"ఫారిన్ విశేషాలు ఏమిటి? అందరూ బావున్నారు కదా!" రావుగారు అడిగారు.
"అందరూ బావున్నారు. నేను కూడా ఇన్ని నెలలూ అక్కడ హాయిగా గడిపి వచ్చాను. రేపు నెల మా రెండో వాడుకూడా ఫారిన్ వెళతాడు." రాజన్ బాబు చెప్పాడు.
"ఊరికినే చూసిరావటానికా? లేక పెద్ద వాడిలాగానే మీ రెండో వాడు కూడా అక్కడే సెటిల్ అవుతున్నాడా?"
"వాడంటే అక్కడి పిల్లని చేసుకున్నాడు కాబట్టి అక్కడే వుండిపోయాడు. వీడికి ఆ అవసరంలేదు. పెళ్ళి, పిల్లలు అంతా ఇక్కడే జరిగింది కదా! సెటిల్ అవటం కూడా ఇక్కడే సరదాగా ఫారిన్ టూర్ వేసుకున్నాడు" రాజన్ చెప్పాడు.
"మీరెప్పుడు వచ్చారు?" ఊర్మిళాదేవి అడిగింది.
"నాలుగు రోజులయ్యింది. ఒకసారి చూసి పోదామని వచ్చాను. అన్నట్టు కిరణ్ ఏమిటి చెప్పాపెట్టకుండా పెళ్ళి చేసుకున్నాడట. మావాడు ఈ వార్త చెబితే ఆశ్చర్యపోయామనుకోండి."
ఊర్మిళాదేవి మొహం నల్లబడింది.
"ఉద్యోగ నిమిత్తము ఫారిన్ వెళ్ళిన నీ కొడుకు అక్కడ పిల్లని పెళ్ళాడితే నువ్వు ఏం చేయగలిగావు. మా కిరణ్ తప్పేమిలేదు. "డాడీ నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. మాకు పెళ్ళి చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి అని కిరణ్ ముందే చెప్పాడు. కాని, నేనే ఏదో గొప్ప సంబంధం తీసుకువద్దామ ని మనకన్నా పై అంతస్థులోవున్న పిల్లని ఈ ఇంటి కోడలిని చేద్దామని వాళ్ళ వివాహానికి ఒప్పుకోలేదు. వాడి మాట కాదన్నందుకు ఏదైనా అఘాయిత్యము చేసుకుంటాడేమోనండీ అని మా ఊర్మిళకూడా భయపడింది. కిరణ్ నిక్షేపముగా ధైర్యముగా పెళ్ళి చేసుకొని వచ్చాడు. నోరు మూసుకుని ఆశీర్వదించి ఇంట్లోకి రానిచ్చాను. ముందే వాడి మాట నేను విని వున్నట్లయితే అందర్నీ పిలిచి గ్రాండ్ గా మ్యారేజ్ చేసి ఉండేవాడిని కదా! కొన్ని కొన్ని అంతే మన చేతుల్ని దాటిపోతాయి మనకి తెలియకుండానే" రావుగారు చాలా సహజంగా చెప్పారు.
"అయితే మీ వాడిది లవ్ మ్యారేజ్ అన్నమాట!"
"అన్నమాట కాదు, ఉన్నమాట."
"కిరణ్ ఇంట్లో ఉన్నాడా?"
"ఇరువురూ పిక్చర్ కెళ్ళారు."
"ప్రేమ వివాహాలు ఫాషన్ అయిపోయాయి."
"చూస్తుంటే అలాగే వుంది."
"యువతరం బొత్తిగా మాటవినటము లేదు. వాళ్ళ మాటే నెగ్గాలన్న పంతము జాస్తి అయిపోయింది.
"మరే" అన్నాడు రావుగారు.
వాళ్ళ సంభాషణలొ ఎక్కువ కలుగ చేసుకోలేదు. ఊర్మిళాదేవి.
కిరణ్ తనంతట తాను పెళ్ళి చేసుకుని రావటము, రాజన్ బాబులాటి వాళ్ళకి వింతగానూ విడ్దూరంగానూ ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా అదే పనిచేశాడు కాబట్టి కాని అందరూ అలా కాదు కదా! కిరణ్ పెళ్ళి చేసుకుని వచ్చిన విషయములో వూర్మిళాదేవిని ఎందరో ఎన్నో అడిగారు. అలా రావుగారికీ జరిగింది. రాజన్ బాబూ రెండు ముక్కలతో వదిలేశాడు. అందరూ అలా వదిలేయరు.
కొద్దిసేపు కూర్చుని రాజన్ బాబు వెళ్ళిపోయాడు.
"ఇంకా మనము ఎన్ని ఎదుర్కోవాలో!" అంది వూర్మిళాదేవి. అలా అంటున్నపుడు ఆమె కళ్ళు తడి అయ్యాయి. "ఎదుర్కోవాలి కాబట్టే మనము ధైర్యంగా వుండక తప్పదు" ముక్తసరిగా అన్నారు రావుగారు.
18
"కిరణ్."
"ఓ...కిరణ్"
"ఏమిటి" అంటూ తలెత్తి చూశాడు. అంతే నోరు బిగుసుకుపోయింది. కళ్ళు పత్తికాయల్లా తెరచుకుని వుండిపోయాయి.
కిరణ్ కళ్ళ ఎదుట అనిత నిలబడి వుంది.
అనితకి మెడనించి కాళ్ళదాకే శరీరం మొత్తం వుంది. మెడమీద తల మాత్రం లేదు. తల పూర్తిగా లేని అనిత చేతులు త్రిప్పుథూ మాట్లాడుతున్నది. మాట్లాడుతున్నది అంటే నోటితోకాదు తలే లేనిది నోరు ఎక్కడి నుండి వస్తుంది. కాని అనితే మాట్లాడుతున్నట్టు మాటలు వినవస్తున్నాయి.
"మాట్లాడవేమిటి కిరణ్!"
"నన్ను మరచిపోయావా!"
"అవును లే హాయిగా పెళ్ళి చేసుకుని క్రొత్త పెళ్ళాంతో కులుకుతున్నవు కదూ! నేను నిన్ను విడిచి పెడతానని అనుకోకు నాతో నిన్ను తీసుకుపోదామని వచ్చాను."
అనిత మాటలు అలా వినపడుతూవుంటే నోరు మేడపబోయాడు కిరణ్. కాని అతనికి నోటితోపాటు సర్వాంగాలు బిగుసుకు పోయినట్టు అయిపోయాయి.
"ఏమిటే కిరణ్ ని తీసుకుపోదామని వచ్చావా!"
ఈ మాట అన్నది ఎవరో కాదు, కామినీదేవి. ఆమె మెడ మీద నుండి క్రింద భాగం లేదు. తలకాయ మాత్రమే వుంది. పెదవులు కదుపుతూ చక్కగా మాట్లాడుతున్నది.
"అవునే తీసుకుపోదామని వచ్చాను." అనిత శరీరం అంది.
"ఎలా తీసుకుపోతావ్" కామినీ తలకాయ అంది.
"చేతులమీద ఎత్తుకుని గాలిలో తేలిపోతూ వెడతాను"
"మెడమీద తలకాయ లేని దెయ్యమా! నీకు మెదడు లేదన్న విషయం మరచిపోయావా! ఏదీ కిరణ్ ని తీసికెడతావా, తీసికెళ్ళు చూద్దాం." అంది కామినీ తల.
"పిశాచం మొహందానా, మొద్దు మొహం వుండగానే సరా, తీసికెళ్ళటానికి చేతుల్లేవా! ఇదిగో ఇలా ఈ చేతులతో కిరణ్ ని ఎత్తుకుని గాలిలో తేలిపోతూ వెళ్ళిపోతాను" ఆ మాట అంటూనే అనిత చేతులు చాచి కిరణ్ ని అమాంతం పైకెత్తేసింది. కామిని తల రయ్యినవచ్చి కిరణ్ జబ్బ దగ్గర ఆగింది. అంతేకాదు కిరణ్ జబ్బని తన పళ్ళతో గట్టిగా పట్టేసింది.
అనిత గాలిలో తేలుతూవుంటే కిరణ్ ని పట్టుకుని, కిరణ్ జబ్బకున్న కండ వూడేలా కామిని కొరుకుతూవుంటే భయంకరంగా కెవ్వున కేక పెట్టాడు కిరణ్.
సరీగా అర్ధరాత్రివేళ భయంకరంగా ఆర్తనాదం చేస్తూ కిరణ్ మంచంమీద నుండి లేచి కూర్చున్నాడు. భర్త ప్రక్కనే పడుకొన్న కామినీదేవి చటుక్కున లేచి కూర్చుని అతని నోరు మూసింది.
"ఏమయింది?" కామిని అడిగింది.
