Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 29


    స్నానం చేసి వళ్ళు తుడుచుకుంటున్న సాంబయ్యకు కనకయ్య గొంతు విన్పించింది.
    "ఆఁఅయిపోయింది! వస్తున్నా! కూర్చో కనకయ్యా!" అని గబగబా ఉతికిన కొత్తపంచను లాగిలాగి కట్టుకోవటం మొదలుపెట్టాడు. సాంబయ్యకు కనకయ్య కంరం వినగానే కనకయ్య లెదర్ బ్యాగే గుర్తుకొచ్చింది.
    అవును! తను మర్చేపోయాడు. అందులో వున్న డబ్బు తీసి సంచి ఇవ్వాలి. ముఫ్ఫైవేలు తనదగ్గర మిగిలిన రొక్కం అదే! నిలవ డబ్బు ఇరవైవేలకు పైచిలుకు పెళ్ళికి ఖర్చు పెట్టాడు. దాదాపు కట్నంగా వచ్చిన డబ్బంతా పెళ్ళికి ఖర్చుపెట్టినట్లే! బలరామయ్య డబ్బుకోసం తనెప్పుడూ ఆశించలేదు. కష్టార్జితమే తనకు కావాల్సింది. కట్నం డబ్బు పెళ్ళికి ఖర్చు చేసి, బలరామయ్య డబ్బుతో తన హోదా పరపతి పెంచుకున్నాడు. బలరామయ్య కూతుర్ని కోడలుగా తెచ్చుకొని తన అంతస్తును పెంచుకొన్నాడు. తన వంశం పరువూ ప్రతిష్టను సంపాదించుకొంది. అదే తను కోరింది. దాన్ని సాధించాడు. అంతకంటే కావాల్సిందేమీలేదు. ఈరోజు ఊరుపోయిన వెంకయ్య కొడుక్కు సాటి యెవరు ఈ ఊళ్ళో? ఎవరు తన మాటను తోసివేయగరు? ఎవడు తనను వేలెత్తి చూపగలడు?
    సాంబయ్య ఇనప్పెట్టె తెరిచి తోలుసంచి తీసుకొని వరండాలో కూర్చున్న కనకయ్య దగ్గర కొచ్చాడు. సంచి తెరవటానికి ప్రయత్నించి "ఇదేదో బిగిసినట్టుంది. నాకు రావటంలా! నువ్వే తియ్!" అంటూ కనకయ్య చేతికిచ్చాడు.
    కనకయ్య నవ్వుకుంటూ లెదర్ బ్యాగ్ జిప్ లాగి సాంబయ్య కిచ్చాడు.
    సాంబయ్య పైపంచ మంచం మీదపరచి లెదర్ బ్యాగ్ తల్లకిందులుగా దులిపాడు. రూపాయి బిళ్ళలూ, నోట్ల కట్టలూ, ఒక పత్రమూ కిందకు జారాయి.
    సాంబయ్య సగానికి పైగా లెక్కపెట్టి ఆగిపోయాడు. కనకయ్య ముఖంలోకి తీవ్రంగా చూస్తూ "ఎంతయ్యా ఇది?" అని అడిగాడు.
    "ఎంతేమిటి? ముఫ్ఫైలేదూ?" అన్నాడు కనకయ్య, ఏ రకమయిన భావాన్నీ ముఖంలో కనపడనియ్యకుండా.
    "అయితే నువ్వే లెక్క పెట్టు!" పంచలోవున్న డబ్బు కనకయ్య ముందు పెట్టాడు. రొక్కం లెక్కపెట్టిన కనకయ్య "పదివేలూ" అని, అందులో వున్న కాగితం మడతవిప్పి "ఆన పందొమ్మిది వందల... వూ! వూఁ! వూరుపోయిన వెంకయ్య కుమార్డు సాంబయ్యకు, యా......వీరభద్రయ్య గారి కుమార్డు బలరామయ్య వ్రాయించి ఇచ్చిన ప్రోనోటు.... వూ! వూఁ!" అని రాగం తీస్తో కనకయ్య సాంబయ్య కళ్ళలోకి చూసి ఆగిపోయాడు.
    "ఎంత మోసం? ఎంత మోసం?" సాంబయ్య గొంతు నూతిలోనుంచి వచ్చినట్టయింది.
    "ఇందులో మోసం ఏముంది? రొక్కం పదివేలూ ఇచ్చారు. మిగతా ఇరవైవేలకు నోటురాసి ఇచ్చాడు. రూపాయి వడ్డీ ఉదహరించి వుంది. మీ కొచ్చిన నష్టం ఏముంది? ఎవరికైనా వడ్డీకి ఇచ్చేదేగా? అయిన వారికే ఇచ్చామనుకోండి!" కనకయ్య మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో అన్నట్లు చెప్పదలచుకున్నదంతా ఒక్క గుక్కలో చెప్పేశాడు.
    "ఎందుకానోటు? నాలుగ్గీసుకోనా? ఇహ తప్పుడు కూతలు మానేసి బలరామయ్య దగ్గిరకెళ్ళి మిగతా ఇరవైవేలు పట్టుకురా!" అంటూ లెదర్ బ్యాగ్ ను విసిరి కనకయ్య ముఖాన కొట్టాడు. కనకయ్య లెదర్ బ్యాగ్ వడిసి పట్టుకొని నిలబడ్డాడు.
    "ఇదుగో సాంబయ్యా! ఇందులో నా ప్రమేయమేమీలేదు. నేను మాత్రం సంచి తెరిచి చూశానా ఏం? ఆయన పెద్దమనిషి! ఇచ్చాడు. అది తెచ్చి నీ కిచ్చాను. అంతవరకే నా పూచీ!"
    "అయితే పద, ఆ బలరామయ్య దగ్గరికి?"
    "నాకేం పని? మీరు మీరు వియ్యంకులు. కిందా మీదా పడ్తారు. ఇవ్వాళ రెండనుకుంటారు. రేపు ఒకటే అవుతారు. ఇచ్చి పుచ్చుకున్నవాళ్ళు! మధ్యలో నా కెందుకూ?" కనకయ్య మెట్లు దిగి తిరిగి చూడకుండా అదే పోతపోయాడు.
    సాంబయ్యకు రక్తం ఉడికిపోయింది! "పెద్దమనిషి! పరువూ ప్రతిష్ట! ఇంత నీచమైన పన్లు చేసేవాళ్ళు కూడా పెద్దమనుషులు, షావుకార్లలా చలామణి అవుతున్నారా? కానియ్! ఈ బలరామయ్య అంతు తేల్చి, తరువాత ఆ కనకయ్యగాడి పని పడ్తా" అనుకొంటూ పళ్ళు పటపట కొరికాడు.
    పదివేలు ఇనప్పెట్టెలో భద్రంచేసి, నోటు తీసుకొని వియ్యంకుడి ఇంటికి బయలుదేరాడు సాంబయ్య.
    మునిమాపువేళ మామగారి మేడపైన చల్లగాల్లో తిరుగుతూ వరూధిని కోసం ఎదురు చూస్తున్న వేంకటపతికి వీధిలో వస్తోన్న తండ్రి కన్పించాడు. తండ్రిరాకకు కారణం వెదకటానికి ప్రయత్నించిన వెంకటపతికి, ఎంతసేపయినా భార్య రాకపోవటానికి గల కారణం కూడా తోచలేదు. పెళ్ళయిన తర్వాత మొదటి మూడు రోజులూ వరూధిని తనకు దూరంగా వుంది. ఈరోజు తెల్లవారగట్ల మామగారి ఇంటికొచ్చినా ఇంతవరకు పెళ్ళాం తన కళ్ళముందు పడలేదు. తన గది చాయలకే రాలేదు. రోజంతా మామగారూ, అత్తగారూ కూతుర్ని ఓదార్చటమూ, ఏదో నచ్చచెప్పటం చూచాయగా పసిగట్టాడు. సాయంత్రం తను వున్న గది కడిగి శుభ్రం చేయటమూ, గదిలో జరుగుతున్న అలంకరణా, ఇంట్లో జరుగుతున్న హడావుడీ వెంకటపతి మనస్సులో ఆశల్ని రేపాయి. తనను మేడమీదకు పంపిన అత్తగారు వరూధిన్ని మేడ మీదకు పొమ్మని తను వింటుండగానే చెప్పింది. వరూధిని సిగ్గుపడి పైకి రాలేదేమో! కొత్తలో అందరికీ అలాగే వుంటుందేమో? నిజానికి తనకూ కొత్తగానే ఉందిగా? ఈవేళప్పుడు తండ్రి ఎందుకు వచ్చినట్టు? పొలాన మిగిలిపోయిన పనులేమైనా వున్నాయేమో? వెంకటపతి ఆలోచనలో పడ్డాడు.
    గడపలోకి వచ్చిన సాంబయ్యను చూసి బలరామయ్య కొంచెం ఖంగారుపడ్డాడు. లేచి మర్యాదగా ఆహ్వానించాడు. సాంబయ్య కూర్చోకుండా నిలబడి వుండటం చూసి "ఇలా కూర్చో సాంబయ్యా! అబ్బాయి మేడమీద వున్నాడు." అన్నాడు బలరామయ్య.
    "కూర్చోటానికి రాలేదు. ఇదుగో, ఈ ప్రోనోటేమిటి? ఈ పన్లేమిటి?" సాంబయ్య చేతిలో ప్రోనోటు ఆడిస్తూ అడిగాడు.
    "అదా! కనకయ్య ముందే మీతో చెప్పానన్నాడే? అందుకు నువ్వు ఒప్పుకున్నా వంటేనే."
    "పచ్చి అబద్దం! కనకయ్య తనకేం తెలియదంటున్నాడు నాతో!"
    "కనకయ్య అట్లా అన్నాడా?" ఆశ్చర్యంగా అన్నాడు బలరామయ్య.
    "ఇది మీ రిద్దరూ కలిసి ఆడిన నాటకం!"
    "సాంబయ్యా, దైవసాక్షి!......నువ్వు పొరబడుతున్నావ్?"
    "అవును! నేను పొరబడ్డాను. పెద్దమనిషివని నమ్మాను. ఇంతమోసం చేస్తావని తెలిస్తే ముప్పైవేలూ చేతిలో పడ్డాకే ఆ మూడుముళ్ళు పడేవి."
    "సాంబయ్యా! తొందరపడమాక. ఇందులో నేను చేసిన మోసం ఏమీలేదు. నీ డబ్బు నీకు పువ్వుల్లో పెట్టిఇస్తా."
    "ఇచ్చేవాడివైతే ఈ రాత కోతలు ఎందుకూ?" సాంబయ్య ప్రోనోటు బలరామయ్య ముందు పడేశాడు. బలరామయ్య.
    "మూడునెల్లాగండి, డబ్బు వడ్డీతో సహా ముట్టచెప్పుతా!" ప్రోనోటు సాంబయ్యకు తిరిగి అందించబోతూ అన్నాడు బలరామయ్య.
    "నీ నోటూ వద్దు నీ అసలూ వద్దు! పరువు మర్యాద వున్నవాడెవడయినా చెయ్యాల్సిన పనేనా ఇది? ఒరేయ్ వెంకటపతీ! ఒరేయ్ అబ్బాయ్" అంటూ కేకలు పెట్టాడు సాంబయ్య.
    వెంకటపతి మామకూ, తండ్రికీ మధ్యన వచ్చి నిలబడ్డాడు.
    "ఎందుకూరా ఇంకా నిలబడ్డావ్? పద?!" సాంబయ్య కొడుకు చెయ్యి పట్టుకొని బయటకు గుంజాడు.
    బలరామయ్య ఒక్కసారిగా తండ్రి కొడుకుల ముందుకొచ్చి "రెండునెల్లు గడువు చాలు! మీ డబ్బు మీ కివ్వకపోతే అప్పుడడగండి!" అన్నాడు.
    "ఇంకా ఏమిటయ్యా అడిగేది? మా డబ్బు మాకు అందినప్పుడే వెంకటపతి ఈ గడప తొక్కేది!" సాంబయ్య కొడుకును గుంజుతూ చరచర మెట్లుదిగాడు.
    "సాంబయ్యా! నలుగుర్లో తలెత్తుకు తిరగాల్సినవాళ్ళం! ఇదేం బాగా లేదు." రోషంతో అరిచాడు బలరామయ్య.
    "తలవంపుల పని చేసింది నువ్వె. మేం కాదు. బుద్దితక్కువపని చేసింది చాలక మాకే నీతులు చెబుతున్నావా?" మాటకు మాట విసిరాడు సాంబయ్య.
    "బుద్ది తక్కువ వాణ్ణి కాకపోతే నా ఇంటి జీతగాడి మనవడికి నా కూతుర్ని ఇస్తానా? నీలాంటి లేకిమనుషులతో వియ్యమందటమే నా పొరపాటు. అందుకే ఆడపిల్ల నిచ్చేముందు, వంశమూ, మర్యాదా, మన్ననా చూడమన్నారు. చెడిబతికినవాడితో....." బలరామయ్య గొంతు పూడిపోయింది. తనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియటం లేదు. ఇన్నాళ్ళుగా మనస్సులో తొక్కిపట్టిన బాధంతా ఆ రూపంలో బయటపడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS