'కాదు నాయనా! అసలు విషయం నీకు చెప్పకుండా పొతే నా ఆత్మకు శాంతి లేదు.'
'రేపు చెపుదుగానమ్మా- నీ పరిస్థితి....'
'నాకు తెలుసు, అందుకే -- నాకు రేపు అనేది లేదు తండ్రీ. యింతాకాలం ఆ మహారాజు పోయినా నీకోసమే బ్రతికున్నా. నా బాధ్యత ప్రకారం శక్తి వున్నంత వరకూ.'
'పడుకోమ్మా నీకాయసంగా ఉంది.'
'నేను - నాకు తెలుసురా. ఆ మహారాజు గుండె ఆగినప్పుడే నా గుండె అగవలసింది.కానీ నీకోసం యింతకాలం- బాబూ - తండ్రీ- మూలుగుతూనే వోపిక లేకపోయినా -- మోసం చేయకుండా నన్ను నిలబెట్టింది యింకా యెంతకాలం? అయిపొయింది-'
'అమ్మా'
'ఏడవకు తండ్రీ నీ అమ్మ ఎవరో నీకు చెప్పాలి.'
'భయంగా ఉందమ్మా, నువ్వలా'
బయటకు పరుగెత్తాడు స్వామి.
'పావనీ! పావనీ!!'
'ఏమిటి?'
'అమ్మ పరిస్థితి బావుంది గనక'
'డబ్బుందా నీ దగ్గర?'
'డబ్బా! మీరిచ్చారా దాచమని?'
తూలుతున్నట్లాయి ముందు గదిలోకి నడిచాడు.
టేబిల్ మీద తళుక్కుమంటూ మెరిసింది గడియారం. చకచక పరిగేత్తున్నట్లు వీధిలోకి సాగి, తలుపులు బాది చిల్లర కొట్టు వీరస్వామి దగ్గరకు వెళ్ళాడు. గడియారం పెత్తుకుని వంద రూపాయ;లిమ్మన్నాడు . యాభై కంటే ఎక్కువ లేదన్నాడు వీరస్వామి. అది చేతబట్టుకుని భీమారావు యింటికి పరిగెత్తాడు. పరిస్థితి చెప్పాడు. వెంటనే హాస్పిటల్ కు తీసుకు పోకపోతే తల్లి బ్రతకదనీ -- జీపుకారు కావాలని చెప్పాడు. రఘుపతి గారి తరపున సాక్ష్యం చెప్పక -- తమకు సహాయం చేసిన స్వామి మీద భీమారావు కున్న కోపం అప్పటికేచాలా వరకు చల్లారిపోయింది. 'అమ్మని బ్రతికించండి.' అన్నాడు చంటి పాపలా చీదుకుంటూ.
'అంతకంటేనా మాష్టారూ! తీసుకెళ్ళు" అన్నాడు భీమారావు. మరికొంత డబ్బుంటే మంచిదని హెడ్ మాష్టారు దగ్గరకు వెళ్ళాడు జీపులో.
'ఏమిటయ్యా ఇంత అర్ధరాత్రి వచ్చావూ?' అన్నారు మాష్టారు కళ్ళు తుడుచుకుంటూ.
'అమ్మకు వంట్లో బాగుండలా. వో వంద రూపాయలుంటే అప్పిస్తారా మాష్టారూ.'
'ఏమిటీ ? అదేమిటయ్యా ? లక్షల మీద వ్యాపారం చేస్తున్న వాడివి. నీకు వందా యాభై అప్పు ఇవ్వగలవాళ్ళమా మేము? అయినా అంత అవసరం మేమొచ్చిందయ్యా?'
'మా అమ్మగారికి ఆకస్మికంగా గుండె జబ్బు వచ్చిందండి.'
'గుండె జబ్బే? నిజంగానే ?' చేత్తో గుండెలు అదుముకున్నాడు హెడ్ మాష్టారు.'
'నూజీవీడు తీసుకు వెళ్ళాలండీ-'
'ప్చ్!ప్చ్!! గుండె జబ్బంటే బాబూ నాకు తెలియకడుగుతానూ ఇదేనా మొదటి సారి రావడం?'
'ఔనండి.'
'మొదటిసారే గదా? బ్రతికించావు పో. హడలి పోయా . మరొకసారి వస్తే బ్రతకడం కష్టమనుకో. ఈసారి కేం భయంలా. నే చెబుతున్నానుగా. నా మాట విను. మా అమ్మగారు కూడా పోయింది ఈ దిక్కుమాలిన గుండె జబ్బుతోనే కావడంతో -- దాని సిగ తరగ - దాని ఆయువు పట్టు లన్నీ కంటో పాఠమై పోయాయనుకో. అంతగా భయపడకు. ఇదేమిటి? చిత్రంగా వుందిచెప్మా! నాకు గుండె దడ వస్తుంది- కొంపతీసి.'
'కాస్త సాయం రండి మాష్టారు?'
'నాకు అసలే భయమయ్యా. మా అమ్మ పోయినప్పుడు -- యిట్లాగే ఏం జరిగిం....సరే పద.... అక్కడి దాకా వస్తా.'
అలికిడి కి అంతకు ముందే అందరూ లేచారు. లేవడానికి అసలు నిద్రపోయిందేవరు? భీమారావు దగ్గరున్న కీపుకారు యింటికి నడుపుకు రావడం చూసి పురుగు తాకినట్లు త్రుళ్ళిపడ్డాడు రఘుపతి గారు.
'ఈయనగారు వెర్రి నాగమ్మంటుంది ఆ మహాతల్లి. అలా వున్నాడు గానీ -- శ్రీరామచంద్ర ప్రభో....'
ఎవరి ప్రపంచంలో వాళ్ళు వ్యాఖ్యానాలు చేసుకుంటున్నారు. హెడ్ మాష్టారి సాయంతో జీపు సీట్లు తీసి - పరుపు వేసి దిండ్లు పెట్టి , తల్లిని అందులో పడుకోబెట్టాడు ఎలాగో , జీపు ఎక్కబోగా ఒక క్షణం తటపటాయించి లోపలికి వెళ్ళాడు.
'పావనీ! నువ్వు వస్తావా?'
'ఎందుకు?"
'అమ్మకు సాయంగా ఉంటావు. ఆవిడ పరిస్థితి నీకు తెలియదూ ఎలా వుందో.'
'మా నాన్న పరిస్థితి ఎలా వుందో మీరు ఆలోచించారా? అందరం కట్ట కట్టుకుపోతే ఆయన్ని చూసేదెవరు?'
'అమ్మ బ్రతుకుతుందని నమ్మకం లేదు.'
'ఎవరు ముందో ఎవరు వెనకో ఎవరు చూడోచ్చారు?'
'రావన్న మాట?'
'తర్వాత వస్తాను.'
'తర్వాత నువ్వు రావలసింది లేదు.'
'అంటే మీఅభిప్రాయం.'
'అంటే ఏమిటో నీకూ తెలుసు. ఆలోచించుకో.'
'బెదిరిస్తున్నారా?'
'బెదిరించ గలవాడినో కాదో నీకూ తెలుసు. జరగబోయేది చెబుతున్నాను. మళ్ళీ ఈ యింట్లో నేను అడుగు పెట్టను.'
'విదాకులిస్తారా?'
'నువ్వు ఎలా అనుకున్నా అభ్యంతరం లేదు.'
'అలాగే కానీండి. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం వుంటుంది?'
స్వామి నివ్వెరపోయాడు. ముఖం పాలిపోయింది. నోట మాట రాలేదు.
'ఎందుకలా చూస్తారు? బలవంతంగా లాక్కేడతారా కొట్టి?'
గిరుక్కున వెనకకు తిరిగాడు స్వామి.
ఒంటెద్దు బండి వెంకన్న సాయం వచ్చాడు నాలుగు రూపాయలిస్తానంటే. 'డబ్బు కోసం కాదు బాబూ! మనిషికి మనిషి సాయం. మీరసలే బెదిరి పోయున్నారు. పదండి.' అంటూనే తలగుడ్డ చుట్టుకుంటూ కారెక్కాడు.!
జీపు దాటి పోయింది యింటినీ ఊరిని,
మొదలు నరికిన మంచి గంధపు చెట్టులా కూలింది పావని మంచం మీద.
* * * *
ఏనాడూ ఆలోచించనంత తీవ్రంగా ఆనాడు స్వామిని గురించి ఆలోచించింది పావని.
పడుకున్నది చివాలున లేచి కూర్చుంది.
పాపంలా కురుస్తున్నది చీకటి.
చీకటి చిట్లి చీలి -- ఆమె మనస్సును చీరి అంతులేని , అర్ధం కాని అస్పష్టమైన ఉద్వేగం లో ముంచెత్తింది.
మెళకువ వస్తుందనే భయంతో రాని నిద్ర. తాను చేయరాని నేరం చేసిందేమో? తీవ్రంగా మాట్లాడటం స్వామికి అలవాటు లేదు. తర్వాత నువ్వు రావాలనిన పని లేదు అంటున్నప్పుడు అ మాట కంటే కోటి రెట్లు తీవ్రత స్వామి కళ్ళల్లో కనిపించింది. చిలికి చిలికి ఈ గాలివాన ఎటువంటి రూపం దాలుస్తుందోనని భయం వేసింది. మళ్ళీ అనుకుంది. తాను మాత్రం ఏం తప్పు చేసింది? తండ్రి జైలుకు పోవలసిన పరిస్థితి కల్పించాడే? ఎటువంటి కృతజ్ఞత అది. చాలీ చాలని జీతంతో పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ బ్రతకవలసిన మనిషిని లక్షాధికారి చేయాలనుకున్నాడే? తన తండ్రి ముఖం చూసి గదా కోనేటిరావు వ్యాపారంలో వాటా యిచ్చింది? అలాగే ఎప్పుడు నిద్ర పోయిందో తెలియదు.
ఉదయం మెళకువ రావడం తోనే ముందు గదిలో నుంచి మాటలు వినిపించాయి. ఒకటి తండ్రి గొంతు రెండవది కోనేటి రావు గొంతు.
'బోడీ వెధవ! పోనీవయ్యా! అసలు ఏం చూసుకుని అంట అంత పొగరు? తిరిగి తిరిగి వాడే వచ్చి కాళ్ళ మీద పడి లెంప లేసుకునే దాకా అసలు అమ్మాయినే పంపించకు. ఆహా ముమ్మాటికీ.'
'దోవలోకి వస్తాడంటారా రఘుపతిగారూ మరీ మొండిఘటంలా వున్నాడు?'
'రాకపోతే పోనివయ్యా ఏం అమ్మాయికి పట్టెడు అన్నమే పెట్టుకోలేక పోతావా?'
'పట్టెడన్నం పెట్టుకోలేననే పెళ్ళి చేశారా అయితే?' అంది భర్త ధోరణి వింటున్న శారదమ్మ గారు గడప దగ్గరే నిలబడి.
'నీకెందుకీ గొడవలు లోపలికి చావ్వే.'
'మీ గొడవలు వింటానికి రాలేదు. మీ పిచ్చి పట్టుదలతో దాని కాపరానికి నీళ్ళు తోదకండి మహాప్రభో అంటున్నాను.'
'నీ బోడి సలహా ఎవరిక్కావాలే సిబ్బీ' ముందు వంటింట్లోకి తగలదు పో'
భర్తచేత తినగలిగినన్ని చీవాట్లు తిన్నతర్వాత గానీ యింట్లోకి వెళ్ళలేదు శారదమ్మగారు. 'చూడు పావనమ్మా మీ అత్తగారికి అంత ప్రాణం మీద కొచ్చినప్పుడు నువ్విలా మొరాయించడం మంచి పని కాదు తల్లీ. నేనూ వస్తా పద. అనక జరగరానిది జరిగిందంటే అతని మనస్సు విరిగిపోవచ్చు.' అని హితవు చెబుతున్న శారదమ్మ గారిమీద పట్టరాని ఆవేశంతో విరుచుకు పడ్డాడు రఘుపరి గారు.
'నామాట ఎప్పుడు చెల్లింది గనక ఈ కొంపలో?' అంటూ నిస్సహాయంగా తనను తాను తిట్టుకుంటూ వంటింట్లో నట్టింట పమిట చెంగు పరచుకుని ఏడుస్తూ పడుకుంది శారడంమగారు.
'ఈ గొడవలతోనే తగలబడి పోతుందే ఈ కొంప' అనుకుంటూ.
అంతపనీ జరిగింది సంజ చీకట్లో మూడవ రోజు.
కోనేటిరావు యింటి దగ్గర నుంచి తిరిగి వస్తున్నా రఘుపతి గారి తల మీద చెరువు గట్టుదాటి గడ్డి వాముల ప్రక్కగా నడిచి వస్తున్న సమయంలో బలంగా నాలుగు కర్రలు ఖణలు మంటూ మ్రోగాయి. తల పగిలి, తెలివి తప్పి పడిపోయిన రఘుపతి గారిని ఎవరో యింటికి తెచ్చారు. 'వెంటనే పట్నం తీసుకెళ్లకపోతే బ్రతకడం కష్టం' అన్నారు పదిమంది బెదిరిన మనస్సు తో కోనేటిరావు యింటికి పరిగెత్తింది పావని. చెప్పి ఏడ్చింది.
'దరిద్రులు పిరికి వెధవలు. దొంగదెబ్బ తీశారు. ఇప్పుడే నూజివీడు తీసుకు వెళ్దాం. భయం లేదు ఏడవకు.' అంటూ పావని భుజం మీద చేతులు వేసి వీపు నిమిరాడు కోనేటిరావు.
'త్వరగా రావాలి' అంది పావని.
ఆరాత్రి రఘుపతి గారిని నూజివీడు తీసుకు వెళ్ళటానికి మార్గం కనిపించలేదు. చివరకు బాంకి గుమస్తా పొరుగూరు రెండు మైళ్ళు సైకిలు వేసుకెళ్ళి పంచాయితీ రోడ్డ్డుకు కంకర తోలుతున్న ఒక లారీని తీసుకొచ్చాడు. మంచం వేసి, పరుపులు పరిచి రఘుపతి గారి శరీరాన్ని అందులోకి చేర్చారు. ఏడ్చిఏడ్చి తెలివి తప్పినట్లు పడిపోయింది ప్రక్కనే శారదమ్మ గారు. తలవంచుకుని కళ్ళు తుడుచుకుంటున్న పావని భుజం మెత్తగా నిండుగా చేయి వేసి నొక్కుతూ అనునయిస్తున్న కోనేటిరావు గారి స్పర్శ -- పావనికి అణుమాత్రం కూడా ఊరట కనిపించలేదు. మాటలకు మాత్రమే కాదు మనిషి చూపులకూ స్పర్శ కూ కూడా మనసులోని ఆలోచనలకూ అభిప్రాయాలను చెప్పెశక్తి వుంది. 'ఈ దిక్కుమాలిన ప్రపంచంలో సానుభూతులు ఎన్ని రకాలు?' అనుకుంది. రఘుపతి గారికి తెలివి లేదు. తెలివిలో ఉన్న శారదమ్మ గారు , జరుగుతున్న ఈ అంతర్నాటక రహస్యం గ్రహించే స్థితిలో లేదు. లారీ దాని దోవన అది ఎగిరెగిరి పడుతూ పరిగెత్తుకు పోతున్నది. కాదు ఎగిరిపడిన ఏ అవకాశాన్ని కోనేటిరావు దుర్వినియోగం చేసుకోవడం లేదు. ఆ పరిస్థితిలో అతని ప్రవర్తనకు సమాధానం ఏవిధంగా చెప్పాలో అర్ధం కాక బుస కొట్టినట్టు పెద్ద నిట్టుర్పు విడిచింది పావని.
'ఏం భయం లేదు' అంటూ దగ్గరకు తీసుకుంటున్నట్లు జబ్బ మీద చేయివేసి దగ్గరకు లాగుతున్న కోనేటిరావు వ్యవహారం శృతి మించిందని గ్రహించింది పావని.
'చెయ్యి తీయ్యి ముందు' అంటూ అరిచింది. అంతవరకూ అదిమీ దాచుకున్న ఉద్రేకం ఒక్కసారిగా పొంగింది గుండెల్లో.
ఆకేకకు శారదమ్మ గారు అదిరిపడి నట్లయింది. 'ఏమిటే? అంటూ మూల్గింది. పావని కేకపెట్టిందని తెలుసు. కాని ఎందుకు పెట్టిందో మాత్రం అర్ధం కాలేదు.
