Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 29


                                      శ్రీశ్రీగారి శ్రీమతి
    
    ఫస్ట్ లూప్ వేశారు. క్లోజప్ షాట్ - భానుమతిగారి ముఖం మాత్రమే పెద్ద లిప్ తో కనిపిస్తోంది.
    తమిళంలో ఆమె డైలాగ్ - "పొయ్ సొల్ర దావదు' (అబద్దం ఆడదామా)  అని వుంది.
    భానుమతిగారు రెండు సార్లు చూసి 'పొయ్-అబద్దం, పొయ్- అబద్దం' అని అనుకున్నారు. బ్రాకెట్లో 'బొంకులాడ్డమా' అని కూడా శ్రీశ్రీగారు రాశారు. దాన్ని చూపించాను.
    "అబద్దం అని అంటే లిప్ పోతుందమ్మాయ్. 'బొంకు' అంటేనే కరెక్ట్ లిప్" - అని అన్నారామె.
    "మీ యిష్టమండీ మీకు చెప్పేతంత గొప్పదాన్ని కాను. కానీ 'బొంకు' అంటే వినడానికి బాగుంటుందా? మీరు ఆలోచించి, మీకేది చెప్పాలంటే అదే చెప్పండి" - అన్నాను.
    "ఇలా రా అమ్మాయ్! నా పక్కన కూర్చో" - అన్నారామె.
    కూర్చున్నాను.
    "చూడమ్మా! నువ్విప్పుడే ఫీల్డులో అడుగు పెట్టావు. తెలివైన దానిలా వున్నావు. కానీ ఎం.బి.బి.యస్ పాసైనవాడు కూడా ప్రాక్టీసు పెట్టి ఒకరిద్దర్ని చంపితే కానీ డాక్టర్ కాదు. నువ్వు చిన్న పిల్లవు. అనుభవం చాలదు. ఓ.కె. లూప్ వేసుకుని ఓసారి చూద్దామా" - అని సున్నితంగా చెప్పారు.
    నేనేమీ మాట్లాడలేదు. ఆమె చెప్పిన మాటల్ని మాత్రం పదిలంగా మనసులో దాచుకున్నాను.
    తర్వాత లూప్ వేశారు. శ్రీశ్రీగారు రాసిన రెండు మాటలూ 'అబద్దాలాడడమా, బొంకులాడడమా' అని రెండు సార్లు మళ్ళీ చూసుకున్నారు. "రెండూ టేక్ చెయ్యండి. చూసి ఏది బాగుంటే అది ఉపయోగిద్దాం"
    ఇంటర్ లాక్ చేసి రెండూ రికార్డ్ చేశాం. వెంటనే సౌండ్ తో సహా పిక్చర్ వేసుకుని చూశాం. నిర్ణయం భానుమతిగారికే వదిలేశాం.
    "బొంకు, పొయ్ - లిప్, బ్రహ్మాండంగా వుంది కానీ వినడానికి అంతగా బాగోలేదు. ఏం సరోజా?" - ఏవంటావ్.
    నేనేమీ మాట్లాడలేదు.
    "అబద్దాలాడడమా - అన్నది వినడానికి బాగుంది కానీ లిప్ దెబ్బతింటుందేమో" అన్నారు.
    "ఓపెన్ లిప్ అండీ. బ మీద బా సరిగ్గా పడేలా ఎడిటింగ్ లో ఎడ్జస్ట్ చేస్తారు. ఫరవాలేద"ని శ్రీశ్రీగారన్నారు.
    "నేనూ అదే అనుకున్నాను. కానీ అది శ్రీశ్రీగారి నోటంట రావడంతో నా అయిడియా కరెక్టేనని తెలుసుకోవడానికి మంచి అవకాశం లభించింది" అంటూ "ఎడిటర్ ఎవర"ని అడిగారామె.
    ఎడిటర్ సింగ్ ఎదుటికొచ్చి నిల్చున్నాడు. "శ్రీశ్రీగారు చెప్పినట్టు, ఆ మాట కరెక్టుగా లిప్ కి అడ్జస్ట్ చెయ్యండి. లేకుంటే క్లోజ్ షాట్ అసహ్యంగా వుంటుంది" అని, "అమ్మాయి సరోజా! ఈ పాయింట్ నువ్వు కూడా నాట్ చేసుకో దగ్గరుండి ఈ లూప్ పని మాత్రం చేయించు" - అని చెప్పారు.
    తరువాత రెండు కాల్ షీట్లతో అవ్వాల్సిన పనిని ఒక కాల్ షీట్లోనే పూర్తి చేసి, మిగిలిన పని మరుసటి రోజు ఒక పూటలో పూర్తి చేసేశారు భానుమతిగారు.
    మెయిన్ క్యారెక్టర్ పని హాయిగా ముగిసిపోయినందుకు చాలా హేపీగా వున్నాం.
    మధ్యాహ్నం శంకర్ సింగ్ గారు ఆఫీసుకొచ్చారు. ప్రొజక్షన్ మర్నాడే ఫిక్స్ చేశాం. ఆర్టిసుల్ని పిలిపించాలి. శ్రీశ్రీగారు లిస్ట్ తయారు చేశారు. ఇందులో వున్న వాళ్ళనే అందులో కూడా దొర్లించారు. నన్ను ఈర్ష్యించుకున్న కథానాయకురాలి పేరు కూడా లిస్ట్ లో ముందే వుంది.
    పిక్చర్ చూసిన తర్వాత అక్కడే ఆర్టిస్టులతో మాట్లాడేసి, అగ్రిమెంట్స్ చేసేద్దామని అనుకున్నాం.
    నేను పెద్ద స్టూడియో అనుకునే ఫిలిం సెంటర్లో నేను అడుగుపెట్టడం అదే మొదటిసారి.
    ఉదయం పది గంటలకి పిక్చర్.
    ఆర్టిస్టులూ, ప్రొడ్యూసర్...అందరూ మా కోసం ఎదురు చూస్తున్నారు. మేం వెళ్ళడం ఆలస్యమయ్యింది. అందరూ శ్రీశ్రీగారికీ, నాకూ నమస్కారాల వర్షం కురిపించేశారు.
    'మా హీరోయిన్ వుందా, లేదా' అని వెతకాల్సిన పనిలేకుండానే "నమస్కారమండీ శ్రీశ్రీగారూ" - అంటూ వచ్చి, నన్ను చూసి ఓ చిరునవ్వు విసిరింది. నేనూ అంతే చేశాను.
    పిక్చర్ చూసే, ఆర్టిస్టులతో మాట్లాడి, అగ్రిమెంట్లు చేయించాం, అడ్వాన్సు లిచ్చే పని పూర్తయ్యేసరికి సాయంకాలం అయిదు గంటలైపోయింది. అందరికీ అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు.
    మర్నాటి నుండి డబ్బింగ్, ఏడుగంటలకి కాల్ షీట్ లంటే, ఆరు గంటల ఏభై నిముషాలకి స్టూడియోకి ఎవరొచ్చినా రాకున్నా, మేం వెళ్ళి వుండేవాళ్ళం.
    నేను పేరు చెప్పని హీరోయిన్ 'గంధర్వకన్య'లో హీరోయిన్ కె మాట్లాడింది.
    ఎడిటర్ యాదవ్ గారి సహకారంతో, వారిచ్చిన టైంలో 'గంధర్వకన్య' స్ట్రయిట్ పిక్చర్ లా వచ్చింది.
    హీరోయిన్ కి మాట్లాడిన అమ్మాయి చాలా చక్కగా, స్వచ్చంగా, భావ యుక్తంగా మాట్లాడింది.
    ఆరు కాల్ షీట్లలో, అంటే డబుల్ కాల్ షీట్లు మూడురోజులూ, ఉదయం ఏడుగంటల నుండి రాత్రి తొమ్మిది గంటలవరకూ పనిచేసి పూర్తి చేసేశాం.
    ఆ పిక్చర్ తో ఫిలిం సెంటర్లో - డబ్బింగ్ రాయడంలో శ్రీశ్రీగారి మీద, పనిపట్ల నా మీద మంచి అభిప్రాయం ఏర్పడింది.
    "మర్నాడు కారు పంపిస్తాం. 'గంధర్వ కన్య' పాటలన్నీ థియేటర్ లో చూద్దాం రమ్మ"ని చెప్పారు.
    ఆ మర్నాడు పదిగంటలకి అందరం ఫిలిం సెంటర్ లో చేరాం. పాటలన్నీ చూశాం. అందులో నా ప్రత్యేక ఇంట్రస్ట్, నేను మూడు పాటలే పాడటమే. ఆ రోజుల్లో కాబట్టి ఫరవాలేదనిపించింది.
    పాటలన్నీ అయి, డిస్కషన్ ముగిసి బైటకొచ్చేసరికి ఒంటి గంటన్నర అయింది.
    ఇళ్ళకి బయలుదేరాం. పాటల గురించి డిస్కషన్ చేస్తూ, మాటల్లోపడి, శ్రీశ్రీగారింటికి వెళ్ళాం.
    స్టూడియో నుండి వచ్చే తోవలో ముందు శ్రీశ్రీగారిల్లే వస్తుంది. అందుకనే డ్రైవర్ ముందు వారింటికి తీసుకువచ్చాడు.
    అప్పుడు - అంటే, 1956 వ సంవత్సరం, సెప్టెంబర్ నెల మందపల్లిలో కపాలీ థియేటర్ పక్క వీధి అరుణగిరి మొదలితెరువులో శ్రీశ్రీగారుండేవారు. ఇంటి నెంబరు పదకొండు.
    మేము లజ్ కి దగ్గరగా కచేరీ రోడ్డులో వున్న మద్దాల నారాయణరావు తెరువులో వుండేవాళ్ళం. శ్రీశ్రీగారు 35 రూపాయల అద్దె యిచ్చేవారట. మా యింటి అద్దె కూడా ముప్పయ్యయిదు రూపాయలే.
    శ్రీశ్రీగారింటి దగ్గర కారు ఆగింది. మేము కారులోనే కూర్చున్నాం. కారు హారన్ విని ఓ 12 ఏళ్ల అమ్మాయి పరుగెత్తుకుని కారు దగ్గరికి వచ్చింది. పెద్ద కళ్ళు, ఎత్తుపళ్ళతో నల్లగా వుందా అమ్మాయి.
    ఆ అమ్మాయి వెనకాలే ఒక ఆవిడ కూడా వుంది. చామన ఛాయతో, చూసేవాళ్ళకి సున్నితమైన మనిషిలా కనిపిస్తుంది. చక్కని పలువరస.
    గుమ్మలోకి వచ్చిందామె.
    "పెళ్ళాం అనుకుంటానే" -అంది మా అమ్మ.
    "నాకు మాత్రం ఏం తెలుసమ్మా" - అన్నాను.
    ఆవిడంటే నాకెందుకో, ఇష్టంతోపాటు ఓ విధమైన అభిమానం కూడా ఏర్పడింది. ఆవిడ కారులోకి తొంగిచూసింది.
    ఎవరో తెలియకపోయినా, నమస్కారం చేశాను. ఆవిడ అదో మాదిరిగా నన్ను చూసి, ప్రతి నమస్కారం చెయ్యకుండానే పిల్లని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది.
    "మధ్యాహ్నం వస్తాన"ని చెప్పి శ్రీశ్రీగారు కూడా వెళ్ళిపోయారు.
    "నువ్వు నమస్కారం చేస్తే ఆవిడ అలా చూస్తుందేమిటే సరోజా?" అని మా అమ్మ అడిగింది.
    "పోనీలే - అమ్మా!" - అనేశాను. "నా కెందుకో ఆవిడ బాగా నచ్చింది" - అన్నాను.
    కారు స్టార్ట్ అవుతూ వుంటే శ్రీశ్రీగారు మళ్ళీ వచ్చి, "సిగరెట్ ప్యాకెట్ మరిచిపోయాను. ముందు సీటులో వుందా!" చూడు" అన్నారు.
    తీసి ఇస్తూ, "మీ ఆవిడా అండీ!" - అని అడిగాను.
    "అవున"న్నారు.
    నాకు చాలా సరదావేసింది. ఆ అమ్మాయి గురించి అడగాలనిపించలేదు. వాళ్ళిద్దరూ బాగున్నారు. ఆ అమ్మాయిలో వాళ్ళిద్దరి పోలికలూ ఏ కోశానా లేవు.
    "ఆ పిల్ల మీ అమ్మాయా?" అని ఆ మాటకాస్తా మా అమ్మ అడిగేసింది.
    "అవునన్న"ట్టు తలూపి వెళ్ళిపోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS