12
ఐదు నిమిషాల్లో బస్సు బయల్దేరింది. బస్సు బయల్దేరగానే పిల్లలిద్దరూ హుషారుగా కేకలు వెయ్యటం మొదలెట్టేరు. బాబిగాడైతే తండ్రి వళ్ళో కూర్చోకుండా నిలబడి ఎగరటం కూడా ప్రారంభించేడు. ఆ బస్సులో వాళ్ళు తప్ప మరెవ్వరూ పిల్లలు లేనందున అందరూ వాళ్ళ వంకే చూట్టం మొదలెట్టేరు. ఒకరిద్దరు పెళ్ళి కాని అబ్బాయిలు వాళ్ళను యింకా గొడవ చేయ్యమనేట్టు హుషారుగా ప్రోత్సహించటం కూడా మొదలెట్టేరు. ఇంటి దగ్గర ఆ యీడు పిల్లలనే వదిలి వచ్చిన తల్లి దండ్రులకు ఆ పిల్లలను చూస్తూనే తమ పిల్లలు గుర్తుకు వచ్చి , చిన్నగా బాధపడ్డారు. ఇంకా పిల్లలు పుట్టని కొత్త దంపతులు ఆ పిల్లల అరుపులు భరించలేక చెవులు మూసుకుని ముఖాలు బయటకు పెట్టి చూడటం మొదలెట్టేరు. బెంగుళూరు లో చూడదగిన ప్రదేశాలన్నీ తిప్పి చూపించింది టూరిస్టు బస్సు. ఐతే ఆ ప్రదేశాలు చాలా ఉండటం వల్ల, ప్రతి సారీ బస్సు దిగి, వాటిని చూసి రావటం, మళ్ళీ కొంతదూరం ప్రయాణం చేసి మళ్ళీ దిగటం యిందతా చాలా యిబ్బందిగా ఉంది కళ్యాణి కి కాంతారావుకీను. మిగతా టూరిస్టులందరూ చకచక నడిచి వెళ్తుంటే వీళ్లిద్దరూ పిల్లలను ఎత్తుకుని కాళ్ళీడ్చుకుంటూ నడవసాగేరు. వాళ్ళ అవస్థ లు చూసి నవ్వుకున్న వాళ్ళు నవ్వుకున్నారు. జాలిపడ్డ వాళ్ళు జాలి పడ్డారు. ఐతే వాళ్ళను మెచ్చుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళ వయసు లోనే ఉండి, ఇద్దరు ముగ్గురు పసి పిల్లలను యింటి దగ్గర వదిలేసి వచ్చిన దంపతులలో ఒక జంట వీళ్ళను చూసి 'మీ కెంత వోపికండి! ఇద్దరు పసి పిల్లలను ఎత్తుకుని యిలా సర్దాగా ప్రయాణాలు చేయటానికి వచ్చేరంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము మా పిల్లలను యింటి దగ్గరే భరించలేం. ఇంక బయటకు ఏం తీసుకొస్తాం?" అందుకనే భయపడి వాళ్ళను తీసుకు రానేలేదు.' అన్నారు.
'ఐతే మా యిద్దరి లోనూ ఉన్న 'డిఫెక్టు ' యేమిటంటే అటు పిల్లల గోలను భరించే శక్తీ లేదు మాకు. ఇటు వాళ్ళను వదిలి తిరిగే శక్తి కూడా అంతకన్నా లేదు. వాళ్ళను వదిలి కొన్ని గంటలు బయట ఉన్నా ప్రానాలన్నీ వాళ్ళ మీదే ఉంటాయ్. అందుకే ఎన్ని అవస్థలు పడినా, పిల్లలు వెంట ఉండటం వల్ల మా మనసులు కొంత ప్రశాంతంగా ఉన్నాయ్.... అని నవ్వుతూ సమాధాన మిచ్చేడు కాంతారావు.
బెంగుళూరు లో విశాలమైన రోడ్లతో పాటు, మురికి రోడ్లు కూడా ఊరు మధ్యలోనే ఉండటం ఒక విశేషం.
బెంగుళూరు లో వారు చూసిన ముఖ్యమైన ప్రదేశాలలో నందికేశ్వరుని నంది విగ్రహం మొదటిది. సాధారణంగా నంది విగ్రహం శివుని ఆలయానికి ఎదురుగా ఉండటం సంప్రాదాయం. కాని యిక్కడ నంది విగ్రహం చాలా పెద్ద సైజులో దేవాలయం లోనే ఠీవిగా పడుకుని ఉంది. ఎదురుగా ఆలయానికి వెలుపల కొన్ని గజాల దూరంలో శివుడి విగ్రహం ఉంది దానిని గురించి గైడ్ చెప్పిన కధ యిది! ఒకసారి పార్వతీ దేవి అలా పేరంటానికి వెళ్తూ, భర్తనూ, కుమారుడయిన వినాయకుణ్ణి వంట చేసి ఇల్లు కనిపెట్టుకుని ఉండమని చెప్పి మరీ పోయిందిట.
గైడ్ ఆ మాట చెప్పగానే కళ్యాణి భర్తతో 'ఐతే ఆ రోజుల్లో కూడా ఆడవాళ్ళు భర్త చేత వంట చేయించే వారన్న మాట!' అంది మెల్లగా.
'అన్నమాటే! కాని, ఆ రోజుల్లో యిప్పటి లాగా కార్లూనిస్ట్ లు లేకపోవటం వల్ల ఆ విషయం గుట్టుగానే వుండి పోయింది గాని అంతగా ప్రచారంలో కి రాలేదు. అన్నాడు కాంతారావు.
సరే- ఆ తరువాత పార్వతీ దేవి నటు వెళ్ళనిచ్చి తండ్రీ కొడుకు లిద్దరూ కలిసి వంట చేసేరట. చేయగానే తల్లి వచ్చేదాకా కూడా ఆగలేక, చేసిన వంటకాలన్నీ ఒక్క పిసరు కూడా మిగల్చకుండా భోజన ప్రియుడైన గణపతి అన్నిటినీ ఆరగించి బయటకు త్రెంచుకుంటూ వచ్చేడట బయట పేపరు చదువుకుంటూ కూర్చున్న పరమ శివుడు (గైడ్ ఈ విషయం చెప్తున్నప్పుడు కళ్యాణి 'అ రోజుల్లో న్యూస్ పేపర్లు కూడా ఉండేవేమిటి?' అని ప్రశ్నిస్తే కాంతారావు ' ఆ రోజుల్లో న్యూస్ పేపర్లు లేని మాట నిజమే, బహుశా శివుడు ఆ సమయంలో పంచాంగం చూసుకుంటూ ఉండి ఉంటాడు. ఈ టూరిస్టు లలో విదేశీయులు కూడా ఉన్నారు కనుక. 'పంచాంగం' అన్న పదాన్ని వాడితే దాని అర్ధాన్ని కూడా వివరంగా చెప్పవలసి వస్తుందన్న భయంతో గైడ్ 'పేపరు' అన్న మాటను వాడి ఉంటాడు' అని సమాధాన మిచ్చేడు.) భార్య ఎంతకీ రాకపోయేసరికి 'సరే, ఈవిడ పేరంటానికి పోయి ఏ అమ్మలక్కలతోనో కబుర్లాడుతూ ఉండి వుంటుంది. ఈ ఆడవాళ్ళు కబుర్లు మొదలెట్టేరంటే కాలం ఎంత గడిచిందీ కూడా గ్రహించరు' అని విసుక్కుంటూ , కరకరలాడే కడుపుతో వంట యింట్లోకి వెళ్ళేడట.
తీరా పీటా, మంచినీళ్ళు పళ్ళెం అన్నీ అమర్చుకుని భోజనం వడ్డించు కుందామని చూస్తె గిన్నెలో ఒక్క మెతుకు కూడా లేదట. అంతటితో ఆ శివుడు ఉగ్రుడై కొడుకుని చాచి లెంపకాయ కొట్టేడట. వెర్రి రాముడు కాబట్టి తండ్రి యజ్ఞను తలదాల్చి వనవాసానికి వెళ్ళేడు కాని ఎంత పురాణకాలంలో అయితే మాత్రం చెట్టంత కొడుకు తండ్రి కొడితే పడతాడా? అసలే తిండి అరిగినట్టన్నా ఉంటుందని అమాంతం లేచి తండ్రి మీద కలియ బడ్డాడట గణపతి. తండ్రీ కొడుకుల మధ్య చెలరేగిన ఈ చిరు కలహం చిలికి చిలికి గాలి వానై నట్టు, ప్రళయం ముంచు కొచ్చేలా భీభత్స రూపం దాల్చిందిట ఆగ్రహావేశంలో ఒళ్ళు మరచిన శివుడు త్రిశూలాన్ని తీసుకుని కొడుకుని చంపబోఎసరికి అంతవరకూ తండ్రీ కొడుకులు జరిపే మల్ల యుద్దాన్ని తొడలు చరచుకుంటూ చూస్తున్న నంది కాస్తా అదిరిపడి వినాయకుడి కి అడ్డంగా నిల్చి అతడి ప్రాణాలను కాపాడిందిట.
.jpg)
సరిగ్గా అప్పుడే యింట్లోకి అడుగు పెట్టిన పార్వతి (తెలుగు సినిమాల్లో కనుక డైరెక్టర్ అవసరం వచ్చినప్పుడు చచ్చిన పాత్రలను కూడా బ్రతికించి సమయానికి ప్రవేశింప జేసినట్లు) ఆ దృశ్యాన్ని చూస్తూనే కంగారుగా పరుగెట్టుకు వచ్చి భర్తను బడబడ నాలుగు తిట్టేసి , కొడుకునో ఒళ్ళోకి తీసుకుని బొజ్జ నిమిరి ఆ తరువాత తన చిట్టి తండ్రి ప్రాణాలను కాపాడిన 'నంది' ని ముద్దేట్టుకుని ఒక మంచి దేవాలయాన్ని కూడా కట్టించి , అందులో కూర్చో పెట్టిందిట.
భార్యకు లొంగని భర్త లెవరున్నారు గనుక ఈ ముల్లోకాలలోనూ?అందుకే శివుడు గత్యంతరం లేక భార్య మాటను శిరసావహించి యీ ఒక్క ప్రదేశం లో మాత్రం ఆలయంలో నంది నుంచి, తాను ఆలయం వేలుపలేనే కాపలాదారుడు గా ఉండటానికి ఒప్పుకున్నాడట. ఆ నంది ఆలయం దగ్గర లోనే పెద్ద సైజు గణపతి విగ్రహం . మరికొంత దూరంలో పార్వతి దేవి ఆలయం కూడా వున్నాయ్.
ఆ తరువాత టిప్పు సుల్తాను తన తల్లి ఫాతిమా బేగం కోసం కట్టించిన విశ్రాంతి గృహం దగ్గరకు వెళ్ళేరు టూరిస్టు లు. ఆ విశ్రాంతి గృహం చెక్కతో చేయబడినది. ఆ గృహం మధ్యలో పెద్ద హాలు ఉంది. ఆ హాలు మధ్యలో నర్తకి డ్యాన్సు చేస్తుంటే అస్వస్తురాలైన రాణి తన పడక గదిలోనే పడుకుని ఆ నాట్యాన్ని తిలకించి, ఆనందిసుండేదిట. చెక్కతో చేయబడిన ఆ ఇంటి గోడలన్నీ ఎరుపు రంగులో ఉన్నాయ్. అక్కడి మరో విశేషమేమంటే నర్తకి డాన్సు చేసే ప్రదేశం (అది పై అంతస్తు లో ఉంది) కుషన్ తో చేయబడి ఉండటం వల్ల నర్తకి పాదాలు తాకినంతనే ఆ యిల్లంతా ఊగిసలాడేదిట. ఆ విషయం నిజమో కాదో తేల్చుకుందామని టూరిస్టు లంతా అక్కడ ఎగిరెగిరి గంతులు వేస్తుంటే వారినందరి నీ ఉద్దేశించి గైడ్ సవినయంగా యిలా విన్నవించుకున్నాడు. 'అయ్యలారా! ఇలా మీ వంటి యాత్రికులు రోజుకు కొన్ని వందల మంది వచ్చి మీలాగానే ఎగిరెగిరి గెంతడం వల్ల యిక్కడ ఉన్న కుషన్ కాస్తా చెడిపోయింది. అదో ఆ మూల.... ఎవ్వరూ నడవని చోట కొంత భాగం మాత్రం యింకా స్ప్రింగ్ యాక్షన్ యిస్తూనే ఉంది. చూపిస్తాను రండి!' అన్నాడు.
అప్పుడు టూరిస్టులందరూ ఒక అడుగు చదరపు వైశాల్యం గల ఆ ప్రదేశానికి వెళ్ళి ఒక్క గంతేసి, అక్కడ కుషన్ ఉన్న మాట నిజమే నని నిర్ధారించుకుని తృప్తి పడ్డారు.
ఆ పెద్ద మనుషులందరూ , ఆఖరికి అమ్మా నాన్నతో సహా ఎందుకలా ఎగురు తున్నారో అర్ధం కాక తెల్లబోయి చూస్తూ నిల్చున్నారు బాబిగాడు, పాపాను. తాము కొంచెం గట్టిగా పరిగెత్తి తే చాలు అమ్మా నాన్నా తమని అంతగా కసిరి కొడ్తారు , మరి యిప్పుడు వీళ్ళంతా ఎందుకు గంతులేస్తున్నట్లో! అనుకున్నారు వాళ్ళిద్దరూ. తరువాత లాల్ బాగ్ గార్డెన్స్ కు తీసుకుపోయింది టూరిస్టు బస్సు. ఆ గార్దేన్సు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్దేన్సు కంటే ఏంతో అందంగా, సహజంగా ఉన్నాయనుకున్నారు కళ్యాణీ, కాంతారావు. ఆ గార్దేన్సు కు వెళ్ళబోయే ముందు గైడ్ తను బట్టీ పట్టిన చెణుకులతో సహా అలవాటు ప్రకారం యిలా చెప్పెడు.
'బెంగుళూరు నగరం చాలా అందమైనది. దీనిని అందరూ 'సిటీ ఆఫ్ గార్డేన్సు' అని పిలుస్తారు ఉన్న గార్డేన్సు అన్నిటిలోకి లాల్ బాగ్ గార్డేన్సు చాలా పెద్దది. తోలి యవ్వనం లోని జంటలు యిక్కడే ప్రణయ భాషలు మాట్లాడుకుంటారు. ఆ ప్రేమ కనుక సఫలమయం దంటే చక్కగా చెట్టాపట్టా లేసుకుని యీ గార్దేన్సు లోనే గంతులు వేస్తూ కాలం గడుపుతారు ఒకవేళ ఆ ప్రేమ గనుక ఫెయిల్ అయిందో - ఎందుకైనా మంచిదని మెంటల్ హాస్పిటల్ ను కూడా దగ్గిర్లోనే కట్టించి ఉంచేరు. ఇంతకూ నేను చెప్పేదేమంటే యీ గార్డేన్సు సౌందర్యాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే జంటగా వెళ్ళవల్సిందే యువతీ యువకులు ఒంటరిగా వచ్చేరో చాలా డిసప్పాయింట్ అయిపోతారు సుమా! మీరు ఒంటరిగా వెళ్ళినా, జంటగా వెళ్ళినా అందరూ ఒక్క గంటలోనే తిరిగి వచ్చేయాలి. మనకింక టైము లేదు. విష్ యూ ది బెస్టా ఫ్ ఎంజాయ్ మెంట్ యిన్ ది గార్డెన్స్" అని తాను దిగిపోయేడు.
యాత్రికులందరూ బిలబిలలమంటూ దిగి గార్డెన్స్ లోకి పరుగులు పెడ్తూ వెళ్ళేరు. ఆ ఒక్క గంటలోనూ అందాన్నంతా అనుభావించి నేయాలన్నా ఆరాటం తో.
ఐతే గార్డేన్సు లోకి ప్రవేశించిన దగ్గర నుండి జంటగా ఉన్నా కాంతారావు కి ప్రేయసి తో ఆనందించే టైము లేకపోయింది. ఎందుకంటె అతను ఆ గార్డేన్సు ను వివిధ కోణాల్లో బ్రాక్ గ్రౌండ్ గా తీసుకుని కళ్యాణి ని, పిల్లలను ఫోటోలు తీయటం తోనే అతనికి సరిపోయింది.
ఆ గార్డెన్స్ లోని మరొక విశేషం అక్కడ ఒక పెద్ద అద్దాల మేడ ఉంది. ఆ అద్దాల మేడ ముందు తన అనుంగు భార్యను నిలబెట్టి మూడు ఫోజులలో ఫోటోలు తీసేడు కాంతారావు.
ఫోటోలు తీయటం అవగానే పాపను కాంతారావు కిచ్చి, తాను కెమెరా బుజాన తగిలించుకుంది కళ్యాణి. బాబును పరుగేత్తమని వాడి నంటుకుంటానంటూ కళ్యాణి కూడా వాడి వెనుక పరుగెత్తింది. ఎర్రటి మందార పువ్వులా కనుమరుగవుతున్న భార్యను చూస్తూ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళేడు కాంతారావు.
బస్సు దగ్గరకు వెళ్ళేసరికి అప్పటికి చాలామంది టూరిస్టు లింకారానందున కళ్యాణి. బాబు బస్సు ఎక్కకుండా అక్కడనే నిలబడ్డారు.
తండ్రి రావటం తో 'నాన్నా, నాన్నా' అంటూ చప్పట్లు కొట్టేడు బాబిగాడు.
భర్త రాగానే కళ్యాణి కూడా ఆమాటా యీ మాటా మాట్లాడి, చివరకు అలవాటు ప్రకారం 'నా అలంకరణ ఎలా ఉంది?' అనడిగింది భర్తను.
సాధారణంగా , కళ్యాణి అలాటి ప్రశ్న వేసి నపుడు కాంతారావు ఎప్పుడూ యేమీ ఆలోచించకుండానే వెంటనే ఆమెను సంతోష పెట్టె సమాధానం చెప్తాడు. అలాటిది ఆరోజేందుకో నఖశిఖ పర్యంతం పరీక్షగా చూసి ఫక్కున నవ్వేడు.
"ఎందుకలా నవ్వుతారు?' అంది నల్లద్దాల కళ్ళజోడు లో నుండి తీక్షణంగా భర్తను చూస్తూ.
