వాళ్ళకి తనొక్కతే సంతానం అంటూ చెప్పింది.
ఇంకా ఎందరున్నారో! అనల్లేరా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళని కలుసుకోవటం ఎలా?"
"స్వప్నా!"
గీత పిలుపుకి ఉలిక్కిపడింది.
"మీ బంధువులు ఇక్కడున్నారన్నావే వాళ్ళని చూసొద్దామా?"
ఉలిక్కిపడింది స్వప్న "అమ్మో! ఇంకేమైనా ఉందా అమ్మమ్మకి తెలిస్తే ప్రాణం పుచ్చుకుంటుంది. తోట తప్ప మరేదీ చూడకూడదని ఒట్టు వేయించుకుని మరీ పంపింది.
నవ్వింది విజయ "మీ అమ్మమ్మదంతా చాందసం మనం వెళ్ళి చూసొస్తే ఆవిడకి తెలుస్తుందా ఏమిటి? ఎంతసేపని మీ తోట అందచందాలు చూస్తూ గడుపుతాం పదవే."
"ఊహూఁ వద్దు!" తనలో ఆ యింటికి వెళ్ళి ఆమెను చూసి ఆమె కొడుకూ, కూతురూ ఎక్కడికి వెళ్ళేరో, తన తల్లిదండ్రుల విషయం తెలుసేమో కనుక్కోవాలని వుంది కానీ అమ్మమ్మగారి మాట బంధిస్తూ వుంది.
"మరేం చేద్దామే?" అడిగింది వినయ.
"డాన్స్ చేద్దామే!" నవ్వుతూ అంది గీత.
"హతోస్మి ఈ వూళ్ళో మనం డాన్స్ ప్రోగ్రాం పెడితే టికెట్ లేని సినిమా అంటూ వచ్చేస్తారు!" అంది సౌందర్య.
"రానీవే, వచ్చిన వాళ్ళలో ఎవరైనా అందగాడుంటే పెళ్ళి చేసుకుందువుగానీ!" అంది విజయ.
"అబ్బ! రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదన్నట్లు ఎక్కడికి వచ్చినా నీ పెళ్ళి గొడవేనా?" విసుక్కుంది గీత.
"గీతా, అందమైన అమ్మాయిల ఆలోచనలు ఎప్పుడూ పెళ్ళి చుట్టూ తిరుగుతూనే వుండాలి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా చూసుకో తగిపట్టి సౌందర్య వరుని, అన్నది మన ఏకైక స్లోగన్." అంది విజయ.
"ఏడ్చినట్టే వుంది!"
వినయ మాటలకి కస్సుమంది సౌందర్య. "శుభమా అంటూ పెళ్ళిమాటలు అంటూ వుంటే ఏడ్చినట్టుగా వుందంటావా రాస్కెల్! పల్లెటూళ్ళంటే ఏమిటనుకున్నావ్? అందానికి నిలయాలు. అనందానికి ఆలయాలు. సిరిసంపదలకి నెలవులు, మంచితనానికి....యింకేం చెప్పాలబ్బా? పరీక్షలతోనే తెలుగు మరిచిపోయాను....ఆఁ కొలువు కూటాలు....కాబట్టి ఓ బేల! ఇక్కడికి వచ్చింది కేవలం కాలక్షేపానికే కాదు. తగిన మొగుడినీ వెదుక్కోవాలి నువ్వు. ఈరోజుల్లో పెళ్ళంటే ఎంత కష్టం? మనం వరుడిని వెతుక్కుంటే మనవాళ్ళకీ సులువుగా వుంటుంది. ఏమంటారెర్రా మీరంతా? నేను రైటా? వినయ రైటా? చెప్పండి?"
"ఇదేం తెలుగు సినిమానా? లేకపోతే నవలనా? పల్లెటూరికి వస్తే పెళ్ళి కొడుకులు దొరికిపోవటానికి. ఇది తెలుగు జీవితం...మనం మన సాంప్రదాయం వేరు. చూసెయ్యగానే ప్రేమించలేం. ఇష్టపడినా పెద్దలు రావాలి. చూడాలి అంగీకరించాలి. కట్న కానుకలు మాటాడుకోవాలి. తర్వాత ముహూర్తాలు." ఆరిందలాగా చెప్పింది వినయ.
"ఓసోస్ ముసలమ్మ కబుర్లు చెప్పొద్దు. నువ్వు చెప్పింది అర శతాబ్దం క్రిందటి మాట. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యటం భారమై పోయి ప్రేమించి పెళ్ళి చేసుకోమని చెపుతున్నారు తెలుసా?" అంది విజయ.
తల పట్టుకుని కూర్చుంది స్వప్న.
"ఏమ్మా తలనొప్పా?" కొంటెగా అడిగింది సౌందర్య.
"కాదే విరహం!" కవ్వింపుగా అంది గీత.
"అరె రే! అదయితే డేంజరే! నా మాట విని వెంట తామరాకు బెడ్డింగ్ ఏర్పాటు చేయండి! శైత్యోపచారాలు చేస్తేనే కానీ అది తగ్గిపోదు!" అంది సౌందర్య నవ్వుతూ.
"అబ్బా!" గట్టిగా అరిచింది స్వప్న.
"ఏమమ్మాయ్?"
"ఇదిగో ఇటు వినండి! నాకెందుకో మనస్సు బాగాలేదు. అనవసరంగా చికాకు పుట్టుకొస్తుంది. ఏడ్చేద్దామనిపిస్తోంది. గట్టిగా కేక వెయ్యాలనిపిస్తోంది కాబట్టి దయచేసి కొంచెం సేపు అందరూ నిశ్శబ్దంగా వుండండి."
అంతా గప్ చిప్ మని మౌనంగా వుండిపోయారు.
నిమిషం తర్వాత కాఫీ పట్టుకుని వచ్చింది వినయ.
"థాంక్స్!" అని కాఫీ అందుకుని తాగేసి అలసటగా కుర్చీలో వాలిపోయింది.
సౌందర్య మెల్లిగా ఆమె దగ్గరికి వచ్చి "అంతా పాడు చేశావే! మూడ్ చెడిపోయింది నీ సీరియస్ నెస్ తో. అసలు పిక్నిక్ ఛార్మ్ పోయింది." అంది దిగులుగా.
ఫక్కున నవ్వింది స్వప్న. కొంటెగా కను చివర్లనుంచి చూసింది.
"అమ్మ హీరోయినూ!" కళ్ళు పెద్దవిచేసి గుండెలపై చేయి వేసుకుంటూ అంది సౌందర్య.
"ఏమిటీ?" అడిగింది గీత.
"చూశావా దీని పోజు! ఊరికే దబాయించి మనల్నందర్నీ హడల గొట్టేసింది."
మళ్ళీ ఫక్కున నవ్వింది స్వప్న. "కాకపోతే ఏమిటే ఎప్పుడూ ఆ కబుర్లు? మరో యావలేనట్టు, మరో విషయం లేనట్టు ఎప్పుడూ పెళ్ళి కబుర్లేనా?"
"హుఁ చూపించావు కధే టెక్కు?"
"ఏమిటే విజయా?" అడిగింది గీత.
విజయ ఏదో సమాధానం చెప్పబోయింది.
అంతలో తోటమాలి శివయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు పైకి. అతని వెంటే మణి కూడా వచ్చాడు. ఇద్దరి ముఖాల్లోనూ సీరియస్ నెస్.
