Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 3

 

    ఆ మధ్య ఏదో రాష్ డ్రైవింగ్ అన్న పేరు మీద మోహన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాల్సి వచ్చింది. ఘుమఘుమలాడే సెంటు పరిమళం అతను వెళ్ళేక అతను కూర్చున్న కుర్చీ నంటి పెట్టుకునే వుంది. విచారణ మీద తెలిసిన దేమిటంటే , ఫారెన్ లో వుంటున్న మోహన్ స్నేహితుడొకతను, ఆ సెంటుని ప్రత్యేకంగా అతనికోసం పంపుతాడు. శివరావు హత్యా స్థలంలో వచ్చిన సెంటూ పరిమళం మోహన్ వాడె సెంటు పరిమళం ఒక్కటే .దీన్నాదారంగా తీసుకుని పరిశోధించాక హత్య స్థలంలోని కుర్చీ చేతి మీద వున్న వేలిముద్రలు మోహన్ వేలిముద్రలతో సరిపోయాయి. వెంటనే మోహన్ అరెస్టయ్యాడు."
    ఆశ్చర్యంగా వింటున్నాను. నిజంగానే పోలీసులు అసాధ్యులనిపించింది. తలా తోకా లేని కేసుగా నేను దీన్ని భావించాను. పోలీసు లేమీ చేయలేరనుకున్నాను. కానీ, కోడిగ్రుడ్డుకు ఈకలు పీకేలా ఉన్నారీ పోలీసులు.
    "బాగానే ఉంది. కానీ, మోహన్ హత్య చేశాడని ఎలా రుజువు చేయగలరు?" అన్నాన్నేను.
    "రుజువులింకా లేదు. కానీ, పరిస్థితులు మోహన్ కి ప్రతికూలంగా వున్నాయి. శివరావు మోహన్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు రుజువు దొరికింది. కాబట్టి, హత్యకు కారణం కనబడుతోంది. హత్య స్థలంలో అతనున్నట్లు ఋజువైంది . ఈమాత్రం చాలు - కేసు బలపడడానికి."
    నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. "అయితే శివరావు మోహన్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్న మాట. అందుకని మోహన్, శివరావుని చంపేశాడంటారు పోలీసులు."
    'అవును, సోదా చేయగా మోహన్ దగ్గర శివరావు రాసిన ఉత్తరాలు, చాలా దొరికాయి. అందులో ఒక ఉత్తరంలో , నన్ను చంపుతానని బెదిరించి ప్రయోజనం లేదు. నన్ను చంపి నువ్వు సాధించగలిగింది లేదు. నన్ను చంపే ఆలోచన పక్కన కట్టి పెట్టి, నేనడిగిన డబ్బిచ్చావో , నువ్వే సుఖపడతావు. అని రాశాడు. ఇవన్నీ మోహన్ ని, తిరుగులేని దోషిగా నిలబెడుతున్నాయి. పోలీసులు ప్రశ్నల కతను సంతృప్తి కరమైన సమాధానాలివ్వక పోతున్నాడు. ఈ పరిస్థితుల్లో అతన్ని రక్షించగలవా రోక్కరే వున్నారు. శివరావు హత్యను కళ్ళారా చూసిన మీరు" అన్నాడు రామారావు.
    "చాలా బాగుంది. శివరావు హత్యను నేను కళ్ళారా చూడ్డ మేమిటి, ఎవరైనా నవ్విపోతారు" అన్నాను. కానీ, నాకు నవ్వు రాలేదు.
    రామారావు ముఖం గంబీరంగా వుంది. "తాన కొడుకును రక్షించే బాధ్యత మాధవరావు గారు నామీద పెట్టారు. సిటీలో జాడలుతీయగల సమర్ధత నాకుందని ఈపాటికే మీరు తెలుసుకుని వుండాలి. ఒక నిండు ప్రాణం అన్యాయంగా బలై పోతుంటే , సహించగల మనస్తత్వం మీకుందని నేననుకోను. ఆలోచించండి."
    ఆలోచనతో హంతకుణ్ణి తెలుసుకోవడం సాధ్యమయే పక్షంలో , అది నాకంటే మీకే ఎక్కువ సాధ్యపడుతుంది. ఎందుకంటె మీరు ప్రయివేటు డిటెక్టివ్ కదా' అన్నాను.
    'శివశంకరం గారూ" రామారావు తీవ్రంగా అన్నాడు. "నిజాన్ని రాబట్టడానికి మా పద్దతులు మాకుంటాయి. తన కొడుకుని రక్షించడం కోసం మాధవరావు గారు ఎంత డబ్బు ఖర్చు పెట్టడాని కైనా సిద్దంగా ఉన్నారు. తన కొడుకును రక్షించే సాక్ష్యం చెప్పగల వారి కాయన పదివేలు రొక్కం బహుమతిగా ఇవ్వదల్చుకున్నాడు."
    శేషగిరి ఇచ్చిన అయిదు వేలు నామనసులో మెదిలాయి. అది తన ప్రాణం కాపాడుకునేందుకు శేషగిరి నాకిచ్చిన డబ్బు. అంటే అతని ప్రాణం నాకు సంబంధించినంత వరకూ ఐదు వేలూ చేస్తుంది. ఇప్పుడు మోహన్ ప్రాణాల విలువ పదివేలు. నేనతని ప్రాణాలను రక్షించగల స్థితిలో వున్నాను. అలా రక్షించడం వల్ల నాకు పది వేలోస్తాయి. ఒక నిర్దోషి రక్షించబడతాడు. ఆతర్వాతెం జరుగుతుంది? గవర్రాజు గుర్తుకొచ్చాడు నాకు, నా ప్రాణాల విలువెంతో నాకు తెలియదు కానీ, అకారణంగా చావడం నాకిష్టం లేదు. నామీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు ముగ్గురున్నారు. వాళ్ళతో కలిసి జీవించాలన్న కోరిక నాలో గాడంగా వుంది.
    'సరే, ఐతే డబ్బు ఖర్చు పెట్టి నిజం రాబట్టుకోండి. నా దగ్గరకు వచ్చి ప్రయోజనం ?"
    "మేష్టారు , డబ్బు ఖర్చు పెట్టడం మొదటి మెట్టు, రెండవ మెట్టు గా, మిమ్మల్నీ హత్య కేసులో ఇరికించగలను" అన్నాడు రామారావు.
    "చాలా బాగుంది" అన్నాను కోపంగా.
    "ఇంకా బాగుంటుంది వినండి. ఆరోజు -- శివరావు హత్య  జరిగినరోజు ఆ సమయంలో మీరక్కడికి వెళ్ళారు. మీ స్టూడెంట్ ఒకతను మీరా ఇంట్లోకి వెళ్ళడం చూశాడు. మీ వేలిముద్రలు శివరావు హత్య చేయబడ్డ గది తలుపుల మీద వున్నాయి. అవి ఎవరివో పోలీసుల కింతవరకూ తెలియలేదు. ఈరోజు నేను తెలియజేయగలను.":
    "తెలియజేయండి.... శివరావు కూ, నాకూ ఏ సంబంధముందని -- అతన్ని చంపుతాను?"
    "ఈ రామరావు సంగతి మీకు తెలియదు. మీరతన్ని చంపడాని క్కారణం కూడా తెలుసుకోగలిగారు. మోహన్ విలస పురుషుడు. అతను మీ పెద్దమ్మాయి వరలక్ష్మి తో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి వదిలేశాడు. మోసం చేశాడు.తర్వాత మీరు మీ అమ్మాయికి పెళ్ళి నిశ్చయం చేశారు. అయితే మీ అమ్మాయికీ, మోహన్ కి వున్న సంబంధాన్నేలాగో శివరావు తెలుసుకున్నాడు, మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయసాగాడు. మీకు డబ్బెక్కడ్నించి వస్తుంది? మరోదారి లేక అతన్ని హత్య చేయాలనుకున్నారు. చేశారు!"
    నా రక్తం మరిగింది. అందులో హృదయం ఉడికింది. "మీరు మర్యాద నతిక్రమిస్తున్నారు. నా కూతురు నిప్పు లాంటిది."
    "ఒకోసారి అబద్దాలు నిజాలే అయిపోయి , మనల్నిబ్బందిలో పెట్టేస్తాయి . మోహన్ హంతకుడవడం ఎంత నిజమో, మీ అమ్మాయి దుశ్శీల  కావడం, మీరు హత్య చేయడం అంతే నిజం. కానీ, మొదటిది అబద్దం కావడం కోసం చివరి రెండూ నిజాలు చేయదల్చాన్నేను ఈ మూడూ అబద్దాలని ఋజువు చేయాలంటే మీ సహాయం నాకు కావాలి" అన్నాడు రామారావు.
    ఆలోచనలో పడ్డాను. "నిజంగా నాకేమీ తెలియదు. ఆయింట్లో నేను వెళ్ళడం చూసిన స్టూడెంట్ ఎవరో చెప్పండి. అతన్ని నిలదీసి అడుగుతాను. అతను బాగా పొరబడి వుండాలి" అన్నాను.
    "మేష్టారు, దబాయించి ప్రయోజనం లేదు. మీరక్కడున్నట్లు నేను ఖచ్చితంగా ఋజువు చేయగలను. ఎటొచ్చి మోహన్ నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి  మీకూ మంచి మనసనేది వుంటే, మీఅమ్మాయి దుశ్శీల కావసరం లేదు. మీరు హంతకులూ కానవసరం లేదు. మీకు ఒకే ఒక్క నిముషం వ్యవధి ఇస్తున్నాను. ఇంక మీరేం చెప్పనవసరం లేదు. హత్య విషయంలో నాకేమైనా సహకరించదల్చుకున్న పక్షంలోనే మాట్లాడండి. లేని పక్షంలో నేను లేచి వెళ్ళిపోతాను. మీరు మౌనంగా వుండండి " అంటూ అతను వాచీ వంక చూసుకుంటున్నాడు.
    నా మనసులో సంఘర్షణ ప్రారంభమయింది. మంచి మనసు ఎదురు తిరుగుతోంది. గవర్రాజు భయపెడుతున్నాడు. రామారావు బెదిరిస్తున్నాడు. కొద్ది క్షణాల్లోనే ఒక నిర్ణయానికి వచ్చాను. గవర్రాజు వల్ల ప్రభావం నా ఒక్కడికే వుంది. కానీ, రామారావు కారణంగా నా కూతురి కాపురం కూడా చెడిపోవచ్చు. అదికాక, ఒకహంతకుడిగా ఉరి తీయబడడం కంటే , ఒక దుర్మార్గుడి చేత హత్య కావించబడడమే మేలు.
    "టైమై పోయింది. మరి నేను వెడుతున్నాను మేస్టారూ" అన్నాడు రామారావు.
    "ఆగండి" అన్నాను. రామారావు ను దగ్గరగా పిలిచి, "నేను హంతకుణ్ణి కాను. ఆరోజు శివరావును శేషగిరి హత్య చేయడం నేను కళ్ళారా చూశాను" అని చెవిలో నెమ్మదిగా చెప్పాను. రామారావు ముఖంలో రంగులు మారాయి. అతను నెమ్మదిగా నన్ను ప్రశ్నించి ఆరోజు జరిగిన వివరాలన్నీ రాబట్టాడు. అన్నీ విని , "మేస్టారూ మీ సమాచారం మోహన్ ని రక్షిస్తుంది. ఇందుకు మీకు తగిన ప్రతిఫలం వుంటుంది" అని వెళ్ళిపోయాడతను.
    అతను వెళ్ళిపోగానే రామావతీ నా దగ్గరకు వచ్చి, "నాన్నా, నిజంగా నువ్వా హత్య కళ్ళారా చూశావా?" అనడిగింది.
    ఉలిక్కిపడ్డాను నేను, దాని వంక అనుమానంగా చూసి, "మా సంభాషణంతా విన్నవేమిటి?"అన్నాను.
    "అంతా వినలేదు. చివర్లో నువ్వాయనాకేం చెప్పావో మాత్రం నాకు తెలియలేదు. ఆఖరున మీరు గుసగుస లాడుకున్నట్లు మాట్లాడుకున్నారు" అంది రామావతి.
    నేను నవ్వి , "లేదమ్మా , నేనా హత్య చూడలేదు. అతన్ని వదుల్చుకోవడం కోసం చివరికి చూశానని ఒప్పుకుని, నాకు తోచిన విధంగా హంతకుణ్ణి వర్ణించి చెప్పాను" అన్నాను.
    రామవతి కుతూహలంగా చూసి, "కానీ, ఆ సమాచారం మోహన్ ని రక్షిస్తుందన్నాడాయన. నీకు నమ్మకముందా నాన్నా" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS