Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 29


    ఇన్నాళ్ళూ, తనకంట బడకుండా ఎక్కడ ఉంది కామాక్షి? ఇవాళ అకస్మాత్తుగా ఎలా తనకంట బడింది?
    చాలా అసహజంగా ఉంది ఇదంతా!
    ఏదో చెప్పలేని గుబులు ఆమె నరనరాల్లో జరజరపాకింది.
    కానీ కామాక్షికి ఇవేవి పట్టడంలేదు. తనఎదుట ఉన్న తినుబండారాల రంగూ, రుచీ, సువాసనా తప్పమరేమీ ఆమె మనసుకెక్కడంలేదు.
    ఆవురావురుమని అన్నీ తినెయ్యడం మొదలెట్టింది దొంగతనంగా ఇంట్లో దూరి పాలూ, పెరుగూ తాగేస్తున్న పిల్లి పిల్ల మధ్యమధ్య భయంభయంగా తలఎత్తి చూస్తున్నట్లు చూస్తోంది తను. జీడిపప్పు పాకం మొత్తంనోట్లో పెట్టుకుని ఆబగా నమిలేసింది. రెండు మినపసున్ని ఉండలు ఆత్రంగా నోట్లో కుక్కేసుకుంది.
    చిక్కిపోయిన ఆమె చెంపలు ఇప్పుడు మినపసున్ని ఉండలతోలావుగా కనబడుతున్నాయి!
    అప్పుడు ఉన్నట్లుండి తలుపు తెరిచిన చప్పుడయింది!
    సృజనపై ప్రాణాలు పైనే పోయాయి.
    అహల్య వచ్చేసిందా?
    తలుపు చప్పుడవడంతోబాటు అహల్య గొంతు కూడా వినబడింది.
    "అరే ఉస్మాన్! రంగేలీ! ఎక్కడచచ్చార్రా అందరూ?"
    "మూలికలు కొన్ని అవసరమై మార్కెట్ దగ్గరకి వెళ్ళి వస్తున్నా అక్కా?" అంది అప్పుడే లోపలికివచ్చిన రంగేలీ.
    ఆతర్వాత క్షణంలోనే వినబడింది ఉస్మాన్ గొంతు "పిలిచావా అక్కా?" అంటూ.
    ఇదంతా అసహజంగా అనిపిస్తోంది సృజనకి. నాటకంలో పాత్రలు, ముందే రిహార్సర్ చేసుకున్న ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి రంగ ప్రవేశం చేసినట్లు....
    ఏమిటిది? ఏం జరుగుతోంది?
    "అమ్మయ్యో! వాళ్ళొచ్చేస్తున్నారు! ఇవన్నీ చూస్తే..." అంటోంది కామాక్షి ప్రాణభయంతో.
    ఒక్క ఉదుటున ఆమె చేతిలోని తినుబండారాల పళ్ళేన్ని లాగేసుకుంది సృజన. ఏమీ ఎరగని దానిలా జీడిపప్పు పాకం మునిపంటితోకొరుకుతూ ముందు గదిలోకి వచ్చింది. లోపలికి వస్తూనే సృజన వైపు మురిపెంగా చూసింది అహల్య. తర్వాత ఆమె చూపులు సృజన చేతిలోని ప్లేటుమీద పడ్డాయి.
    "ఇప్పుడు చిరుతిండి తింటున్నావేమమ్మా! ఆకలి పోదూ! ఒకేసారి భోజనం చేసెయ్యకపోయావా? వేళతప్పిన భోజనం వంటికిమంచిదికాదు" అంది.
    "బాగా ఆకలేసింది" అంది సృజననీ వినబనట్లు.
    "ఓసిపిచ్చిపిల్లా!" అంది అహల్య సృజనని దగ్గరికి పొదుపుకుంటూ, నువ్వు ఆకలితో ఉండడం నేను చూడలేనమ్మా! ఒకరోజు నేను ఇంట్లో ఉంటాను. ఉండకపోతాను. ఇంట్లో తినడానికేమైనా ఉంటుంది. ఉండకపోతుంది. అందుకని, నీ దగ్గరే ఎప్పుడూ ఏదన్నా ఉంచుకుంటూ ఉండు. చాక్లెట్లు ఇష్టమేనానీకు?"
    "వద్దు" అనబోయి ఆగిపోయింది సృజన. ఆమెకి ఆకలితో నకనకలాడిపోతున్న కామాక్షి గుర్తొచ్చింది.
    "ఇష్టమే!" అంది అస్పష్టంగా.
    ఉస్మాన్ వైపు తిరిగింది అహల్య.
    "అమ్మాయికి చాక్లెట్లు కావాలిట! పెద్ద పెద్ద చాక్లెట్ బార్ లు ఉంటాయి చూడు! అవి తీసుకురా! రకానికొకటి! ఓ పదో పదిహేనో!"
    ఉస్మాన్ తలవూపి బయటికివెళ్ళాడు.
    "సంగీతం పాఠం బాగా నేర్చుకున్నావా?" అంది అహల్య సృజనతో.
    "ఇప్పటిదాకా నేర్పిస్తూనే ఉన్నాను" అన్నాడు సుబ్రహ్మణ్యం, సృజన పెదవి విప్పే లోపలే అందుకని "మంచి గాత్రం ఉంది అమ్మాయికి."
    "లతా మంగేష్కర్ తర్వాత మళ్ళీ మీ అమ్మాయేనని చెప్పుకోవాలి జనం!" అని తల ఎగరేసి, నవ్వింది అహల్య "పదమ్మా! లోపలికెళదాం!"
    లోపలికి వెళ్ళేముందు ఓరగా ఒక్కసారి కామాక్షి ఉన్న గదివైపు చూసింది అహల్య.
    ఒక్కచూపు! అంతే!
    జరిగినదేమీ అహల్య గమనించలేదని అర్ధమయ్యాక పోయిన ప్రాణాలు తిరిగివచ్చినట్లయింది సృజనకి!
    వాళ్ళులోపలికెళ్ళిపోగానే, పళ్ళెంలో తను ఇంకా తినకుండా మిగిలిపోయిన ఫలహారాలు తలుచుకుని నిస్పృహగా నిట్టూర్చింది గదిలో ఉన్న కామాక్షి.
    ఇంకొంచెం తొందరగా తినేసి ఉండవలసింది తను. ఆకలి ఇంకా తీరలేదు తనకి.
    మళ్ళీ నోట్లో ముద్దపెట్టడం ఎప్పుడో! ఎన్నాళ్ళకో?
    తనగదిలోకి వెళ్ళివెళ్ళగానే పందిరిమంచం మీద అడ్డంగాపడుకుంది అహల్య.
    "స్స్ స్స్! అబ్బ!" అంది తలపట్టుకుంటూ. "తల పగిలిపోతోంది సృజనా! కాస్త అమృతాంజనం తెచ్చి మర్దనాచేస్తావ్?"
    మాట్లాడకుండా అమృతాంజనం సీసా తెచ్చి, అహల్య ప్రక్కన కూర్చుని మర్దనా చెయ్యడం మొదలెట్టింది సృజన.
    పదినిమిషాల తర్వాత, పెద్దపెద్ద చాక్లెట్ బార్లతో ప్రత్యక్షం అయ్యాడు ఉస్మాన్. వాటిని సృజనకు అందించాడు.
    ఒకసారి కళ్ళు తెరిచిచూసింది అహల్య. "ఆ చాక్లెట్లన్నీ నీప్లేట్లో పెట్టుకో! ఆకలేసినప్పుడు తిను! నీకెప్పుడు ఏంకావలసినా మొహమాటపడకుండా నన్ను అడుగుసరేనా?" అంది.
    తలవూపింది సృజన.
    మళ్ళీకళ్ళు మూసేసుకుంది అహల్య. సృజన మృదువుగా వేళ్ళతోనుదుటి మీద రాస్తుంటే ఆమెకు నిద్రపట్టేసింది.
    మర్దన చెయ్యడం ఆపి, ఒకసారి అహల్యవైపు చూసి, తర్వాత చెవులు రిక్కించి వింది సృజన.
    ఇంట్లో సందడి వినబడటంలేదు. నిశ్శబ్దంగా ఉంది. బహుశా అందరూ కునుకుతీస్తూ ఉండి ఉండొచ్చు. ఆ ఇంట్లో అది మామూలే? చాలామంది రాత్రంతా మేలుకుని పగలంతా జోగుతూ ఉంటారు.
    అలికిడి కాకుండా లేచి, నెమ్మదిగా కామాక్షి గదిలోకి వెళ్ళిపోయింది సృజన.
    ఆమెనిచూసి సంతోషంగా ఏదో అనబోయింది కామాక్షి.
    "ష్!" అని పెదిమల మీదవేలుపెట్టుకొని వారించింది సృజన. "ఇవిగో! చాక్లెట్లు! దాచుకుని ఆకలేసినప్పుడు తింటూ ఉండు. వీలైనంత త్వరలో మళ్ళీ ఏవైనా...."
    దూరంగా అగ్గిపుల్ల వెలిగించిన సవ్వడి.
    ఉస్మాన్ బీడీ అంటించుకుని ఒక కాలు ఈడుస్తూ నడవటం మొదలెట్టాడు.
    ప్రాణాలుగ్గబట్టుకుని చూస్తున్నారు సృజన, కామాక్షీ.
    ఉస్మాన్ అడుగుల చప్పుడు దగ్గరై, మళ్ళీ దూరమైపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS