. ఇద్దర్నీఏదో వల్లకాడు సెక్షన్ ప్రకారం - జైలుకు పంపిస్తానని బెదిరించారు . మా వకీలు మామయ్య. వాళ్ళమ్మాయి పెళ్ళి కాకుండానే లేచిపోతే రెండో కంటి వాడికి తెలీకుండా పలుపు పెట్టి బాది మరో అభాగ్యుడికిచ్చి పెళ్ళి చేశాట్ట. గప్ చిప్ గా యింటికి తిరిగి రమ్మంటూ నాన్న తరపున రాయభారం వచ్చాడు.'
    'వెళ్ళలేదన్నమాట.'
    'వెర్రి బావా! వెళ్ళి వుంటే నీ'కీనాడు యిక్కడ కనిపించి వుండేదాన్నా?'
    'ఏమిటో ఈ జీవితాలు.'
    'అన్నం తిను బావయ్యా! పెరుగుంది. పులిసింధనుకో? రవ్వంత ఉప్పు వేస్తా. నేనూ ఆలోచించా. నేను యింత సాహసం చేస్తాననే ఎవ్వరూ అనుకోలేదు. నేను మాత్రం అనుకున్నానా? మా వూరు టూరింగ్ సినిమా పుణ్యమా అని ఈ మాత్రం దోవ దొరికింది గాని , పెళ్లన్నారు- అదేమిటో నాకు తెలియకుండానే. ఆరు నెలలు తిరక్కుండానే -- విధవరికం వచ్చిందన్నారు. అందరూ నన్ను కావలించుకేడ్చారు. అదేమిటో నాకు తెలియాలా. ఏదో నాటకం చూసినట్టు చూశా. తర్వాత తెలిసింది. మొగుడు రావడానికి పోవడానికి అర్ధం.ముఖాన బొట్టు చెరిపేశారు. పెట్టేడు చీరలు కట్టుకోనిచ్చే వారు కాదు. వీధిలో నుంచుంటే తప్పు. తల దువ్వుకుంటే తప్పు. మంచి చీర కట్టుకుంటే తప్పు. రెండో పెళ్ళి చెయ్యమన్నారు. తోక త్రొక్కిన త్రాచులా యెగిరి పడ్డాడు నాన్న ముందు. చివరకు కొంత తగ్గి మళ్ళీ మీ యింటికి వచ్చాడు. అమ్మపోరు పడలేక వచ్చాడని నా అనుమానం. నీకూ అత్తయ్య కూ దయ కలగలేదు. నాన్న మీ కుటుంబానికి అన్యాయం చేశాడనుకో. అందుకు నన్ను శిక్షించావు బావయ్య నువ్వు-'
    నివ్వెరపోయి చూశాడు స్వామి.
    కట్టలు త్రెంచుకు వస్తున్న ఉద్రేకాన్ని ఆపుకుని 'ఏమిటో మరీ పిచ్చిదానిలా వాగుతున్నా. ఏం అనుకోకు. మీ యింటికి తీసుకెళ్ళి మీ ఆవిణ్ణి నాకు చూపెట్టాలి మరి. అంత రంభా ఏమిటి?' అంది తొందరగా తడబడుతూ ధోరణి మార్చి.
    'వస్తా శ్రీదేవి! వాళ్ళు కంగారు పడుతున్నారేమో పాపం!'
    'ఈసారి మీ ఆవిణ్ణి తీసుకురావాలి.'
    'తప్పకుండా'
    'చేతిలో చెయ్యి వెయ్యి.'
    'శ్రీదేవి కి చెయ్యి వెచ్చగా ఉంది జ్వరం కాదుగదా?'
    'జ్వరం లేదు చట్టుబండలూ లేదు. రాయిలా వుంటే. ఆవిడ చెయ్యి ఎప్పుడూ చల్లగా ఉంటుందా ఏమిటి? ఎల్లా ఉంటె నాకెందుకులే బాబూ వెళ్లిరా, మొన్న శంకరమొచ్చాడు.'
    'ఎప్పుడు?'
    'ఆదివారం . నేనేదో కష్టాలు పడిపోతున్నానని ఒకటే ఏడుపు వెర్రి ప్రేమ పాపం. అందరూ నన్ను చూసి జాలిపడతారు . నాకేమనిపిస్తుంది బావయ్యా? సర్లే, నీ విరహం చూడలేకుండా -- వున్నా, ఈసారి చెబుదుగానిలే నా ప్రశ్నకు సమాధానం అడిగానని చెప్పు.'
    'ఎవరిని?'
    'అనని.'
    స్వామి తిరిగి వచ్చేసరికి పావనీ -- సీతమ్మగారు మౌనంగా ఏదో ఘోరం జరిగిం తర్వాత డస్సిపోయిన ప్రాణుల్లా కూర్చున్నారు. భారతి కనిపించలేదు.
    'ఏమిటమ్మా అలా కూర్చున్నారు?'
    ఎవరూ మాట్లాడలేదు.
    అనుమానం వచ్చింది స్వామికి.
    'భారతి ఏదీ పావని.'
    'వెళ్ళిపోయింది ' - పగిలింది పావని గొంతు.
    'ఎక్కడికి - ఏం జరిగిందసలు పావనీ?'
    'మొగుడొచ్చి భారతిని గొడ్డును బాదినట్లు బాది, జుట్టు పట్టుకు ఈడ్చుకుంటూ జీపు కారేక్కించుకు లాక్కుపోయాడు. కారు తాళం చెవులు లేవంటే అట్లకాడ పెట్టి అన్నీ పగలకొట్టి స్టార్టు చేసుకు వెళ్ళాడు. అందరినీ నోటి కొచ్చినట్టు తిట్టి.-
    ఏడ్చింది  పావనీ.
    ఏ సౌధానికైనా బలాన్నిచ్చేది పునాది. రోజులు మారిపోయాయనీ , జీవితం నూరి పోయిందనీ అనుకుంటున్న స్వామి అదృష్టసౌధానికి బలమైన పునాదిలేదు. 'రొష్టు పడిపోతున్నావు నాయనా. నీకేం తక్కువయిందిరా? నిక్షేపంగా చదువుకున్నావు. ఉద్యోగం చేసుకున్నావు. ఎందుకు చెప్పు ఈ లావాదేవీలన్నీ?' అంటూ హితవు చెపుతూ బాధపడింది సీతమ్మ గారు.
    మర్నాటి ఉదయం బస్సు మీద జ్ఞానవరం తిరిగి వచ్చిం తర్వాత గానీ అసలు విషయం అర్ధం కాలేదు. ఆ క్రితం రోజు స్వామి అటు సినిమాకు బయలుదేరింతర్వాత యిటు దిగారు. ఆ రఘుపతిగారూ ఈ కోనేటి రావూ ఊళ్ళో . జవరాండ్ర చిత్తాలూ , ప్రభువుల అగ్రహానుగ్రహాలు ఏ క్షణంలో ఎలా వుంటాయో బ్రహ్మ చెప్పలేదంటారు. స్వరాజ్యమూ, ఎన్నికలూ వచ్చాక  ప్రజావాక్యం గూడా ఆ తరగతి లో చేరింది. బ్రహ్మాండమైన మెజారిటీ తో గెలిపించిన పెద్ద మనిషినే - మళ్ళీ ఎన్నికల్లో పగబట్టినట్లు చిత్తుగా ఓడించగల సమర్ధత మహా ప్రజకుంది. పంచాయితీ ఎన్నికల్లో అంత ఘనంగా గెలిచిన కోనేటిరావు మీద ఆరునెలలు తిరక్క ముందే మహా ప్రజకు మొహం మొత్తింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS