"వాలాంగ్ దగ్గర జరిగిన యుద్ద వార్తలు మీరు చదివే ఉంటారు. చైనీయులు ఒక ప్లాను ప్రకారం ముందుకొస్తున్నారు. తుపాకులూ, అవీ వాళ్ళకు ఎక్కువ ఉండడమే గాక అవి అధునాతనంగా తయారు చెయ్యబడ్డాయి. తప్పని సరిగా మేము కొన్ని స్థావరాలు వదులుకుని వెనక్కు రావలసి వచ్చింది. ఈసారి పోస్టు చైనా వాళ్ళకు దక్క నివ్వరాడనే పట్టుదలతో వున్నాము. చాలా జాగ్రత్తగా పహారా కాస్తున్నాము. మృత్యువునైనా సరే ఎదుర్కొనేందుకు సంసిద్దులమై వున్నాము. వేకువ ఝాము కావస్తుంది. విపరీతమైన చలి, గుడారాల దగ్గర , దూరంగా మంటలు వేసుకుని చలి బాధను దూరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాము. ఇంతలో దూరంగా ఉన్నట్టుండి అలజడి ప్రారంభమైంది. అందరం ఆ వైపుకు పరిగెత్తాము. పహారా కాస్తున్న జవాన్లు వీరోచితంగా పోరాడి ప్రాణాలను వదిలారు. చైనావాళ్ళు విజయోత్సాహంతో ముందుకు పరుగులు తీస్తున్నారు. వాళ్ళ సంఖ్యతో మన సంఖ్య పోల్చుకున్నట్లయితే చాలా స్వల్పం. మేము విరోచితంగానే వాళ్ళ నేడుర్కొన్నాము. ఆ క్షణంలో మా ప్రాణాలను గురించి అసలు ఆలోచించలేదు. ఆ కొండల్లో, గుట్టల్లో చెట్ల మధ్య దారీ తెన్నూ గూడా సరిగ్గా తెలీడం లేదు. నేనూ మరిద్దరు జవాన్లూ మటుకు ఒక చెట్టు చాటున దాక్కుని తుపాకులు పెలుస్తున్నాం. శత్రు నష్టం ఎక్కువగానే జరిగింది. ఉన్నట్లుండి ఫిరంగి మ్రోగింది. వాళ్ళిద్దరేమయ్యారో నాకు తెలీదు గానీ నా కళ్ళల్లో మటుకు నిప్పు రవ్వలు పడి మండసాగాయి. ఆ బాధకు తట్టుకోలేక పడిపోయాను. పడి పోయిన మరుక్షణం లో కాలిలో తుపాకి గుండోకటి దూసుకు పోయింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు."
సిగార్ పూర్తిగా కాలిపోవడం చేత వేళ్ళు చురుక్కు మన్నాయి. కాలిపోయిన సిగార్ క్రింద పడేసి బూటు కాలితో నలిపేశాడు.
"ఊ.... తర్వాత?
?' కూతుహలంగా అడిగింది సుధీర.
"తర్వాతేముంది? నాకు స్పృహ వచ్చే సరికి మిలటరీ హాస్పిటల్లో వున్నాను. కళ్ళు పోయాయని అప్పుడే తెలిసింది. అందుకు బాధపడ్డం లేదు గానీ యిక మిలటరీ లో పనిచేసేందుకు వీల్లేదే అని నా బెంగల్లా." విచలిత కంఠంతో అన్నాడు సుందరం.
'అక్కడ డాక్టర్లు నీ కళ్ళు పరీక్ష చేశారా అన్నయ్యా!" అందిసుధీర.
"చేశారు. తిరిగి కంటి చూపు రావడం అసాధ్యమన్నారు."
"విజయను పిలిపిస్తే?" అంటూ ప్రశ్నార్ధకంగా సుధీర ముఖంలోకి చూశాడు భానుమూర్తి.
"నేనూ అదే అనుకుంటున్నాను." అంది అప్పుడే హాల్లోకి వచ్చిన లలితమ్మ వేపు చూసి-- "అక్కయ్యను రమ్మని వైరిచ్చేదా, అమ్మా?" అంది సుధీర.
"ఎందుకు సుధీ? విజయ వచ్చి మటుకు చేసేదేముంది?' అన్నాడు సుందరం ఒక విధమైన నిస్పృహతో.
"నీకు తెలీదు ఊర్కో సుందరం! నిన్ను ఈ పరిస్థితుల్లో హైదరాబాదు తీసి కెళ్ళడం వీలుకాదు. విజయ వచ్చి ఒకసారి చూస్తె అన్నిటికి బాగుంటుంది." అంది లలితమ్మ.
"అవును సుందరం! విజయ ఒకసారి వస్తేనే మంచిది. నేను వైరిస్తాలే, అత్తయ్య!' అన్నాడు భానుమూర్తి.
వంటమనిషి పిలవడం చేత లలితమ్మ లోపలికి వెళ్ళింది.
శేఖరం మెల్లగా హాల్లో అడుగు పెట్టాడు.
"రావోయ్ ! రా!'సాదరంగా ఆహ్వానించాడు భానుమూర్తి.
శేఖరాన్ని చూడగానే సుధీర కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. ఎంత దాచుకుందామన్నా విచార కారు మేఘాలు ఆమె ముఖ మండలాన్ని క్రమ్ముకున్నాయి.శేఖరం మౌనంగా వెళ్ళి భానుమూర్త్జి ప్రక్కన కూర్చున్నాడు. సుధీరా, భానుమూర్తి అంత నిశ్శబ్దంగా, విచారంగా మౌనంగా ఎండుకున్నారో శేఖరానికి అర్ధం కాలేదు.
"ఏవైంది? అందరూ యింత నిశ్శబ్దంగా వున్నారేం? వీరు మీ అన్నగారు కదూ?" అన్నాడు సుధీర ముఖంలోకి చూసి.
సుధీర ఔనన్నట్టుగా తల ఊపింది.
"ఎవరు సుధీ?" సుందరం ప్రశ్నించాడు.
సుధీర కాసేపు, అసౌఖ్యంగా బాధపడింది. శేఖరాన్ని సుందరం కేలా పరిచయం చెయ్యాలో తోచలేదు. కాసేపటికి -- "శేఖరం గారని...." అస్పష్టంగా గొణిగి , అర్ధాంతరంగా ఆగిపోయింది.
భానుమూర్తికి నవ్వొచ్చింది. మెల్లగా అర్ధవంతంగా నవ్వాడు.
భానుమూర్తి నవ్వు చూశాక సుధీరకు రోషం పెల్లుబిక్కింది. "శేఖరం గారు చాలా బాగా కవిత్వం రాస్తారన్నయ్యా! మొన్ననో నాటకం వ్రాసి మా సమాజానికిచ్చారు. ఓహ్! ఎంత బావుందనో?" చురచురా భానుమూర్తి ముఖంలోకి చూస్తూ అంది.
'అలాగా! నమస్కారమండి, కవిగారూ!" అన్నాడు చేతులు రెండు జోడించి సుందరం.
"నమస్కారం!" సిగ్గుతో కుంచించుకు పోతూ ప్రతినమస్కారం చేశాడు శేఖరం.
"అన్నయ్యకు రెండు కళ్ళూ పొయ్యాయి" అంది సుధీర విచారంగా.
సుధీర కళ్ళల్లో చిప్పిల్లిన కన్నీటిని శేఖరం గమనించక పోలేదు. శేఖరం సుందరం వేపు ఓ క్షణం చూశాడు. మాతృ దేశ సంరక్షణ కోసం జీవితాన్ని తృణప్రాయంగా పరిగణించిన ఆ యువకుని పట్ల శేఖరం హృదయం అధ్యాజానురాగంతోనూ, అన్యక్తమైన పులకరింత తోనూ నిండిపోయింది. మనసులోనే అతనికి జోహారులర్పించాడు.
"మీ అన్నయ్య చేసిన త్యాగానికి సంతోషించడానికి బదులు కంట తడి పెడతావెందుకు సుధీ? ఇది నీవంటి వివేకులు చేయవలసిన పనేనా? ఇంతటి మహావకాశం నీకూ, నాకూ , భానుమూర్తి గారికి కలుగుతుందా చెప్పు? జీవితం క్షణికం. సుందరం తన జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు. మనదరికీ అందని మహోన్నత శిఖరాలనందుకున్నారు. ఇది సంతోషించవలసిన విషయమే గానీ, విచారించవలసిన విషయం కాదు." తనువూ, మనసూ కంఠం పులకరింతలతో నిండిపోగా కిటికీ లో నుండి నీలాకాశం వేపు చూస్తూ అన్నాడు శేఖరం.
"బాగా చెప్పావు శేఖరం! దేశంలోని ప్రజలంతా యుద్దాని కెళ్ళాలని ప్రభోదించిన సుధీర, నాటకాలు, ఉపన్యాసాల ద్వారా జీవితం ముఖ్యం కాదని చెప్పిన సుధీర-- ఈ రోజు అవన్నీ మరిచిపోయింది! ఏదైనా అంతే! చెప్పడం సులభం! ఆచరణలో పెట్టడమే కష్టం. తనదాకా వస్తేనే...."
సుధీర ముఖం రోషంతో ఎర్రబడింది. భానుమూర్తి మాటలకు మధ్యలోనే అడ్డు పోయి -- "నన్ను గురించి అంత తక్కువగా ఆలోచించడం ఎప్పట్నుండి నేర్చుకున్నారు బావగారూ?" అంది నెమ్మదిగా, కఠినంగా, ఒక్కోమాటే స్పష్టంగా నొక్కి పలుకుతూ.
"ఈక్షణం నుండే!" అన్నాడు నవ్వుతూ భానుమూర్తి.
"అన్నయ్య కోసమే కాదు. మాతృదేశ గౌరవ సంరక్షణ లో జీవన సుమాల నర్పించిన ప్రతి సైనికుని కొరకూ కన్నీరు కార్చగలసహృదయం నాకుంది! అంతస్తూ, ఐశ్వర్యమూ , చేకూర్చి పెట్టిన స్వార్ధమూ, సంకుచిత త్వమూ , కఠినత్వమూ నన్నేరోజూ జోకొట్టి నిద్ర పుచ్చలేవు! కరుణ శ్రీగారి పుష్ప విలాసం లోనూ, శత్రువులతో హోరాహోరీ పోరాడి అంతిమ యాత్రకు సిద్దంగా వున్న సైనికుని చివరి శ్వాస లోనూ -- నా హృదయ స్పందనను నువ్వు చూడగలవు. భగవంతుడు నాకిచ్చిన గొప్పదనం అదే! నీ సుధీరను గురించి అంత తక్కువగా ఏరోజూ ఆలోచించకు, బావా! అది నా హృదయానికి రంపపు కోత."
ఆవేశంతో సుధీర ఊగిపోయింది. ఆర్ద్రతతో హృదయం తడిసింది. ఆవేదన వల్ల కళ్ళు చెమ్మగిల్లాయి.
"శేఖరం గారూ! మీ సాహచర్యం వల్ల మా సుధీర క్కూడా కవిత్వం వస్తున్నట్లుందే!" అన్నాడు సుందరం నవ్వుతూ.
శేఖరం, సుందరం ముఖంలోకి చూశాడు. భావరహితంగా ఉన్న ముఖంలో ఎలాంటి భావాలను చదవలేక చిన్నగా నవ్వి ఊరుకుండి పోయాడు శేఖరం.
"నన్ను మరీ అంతగా ఎగతాళి చెయ్యకన్నయ్యా! నేనేం కవిత్వం చెప్పడం లేదు" అందిసుధీర తల ప్రక్కకు తిప్పుకుని.
"అలా అనకు, సుధీ!నేనబద్దం చెప్పానంటావా/ అయితే కవిత్వమంటే ఏవిటో చెప్పండి శేఖరం గారూ!" అన్నాడు సుందరం.
"హృదయాన్ని కదిపెదె కవిత్వం."
"మరి ఇప్పుడు సుధీర చెప్పింది కవిత్వమా, కాదా?" పెదిమల మధ్య నవ్వును దాచుకునేందుకు ప్రయత్నిస్తూ అన్నాడు సుందరం.
దానితో భానుమూర్తి , శేఖరం ఫక్కుమని నవ్వారు.
'అలాగయితే నేనిక్కడ్నించి వెళ్ళిపోతానన్నయ్యా!" తెచ్చి పెట్టుకున్న కోపంతో అంది సుధీర.
"వెళ్ళు! వెళ్ళు! వెళ్ళి భోజనం ఏర్పాట్లు చేస్తే మరీ మంచిది! కడుపు నకనకలాడిపోతుంది." అన్నాడు సుందరం నవ్వుతూ.
"ఐదు నిమిషాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తాను" అంది సుధీర లేస్తూ.
శేఖరం గారూ , మీరు వుండిపొండి! అందరం కలిసి భోజనం చేద్దాం" అన్నాడు సుందరం.
శేఖరం పరిస్థితి కాస్త ఇరుకున పడింది. ఏం జవాబు చెప్పనూ చేతకాక సుధీర కళ్ళల్లోకి చూశాడు. సుధీర కళ్ళల్లో భావాలు చదవడం శేఖరంకే రోజూ కష్టం కాదు.
"ఉంటారు కదూ?" రెట్టించాడు సుందరం.
"ఉండకెక్కడ పోతారు? ఇంకా ఏవిటోయ్ ధర్మ సందేహం?' శేఖరం భుజం మీద చరిచి అడిగాడు భానుమూర్తి.
"ఏం లేదు. అలాగే!" అన్నాడు మెల్లగా.
సుధీర లోపలికి వెళ్ళి, ఐదు నిమిషాల తర్వాత అందర్నీ భోజనానికి పిలిచింది.
