Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 29


    అవన్నీ ఆమె వదులుకోలేదు.
    అస్థవ్యస్తమైన మానసికావస్థలో తన మనోవికారాన్ని పరాక్రమం తాలూకు ప్రకోపాన్ని, దానికి అవరోధం ఏర్పడినందువల్ల కలిగినపరితాపాన్ని చల్లార్చుకునేందుకు ప్రయత్నించాడు అర్ధమానవుడు.
    వేట అనే ఒక నెపాన్ని కల్పించుకుని మనశ్శాంతిని వెతుక్కుంటూ అక్కడినించి వెళ్ళిపోయాడు.
    అతడు అక్కడినించి నిష్క్రమించిన తరువాత ధైర్యంగా లేచి నిలబడ్డాడు ఫిజో. కెప్టెన్ మాలతి అతనిని గుహా ముఖానికి తీసుకువచ్చింది ఆ ప్రాంతాలకు వెళ్ళేందుకు భయపడ్డాడు ఫిజో.
    కాని మాలతి అతనికి ధైర్యం చెప్పింది. అర్ధమానవుని గురించిన వివరాలన్నీ తెలియజేసింది.
    "మిగిలినవారంతా ఏమయ్యారు?" అని అడిగింది.
    "వారంతా వెళ్ళిపోయారు." అన్నాడు ఫిజో.
    "నువ్వు రాగలిగావు మంచిదే. కాని ఎలా రాగలిగావు? ఇక్కడున్నానని ఎలా ఊహించావు? దారి ఎలా తెలిసింది?" అంటూ అమితాశ్చర్యంతో అడిగింది మాలతి.
    ఫిజో తాను పడిన శ్రమంతా వివరించాడు.
    "ఫిజో ఈ అర్ధమానవుడు ప్రకృతి పుత్రుడు. మైత్రి అనేమదుర భావనకు లొంగిపోయిన వాడు. అందునించి మనిద్దరం సజీవంగా ఉండగలుగుతున్నాం. అతనిలో మైత్రి బీజం మొలకెత్తకపోతే మనల్ని ఆ భగవంతుడు కూడా రక్షించ లేడు." అన్నది కెప్టెన్ మాలతి.
    "నీవు నిజమైన సాససిని. నిజమైన మిత్రుడవు. నీవు రాకపోయి వుంటే ఏమి జరిగేదో నాకు తెలియదు. కాని ఇప్పుడు వెనువెంటనే తిరిగి పోవాలనిపిస్తుంది." అని కూడా అంది. "కెప్టెన్: టీము స్పిరిట్ తో నా కర్తవ్యాన్ని నేను పాటించాను. అంతేకాని నేను ఎక్కువగా చేసింది ఏమీలేదు. ముందు ఇక్కడినించి బయటపడే దారి అలోచించాలి." అంటూ తొందరించినాడు ఫిజో.
    "మనమిద్దరమే పారిపోవాలనుకుంటే నీవు వచ్చిన దారిన ఎలాగో తిరిగిపోవచ్చు. కాని అతన్ని కూడా వెంట పెట్టుకుపోవాలి. అతిపెద్ద సమస్య" అన్నది కెప్టెన్ మాలతి సాలోచనగా.
    "అర్ధమానవుడ్ని వెంటపెట్టుకు పోవటమా? అదెలా సాధ్యం? అలా చేస్తే ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించారా మేడమ్?" అన్నాడు ఫిజో. అతని ముఖం ప్రశ్నార్ధకంగా అయిపోయింది. నొసలు ముడిపడ్డాయి.
    మాలతి రవంతసేపు ఆలోచించి నవ్వింది.
    "ఫిజో-సమస్యల గురించి భయపడ్డవారు ఎవరూ మౌంట్నీరింగ్ గురించి ఆలోచించరు. శిఖరాన్ని అధిరోహించటమనే ప్రయోగం ఎలాగూ అసాధ్యమయిపోయింది. పిరికిపందలతో కలిసి ఘనకార్యాలు సాధించాలనుకోవటం వెర్రిపని. వారు తిరిగిపోవటం చాలా మంచిది అయింది.
    నీవు రాకపోయి వుంటే నా స్థితి ఏమయేదో నాకు తెలియదు. కాని ఇప్పుడు ఇంత దూరం వచ్చిన దానికి ఫలితంగా ఈ అర్ధమానవుడ్ని మన వెంట తీసుకుపోతున్నాం. ఒంటరిగా ఒదిలి మనం పారిపోతే అతడు జీవించలేడని కాదు. కాని అతడ్ని మన వెంట తీసుకుపోగలిగితే అది ఒక అధ్బుతమే అవుతుంది" అన్నదామె.
    ఫిజో మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది. కెప్టెన్ మాలతి ఎక్కడా రాజీ పడకుండా ఆలోచించగలడు. తన ఆలోచనల్ని ఆచరణలోనూ ప్రదర్శించగలదు.
    నాగరిక ప్రపంచం తెలియకుండా భాష తెలియకుండా అడవులలో మృగాల మధ్య మృగంలా అలవాటుపడిన ఈ మనిషిని తీసుకుపో గలగటం కూడా అసాధ్యం కాకపోవచ్చు. కాని తీసుకు వెళ్ళటం చెయ్యాలి.
    మనస్వి అయిన నాగరిక మానవుడు ఇటువంటి ప్రాణిని తన సమాజంలో ఇముడ్చుకోగలడా? ఒకవేళ అతడా ప్రపంచంలో ఇమడలేకపోతే తిరిగి అతడిని ఏం చెయ్యాలి.
    ఆ మనిషిని కాపాడుకోవటం ఎలా? ప్రకృతి అందాల మధ్య ప్రకృతి సహజమయిన జీవితానికి అలవాటుపడిన ప్రకృతి పుత్రుడు అతడు.
    అక్కడి అసహజమయిన కృత్రిమజీవితానికి అలవాటుపడలేకపోతే ఏమవుతాడు? తిరిగి ఇంతదూరం పారిపోయి రాగలడా?
    అనేక ప్రశ్నలు ఫిజో మస్తిష్కంలో తారాడుతున్నాయి.
    మాలతి మనసులోని ధైర్యం ఏమిటో అతనికి అర్ధం కాలేదు. ఏమైనా ఆమె సమర్దురాలు. అనుకున్నది సాధించి తీరగల వ్యక్తిత్వం ఆమెది.
    తను కెప్టెన్ మాలతికి సహాయంగా ఉండటం తప్ప విధాన నిర్ణయం చేయవలసినవాడు కాదు. జరుగనున్న అద్బుతమయిన సంఘటనలో తన పాత్ర ఎలాంటిదా? అని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఫిజో!
    ఏదో మృగాన్ని వేటాడి తీసుకువస్తూ అల్లంతదూరాన కన్పించాడు అర్ధమానవుడు. ఆ క్షణం ఫిజోని వదిలి పెట్టి ఆ వంకకు పరుగుతీసింది మాలతి. అర్ధమానవుడి ముఖ ముద్రలు ఉద్విగ్నతను సూచిస్తున్నాయి.
    అతని మనః ప్రపంచంలోని మౌలిక మయిన ప్రవృత్తులు సూచించిన దారివేరు. యిప్పుడు ఎదురు అవుతున్న స్థితులు వేరు. తనకు ఒంటరితనాన్ని దూరం చేసిన స్నేహమయి మాలతి. ఆమెను తన నించి దూరంగా లాగివేస్తున్నప్పటి బాధ అతని అనుభవంలో పదే పదే ప్రత్యక్షమవుతోంది.
    తాను వేటాడి వెన్నాడిన చమరీ మృగాన్ని మరొక రెవరయినా ఎగదన్నుకుపోతే కలిగినప్పటి అతి సహజమయిన అసంతృప్తిలాంటిదేఇది.
    కాని పరిస్థితిలో వున్న మార్పు అతనిని కలవర పర్చుతోంది. ఒక ఇరకాటంలో పడవేసింది.
    అతి సహజంగా అయితే తననించి లాగివేసుకున్న చమరీ మృగాన్ని దక్కించుకోవటానికి అతడు పోరాటమార్గాన్ని ఆశ్రయించేవాడు. తనకు ప్రత్యర్ధిగా నిలిచిన ప్రాణితో యుద్దానికి దిగి విజయం సాధించేవాడు.
    ఇప్పుడు కూడా అలాగే జరిగితే అతని మనఃప్రపంచం ఇంతగా కల్లోలిత మయేది కాదు. తన లక్ష్యమయిన మాలతి ప్రత్యర్ది మీద పోరాడకుండా అడ్డునిలుస్తోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS