Previous Page Next Page 
మమత పేజి 29

సుబ్బి నవ్వు ముఖం చూసింది చెన్నమ్మ.
వారంరోజులు గడిచాయి. సుబ్బి పనులు చేసుకుపోతోంది. జానకి, మాధవరావుల మార్నింగ్ వాక్, రాత్రి క్లబ్బు యధాప్రకారంగా కొనసాగుతున్నాయి. చెన్నమ్మ రోజుకో కొత్త వంట చేస్తోంది ముఖ్యంగా సుబ్బిని దృష్టిలో పెట్టుకుని.
"చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో!" అంది అన్నం వడ్డిస్తూ.
"ఊ...." అంది సుబ్బి.
"చూస్తావుగా... రాజయ్యని!" అంది పచ్చడివేస్తూ.
"ఆ..." అంది సుబ్బి.
జానకి అటు రావటం గమనించి "ఎంతసేపు తింటావూ - అమ్మగారి మంచంమీద దుప్పటి తీసి ఉతికింది ఇంకోటి వెయ్యి... దిళ్ళ గలీబులు మార్చు" అంది.
సుబ్బి తలూపింది.   
                                     *    *    *
లీల ఆ రాత్రంతా రాలేదు.
తెల్లారి రాలేదు, మధ్యాహ్నమైంది రాలేదు.... అందరికీ కంగారు- ఎక్కడికి వెళ్ళివుంటుంది? అని..! ఎవరికీవారు రకరకాలుగా అనుకున్నారు... సుధాకర్ కి ఫోన్ చేసాడు చంద్రయ్య. అక్కడికీ రాలేదు- ఏమైనట్టు?
"ఇంకా ఊరుకుంటే ఎలా, పేపరులో వేయాలి!" అంది తిరుపతమ్మ.
చంద్రయ్యకి ఏమీ బోధపడలేదు. అంతలోనే ఆశ్రమంలో వెనక ఇంట్లో వుండే చంద్రయ్య భార్య గబగబా పరిగెత్తుకొచ్చింది. "చూడండి, చూడండి" పేపరు అందించింది-'ముప్పయి ఏళ్ల మహిళ శవం టాంక్ బండ్ నీళ్ళపై తేలింది. ఎర్రని జాకెట్, పూలచీర, పెద్ద జడ'- అందరో అవాక్కయిపోయారు- ఎందుకు చేసావు తల్లీ ఇలా, చచ్చి స్వర్గంలో వున్న తులసమ్మకి ఏం చెప్పుకోగలం- అందరికన్నా పెద్ద గొంతెత్తి చంద్రయ్య ఏడ్చాడు.
భార్య కర్మకాండలు చేసిన సుధాకర్ బెంగుళూరెళ్ళిపోతూ చంద్రయ్య దగ్గరకొచ్చాడు.
"ఆ డబ్బు నాకిస్తే దానిపేర ఏ గుడికో దానమిస్తా!"
చంద్రయ్య రాక్షసుడిలా సుధాకర్ మీద పడిపోయాడు అరుస్తూ.
"ఆ డబ్బు ఎప్పుడో తీసుకుంది. ఎవరికీ పెట్టిందో..! డబ్బట, డబ్బు-బతికున్నపుడు దాన్ని చూడలేదు, అది చచ్చాక డబ్బు కావాల్సొచ్చిందా... ఫో!" కసిరాడు.
సుధాకర్ కి తెలుసు- ఆ డబ్బు చంద్రయ్య దగ్గరే వుందని! "ఉచితంగా నీకు యిచ్చేసాననుకుంటానంతే!" అన్నాడు.
ఆ మాటలు వింటున్న తిరుపతమ్మ మూతి తిప్పుకుంది.
"కడుపు చేయించుకుని భయపడి టాంక్ బండ్ లో దూకింది. నాకు తెలుసు దాని విషయం" అంది.
అక్కడున్న ఇద్దరూ "ఏమో... కావచ్చు!" అన్నారు.   
                                      *    *    *
సుమతి మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది.
భర్త మనసుని అర్ధం చేసుకోలేని యిల్లాలు- ఒక ఇల్లాలా..? అనిపించింది సుమతికి. కానీ, తనేం చెప్పినా వినడు, నమ్మడు రాజీవ్! పైగా... తనంటే విపరీతమైన ద్వేషం, కోపం, అసహ్యం- అని సుమతికి అనిపించింది.
