Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 30


    భార్యవైపు అయోమయంగా చూశాడు కిరణ్.
    కిరణ్ కి ఇంకా పూర్తిగా మెలకువరాలేదు. ఈమధ్య తరచూ. అర్ధరాత్రి పూట ఆనాడు సరీగా అనిత చనిపోయిన టైమ్ లో ఒక భయంకరమైన కల రావటం మొదలు పెట్టింది.
    కలలో.
    అనితకు తల లేకుండాను. కామినీకి మొండెం లేకుండాను కనిపించడం, నిన్ను తీసుకెడతానని అనిత, ఎలా తీసికెడతానో చూస్తానని కామిని పోట్లాడుకోవటం.
    ఒకే రకమైన కల.
    ఎన్నిసార్లు వచ్చినా అదే కల.
    ఏ మాత్రం మార్పు లేని కల.
    ఆ కల వచ్చినప్పుడల్లా కిరణ్ గావుకేక వేసి లేచి కూర్చుంటాడు. అతను మళ్ళీ మళ్ళీ అరవకుండా ప్రక్కనే వున్న కామిని, అతని నోరు మూసో, తట్టిలేపో అతనికి తెలివి తెప్పించేది.
    అయినా, కొద్దిసేపటి వరకు కిరణ్ మనిషి కాలేకపోయేవాడు. శరీరం భయంతో కంపిస్తూ వుండేది. శరీర మంతా ముచ్చెమటలు దిగకారిపోయేవి. హృదయ స్పందన విపరీతంగా హెచ్చేది. మరి కొద్దిసేపు బుర్ర అసలు పనిచేసేదికాదు. తను బ్రతికున్నాడో, మరణించాడో తెలియని అవస్థ ఆ తరువాత పూర్తిగా తెలివి వచ్చినా, చాలాసేపటి వరకూ మనిషి కాలేకపోయాడు.
    కిరణ్ ఏ స్థితిలో వున్నాడో కామినీకి తెలుసు. అయినా లెక్కచేసేది కాదు. బుజ్జగింపు, ఓదార్పు, సానునయం మాటలు ఏవీ వుండేవి కావు.
    "ఏమైంది? మళ్ళీ ఆ భయంకరమైన కలే వచ్చిందా" కామిని వ్యంగ్యంగా అడిగింది.
    అప్పుడే తేరుకుంటున్న కిరణ్ "ఆ" అన్నాడు.
    "నీ పిచ్చి కలలు కాదుగాని నా ప్రాణం పోతున్నది అరచే అంత భయంకరంగా వుంటుందా! ఆ కల."
    ముక్తసరిగా "ఊ" అన్నాడు కిరణ్."
    "నీ కల కాదు కాని నేను హడలి చస్తున్నాను"
    కిరణ్ మౌనంగా వుండిపోయాడు.
    "మేడమీద మీ అమ్మా నాన్న అటు చివరి గదిలో మనము ఇటు చివరి గదిలో పడుకోబట్టి సరిపోయింది. లేకపోతే అర్దరాత్రి ఈ ఆర్తనాదాలు వుంటే నేను నీ గొంతు పిసికి చంపుతున్నానని అనుకున్నా అనుకుంటాను. మీ అమ్మా అయ్యకి అతి తెలివి జాస్తీలే" వ్యంగ్యంగా అంది కామిని.
    ఈతఫా కూడా మాట్లాడలేదు కిరణ్. నిస్సత్తువగా వెనుకకు వాలి పడుకున్నాడు.
    "ఎన్నిసార్లు అడిగాను? ఆ భయంకరమైన కల ఒక్కసారికూడా చెప్పవేమిటి? అడిగినప్పుడల్లా భయంకరమైన కల వస్తుంది అంటావు కాని, ఆకలేమిటో చెప్పవు." నిష్టూర్యంగా అంది కామినీదేవి.
    "ఎలాంటి కలో నిజం చెబితే నువ్వు భరించలేవు."
    "నీ కొచ్చిన కలకి నేను భరించడమేమిటి. కలకన్నది నీవు. భరించటం, బాధ పడటము, భయ పడటమూ అది నీపని. కలేమిటో చెబితే విని ఆనందిస్తాను."
    కిరణ్ కి ఒళ్ళు మండింది.
    "భరిస్తాననటం కాదు బాధ పడతావ్."
    "ఇన్ని మాట లెందుకు కలేమిటో చెప్పు"
    తన కొచ్చిన కల వివరంగా చెప్పాడు కిరణ్.
    "కావాలని కల్పించి చెబుతున్నావా!" కోపంగా అడిగింది కామినీదేవి,
    "అంత అవసరం నాకు లేదు. నాకోచ్చే భయంకర మైన కలేదో నీకు నిజం చెప్పినా నమ్మనని ఇంతవరకూ చెప్పలేదు. నేనేదో దాస్తున్నానని అనుకోని, నువ్వు పదే పదే అడగటంతో ఇప్పుడు చెప్పక తప్పలేదు. నా కొస్తున్న కల మాత్రం ఇదే. ఒకప్రక్క భయంకరమైన కల. తెలివి రాంగానే నీ వేధింపు, నా ప్రాణం పోతున్నది" రెండు చేతులతో తల నొక్కుకుంటూ చెప్పాడు కిరణ్.
    "ఒకే రకమైన కల వస్తున్నది చెప్పావు కదూ!"
    "ఒకే రకమైన కల"
    "దీనర్ధమేమిటి?"
    "నువ్వు చాలా తెలివికలదానివి కదా! నువ్వె ఆలోచించి చూడు."
    కిరణ్ వ్యంగ్యంగా అన్నట్టుగా అనిపించింది కామినీకి. బస్సున కోపం వచ్చింది. "నీ కలకు అర్ధం నాకు తెలుసు" అంది.
    "తెలుసా!" కిరణ్ ఆత్రుతగా అన్నాడు.
    "తెలుసు అంతేకాదు. ఈ కల నీకు తిరిగి ఎప్పుడు రాకుండా పోతుందో కూడా తెలుసు."
    "ఎప్పుడు రాకుండా పోతుంది" కిరణ్ ఆతృతగా అడిగాడు.
    "నేను చచ్చిన తరువాత"
    కామిని అలా అంటూంటే తెల్లబోయాడు కిరణ్.
    "ఏమిటి....ఏమిటి కామిని నువ్వు అనేది!"
    "ఉన్నమాటే కిరణ్! అనిత చచ్చి తలలేని దయ్యం అయ్యింది. నేను చచ్చిన తరువాత మొండెం లేని దెయ్యాన్ని అవుతాను. ఆ లోకంలో ఎదురెదురు పడతాము దాని శరీరమూ, నా తల హోరా హోరీగా పోట్లాడుకుంటాయి. ఎందుకో తెలుసా? నీ కోసమే..." కిరణ్ నా వాడంటే నా వాడని క్రిందా మీదా పడి తన్నుకు చస్తూంటాంకదా! ఇంక మా ఇద్దరికీ నీ కలల్లోకి వచ్చే టైమ్ ఎక్కడ వుంటుంది. అప్పుడు మరోదాన్ని కట్టుకొని, తియ్యని కలలు కంటూ రాత్రింబవళ్ళు హాయిగా కులుకుతుంటావు కదా!" వ్యంగ్యంగా అంది కామిని.
    "కామినీ! నీవు చెప్పినట్టల్లా వింటున్నాను. ఎందుకు నన్నిలా వేధిస్తావు. నేను చేసింది ఒకే ఒక్క పొరబాటు. నువ్వు చెప్పినట్టుగా విని ఆ పొరబాటుని కూడా దిద్దుకున్నాను. అయినా నువ్వు నన్ను సాధించడమూ, వేధించడమూ మానలేదు."
    "నేను నిన్ను సాధించి వేధిస్తున్నానా?" కామిని ఆశ్చర్యంగా అడిగింది.
    అదేదో నువ్వె ఆలోచించి తేల్చుకో అన్నట్లు కిరణ్ మౌనంగా వుండిపోయాడు.
    "అవునులే, నీవు నరకంపాలు కాకుండా తప్పించాను ఆ నరకం,లోనే నీవు వుంటే రాత్రింబవళ్ళూ, వేదనతో తల పట్టుకొని ఒంటరిగా నాలుగు గోడలమధ్యా..."
    "స్టాపిట్ కామిని! స్టాపిట్"
    "నేను నోరు మూసుకున్నాను కాబట్టే నువ్వు నోరు తెరవగలిగావు కిరణ్!"
    అదీ ఒకందుకు నిజమే. హత్యానేరం బయటపడి కిరణ్ జీవితం జైలు పాలయితే ఊచలు లెక్కపెట్టుకునే స్థితే ఏర్పడేది. సమయానికి తెలివిగా కామినీ వచ్చి రక్షించగలిగింది. అలా అని కామినీ ఏమీ కిరణ్ ని స్వర్గధామంలో విహరింప జేయడంలేదు. "నీవు తప్పు చేశావు. దానికి శిక్ష నోరు మూసుకుని పడి వుండటమే. నోరు తెరిచావా నీ పని గోవిందో హరి. అన్నట్లుగా ప్రతి క్షణం గుర్తు చేస్తూ అలాగే బిహేవ్ చేస్తున్నది. ఇంక కిరణ్ కి శాంతి ఎక్కడ నుండి లభ్యమవుతుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS