Previous Page Next Page 
అపస్వరం పేజి 29


                                  11

    తిమ్మమ్మ మరోసారి నర్మదను పరీక్షగా చూసింది. తన కూతురు నిప్పులో పడ్డ పువ్వులా ఉంటే, నర్మద సంసారపు వేడి తగలని విరసిన పువ్వులా ఉంది.
    "ఏం తిమ్మమ్మా, బదులు చెప్పవేం?"
    "మీరన్నదీ నిజమే తల్లీ. మాది చిక్కి పోయింది. పేదోళ్ళు ఎక్కడున్నా ఇంతేనండమ్మా. పెళ్ళి సేసుకున్నా, సేసుకోకపోయినా సుకంలేదు. కాని మా మీరమ్మగారికేం తక్కువయిందో సెప్పండమ్మా. శామప్పగోరు రానిలా సూసుకుంటారుగందా ఆడు గీసిన గీటు దాటరు గందా ......"
    "నిజమటే మీరా?"నర్మద చిలిపిగా మీర వైపు చూసింది. విషాదపు తెర ఆమె మొహంలో కనిపించి మాయమయింది. బదులుచెప్పే సాహసం కలగలేదామెకు.
    "కాని తిమ్మమ్మా, నువ్వు అన్నట్టు సంసారంలో అందరికీ కష్టాలే ఉంటాయనలేం. కాని మన పాలిటికి కష్టాలుండవని సుఖాలే ఉంటాయని ఏమిటి నమ్మకం?"
    "అయితే ఎన్ని రోజులు ఇలా ఉంటారు?"
    "ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను. చదివి ఉద్యోగము చేస్తాను. మగవాడికి బానిసగా బ్రతకడం నా కిష్టంలేదు."
    "ఎట్టెట్టా ...." అంటూ ముక్కుమీద వేలేసుకుంది తిమ్మమ్మ.
    "ఇక వస్తాం" అంటూ మీర స్నేహితులతో సాగిపోయింది.
    ఇల్లు చేరేసరికి ఏడున్న రయింది. తొమ్మిదింటికి అందరి భోజనాలూ అయ్యాయి. మీర స్నేహితులకు పక్కలు వేయించింది.
    చంప "మీరా, నువ్వు ఇక్కడే పడుకుందూ" అంది, మీర కూడా వాళ్ళతో కబుర్లు చెబుతూ పడుకోవాలనే ఉంది. నర్మద వ్యంగ్యంగా.
    "చాల్లే వూరుకో మీర లేకపోతే వాళ్ళాయనకు నిద్రపట్టదు." అంటూ వేళాకొళం చేసింది.
    "అలాంటివేం లేదులే, ఇక్కడే పడుకుంటాను" అంది మీర.
    "కాస్త వక్కపొడి ఇస్తావ్?" రాజు అడిగింది.
    "తెస్తానుండు" అంటూ లేచి వెళ్ళింది మీర.
    శాము గదిలో దీపం వెలుగుతోంది. శాము పక్కమీద కూర్చుని భార్యకోసం ఎదురు చూస్తున్నాడు. మీర తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. శాము తలెత్తి ఆమె వైపు చూశాడు. ముడి విప్పి రంగు రిబ్బను కట్టుకుంది. స్నేహితులతో కలిసి తాంబూలం సేవించినందువల్ల గాబోలు పెదవులు మరింత ఎర్రనయ్యాయి. ఆమె నించున్న తీరు అన్నీ కలిసి శామును అమితంగా ఆకర్షించాయి. పల్లెకువచ్చినప్పటినుండి ఇంతవరకు మీర ఎన్నడూ ఇంత అందంగా కనిపించలేదనిపించింది.
    మీర సౌందర్యం శాముకు మత్తు కలిగించింది. మెప్పుదలతో మత్తుగా ఆమెవైపు చూస్తున్న కళ్ళలో ఆ సౌందర్యాన్ని పొందాలన్న పిపాస కలిగి కళ్ళు ఎరుపెక్కి క్రూరమయ్యాయి.
    మీర శాము మొహంలోని మార్పును గమనించి గడప దగ్గరే నుంచుంది.
    "లోపలికి రావచ్చునే"
    మీర అక్కడే నిల్చుని "ఈరోజు నా స్నేహితులతోనే పడుకుంటాను. మీతో చెప్పి వెడదామని వచ్చాను" అంది.
    "సరయితే ఓ గ్లాసెడు మంచినీళ్ళు తెచ్చి పెట్టివెళ్ళు."
    మీర కృతజ్ఞతతో అతనివైపు చూసి వంట గదిలోకి వెళ్ళి నీరు తెచ్చి టేబుల్ మీద పెట్టింది. వెనక తలుపు గడియ వేసిన చప్పుడయింది. వణికి పోయింది మీర. రోషంతోను, దుఃఖంతోనూ ఏడుపు వచ్చిందామెకు తలుపుకు అడ్డంగా నిల్చున్న శాముతో దీనంగా.
    "మీకు దన్నం పెడతాను. తలుపు తెరవండి. అయిదు నిమిషాల్లో వస్తానని చెప్పివచ్చాను. ఇంటి కొచ్చిన స్నేహితులముందు నన్నవమానంపాలు చెయ్యకండి." అంది.
    శాముబదులు చెప్పకుండా ఆమెను తన వైపుకు లాక్కున్నాడు.
    "వదలకపోతే అరుస్తాను"
    కాని శాము వదలకపోయినా మీర అరవలేక పోయింది. స్నేహితులముందు అవమానం జరుగుతుందన్న కోపంతో అతడిని గిల్లింది, కొరికింది. శాము బుగ్గమీద రక్తం వచ్చింది. కాని అతడి భల్లూ కప్పట్టునుండి బయటపడలేకపోయింది.
    తన కోర్కె తీరగానే శాము మైకం ఒక సారిగా దిగిపోయింది. పశువులా ప్రవర్తించినందుకు సిగ్గుతో కుంగిపోయాడు. మీర రోషంతో ఏడుస్తూ నిల్చుంది. ఆమెను వోదార్చటానికి కూడా నోరు రాలేదు, శాముకు.
    రేపు స్నేహితులకు ఎలా మొహం చూపను? వాళ్ళ చూపుల నెలా ఎదుర్కోను అన్న బాధలో కృంగిపోయింది. మీర స్నేహితులను పల్లెకు ఎందు కాహ్వానించానా అని మధనపడసాగింది. ఆమె ఏడుస్తూ ఉండటాన్ని గమనించి శాము,
    "మీరా నాది తప్పయింది. కావాలంటే వెళ్ళు"
    "నన్ను మాట్లాడించకండసలు" అంటూ మీర టేబుల్ దగ్గరకు వెళ్ళి గ్లాసులోని నీరు చేతిలోకి పోసుకుని మొహం తుడుచుకుంది. జుత్తు సరి చేసుకుని బయటికి వెళ్ళిపోయింది.
    నర్మదావాళ్ళు పడుకున్న గది చీకటిలో మునిగి ఉంది. నెమ్మదిగా 'చంపా' అని పిలిచింది.
    "రా తల్లీ, నీ కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాయి. పోకచెట్టు నాటడానికి వెళ్ళావేమోనని లైటార్పేశాం."
    మీర నెమ్మదిగా "వక్కపొడి దొరకలేదే. వెతికి తెచ్చాను. రాజూ ఇదిగో వక్కపొడి" అంది.
    "రాజెక్కడుందే ఇంకా? ఎప్పుడో స్వప్న సామ్రాజ్యంలో విహరించటానికి వెళ్ళిపోయింది. సుఖజీవి అంటే రాజు పేరే ముందు చెప్పుకోవాలి మీరా. తల కింద పెడితే నిద్ర, కావాలనుకున్నప్పుడు ఆకలి. అదృష్టమంటే తనదేనోయ్.
    "అందరికీ కావాలనుకున్నప్పుడల్లా నిద్రరాకలదా? అదీ ఓ వరమేనే! రాజు డికిన్స్ ఫేట్ బాయ్ లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోగలదు" అంది నర్మద.
    "కాస్త చోటివ్వు నర్మదా."
    నర్మద కొద్దిగా రాజువైపు జరిగి చంపకూ, తనకూ మధ్య చోటిచ్చింది. ముగ్గురూ కబుర్లలో పడిపోయారు. వాళ్ళు నిద్రపోయేసరికి గంట రెండయింది.
    నర్మద మెలకువ రాగానే 'జీవన సపనా టూట్ గయా' అంటూనే లేచింది. రాజు ఇంకా గుర్రు పెడుతూ నిద్రపోతోంది. చంపా, మీరా అంతకుముందే లేచారేమో పక్కంతా కాళీగా ఉంది.
    కాఫీ ఫలహారాలయ్యాక మీర స్నేహితులను తమ చెరకు గానుగ ఆడుతున్న దగ్గరికి తీసుకుని వెళ్ళింది. వాళ్ళచేత చెరకు రసం త్రాగించింది. వేడి బెల్లం రుచి చూపించి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నమయింది.
    తన స్నేహితులువచ్చి రెండు రోజులయినా శాము వాళ్ళను పలకరించనేలేదు, తన స్నేహితుల పట్ల అతను చూపుతున్న ఉదాసీనత మీరను గాయ పరిచింది. కాని మనసులోని అసమాధానాన్ని పైకి కనపడనీయకుండా స్నేహితులతో నవ్వుతూ కాలం గడిపింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS