అయిదు నిముషాలు గడిచాయిగాని ఎవరూ ఆటు రాలేదు. ఇక మిగిలింది తనే. తనే ఇంట్లోకి వెళ్ళడం. ఆంత రాత్రి అలాంటి స్దితిలో వెళ్ళడం ఇష్టంలేకపోయింది.
మరో ఐదు పది నిముషాలు చూద్దాంలెమ్మని నిలుచున్నాడు.
దాసు ఇంట్లోంచి ఎలాంటి అలికిడి లేదు. లైట్ మాత్రం వెలుగుతోంది. శ్రీరామనవమిలాంటి ఉత్సవాలు ఉన్నప్పుడైతే పదకొండు గంటల వరకు ఎవరో ఒకరు జనం తిరుగుతుంటారు. మామూలుగా అయినా పది గంటల వరకు ఎవరో ఒకరు అటూ యిట తచ్చాడుతూ వుంటారు. ఈ రోజేమిటో ఎవరూ రావడంలేదు.
అతను అసహనంగా నిలబడ్డాడు.
బీరు ప్రభావం కూడా తగ్గింది. ఇంతకు ముందున్న కిక్ ఇప్పుడు లేదు. ఉత్సాహం మాత్రం అలాగే వుంది.
అతను ఓ నిర్ణయానికి వచ్చినట్టు కదిలాడు. ఇంటి లోపలికి వెళ్ళాడు.
తలుపు దగ్గిర నిలబడ్డాడు.
ఏమని పిలవాలో కూడా ఓ క్షణం తట్టలేదు.
"దాసు...దాసూ...." పిలిచాడు.
తలుపు తెరుచుకొని ఉమ వచ్చింది. . కంగారుగా , ఎదురుగా నిలుచున్న గోపాల్రావును చూసి ఓ క్షణం సేపు ఏం పాలుపోకుండా నిలుచుని, ఆ తర్వాత "కూర్చోండి...కూర్చోండి" అంటూ తిన్నెను దులిపింది.
అతను అక్కడే చూస్తున్నట్టు ఓసారి తన పైటవైపు చూసుకుని పైట సర్దుకుంది. అది ఎప్పుడు జరిగేదే.
అలా అమె తనని ఓ యువకుడిగా అనుకుని పైట సర్దుకోవడం అయనకిట చాలా గర్వంగా వుంది. ఓసారి గర్వంగా అతను అమె ఎదవైపు చూసాడు.
నిజానికి అమె ఎద ఎలా వుంటుందంటే- తేనెపుట్టను చూస్తూనే తేనె తీపేదో మనసుకి తగిలినట్టు అమె ఎద ఎత్తూ సునుపూ కళ్ళకూ తగులుతాయి., అమె అరోగ్యం అంతా అక్కడే నిక్షిప్తమైనట్టు అవి బలంగా కూడా వుంటాయి.
"ఓ చిన్న పనిమీద వచ్చాను"
" చెప్పండి" అతను ఎక్కడ చూస్తున్నాడో పసిగట్టి పైటను మళ్ళీ సర్ధుకుంది.
అమె అలా సర్ధుకోవడం బావుంటుంది కాబట్టే అతనూ అక్కడే చూస్తున్నాడు.
ట్రాక్టర్ చెడిపోయింది. రిపేరు , దాసు లేట్ గా వస్తాడు" అని చెప్పి తిరిగి వెళ్ళడానికి కదులుతూ అంతలో చేతిలో వున్న పొట్లం గుర్తొచ్చి "ఇది ఇవ్వమన్నాడు" అంటూ చేయిచాపాడు.
అమె కూడా చేయి చాచింది. పొట్లం చిన్నది కావటం వల్లో, అతని వేళ్ళు పొడవుగా వుండటంవల్లో అమె వేళ్ళకి అతని వేళ్ళు తగిలాయి.
చిత్రంగా అతను తనలో తాను ముడుచుకుపోయినట్లు భయపడి పోలేదు. చెమట్లు పట్టలేదు. కాళ్ళూ చేతులూ వణకలేదు. కాంచనమాల దగ్గిర జరిగేది అదే.
ప్రస్తుతం దానికంటే భిన్నంగా అతనిలో నిప్పులు వి్చ్చుకున్నట్లు వెడేక్కిపోయాడు. తన విశ్వరూపం తనకే కనిపిస్తున్నట్లు ఫీలయ్యాడు. ఏదో కావాలన్న కోరిక శరీరమంతా నిండిపోయినట్లు కనిపించింది.
ఈసారి అతను అమె పైటవంక అత్వవిశ్వాసంతో చూశాడు. అయితే ఈసారి మాత్రం అమె పైట సవరించుకోలేదు.
ఆ భాగం పొంగినట్లు అతనికి కనిపించింది. అది తన భ్రమో నిజమో తెలుసు కోవడానికి మరోసారి అటువైపు చూడాలనిపించినా అమె మనసు తనకు సరిగ్గా తెలియదు కాబట్టి అక్కడి నుంచి వచ్చేశాడు.
ఉమకి గత నాలుగు రోజులుగా నలతగా వుంది. ఏమైందో తెలియదుగాని గుండెంతా పట్టేసినట్లు వుంటోంది. కడుపులోకూడా మంట. నెలరోజుల క్రింత ఆలాగే వచ్చింది. గానీ దానంతటదే పోతుందని ఊరుకుంది. ఆ తరువాత తను పట్టించుకోలేదో నిజంగా రాలేదో తెలియదుగాని దాని ద్యాస లేకుండాపోయింది.
అయితే మొన్నోరోజు ఉదయం సద్దన్నం తిన్న వెంటనే గుండెను ఎవరో వత్తేసినట్టు నొప్పిగా అనిపించింది. క్షణం సేపే అయినా ఊపిరాడనంత పనైంది.
ఇక లాభంలేదని ఆరోజు పని మానేసి రాఘవరావు కోసం కాచుక్కూర్చుంది.
రాఘవరావుకి వైద్యశాస్త్రంలో ఎలాంటి పరిచయం వుందో, దానికి సంబంధించి అతనేం చదువుకున్నాడో ఆ ఊర్లో ఎవరికి తెలియదు. అతనో గవర్నమెంటు అఫీసులో గుమాస్తా అని మాత్రం తెలుసు.,
తాను కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా మెడికల్ ప్రాక్టిషనర్ కోర్స్ చేశాననీ కాస్తంత చదువుకున్నవాళ్ళ దగ్గిర చెప్పాడు తప్ప అంతకంటే ఋజువులు లేవు.
అతను రోజూ సాయంకాలం టౌన్ నుంచి ఆ గ్రామాలకి వచ్చేవాడు. వీధి మొదట్లో ఓ మిద్దిల్లు ఉండేది. ఆ వరండాలో స్టూల్ వేసుకుని కూర్చునేవాడు.
అనారోగ్యంగా ఉన్నవాళ్ళంతా అక్కడికి వెళ్ళాలి. అతని దగ్గర స్టెత్ గానీ, బీ.పి. మిషన్ గానీ, కనీసం థర్మామీటర్ గాని వుండేది కాదు.
అంతా వాడి ద్వారానే తెలుస్తుందనేవాడు.
అతనే ఓ పెద్ద ప్లాస్టిక్ సంచీ లాంటిది ఒకటి తెచ్చేవాడు. అందులోనే మందులన్నీ వుండేవి. అందులోంచి మాత్రలు తీసి ఇచ్చేవాడెతప్ప బయట కొనుక్కోమని ఏ రోజూ ప్రిస్కిప్షన్ రాసిచ్చేవాడు కాదు. మరి దానికి కారణమేమిటో ఎవరికి తెలియదు.
ఉమ వెళ్ళేటప్పటికి జనం ఎవ్వరూలేరు.
తనకు వచ్చిన ఇబ్బందిని గురించి చెప్పింది. అతను నాడిపట్టి చూశాడు. "గుండె సంబంధమైన జబ్బు- ఇవ్వేసుకో- తగ్గిపోతుంది". అని నాలుగు రకాల మాత్రలు ఇచ్చాడు. ఇరవై రూపాయలు తీసుకున్నాడు.
ఆ మాత్రలు వాడిందిగానీ ఏమీ గుణం కనిపించలేదు. ఇక లాభం లేదని టౌన్ కి వెళ్ళాలనుకుంది. కాని టౌనంటే డబ్బు చాలా వుండాలి. వాళ్ళు వెళ్ళడం తరువాయి ఆ టెస్టులంటారు- ఈ టెస్టులంటారు. మాత్రలు కూడా ఖరీదుగా వుంటాయి.
అందుకే డబ్బు కోసం భర్తకు చెప్పింది.
"కనీసం రెండొందలున్నా ధైర్యంగా వుంటుంది. అదైనా అడ్జెస్ట్ చేయి"
దాసు అలాగే అన్నట్లు తల వూపాడు గానీ ఇవ్వలేదు. అమె హాస్పిటల్ కి వెళ్ళలేదు.
ఉదయం నిద్రలేస్తూనే మళ్ళీ గుండెలు అదిమేసినట్టు అనిపించటంతో అలానే పడుకుండిపోయింది.
ఆరోజు అదివారం కాబట్టి దాసుగానీ, అమెగానీ పనుల్లోకి వెళ్ళఖర్లేదు. ట్రాక్టర్ కూలీలు ఆరోజు రారు. కూలీలు వారానికి రావాల్సిన కూలీని శనివారం రాత్రే తీసుకుంటారు. ఇక ఆ రోజు టౌన్ లో జరిగే సంత చూసుకుని. అందులో సామాను కొనుక్కోని, టూరింగ్ టాకిస్ లో సినిమా చూసి వస్తారు. దాసులాంటి వాడయితే క్వార్టర్ మందు కూడా బిగిస్తాడు.
"నిన్న గోపాల్రావు డబ్బిచ్చాడా?" పది గంటలైనా దాసు హాస్పిటల్ మాట ఎత్తకపోయేటప్పటికి అడిగింది.
"ఇచ్చాడు"
" మరి డబ్బిస్తే సాయంకాలం అయినా వెళ్ళొస్తాను. లేదంటే నువ్వు కూడా తోడుగా రా."
" ఆ లక్షుమమ్మలేకే అదివారం అయినా కూర చెంగయ్య ఇంటివైపు కన్నెత్తి చూళ్ళేదు" నిష్టూరంగా అన్నాడు దాసు. లక్షుమమ్మ అంటే డబ్బు.
