"అదే ఆలోచిస్తున్నాను శశీ ఈ రెండు గంటలోనూ చాలా నేర్చుకున్నాను. ఈ రెండు మూడేళ్ళల్లో నూ చాలా నేర్చుకున్నాను. నీతో మాట్లాడేక, నీ సంసారం చూశాక, ఏదో ఒకటి చెయ్యదలుచుకున్నాను.
"ఏమిటది."
"చాలా మార్గాలు ఉన్నాయి శశీ! మనిషిగా నిన్ను కొన్నారు. ఆయనా, శశీ.... నా జీవితం నా చేతుల్లోకి తీసుకోదలుచుకున్నాను-"
"ఎలాగ?"
"అవసరం ఐతే-విడాకులిస్తాను."
గోపాలం" నిశితంగా అంది శశిరేఖ" ఇలాటి మూర్ఖత్వం చెయ్యకు. నువ్వు చేసిన పొరపాటుకి వసంతని బలివెయ్యకు."
"నేను పొరపాటు చేశానా శశీ?"
"అవును- ఆమె బాద్యత నీది కాక ఎవరిది?-అదీ కాక. ఒకమాట ఆలోచించు. ఈ తెరలన్నీ తొలగించి ఆమెని మనస్సు మనస్సులో కలియడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా?"
"ఆఁ - కాని-"
"లేదు గోపాలం! ఆమె ప్రతీ పొరపాటునీ నువ్వు పదిరెట్లు చేసి చూశావు - క్షమించు గోపాలం... కాని, మగవాడిలాగ పరిస్థితిలో పోరాడ్డం మానివేసి, అలిగినట్టు మూల మూలల్లో దాగున్నావు.
"నీకు తెలీదు శశీ!"
"నువ్వే చెప్పేవు గోపాలం! నా మాట విను. జాగ్రత్తగా ఆలోచించు. మరొకటి -విడాకులివ్వడం అంత సుళువుకాదు....నీకూ, ఆమెకీ కూడా మర్యాదా కాలం, జీవితం - అన్నీ నాశనం ఔతాయి.....నీ జీవితంలో కలుగజేసుకునే హక్కు నాకులేదు: కాని, ఏ భావనతోనో నువ్వన్నీ చెప్పేవు - నా మనసారా ఉన్న ఇది నీకు చెప్పక తప్పదు గోపాలం!"
మహాప్రవాహంలాగ వొచ్చాయి ఆమెనించి మాటలన్నీ. విని, ఏమీ అనలేదు. వాచీ చూసుకున్నాడు. నాలుగౌతోంది.
"కాఫీ తెస్తాను - కూర్చో"
ఆమె లోపలికి వెళ్ళింది. తిరిగి ఆమె కాఫీ కప్పులతో రావడమూ కాల్ బెల్ రింగూ ఒక్కసారే జరిగాయి.
ఆమె తొందరగా వెళ్ళి తలుపులు తీసింది. రామానంద్ లోపలికి వొస్తూ. "సారీ గోపాల్? ప్రోగ్రామ్ అంతా పాడైపోయింది శశి చెప్పిందా?-"
అతని వెనకాతల నిలబడ్డ రామ్మూర్తిని క్షణమాత్రం గుర్తించలేదు గోపాలం.
"సర్ప్రైజ్! - మీపాత ఫ్రెండు!"
రామ్మూర్తి గోపాలాని, కౌగలించుకుని, "చాలా సంతోషం మళ్ళీ మిమ్మల్ని చూసినందుకు" అన్నాడు.
"మీరు కలకత్తా ఎప్పుడు వొచ్చారు?"
"వారం ఐంది. కాలేజీకి సెలవులు....ఇక్కడ తిరుగుదాం అని వొచ్చాను"
"ఎక్కడ ఉంటున్నారు?- నాకు రాయలేదేం?"
"రామానంద్ ఆహ్వానం- ఇక్కడే బస ఎలాగ ఉన్నారు?"
లాంఛనాలన్నీ వొచ్చి గోపాలం సర్దుకొనేందుకు వ్యవధి దొరికింది.
"పద శశీ! - అన్నంపెట్టు. సారీ. నీ పుట్టిన రోజుకి వేసుకున్న-"
గోపాల్ వాళ్ళిద్దరివైపూ తిరిగి, "ఇవేళ శశి పుట్టిన రోజా?" అన్నాడు.
కొంచెం నసుగుతూ. "అవును" అన్నాడు రామానంద్.
"ఆల్ రైట్ - నాకు మతి ఉండవలసింది... రాత్రి మనందరం డిన్నర్- ట్రింకాన్ లో? అంబర్ లో?"
"ఇక్కడే ఎందుకు కూడదు?" అంది శశి.
"నీ పుట్టినరోజు కనక."
ఎవరూ మాట్లాడకపోవడం చూసి. "ప్లీజ్?- మీరు తినేది తక్కువగా తొందరగా కానివ్వండి" అన్నాడు గోపాలం;
వాళ్ళిద్దరూ భోజనాలకు వెళ్ళిపోయారు. అతను తొందరగా బయటికివచ్చి ఫర్లాంగు నడిచి ట్రింకాస్ కి ఫోన్ చేసి టేబిల్ రిజర్వు చేసుకొని వచ్చాడు.
కొంత సేపు మాట్లాడుకుని సాయంత్రం టాక్సీలో అందరూ బయలుదేరారు. గోపాలం ముఖంలో కొత్త కాంతి వచ్చింది- అతని మనస్సు చాలా తేలిక పడింది.
* * *
30
ఉదయం ఆఫీసుకి రాగానే డ్రాయర్లో ఉన్న కాగితాలన్నీ పరీక్షించి అవసరమైనవి తీసుకుని మిగిలిన వాటిని చించి పారేశాడు గోపాలం.
స్టెలాని పిలిచి, "నాకు సెలవు ఎంతవుంది?" అని అడిగాడు.
"రెండు నెల్లు"
నవ్వి. "అంత తొందరగా ఎలాగ చెప్పేవు? అన్నాడు.
"మీ సర్వీస్ మూడేళ్ళు- మీరు సెలవు తీసుకోలేదు. అందుకని" అంది చిరునవ్వుతో స్టెల్లా.
"ఆల్ రైట్ నాకు ఆదివారం మద్రాసు మెయిలో టికెట్ కావాలి. వాల్తేరు దాకా.
"వెంటనే బుక్ చేయిస్తాను. రిటర్న్"
"వొద్దు! అవసరం లేదు. కన్ఫర్మ్ చెయ్యండి.
కొన్ని కాగీతాలు వొచ్చాయి. వాటి పని ముగించేసరికి స్టెల్లా అతని టిక్కెట్టూ, రిజర్వేషన్ టిక్కెట్టూ తెచ్చి ఇచ్చింది.
"వెరీ ఫాస్ట్!"
"ఏజన్సీకి ఫోన్ చేశాను"
"గుడ్! ఒక ఉత్తరం డిక్టేట్ చేస్తాను...."
స్టెల్లా కూర్చుని పాడ్ టేబిల్ మీద పెట్టి పెన్సిలు సిద్ధంగా ఉంచుకుని అతనివైపు చూడసాగింది.
నిజంగా స్టెల్లా చాలా అందంగా ఉంటుంది! అనుకున్నాడు గోపాలం.
అతని డిక్టేషన్ పూర్తి అయేదాకా ఆమె ఏమీ మాట్లాడలేదు. ముగిశాక పెన్సిలు టేబిల్ మీద పడేసి. "ఇది. ఇది....ఎందుకిలాగ?" అంది.
"అనివార్యం....త్వరగా తీసుకురండి..."
ఆమె వెళ్ళిపోయింది. వెనక్కిపిలిచి, "వచ్చే వారందాకా ఇది రహస్యం. ఏం ?" అన్నాడు గోపాలం.
స్టెల్లా తల ఊపి వెళ్ళిపోయింది.
ఉత్తరం మీద సంతకంచేసి డైరెక్టరు అడ్రసు కవరుమీదరాసి ఆమె కిచ్చాడు. ఆమె ఎర్రటి కళ్ళు చూసి, "కూర్చోండి-" అన్నాడు.
ఆమె కూర్చుని. "ఎందుకిలాగ చేస్తున్నారు. ఏదైనా బెటర్ అవర్ వొస్తూందా?" అంది.
ఆఁ - చాలా బెటర్ ఆఫర్ స్టెల్లా. ఈ ఉదయం పేపరు చూశారా? నేను పేసయ్యాను" అన్నాడు త్వరత్వరగా గోపాల్.
"కంగ్రాట్యులేషన్స్!' అంది నీరసంగా స్టెల్లా.
థాంక్స్- మీరు బాధపడకూడదు. వెళ్ళి ఉత్తరం డైరెక్టర్ ట్రేలో పడనీయండి. తరవాత-"
"యస్?"
"కాఫీకి ఆర్డరు చెయ్యండి-"
ఆమె వెళ్ళిపోయింది. ఇవేళ ఆఫీసుకి వొస్తాననీ పన్నెండుగంటలకి కలుసుకుంటాననీ అన్నాడు రామ్మూర్తి.
వాచీ చూసుకున్నాడు గోపాలం. ఆ క్షణం లోనే దర్వాన్ రామ్మూర్తిని లోపలికి తీసుకొచ్చాడు.'
కుశల ప్రశ్నలయాక, "మీ ఆఫీస్ చాలా బాగుంది గోపాలం! అన్నాడు రామ్మూర్తి.
"ఆఁ - చాలా అన్నాడు గోపాలం.
కాఫీ వొచ్చింది. తన కప్ తీసుకుంటూ. "ఇవేళ నన్ను రమ్మని మరీమరీ చెప్పేరు మీరు. కొంచెం ఆశ్చర్యపడ్డాను. ఎందుకు రమ్మన్నారు?" అన్నాడు.
"వింటే ఆశ్చర్యపోతారు?"
"చెప్పండి-"
కాఫీ చప్పరించి, "మీ కాలేజీలో నాకోసం ఖాళీ ఉందా?" అన్నాడు గోపాలం.
"హాస్యం ఆడుతున్నారు మీరు!"
"లేదు - అన్నట్టు చెప్పండి మరిచేసు ఈరోజు నుంచీ నేను బి. ఎల్ కూడా... మీ కాలేజీలో పనిచెయ్యాలని ఉంది. రమ్మంటారా?"
అతని సీరియస్ నెస్ చూసి కొంచెం ఆశ్చర్యపడ్డాడు రామ్మూర్తి.
"మరి - ఈ ఉద్యోగం?"
"పదినిమిషాలక్రిందట రాజీనామా ఇచ్చాను"
"గాడ్! - ఏంచేత?"
"అది చెప్పాలంటే చాలా పెద్దకథ ఉంది. టూకీగా చెప్తాను వినండి నాకు తెలివొచ్చింది... అందుచేత"
"మీ కారణాలు మీకు ఉన్నాయి.... కాని, గోపాలం! తొందరపడి ఏమీ చెయ్యకండి- తరువాత విచారిస్తారు"
"మీ సలహాకి కృతజ్ఞున్ని మేష్టారూ - కాని. నమ్మండి..... ఒకరోజు మీకు అంతా చెప్తాను, నేను తొందరపడకపోతే విచారిస్తాను"
"మీ యిష్టం- నిజం చెప్పాలంటే నేనూ ఒక ఎకనామిక్స్ లెక్చరర్ కోసం చూస్తున్నాను ఎవరొచ్చినా ఆర్నెల్లుండి మంచి జాబ్ దొరగ్గానే వెళ్ళిపోతున్నారు!"

"నేను రెండు సంవత్సరాలకి బాండ్ రాసి ఇస్తాను"
"అవసరంలేదు- మీరు ఏ రోజు కావాలంటే ఆరోజు వొచ్చి జాయిన్ అవండి," "వొచ్చే వారం?"
"తప్పకుండాను"
"గుడ్?"
ఉత్సాహంగా అన్నాడు గోపాలం. అతనిలో గొప్ప ఉషారు కనిపిస్తోంది.
"మీరు నన్ను అపార్ధం చేసుకోకండి-కాని- నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది" అన్నాడు రామ్మూర్తి.
"నిజమే- ఈ పరిస్థితుల్లో అది సహజమే'
"కాని - నేను కాదంటే ఇక్కడే ఉండే వారా?"
"లేదండీ'- ఆంద్రప్రదేశ్ గవర్నమెంటులో ఆన్సర్ డివిజన్ గుమాస్తాగా ఉండేవాణ్ణి? రక్షించారు మీరు? సాక్ష్యం ఇదిగో! చూడండి!" అంటూ డ్రాయర్ లోంచి ఉద్యోగపు ఆఫర్ తీసి అతని చేతికిచ్చేడు.
"నేనిచ్చే ఉద్యోగంకన్న ఇదిచాలా మంచిది"
"కాదు నా దృష్టిలో కాదు"
"రైట్. మీ యిష్టం"
"నేను సోమవారం ఉదయం అక్కడికి వొస్తున్నాను. మీరు!"
"రేపు వెడుతున్నాను"
రామ్మూర్తి మరికొంచెం సేపు ఉండి వెళ్ళి పోయాడు.
ఆరోజు మళ్ళీ రెండు మూడుసార్లు స్టెల్లా ఏదో పనిమీద అతని గదిలోకి వొచ్చింది.
'డైరెక్టర్ ఈ ఉదయం ఢిల్లీ వెళ్ళేరు,"
"ఎన్ని రోజులు?!
ఫ్రైడే వొస్తారు"
"సరే"
ఆ సాయంత్రం అతనికేమీ తోచలేదు. నాలుగయ్యేసరికి ఆఫీసు వదిలి టాక్సీ తీసుకుని బేలూర్ వెళ్ళేడు. అతని మనస్సులో ఒక ప్రక్క కల్లోలము, మరోప్రక్క గాఢమైనశాంతీ ఒక్కసారి కలిగాయి.
అతను వెళ్ళేసరికి అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్ళి హోలీ మదర్స్ టెంపిల్ దగ్గర ఎంతో పవిత్రంగా, ప్రశాంతంగా పారుతోన్న గంగానది ఒడ్డున మెట్టుమీద కూర్చున్నాడు. ఆ చల్లటి గాలి అతని మనస్సులో దాగిన మంటలనించి అతనికి ఉపశమనం కలుగజేస్తోంది. ఆ పరిసరాల ప్రశాంతత. ఆ మానవుల పవిత్రత అతన్ని ఎంతో ఓదారుస్తూంది. కొంత మంది కాషాయ వస్త్రధారులు క్రమంగా నదిలో స్నానాలకి రావడం ప్రారంభించేరు. అతను లేచి ప్రార్ధనా మందిరం దగ్గరికివెళ్ళి చుట్టూ తిరిగాడు. పాలరాతి నేల ఎంతో చల్లగా ఉంది.
లోపలికి వెళ్ళి ఒక స్తంభాన్ని అనుకుని కూర్చున్నాడు. అనిర్వచనీయమైన ఆనందం అతన్ని ఆక్రమించింది - ఆ మందిరం భక్తులతో నిండిపోయింది. పవిత్రమైన ఆ నిశ్శబ్ధాన్ని మధురమైన భక్తిగానాలు ఇంకా పవిత్రంగా చేశాయి.
తొమ్మిదయేదాకా అలాగే కూర్చుని, మందిరం మూసివేస్తూంటే బయటికివొచ్చి, పదినిముషాలు వెదికి టాక్సీలో ఇంటికి చేరుకున్నాడు గోపాలం, ఆ క్షణం దాకా అతని మనస్సులో బాధ లేమీ లేవు - ఆ ప్రశాంతత తప్ప.
అతను ఇంటిలోకి వెళ్ళేసరికి వసంత భోజనం చేస్తోంది ఒంటరిగా, అతను స్నానం చేసి, భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు - బాధిస్తోన్న ఆ నిశ్శబ్దంలో. అతనికి ఆ రాత్రి బాగా నిద్ర పట్టేసింది.
ఆ తరవాత శుక్రవారం దాకా అతను ప్రతీ రోజూ బేలూర్ వెళ్ళి రాత్రి పదిగంటలకి ఇంటికి వొచ్చేవాడు, శనివారం రాత్రి అతను వొచ్చే సరికి వసంత డ్రాయింగ్ రూములో కూర్చుని ఏదో పుస్తకంలో బొమ్మలు చూస్తూంది.
అతను స్నానంచేసి వొచ్చి నిశ్శబ్దంగానే భోజనం చేశాడు. తరవాత బెడ్ రూములో రెండు సూట్ కేసుల్లో తన బట్టలూ, కాగితాలూ, కొన్ని పుస్తకాలూ పడేసి, పెట్టెలు మంచంకిందకితోసి నడుం వాల్చేడు - దీపం ఆర్పేసి.
