Previous Page Next Page 
అష్టపది పేజి 29

 

    "రేపు నిన్ను బైటికి తీసుకు వెళతాను" తనకు తానుగా అన్నాడు లోకేశ్వరరావు.
    
    "నిజంగా?"
    
    "నిజంగా నిజం"
    
    "ష్యూర్?"
    
    "ష్యూర్ అంటే ష్యూర్!"
    
    "అంకుల్!"

 

    "ఊ"
    
    "నాకు చాలా అనుమానాలు వస్తూ వుంటాయి.
    
    అవన్నీ అడగనా?"    

 

    "అడగటం చాలా తేలిక గాబట్టి నిక్షేపంగా అడుగు"
    
    "ఈ ఇల్లుగాక మరో ఇల్లు లేదా అంకుల్?"
    
    "మరో ఇల్లు అంటే."
    
    "మీకు సొంత ఇల్లు."
    
    "ఇది నా సొంత ఇల్లే కదా!" 

   

    "అబ్బా! ఏదడిగినా మీకు ఓ పట్టాన అర్ధం కాదు అంకుల్!"
    
    "నిజంగా అర్ధం కాలేదమ్మా!"
    
    "ఇది మీ సొంత ఇల్లే కావచ్చు. సముద్రం గాలి వేయటానికి ఇది ఇక్కడ కట్టారు. ఇక్కడ రూమ్స్ లో సంసారానికి సంబంధించిన సామాన్లు లేవు..."
    
    శీతల్ మాట పూర్తి చేయకముందే లోకేశ్వరరావు అడ్డు తగిలి "అమ్మయ్య, ఇప్పటికి అర్ధం అయింది మొద్దు బుర్రకి" అన్నాడు చాలా తేలిగ్గా నవ్వుతూ.
    
    "అర్ధమైందా అయితే అదేదో మీరే చెప్పండి అంకుల్!" అంది శీతల్.
    
    "నాకు ఒక యిల్లు కాదమ్మా పదిళ్ళున్నాయి.
    
    "ఆ అంకుల్! పదిళ్ళంటే పది సంసారాలు"
    
    "ఛా....ఛా.....నేనేమన్నా అరబ్ షేక్ నా,  ఫామిలీలు పెట్టుకోటానికి! డబ్బు వుంది. ఇళ్ళు, ఫ్యాక్టరీ రకరకాల బిజినెస్ లు అలా అన్నమాట- మీ అత్తయ్య అంటే నా భార్య పోయింతర్వాత మళ్ళీ పెళ్ళిమాట పెట్టలేదు. ఆడదాని ముఖం చూడలేదు."
    
    "అత్తయ్య పోయి ఎన్నాళ్ళయింది అంకుల్!"
    
    "ఎన్నాళ్ళు కాదు ఎన్నేళ్ళయింది అని అడుగవచ్చు మీ అత్తయ్య శాశ్వతంగా నాకు దూరం అయి ఇంకో నెలకి సరీగా పదేళ్ళు అవుతుంది. మితిమీరిన ఐశ్వర్యం వుండి కూడా భార్యని రక్షించుకోలేకపోయాను."    
    
    "విచారించకండి అంకుల్! పుట్టడం గిట్టటం అన్నవి మనచేతుల్లో లేదు కదా!"
    
    "నిజమే" తలాడించాడు లోకేశ్వరరావు.
    
    "మీకంటూ ఇంకెవరూ లేరా అంకుల్?"
    
    "ఉన్నారు."
    
    "ఉన్నారా! వాళ్ళంతా పిల్లలా! మరింకెవరైనా వాళ్ళని నాకు చూపించరా!" చిన్న పిల్లలా సంతోషపడిపోతూ అడిగింది శీతల్.
    
    "ఒక్క వారం ఓపికపట్టు."  

 

    "దేనికి?"
    
    "నా ఇల్లు నా అనేవాళ్ళని చూపిస్తాను."    

 

    "వారం ఆగటం దేనికి! వాళ్ళంతా ఏదయినా ఊరువెళ్ళారా?"
    
    "ఉహూ! కారణాలు అడగవద్దు వారం ఆగమన్నా కదా!"
    
    "సరీగ వారం అంతేనా?"    

 

    "అంతే"
    
    "సస్పెన్స్ అన్నమాట!"
    
    "ఎస్ సస్పెన్స్  ఫుల్ సస్పెన్స్" లోకేశ్వరరావు నవ్వుతూ అన్నాడు.
    
    శీతల్ ఫక్కున నవ్వింది.
    
    "ఓ.కె." అంది ఆమె.
    
    "నేను నా మనిషిని మీ ఇంట్లో నౌకరుగా పెట్టాను. దానివల్ల మీ ఇంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు నాకు తెలుస్తున్నాయి."
    
    "చాలా మంచి పని చేశారు అంకుల్! కాని మా డాడీ కొత్తవాళ్ళని నమ్మరు. పనిలో పెట్టుకోరు కదా!" శీతల్ అనుమానం వ్యక్తం చేసింది.    
    
    లోకేశ్వరరావు నిజంగా పసివాడిని శీతల్ వాళ్ళ యింట్లో పెట్టలేదు. అదో అబద్దం. అది అబద్దం అన్నమాట శీతల్ కి తెలుసు. కాని నమ్మినట్లు నటించాలి. మరీనటించినా బాగుండదు. అతి తెలివి ప్రదర్శిస్తూ ఉండాలి. అలా అయితే తన మీద ఏ అనుమానం రాదనే శీతల్ అలా ప్రవర్తిస్తున్నది.  

 

    "శీతల్! మీ డాడీ చాలా తెలివికల వాడినని అనుకుంటుంటాడు అంతే. మీ డాడీ కన్నా, నీ ఈ అంకుల్ తెలివికలవాడు. ఉపాయంగా మనిషిని మీ ఇంట్లో ప్రవేశ పెట్టాను."
    
    "ఊ...తర్వాత...?"
    
    "తర్వాత ఏముంది? గొప్పింటి వాళ్ళ గోత్రం పనివాళ్ళ కెరుక అని ఓ సామెత వుంది. ముఖ్యంగా యింట్లో ఏం జరుగుతున్నది అన్న విషయం ఇరుగుపొరుగుకు తెలియకపోవచ్చు, స్నేహితులకి, బంధువులకి తెలియకపోవచ్చు,  కాని ఆ యింటి నౌకర్లకి తప్పక తెలుస్తుంది అలాగే నేను మీ ఇంట్లో ప్రవేశపెట్టిన నౌకరు కి చాలా విషయాలే తెలిశాయి."    

                                                            *    *    *
    
    "ఈరోజు మనం బైటికి వెళుతున్నాము."
    
    లోకేశ్వరరావు చెప్పంగానే "హొయ్ హొయ్ అని ముందు సంతోషం వ్యక్తంచేసి ఆ తర్వాత ఆనందంగా ముఖంపెట్టి "నిజంగానేనా అంకుల్!" అంది శీతల్.
    
    "నిజమో అబద్దమో నీవే చూస్తావు కదా!"
    
    "మరి నన్నెవరైనా గుర్తుపడితే?"    
    
    "పట్టరు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS