"ఏదో మీ అభిమానం....మీరు మంచి మొగుడు కాబట్టి, వచ్చే జన్మలో 'గోప్పమొగుడు' నాకు దొరకాలన్న కోరికను మనస్పూర్తిగా ఆశీర్వదించారు. ఈ వారం పాదపూజ చేయనీయండి" అంది భువన.
త్రిలోకం సిక్త్స్ సెన్స్ ఏదో హెచ్చరించింది.
అతను జరగబోయే ప్రమాదం ఉహించకముందే , జరగవలసిన డామేజ్ జరిగింది.
సోఫా మీద పెట్టిన అతని పాదాలను ఒడుపుగా కిందకి లాగి, కిరోసిన్ బేసిన్ లో పాదాలను ముంచేసింది.
"ఒసే పతివ్రతా.....ఏం చేస్తున్నావే...." అనేలోగా కిరోసిన్ తో పాదాలను కడగసాగింది.
"నీయమ్మ కడుపు మాడ" అంటూ పాదాలను పైకి లాక్కోబోయాడు.
"హమ్మ.....ఆశ.....కిరోసిన్, హారతి కర్పూరం....పాదపూజ చేయకుండానే కాళ్లు లాక్కుందామనే....." అంటూనే ప్లేటులో వున్న హారతి కర్పూరాన్ని, అగ్గిపుల్లతో వెలిగించబోయింది.
"ఏం చేస్తున్నావే?" కంగారుగా, భయంగా అడిగాడు త్రిలోకం.
"హారతి కర్పూరం వెలిగించి ......మీ పాదాలకు హారతి ఇద్దామని...."
కిచుగా అరిచాడు త్రిలోకం.
"నీ పతి భక్తీ పాకిస్తాన్ సరిహద్దుల్లో కాపలా పెట్టా, నువ్విలా కిరోసిన్ లో తడిసిన నా పాదాలకు హారతి ఇస్తే ఆ తర్వాత నా పాదాలు, బాడీ కాలిపోయి బూడిద మిగుల్తుందే" మొత్తుకున్నాడు త్రిలోకం.
"నిజమా? అయితే అవనివ్వండి" అంటూ లేచి సీలింగ్ ప్యాన్ వంక చూస్తూ-
"అదేగనక జరిగితే నా పాతివ్రత్యంతో బూడిదైన మిమ్మల్ని రక్షించుకుంటాను. ఇదే నా శపథం" అంది పిడికిలి బిగించి చేయి పైకెత్తి.
తలని సోఫా కేసి కొట్టుకుని "ఒసే భువనా! అదిగో పూజగదిలో నుంచి ఎవరో దేవుడు పతివ్రతా శిరోమణి అని పిలుస్తున్నాడు. వెళ్ళవే" అన్నాడు.
"నిజమా! చూసారా! దేభ్యపు మొహమేసుకుని మీరు గుర్తించలేదు గానీ ఆ దేవుడు గుర్తించి పిలుస్తున్నాడు. ఆ! దేవా! వస్తున్నా?" అంటూ పూజగదివైపు వెళ్లింది.
"వెళ్ళు. వెళ్ళవే మొగుడ్ని కిరోసిన్ తో కడిగి హారతి తో తగలబెట్టాలన్న నీ పతివ్రత్యపు ఆలోచన మెచ్చుకుని రవీంద్రభారతిలో శాలువా కప్పి సన్మానం చేయిస్తాడు" కచ్చగా అని బాత్రూం లోకి పరుగెత్తాడు కాళ్ళు కడుక్కుందామని.
లేకపోతే ఏదో ఒక టైంలో హారతి ఇస్తానని తన కాళ్ళకు నిప్పు అంటించడం గ్యారెంటి అని అర్ధమైంది త్రిలోకానికి.
* * *
నారదుడు యముడు భూలోకం వచ్చారు.
చిత్రగుప్తుడు 'నేను వృద్దుడినైపోయాను, మీరు పదేపదే నన్ను కోపగిస్తే ఝడుసుకు చస్తానని" అనడంతో చిత్రగుప్తుడి అభ్యర్ధన మేరకు నారదుడు యముడితో కలిసి భూలోకం వచ్చాడు.
"ఆహా నారదా! భూలోకమెంత సుందరంగా వున్నది. ఎన్ని భవనములు, మరిన్ని చిత్ర విచిత్ర వాహనములు మిక్కిలి చక్కగునున్నది" అన్నాడు.
"మీకు కొత్త గానీ నాకు కొత్త కాదు సమవర్తి. త్రిలోక సంచారమే కాదు, అడపాదడపా భూలోక సంచారము చేస్తున్నా, జిహ్వా చాపల్యమును తీర్చుకోవలెనన్న భూలోకమే పసందు."
"అదేమీ ......మన సురకన్నా మన అమృత ఫలముల కన్నా రుచికరముగా నండునా?"
"అయ్యో సమవర్తి! మిమ్మల్ని పరలోకమునకు అధిపతిని చేసి నరకమునకే పరిమితం చేసారు. అన్నీ లోకములు దర్శించు అవకాశము లేనివారు స్వర్గలోకములను మించిన లోకములు వున్నవి?" నారదుడు అన్నాడు.
"అటులనా , అదియును చూచుదుము తమరి ఆశీర్వాదం చేత."
"అందులకు నా ఆశీర్వదమేల సమవర్తి. ముందు మనమీ దేశ భాష మానవలయును. లేకున్న మానవులు మనల్ని తరిమికొట్టేదరు."
"అటులనా......అటులైనచో మీరు చెప్పినటులే కానిద్దాం" అంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు.
మాములు భాష అతని స్వరపేటికను చేరుకుంది కొద్ది క్షణాల తర్వాత కళ్ళు తెరిచి.
"నారద మహర్షి! ఇప్పుడు నా భాషకేమి ఇబ్బంది లేదు కదా. ఈ మానవుల భాష కడు విచిత్రంగా తోచుచున్నది ఏమంటారు మహర్షి. యామై కరెక్ట్" దర్పంగా అడిగాడు యమధర్మరాజు.
"ఆహా! అచ్చ తెలుగులోను, ఆంగ్లములోనూ బహు చక్కగా ముచ్చటించుచుంటిరి. భేషుగ్గా వుంది. అల్ ద బెస్ట్ యమధర్మరాజు!" అన్నాడు నారదుడు.
"ఏమి......మీరు కూడా?" ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టడు యమధర్మరాజు.
"తప్పదు సమవర్తి!" చిరునవ్వుతో అన్నాడు నారదుడు.
* * *
"మహర్షి! అదేమిటో క్షుద్భాధ కలుగుచున్నది."
"దాన్ని ఆకలి అందురు."
"ఏదో ఒక రోకలి"
"రోకలి కాదు సమవర్తి. ఆకలి"
"అదియే ఇప్పుడెలా?"
"ముందు మనమొచ్చిన పని పూర్తీ చేసుకుని వెళ్ళాలి కదా."
"పని తరువాత. రోకలి.....కాదు కాదు ఆకలి మందు" అన్నాడు యమధర్మరాజు కడుపును చేత్తో పట్టుకుని.
"ఔరా వాతావరణ ప్రభావం. భూలోకమునకు రాగానే క్షుద్భాధ తెలియుచున్నది" అనుకుంటూ "ఔరౌరా.......నాకునూ ఆకలి బాధ వేయుచున్నాదే" అనుకున్నాడు నారదుడు తనూ కడుపు చేత్తో పట్టుకుని.
"ఎవరైనా గృహస్తుడ్ని ఆతిధ్యం ఇవ్వమని అడుగుదామా?" యమధర్మరాజు అన్నాడు.
"పిచ్చి యమధర్మరాజా! ఇది భూలోకము, అందునా రాజుల కాలం కాదు. కలికాలం ఇది. మీరు ఎప్పుడో రాయల వారి సమయాన భూలోకం వచ్చి వుంటారు. లేదా త్రేతాయుగంలో వచ్చి వుంటారు. ఇచ్చట ఉచితంగా ఏది లభించదు."
"ఏమేమి......యముండ.....మాకే ఆతిధ్యం లభించదా?"
"మీకు ఇంకా ఈ లోక విశేషములు తెలియచున్నవి. అది నీ ప్రారభ్ధం."
"ఏమి?"
"ఏమిలేదు సమవర్తి. మీ ఆకలి తీరు మార్గం నేనాలోచిస్తాను. కొద్ది క్షణములు ఓపిక పట్టుడు" అన్నాడు.
వాళ్ళిద్దరూ టాంక్ బండ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. తంబురతో నారదుడు, గదతో యమధర్మరాజు రోడ్డుమీద నడుస్తుంటే జన్మ వింతగా చూస్తున్నారు.
రోడ్డుమీద వెళ్ళే ఓ వ్యక్తీ వీళ్ళ వైపు చూసి దగ్గర కొచ్చి "ఏ కంపెని తమది?" అడిగాడు.
