ఆమె అతనివైపు పరిశీలనగా చూసి "పదిరోజుల్లో లక్ష రూపాయలు సంపాదించావ్- అదీ ఈ చిన్న పల్లెటూళ్ళో అంత తెలివైన వాడివి ఎందుకీ వూర్లో పడి చావడం?" అంది.
"చావడం అనకండి నిజంగా బతికున్న క్షణాలు ఇవే. నేను వున్నానన్న ఫీలింగ్ లేకుండానే చాలామంది బతికేస్తుంటారు. నేను మీకు కనిపించేవరకు అంతే మిమ్మల్ని చూసిన క్షణంలోనే నా అస్తిత్వం నాకు తెలిసింది. భగవంతుడి దర్శనమయ్యాక మనం మాయమై పరమాత్మలో ఐక్యం అయిపోతాం. అయితే అందుకు విరుద్దంగా నేనెవరో నాకు తెలిసింది. నా గమ్యం ఏమిటో నాకు బోధపడింది. నాకేం కావాలో నాకు తెలిసింది"
"వచ్చిన లాభాన్ని రైతులకు పంచేశావట. డబ్బంటే అంత చేదా?"
"డబ్బు విలువ తెలిసినవాడ్ని కనుకే దాన్ని త్యజించగలిగాను. మీరు తప్ప మరో ప్రపంచం లేనివాడికి ఈ డబ్బు ఎందుకు చెప్పండి!"
అలా మాట్లాడుతున్న వాడికి ఏం సమాధానం చెబుతుంది? అందుకే మౌనంగా వుండిపోయింది.
పందెంలో గెలిచాడు కదా మరి ఏం కావాలో ఎందుకు అడగడం లేదు. మరిచిపోయాడా? లేక తను ఆ విషయం ఎత్తడం బాగుండదని మానేశాడా? విషయం ఏమిటో తెలియకపోతే టెన్షన్ తగ్గదు. మామూలుగా అయితే తను రాత్రి తొమ్మిదిగంటలకే ముసుగుదన్ని పడుకునేది. కానీ ఇప్పుడు పదకొండు దాటుతున్నా నిద్ర రావడం లేదు. కాబట్టి తనే అడిగేయాలనుకుంది.
"పందెంలో నువ్వు గెలిస్తే నువ్వడిగింది నేను చేయాలి అన్న షరతు విధించుకున్నాం కదా మరి నీవు ఆ వూసే ఎత్తడం లేదు"
అతను చిన్నగా నవ్వాడు.
"మీరు ఓడిపోయారు అన్న విషయాన్ని గుర్తు చేయడం నాకిష్టం లేదు. అందుకే ఇంతవరకు అడగలేదు"
ఆమెకు ఠక్కున సతీష్ గుర్తొచ్చాడు. ఇంత సున్నితంగా ఆలోచిస్తున్న ఇతన్నీ, సతీష్ నీ బేరీజు వేసుకొంది.
"నువ్వు గెలిచావు కదా అడగడం నా ధర్మం"
"అయితే నేను అడిగింది చేస్తారా?"
ఆమె ఓ క్షణం వూపిరి బిగపట్టింది.
అతను ఏం అడుగుతాడు? ఒకవేళ కోరదగనని కోరితే ఏం చేయాలి? ఆమెను సవాలక్ష అనుమానాలు పీక్కుతింటున్నాయి.
అతను తలవంచుకొని మెల్లగా చెప్పాడు "మీరు రేపు పావడా, ఓణీ వేసుకోవాలి. పెళ్ళి కాకముందు మీరెలా వుండేవారో వూహించుకోవడానికి నా కల్పనాశక్తి చాలడం లేదు. అందుకే మీరా డ్రస్ లో రేపు సాయంకాలం ఓసారి కనిపిస్తే చాలు"
ఆరోజు కార్తీక సోమవారం ఊరు ఊరంతా హడావుడిగా వుంది. ఉదయం లేస్తూనే అందరూ తలస్నానాలు చేశారు. దేవుడి ముందు పండో ఫలహారమో పెడ్తారు.
కొందరు టౌన్ కి బయలుదేరారు. అక్కడయితే శివుని దర్శనంతో పాటు ఓ సినిమాను కూడా చూసిరావచ్చు. మరికొందరయితే పిక్నిక్ స్పాట్ లో వున్న దేవాలయాలను సందర్శించడానికి బయలుదేరారు. వాళ్ళు తలకోనకో, కైలాస కోనకో ప్రయాణం కట్టారు.
అంతదూరం వెళ్ళడానికి వీల్లేని వాళ్ళు పక్క వూర్లో వున్న శివాలయానికి వెళ్ళి సంతృప్తి చెందుతారు. పక్కవూరే కాబట్టి సాయంకాలం అలా షికారెళ్ళినట్టు వెళ్ళి వచ్చేస్తారు.
లిఖిత తలారా స్నానం చేసి షెడ్ లో వచ్చి కూర్చుంది. ఒద్దంటున్నా జితేంద్ర గుర్తొస్తున్నాడు.
పందెంలో గెలిచినప్పుడు కోరిన కోరికను ఆమె ఇంకా తీర్చలేదు. పెళ్ళికి ముందు తాను ఎలా డ్రస్ చేసుకొనేదో అలా డ్రస్ చేసుకొని కనపడాలి. గుడ్డిలో మెల్లగా ఆ కోరిక కోరాడు. అదే మరేదయినా కోరి వుంటే తన పరిస్థితి ఏమిటి?
ఈరోజు అతను కోరిన విధంగా డ్రస్ చేసుకొంటే ఓ సమస్య తీరిపోతుంది. ఆ తరువాత తనకి దూరంగా వుండొచ్చు. లేకుంటే ఇదేమిటి ఇలా అర్ధం పర్ధంలేని కోరికలు కోరడం?
పావడా, ఓణీ వేసుకొని కనపడాలట. అందులోనూ రెండు జడలతో, ఆ విధంగా డ్రస్ చేసుకొని ఊర్లో జనానికి ఎలా కన్పించడం? ఆ డ్రస్ తో తనని చూసి రకరకాలుగా కామెంట్లు చేస్తారు. వెధవ అని తనలో తానే విసుక్కొంది లిఖిత.
ఏది ఏమైనా మాట తప్పడం నీచం. ఆరోజు పందెం వేయకుండా వుండాల్సింది. కానీ ఏదో తెలియని ఆవేశంలో అలా నోరు జారింది. ఇప్పుడు వెనక్కి తగ్గడం బావుండదు, అతను కోరినట్టు పావడా, ఓణీ వేసుకొని కనిపించాలి.
ఈరోజు కార్తీక సోమవారం కనుక అలా శివాలయం వరకు వెళ్ళి రావచ్చు. మార్గమధ్యంలో ఎక్కడయినా అతను చూడవచ్చు. ఈరోజు తాను అతను కోరినట్టు డ్రస్ చేసుకోబోతున్నానని ఎలా తెలియజెయ్యడం? దానికి ఏదో ఒక మార్గం ఆలోచించవచ్చు. ముందు పావడా కుట్టించుకోవాలి.
ఆమె అక్కణ్నుంచి లేచి ఇంట్లోకి వచ్చింది. పావడాగా కుట్టించడానికి ఏదో ఒక గుడ్డ కావాలి. సరయినది ఒక్కటీ కనిపించడం లేదు.
చివరికి బాంబేడయింగ్ బెడ్ స్పైడ్ కనిపించింది. అది పాతదే అయినా కొత్తగా కన్పిస్తుంది.
ఓణీగా వేసుకోవటానికి జార్జెట్ బట్టనొకదాన్ని సంపాదించింది. బెడ్ స్పైడ్ ను తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళింది.
ఆమె వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది అమ్మాయిలున్నారు.
పద్మావతి తను తెచ్చిన ప్యాకెట్లు నుంచి ఒక్కో చీర తీసి దానికి ఏం పని చేయాలో టైలర్ కి వివరంగా చెబుతోంది.
"ఇదిగో ఈ కాటన్ చీరకి ఫాల్స్ కుట్టాలి. ఈ జాకెట్టుకి రెట్టల చివర పూసలు కుట్టాలి. ఈ చీరకు ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలి"
పద్మావతికి మరో వారం రోజుల్లో పెళ్ళి అంతకు ముందురోజే టౌన్ కి వెళ్ళి బట్టలు తెచ్చుకొంది.
"ఎంతో కష్టపడి చీరకి, జాకెట్టుకి నగిషీలు చేయిస్తున్నావు. పెళ్ళయిన మొదట్లో నగిషీ చీరలు కట్టుకోవడం కన్నా నగ్నంగా కనిపిస్తేనే మొగుడు సంతోషిస్తాడు" ఆమెకు తోడుగా వచ్చిన సరస్వతి కామెంట్ చేసింది.
అది నిజమో, లేక వుడుకుమోతుతనమో తెలియని పద్మావతి ఓ చిరునవ్వు నవ్వి వూరుకుంది.
ఆమె చెప్పడం పూర్తిచేశాక లిఖిత టైలర్ తో "నాకు ఓ పావడా కుట్టాలి. అదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఇచ్చెయ్యాలి" అంది.
"పావడానా! ఎవరికీ?"
అతను ఆశ్చర్యపోయి అడిగాడు.
"నాకే"
అతనికి నోట మాట రాలేదు.
