Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 29


    
    "లింగమూర్తీ! ఏమైనా అవసరం అయితే నాకు కబురుచేయి" అని ఆయన ఆశ్రమం పెద్ద దగ్గర వీడ్కోలు తీసుకున్నారు.    
    
    "అలాగేనండీ మీరు ఇలాగే ఏటేటా జన్మదినోత్సవాలు చేసుకోవాలని, ఎంతోమందికి నూతన జీవితాలు అందించాలని మా ఆశ్రమంవాళ్ళు అందరూ కూడా ప్రతిరోజూ భగవంతుడ్ని కోరుకుంటారు" అన్నాడతను.
    
    ధృతి కార్లో కూర్చోబోతూ ఆ మాటలు విని చటుక్కున తలతిప్పి ఆయనవైపు చూసింది.
    
    "నేను చేస్తుందేముందయ్యా! పుట్టిన ప్రతివాళ్ళు ఖాళీగా కూర్చోకుండా ఏదో చేయాలి కదా, అదేదో నలుగురికీ పనికొచ్చేది చేస్తే మంచిది అని నా వుద్దేశ్యం" అంటూ ఆయన కార్లోకి ఎక్కారు.
    
    కారు 'ఆనందాశ్రమం' గేటుదాటి రోడ్డుమీదకి వచ్చాక "మీ పుట్టినరోజని నాకు ఇంతవరకు తెలియదు. కాస్త ఆలస్యమైనా పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకోండి" అంది ధృతి.
    
    "ప్రొద్దుటే నాకు గుడ్ మార్నింగ్ చెప్తూ నోరు తీపిచేశావు. అంతకంటే ఏం కావాలి? నాకీ రోజు చాలా ఆనందంగా అనిపించింది. జీవితంలో చాలా రోజుల తర్వాత ఇలాంటి అనుభూతి కలిగింది" అన్నారు ఆమె వైపు చూడకుండా విండోలోంచి చూస్తూ "ఇంతలో పుట్టినరోజు పండుగ చేసుకునే అంత గొప్ప విషయం అని నేను అనుకోవడం లేదు" అన్నారు.
    
    నిరాడంబరంకన్నా గొప్పది లేదు. గొప్ప ఎప్పుడూ నిరాద్మబరంగానే వుంటుంది అనిపించింది ఆమెకి.
    
    "ప్రతిదీ నాకేం అవసరం, దీనివల్ల నాకేమిటి లాభం అని ఆలోచిస్తానంటారు కానీ, చూశారా మీలో ఎంత ఆత్మీయతాభిమనాలు దాగున్నాయో! ఇందాక వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత తృప్తినీ, ఆనందాన్ని పొందారో నేను గమనించాను. నిస్వార్ధంగా వారి అవసరాలు తీరుస్తూ మీరు పొందే ఆనందాన్ని ఎలా నిర్వచిస్తారు? ఆత్మీయతలూ, ఆపేక్షలూ అనేవి అర్ధంలేని పదాలని మీ ఉద్దేశ్యం కదా!" అంది.
    
    ఆయన వెంటనే తలతిప్పి ఆమెని చూస్తూ "ఆత్మీయతలూ, ఆపేక్షలూ.....నమ్ముతాను కానీ అసలు నేను బంధుత్వాలనే నమ్మను. ఇందాక చూశావుగా! ఆ మిశ్రా కొడుకు పెద్ద బిజినెస్ మెన్, చాలా ధనవంతుడు కానీ తండ్రి ముసలితనంలో హృద్రోగంతో మంచానపడితే వదిలించేసుకున్నాడు. గోవిందానికి ఆరుగురు పిల్లలు. ముగ్గురు కొడుకులు పెద్ద పెద్ద హోదాల్లోనే వున్నారు. ఆస్తమా రోగి ఇంట్లో వుంటే 'న్యూసెన్స్' అని తరిమేశారు. ఇలా ఎందరో! తమ జీవితమంతా కష్టపడి భార్యా, పిల్లల్ని పోషించి, వృద్దిలోకి తెస్తే, చివరికి వాళ్ళు వాళ్ళని రోడ్లపాలు చేస్తారు. అటువంటి దిక్కులేని నిర్భాగ్యుల్ని చూశాక కూడా ఇంకా ఈ కుటుంబ వ్యవస్థనీ, అనుబంధాల్ని నమ్మమంటావా?" అడిగాడు తీవ్రంగా.
    
    ఆమె తనకి తెలియని సరికొత్త విషయాల్ని వింటున్నట్లు ఆశ్చర్యంగా వింటోంది.
    
    "నిస్వార్ధంగా నేను సేవ చేస్తున్నానన్నావు. అది శుద్ద తప్పు నేను అలా ఏం చేయడంలేదు. ప్రతి పనీ నాకు ఆనందం ఇచ్చేదే చేస్తున్నాను. అది నిస్వార్ధం ఎలా అవుతుంది? పైపెచ్చు నేనూ దిక్కూ దివాణము లేనివాడ్ని నేను చేరవలసిందీ అటువంటి గూటికే, అందుకే గూడు పటిష్టం చేసుకుంటున్నాను" అన్నారు అదోలా నవ్వుతూ.
    
    ఆయన వాదన నిజమే కావచ్చు. కానీ పూర్తిగా ఆయన 'అనాత్మావాది' అంటే ఆమె మనసు ఒప్పుకోలేదు.
    
    ఆమె ఆలోచనలని ఆటంకపరుస్తూ "ప్రొద్దుటే ఎవరో నీకిష్టమైన వ్యక్తి పుట్టినరోజన్నావు" అన్నారు.
    
    ధృతికి ఒక్కసారిగా నవీన్ గుర్తొచ్చాడు. ఎంత ఆశ్చర్యం! తనావిషయమే మరిచిపోయింది ఇంతసేపూ.
    
    "ఈ రోజు నవీన్ పుట్టినరోజు అతనికి శుభాకాంక్షలు తెలియచేయడానికి వెళ్దామనుకున్నాను ప్రొద్దున" అంది.
    
    "ఇప్పటికైనా మించిపోలేదు కదా! కారు ఎక్కడ ఆపమంటారో డ్రైవర్ తో చెప్పు" అన్నారు.
    
    ఆమె ఉత్సాహంగా ముందుకి వంగి డ్రైవర్ తో తమ ఇంటివైపుగా వెళ్ళేచోట కారు ఆపమని గుర్తులు చెప్పసాగింది. ఆమె ఆయనవైపు తిరిగేసరికే, ఆయన వెనక్కివాలి తననే నిశితంగా పరిశీలించడం గమనించి కాస్త ఇబ్బందిగా ఫీలయింది.
    
    ధృతి వెళ్ళేసరికి నవీన్ ఇంటిదగ్గర లేడు. దయామణిని పలకరించి, త్వరత్వరగా నడుచుకుంటూ అతను పనిచేసే 'గ్యారేజ్' దగ్గర కెళ్ళింది.
    
    "నవీన్ వున్నాడా?" అడిగింది ఓ కుర్రాడ్ని.
    
    "ఆ! నవీనన్నా ఎవరో వచ్చిన్రు!" అని కేకవేసి వాడి పనిమీద వాడు వెళ్ళిపోయాడు. వాడు చూసి మాట్లాడినవైపు కదిలింది ఆమె కారు క్రింద నుండి రెండు కాళ్ళు కనిపించాయి బయటికి.
    
    "నవీన్!" అని పిలిచింది.
    
    "హలో! షేక్ హాండ్ బదులు షేక్ లెగ్" అన్నాడు పాదాలు అటూ ఇటూ కదుపుతూ.
    
    "చాల్లే బయటికిరా! ఏదీ పుట్టినరోజు బుజ్జిబాబు అవతారం చూడనీ" అంది నవ్వుతూ.
    
    అతను నెమ్మదిగా వీపుతో దేకుతూ వచ్చి లేచి నిలబడ్డాడు. మొహమంతా ఆయిల్ మరకలూ, నల్లని బట్టలూ, జుట్టంతా దుమ్ము కొట్టుకొనిపోయి వున్నాడు.
    
    ఆమె అతఃన్ని తీవ్రంగా చూసి "ఇవాళ బర్త్ డే అని గుర్తుందా?" అడిగింది.
    
    "ఆ! అందుకేగా ఈ పాట్లన్నీ ఆ పుట్టడమేదో గొప్ప పనిలాగా పనిగట్టుకొని వచ్చి మరీ చెప్తున్నావు" అన్నాడు విసుగ్గా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS