శ్రీదేవి మౌనంగా జాలి చూపడం తప్ప, ఏమీ చెయ్యలేకపోయింది. అటు అత్తగారుకాని, ఇటు భర్త కాని ఎవరో ఒకరు మంచివారైతే, పద్మ కావాలి అనుకుంటే, "వాళ్ళున్నారు, పద్మ కాపరానికి ఫరవాలేదు. కొన్నాళ్ళలో అన్నీ చక్కబడతాయి" అని చెప్పవచ్చును. కాని ఇద్దరి లోను ఎవరూ దయ గలవారు కాకపోతే పద్మ కాపరానికి ఎలాంటి భరోసా ఉంది?
పద్మకి జరిగిన అన్యాయం తలుచుకున్న శ్రీదేవికి కోపం వచ్చింది.
వరలక్ష్మి గారిని కూర్చోమని తానే కొబ్బరికాయ పచ్చడి చేసి, బంగాళాదుంపలు వేయించింది శ్రీదేవి. ఇన్నాళ్ళ దాకా గుండెలలో బరువుగా ఉన్న కూతురి కథ ఈ రోజు ఈ అమ్మాయితో హృదయం విప్పి చెప్పుకో గానే వరలక్ష్మి కి చాలా భారం తగ్గినట్టయింది.
బాబుకి పాలుపట్టి, పడుకోబెట్టి అందరు భోజనాలు చేశారు. భోజనాల దగ్గిర హైదరాబాద్ విశేషాలు, వింతలు చెప్పింది శ్రీదేవి.
రాత్రి పద్మ గదిలో మంచంమీద బాబుని పడుకో బెట్టి, స్నేహితురాళ్లిద్దరు చాపలు వేసుకుని కింద దగ్గిరగా పడుకున్నారు.
చాలాసేపు మౌనంగా గడిచిపోయింది. కాని ఇద్దరికీ తెలుసును, ఎవరూ నిద్రపోలేదనీ, నిద్రపోయినట్లు నటిస్తున్నారనీను. చివరికి శ్రీదేవే అంది: "పద్మా, నేను కాకినాడ ఎందుకు వచ్చానో తెలుసా? చారుమతి నీ విషయం అంతా ఉత్తరంలో రాసింది చాలా రోజుల కిందటే. అప్పటినించి నీ దగ్గిరికి రావాలని ఒకటే తహ తహ. ఇప్పటికి రాగలిగాను."
పద్మ 'ఊఁ' అని ఊరుకుంది.
"అమ్మ నా కంతా చెప్పారు. నీ కథ విన్న దగ్గిరనించి నా గుండెలు మండిపోతున్నాయి. పెళ్ళి అనగానే ఎన్ని కలలు కంటాం! భావిజీవితాన్ని ఎన్ని రంగుల్లో ఊహించుకుంటాం! అన్నీ నీకు నిరాశలుగా మారిపోయాయి. అయినా మీ అత్తగారినికాదు అనవలసింది. తప్పంతా మీ ఆయనది. ఆయనని అంటున్నానని కోపగించుకోకు. మరీ అంత చవట ఏమిటి మాధవరావు?"
"నువ్వు ఏ మాట అన్నా, ఎవరిని అన్నా నాకు కోపం రాదు, ఏడుపు రాదు" అంది పద్మ.
"నే నొక మాట అడుగుతాను. చెబుతావా పద్మా? నువ్వు మీ ఆయన్ని మార్చడానికి ఏమైనా ప్రయత్నించావా?"
"అన్నీ అయ్యాయి, దేవీ ఆయన వాళ్ళ అమ్మ బ్రతికి ఉన్నన్ని రోజులూ మారరు. అమ్మ తప్ప ఇంకో మనిషి అవసరం లేదు."
"మీ అత్తగారు కొడుక్కి పెళ్ళి ఎందుకు చేసినట్టూ?"
"కొడుకుని కన్నాను, పెంచాను, పెద్దచేశాను, చదువు చెప్పించాను, పెళ్ళి చేశాను అని తమ కొడుక్కి చేసిన ఉపకారాలన్నీ వల్లించుకునేందుకు! ఆవిడ కొడుక్కి పెళ్ళి మాట్లాడని మామతో చెయ్యవలిసింది, హృదయం ఉన్న మనిషితో కాదు."
"కాని ఎన్నాళ్ళు మీ ఇద్దరు వేరుగా ఉంటారు?"
"బహుశః జీవితాంతం వరకు...." పద్మ గొంతుకలో అంతులేని నిరాశ.
"నీ జీవితం ఇలా చీకటిగా, అడివి కాచిన వెన్నెల్లా గడిచిపోవడం నేను సహించలేను." శ్రీదేవి ఉద్రేకంగా అంది.
పద్మ నవ్వింది. "మరేం చేస్తావు?"
"ఏదో ఒకటి చెయ్యాలి పద్మా. నువ్వు మాధవరావుని వదిలేసి ఇంకెవర్నేనా పెళ్ళి చేసుకో." ఆవేశంగా అంది శ్రీదేవి.
"అవన్నీ వట్టి మాటలు దేవీ! మొదటిసారి పెళ్ళి కావడానికే ఆడపిల్లలకి ఎంతో కష్టమైపోతూ ఉంది. ఇంక, ఒకసారి పెళ్ళి అయి, రెండేళ్ళు కాపరం చేసిన నన్ను ఎవరు చేసుకుంటారు?"
"నీలాంటి అందగత్తెను చేసుకోడానికి కోటిమంది ముందుకు వస్తారు."
"అంతా నీ భ్రమ. అలా వచ్చినా నేను చేసుకోను."
"ఎందుకు చేసుకోవు?" అర్ధం కానట్టు అడిగింది శ్రీదేవి.
"ఈ పెళ్ళి ఇంత బాగా అయింది. ఈ మొగుడుతో ఇంత చక్కగా సంసారం చేశాను. నా కిప్పుడు పెళ్ళి అన్నా, మొగుడన్నా వెగటు పుట్టింది. నా జీవితాన్ని ఇలా వెళ్ళనియ్యి."
"అలా జీవితాన్ని అసహ్యించుకోకు, పద్మా ఏ గాయ మైనా కాలగతిలో మానిపోతుంది. కొన్నాళ్ళు గడిచే సరికి నువ్వూ ఈ చేదుజీవితాన్ని మరిచిపోయి, నూతన జీవితాన్ని ఆశిస్తావు" అంది శ్రీదేవి.
"నువ్వో పిచ్చిదానివి. అందరినీ ఉద్ధరించాలనుకుంటావు" అంది పద్మ, అటు తిరిగి పడుకుంటూ.
"అవును, నా స్నేహితురాలు సుఖం గా లేదని తెలిస్తే, నేనూ సుఖంగా జీవించలేను" అంది శ్రీదేవి.
పద్మని గురించే ఆలోచిస్తున్న శ్రీదేవికి చాలాసేపటి దాకా నిద్రపట్టలేదు.
పొద్దున్నే ఇంటికి ప్రయాణమయింది శ్రీదేవి. ఇల్లంతా సందడిగా తిరుగుతూ, ఎండిపోయినవారి హృదయాలను రంజింపజేస్తూ, తియ్యటి నవ్వులు ఒలకబోస్తున్న చిన్ని అమర్ ని వదలాలనిపించలేదు పద్మకి, పద్మ తల్లికి, తండ్రికి కూడా. తాను కాకినాడలో ఉన్నన్ని రోజులు తరుచు పద్మ ఇంటికి వస్తూ ఉంటావని మాట ఇచ్చి బయలుదేరింది శ్రీదేవి.
రిక్షా వచ్చింది.
"వెళుతున్నాను, పద్మా. ఇవాళ సాయంత్రం మా ఇంటికి రా. చారుకి కూడా కబురు పంపుతాను. కొంత సేపు ముగ్గురం హాయిగా గడపవచ్చును" అంది శ్రీదేవి.
పద్మ తటపటాయించింది. మద్రాసునించి వచ్చాక పద్మ ఇల్లు కదిలి బయటికి వెళ్ళలేదు. బయటికి వెళితే ఇరుగుపొరుగు, తెలిసినవాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారో అని భయం.
"రాను" అని చెప్పబోతున్న పద్మ జవాబుని ఆపుతూ నారాయణరావుగారే అన్నారు, "పద్మని అప్పక మీ ఇంటికి పంపుతానమ్మా అయిదు గంటలకి వస్తుంది" అని.
శ్రీదేవి రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది.
సాయంత్రం నాలుగు గంటలకి శ్రీదేవి కబురు అందిన చారుమతి ఆమె ఇంటికి వచ్చింది. అమర్ ని చూసి చారుమతికూడా మురిసిపోయింది. వాడిని ఎత్తుకుని ముద్దులు కురిపించింది.
శీతాకాలం పొద్దు. నాలుగు గంటలకే ఎండ తగ్గిపోతూంది. చారుమతి, శ్రీదేవి పెరట్లో మామిడి చెట్టుకింద కూర్చున్నారు.
"ఇంకా పద్మ రాలేదా? వస్తుందని రాశావు చీటీలో" అంది చారుమతి కూర్చుంటూ.
"పద్మ అయిదు గంటలకి వస్తుంది. నీతో ముందు ఏకాంతంగా మాట్లాడవచ్చునని నాలుగింటికే రమ్మన్నాను."
"అంత ఏకాంతంగా మాట్లాడవలిసింది ఏమిటీ?" అంది చారుమతి, కళ్ళు చిట్లించి చూస్తూ.
"మన పద్మ విషయమే. నిన్న రాత్రి వాళ్ళమ్మగారు నాకు పద్మ కథంతా చెప్పారు. పద్మతోకూడా మాట్లాడాను నేను" అంది శ్రీదేవి, బాబుని ఒళ్ళోకి తీసుకుంటూ.
"నువ్వు పెళ్ళి అయినదానివి. అర్ధం చేసుకోగలనని పద్మ కథ చెప్పి ఉంటారు. ఇంతకీ ఏమిటి సంగతి?" అంది కుతూహలంగా చారుమతి.
వరలక్ష్మి గారు చెప్పిన కథ అంతా తిరిగి చెప్పింది శ్రీదేవి. విని ఎంతో బాధపడింది చారుమతి. పెళ్ళికాని తనకి, పెళ్ళిఅయిన పద్మకి జీవితంలో భేదం లేదు. పద్మకి ఒక చేదుఅనుభవంమాత్రం మిగిలిపోయింది.
"అంటే, కాపరం వదిలివేసి వచ్చిందంటావా పద్మ?" అంది చారుమతి.
"అది కాపరమా, చారూ? అతను పద్మని పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో అర్ధం కావటం లేదు. అతనికి విడాకులు ఇచ్చేసి, తిరిగి పెళ్ళి చేసుకోమంటున్నాను నేను."
ఆడపిల్లకి పెళ్ళి కావటం,, సరియైన వరుడు దొరకటం ఎంత కష్టమో స్వానుభవం మీద తెలుసును చారుమతికి.
"మొదటిసారికే దిక్కు లేకపోతే, రెండోపెళ్ళి అమ్మాయిని చేసుకోడానికి ఎవరు సిద్ధపడతారు, దేవీ?" అంది చారుమతి సందేహంగా.
"సహృదయులైన యువకులు మన సంఘంలో ఉండకపోరు, చారూ! అయితే మనం కొంచెం ప్రయత్నించి, వెదకాలి" అంది శ్రీదేవి. చారుమతి మౌనంగా ఊరుకుంది.
"నాకే ఒక అన్న ఉంటే ఈ ఇబ్బంది లేకపోవును కదా అని ఆలోచిస్తున్నాను. నచ్చచెప్పి, ఒప్పించి పద్మని పెళ్ళాడేటట్టు చూద్దును" అంది శ్రీదేవి తిరిగి.
చారుమతికి వెంటనే శంకరం జ్ఞాపకానికి వచ్చాడు శంకరానికి పద్మ అంటే ఇష్టమే. ఎన్నోసార్లు పద్మ అందాన్ని పొగిడేవాడు.
"నీకు అన్న లేకపోతేనేం? నాకో అన్న ఉన్నాడుగా? అడుగుతాను" అంది చారుమతి.
శ్రీదేవి ఆనందంతో ఎగిరి గంతువేసినంత పనిచేసింది.
"శంకరం మాట నాకు జ్ఞాపకమే రాలేదు, చారూ. నువ్వు తప్పక శంకరాన్ని అడుగు. చిన్నప్పటినించీ తెలిసినది, చెల్లెలు ప్రాణమిత్రురాలూ కనక పద్మ కథ విని, హృదయం కరిగి, పెళ్ళి చేసుకోవచ్చును" అంది.
"సరే, వాడు రానీ అడుగుతాను. ఉత్తరాలలో రాస్తే ఇలాంటి పనులు జరగవు" అంది చారుమతి.
"శంకరం ఎప్పుడు వస్తాడు?" అడిగింది శ్రీదేవి.
"రెండు నెలలు సెలవు తీసుకుని సంవత్సరాదికి వస్తాడట. మార్చిలో రావచ్చును. ఆ రెండు నెలలలో ఇక్కడ బోల్డు పని ఉంది."
"ఏమి టంత పని?"
"భగవతి పెళ్ళిని గురించిన తొందర. భగవతికి మంచి సంబంధం చూసి, వాడు ఉండగానే పెళ్ళి చేసెయ్యాలని ఊహ"
"అదేమిటి? నీకు, మాలతికి పెళ్ళిళ్ళు కాకుండానే చిన్నదానికి చేసేస్తారా?" శ్రీదేవి ఆశ్చర్యంగా అడిగింది.
"మాలతికి సంబంధం నిశ్చయమై పోయింది. మా అత్త కొడుకు గోపాల్ ఇక్కడ రైల్వేలో పని చేస్తున్నాడు. నా సంగతి తరవాత చూసుకోవచ్చును. భగవతికి తొందరగా పెళ్ళి చేసుకోవాలని ఉంది" అంది చారుమతి.
"నీ పెళ్ళి కాకుండా భగవతి పెళ్ళి చెయ్యడం నాకేం నచ్చలేదు" అంది శ్రీదేవి. చారుమతికి అన్యాయం జరిగి పోతున్నట్టు బాధపడింది శ్రీదేవి.
"ఒకటి రెండు సంబంధాలు చూశాం. నచ్చలేదు. అంటే, మాకు నచ్చకకాదు. వాళ్ళకి చాలా కట్నం ఆశ ఉంది. ఒకరు అయిదువేలు, ఒకరు మూడువేలు కట్నము, లాంఛనాలు ఇవ్వమని కోరారు. వాళ్ళతో మేం తూగలేం. భగవతికి మాత్రం మంచి ఉద్యోగస్థున్నే చేసుకోవాలని ఉంది."