ఆరోజు తను తులసమ్మ దగ్గరకెళ్ళింది- ఎన్నేళ్ళనాటి మాట- మళ్ళీ తులసమ్మ పిన్ని దగ్గరకే వెళ్ళాలి....ఆరోజు తనకి ఏ నిజాలు తెలియవు. కానీ, కేవలం ఆ పసిగుడ్డుపై, అదీ ఓ దిక్కులేని అనాధ పిల్లపై అసహ్యంతో అలా చేసాను కానీ, నా భర్తమీద నాకు గౌరవమే- అని చెప్పాలి.... తులసమ్మ కల్పించుకుంటే ఆ పిల్లని వీణ దగ్గరనుంచి తను తెచ్చుకోగలదు.
కానీ... ఇవన్నీ జరుగుతాయా? రాజీవ్ తన మాట నమ్ముతాడా, తులసమ్మ మాత్రం ఖచ్చితంగా వచ్చి తనకీ, రాజీవ్ కీ రాజీవ్ కీ రాజీ కుదురుస్తుందనే ఆశ రోజురోజుకీ సుమతిలో పెరిగిపోయింది. రాజీవ్ తనకి దూరమై పోతున్నాడనే భయం గుండెల్లో నాటుకుపోయింది.
తులసమ్మ ఆశ్రమం ముందు ఆటో ఆగింది. లోపల కెళుతుంటే ఎదురుగా ఆ పటం మనసుని ముక్కలు చేసింది. 'అయ్యో... చచ్చిపోయిందా?' సుమతి ఆ పటానికి నమస్కారం చేసింది. మరో ఆటోలో ఇల్లు చేరింది. మనసు నిరాశతో క్రుంగిపోయింది.
ఊరంతా గుప్పుమంది- ఆశ్రమంలో జరుగుతున్నాయి రకరకాల అక్రమాలు అంటూ. ఆ పిల్ల ఎందుకు టాంక్ బండ్ లో పడి శవమై తేలిందీ అంటే...
"ఆ, ఏముందీ.... ఆ దుర్మార్గుడు చంద్రయ్య దాన్ని బలాత్కారం చేసాడట, పాపం, ఎవరితో చెప్పుకుంటుందీ, నమ్ముకున్న తులసమ్మ పెద్దదిక్కు చచ్చిపోయిందిగా, పిచ్చిపట్టి అలా చేసిందంతే!!"
"విన్నావా... ఆ తిరుపతమ్మ కబుర్లు - తలకి కొత్తగా సెంటు నూనె రాసుకుంటోంది- పైగా.... ఆ చీరలు చూసావా, ఎంత ఖరీదైనవి కడుతోందో! -ఇక్కడ డబ్బులు దోచి దానికి పెడుతున్నాడు."
'అందుకే దానికా గర్వం!! ఆమధ్య ఆశ్రమంలో నుంచి ఇద్దరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. విన్నావా- ఏమ్దుకనుకున్నావు? ఆ పెద్దాయనకి తెలియనీయకుండా చాలా మంది డబ్బులు వసూలు చేస్తున్నాడట."
-ఇలా ఇలా మాటలు ఆశ్రమం గురించి చెప్పుకోగా చెప్పుకోగా రాజభూషణరావు చెవిన చేరాయి. ఆ పెద్దమనిషికి చాలా బాధ కలిగింది. మన సంస్క్రుతికే వ్యతిరేకం ఈ వృద్దాశ్రమాలు- కాని, పెంచిన తల్లిదండ్రులు బరువై ఇలా వదిలేసే పిల్లల్ని ఎవరూ శిక్షించరా కానీ, రాజభూషణరావు వృద్దాశ్రమం పెట్టినపుడు తనకి సలహా ఇచ్చి, కాలంతోపాటు ఆ వృద్దుల్ని పిల్లలూ చూడక, సమాజమూ చూడకపోతే వాళ్ళేమవుతారూ..? అన్నాడు రాఘవరావు. నిజమే....అనిపించింది. తులసమ్మ అండగా నిలబడింది. కానీ, నేడు ఆశ్రమం గురించి ఇంత ఘోరమైన దుష్ప్రచరం జరుగుతోంటే ఎలా? రాజభూషణరావు ఆలోచించాడు... చంద్రయ్యని పిలిపించాడు.
"ఎవరో గిట్టనివాళ్ళ మాటలు నమ్మకండయ్యా-అన్నీ అబద్దాలే! - ఏదో పెద్దవాళ్ళు తలదాచుకుందుకి ఈ ధర్మకార్యం చేస్తున్నారు మీరు! వాళ్ళు వీధిన పడతారు..... నా మాట నమ్మండి" అన్నాడు ధీమాగా చంద్రయ్య.
"ఆ పిల్ల చచ్చిపోటం, అదీ.... టాంకుబండ్ లో పడి ఆత్మహత్య చేసుకోటం ఎందుకంటావ్? లోకమంతా-"
"ఆ... లోకులు కాకులండీ! ఆ పిల్ల చచ్చిపోడానికి కారణం నాకు తెలుసండి- చెప్తే బాగుండదు- అందుకే నింద నామీద పడ్డా ఆడకూతురి గౌరవం కోసం నోరు విప్పలేదు" అన్నాడు.
రాజభూషణరావు "వివరంగా చెప్పు" అన్నాడు.
"ఆ పిల్ల భర్తని వదిలిపెట్టిందండీ..... ఇక్కడే దగ్గర్లో ఎవడితోనే పరిచయమైంది....అది అక్కడితో ఆగుతుందా మరి! ఒకదాని వెంట ఒకటి - ఏదన్నా అందామంటే దేవుడు, భక్తి అనటం... గర్భం తీయించుకునే ధైర్యం లేక, ముఖం చూపించలేక దూకి చచ్చింది అంతే..!" అన్నాడు- అన్నీ తనకి తెలిసినట్లుగా! లోకంలో నాజాలు ఎలా శాశ్వతంగా మరుగున పడిపోతాయో... అసత్యాలు ఎలా ప్రచారంలోకొచ్చి నిలబడిపోతాయో కదా!! పాపం... లీల!!
చంద్రయ్య మాటలకి రాజభూషణరావు తలూపాడు. ఆ పిల్లకి డైవోర్సు యిప్పించేసి మనం వాడితో పెళ్ళి చేసేయాల్సింది. ఇవన్నీ నాకు మీరెవరూ చెప్పకుండా దాచారు. పాపం... అన్యాయంగా బలి అయిపోయింది కదా ఆ పిల్ల!
రాజభూషణరావు మనసు చాలా దయాపూరితం. ఎవర్నీ నిందించటం, వేధించటం అతనికి నచ్చదు. మానవత్వంతో అందరి గురించి ఆలోచించే గొప్ప మనసున్న ఆయన లీల చావుకి చాలా బాధపడ్డాడు.
"చంద్రయ్యా... ఇక నుంచి నేను కూడా రోజూ ఆశ్రమానికొస్తా- పొద్దున్నా, సాయంత్రం - ఏం జరుగుతోందో ఏమిటో నాకు నువ్వు అన్నీ చెప్తుండాలి - ఆ తిరుపతమ్మ విషయమేమిటీ?"-
"నిప్పండీ... నిప్పు! -ఆమెని వంక పెట్టడానికి వీల్లేదండి! మొన్న వంటమనిషి రాలేదండి- మొత్తం ఒక్క చేతిమీద వంట చేసి అందరికీ పెట్టిందండి - ఆమె వుండబట్టే ఆశ్రమంలో వాళ్ళు హాయిగా వుంటున్నారండి- అయ్యా, మీరు రండి, రోజూ రాలేకపోయినా, వారానికి ఒక్కరోజు రండి, నేనున్నాగా.... అన్నీ చూసుకుంటా!" అన్నాడు రాజభూషణరావుకి ధైర్యం చెప్తూ రాజభూషణరావు కొడుకులు ముగ్గురూ అమెరికాలో స్థిరపడిపోయారు.
ఈ ఇంట్లో ఆయన భార్య, వెనక ఇంట్లో వంటమనిషి కుటుంబంతో వంట మనిషి భర్త, డ్రైవరు- ఊరికినే ఆ ఇంట్లో వుండమన్నాడు రాజభూషణరావు. పెద్దవాళ్ళకి కాస్త తోడు, ఆ చిన్న కుటుంబానికి మంచి వసతి - ఎవరో ఒకరు ఆశ్రమాన్ని చూడకపోతే ఎలాగ? జరిగినంత కాలం జరగనీ.... తన తర్వాత ఏమో! ఎవరి తర్వాత ఏమిటో ఎవరికీ తెలుసూ - ఏది ఆగింది లోకంలో!!   
                                 *    *    *
నెల రోజులుగా బోడి ఎందుకో బెంగగానే వుంటోంది.... జ్వరమొచ్చిందని పడుకుంటోంది. కడుపులో నొప్పి అంటుంది.
ఏదో మాత్ర ఇచ్చి, అదే పోతుందిలే.... అంటుంది జానకి. "ఆ....దొంగ కడుపునొప్పి! పనిచేయకుండా వెచ్చగా పడుకోవచ్చనీ!" అన్నాడు మాధవరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS