"ఏమో, నన్ను నేను రక్షించుకునెందుకు సమాచారాన్నిచ్చాను. అయినా మనకెందుకు లెద్దూ?"
"అది కాదునాన్నా, ఆ వచ్చిన మనిషి మీద నాకు చాలా అనుమానంగా వుంది. అతను మోహన్ ని రక్షించడానికి వచ్చేడని నా కనిపించడం లేదు" అంది రామావతి.
నేనాశ్చర్యంగా చూశాను నా చిన్న కూతురి వంక! "ఈ హత్య గురించి నీకు చాలా వివరాలు తెలిసినట్లు కనబడుతోంది?" అన్నాను.
"అవున్నాన్నా , మోహన్ మా కాలేజీ లోనే చదువుతున్నాడు. నాకొక ఏడాది సీనియర్ "అంది రామావతి .
"అయితే...."
'అతను హత్య కేసులో ఇరుకున్నాక డిటెక్టివ్ రామారావు గారు మా కాలేజీకి వచ్చారు. మోహన్ ప్రవర్తన గురించి స్టూడెంట్స్ ని చాలా ప్రశ్నలడిగారు."
"అయితే "అన్నాను మళ్ళీ.
"ఇందాకా వచ్చిన తను డిటెక్టివ్ రామారావు కాదు. డిటెక్టివ్ రామారావు గారిని నేను కళ్ళారా చూశాను. మా కాలేజీ ప్రిన్సిపాల్ గారే మా క్లాసుకు తీసుకు వచ్చి స్వయంగా పరిచయం చేశారు" అంది రామావతి.
పక్కలో బాంబు పేలినట్లదిరి పడ్డాను. అయితే ఇందాకా వచ్చినతను ఎవరు?
4
సుమారు రాత్రి పదిన్నర ప్రాంతంలో ఎవరో తలుపు తట్టారు.
సాధారణంగా నేనొక్కడ్నే వరండాలో నిద్ర పోతుంటాను. మా యింట్లో అందరం తొమ్మిదింపావయేసరికి నిద్రపోతాం.
ఆ తలుపలా ఎంత సేపట్నించి తట్టబడుతోందో తెలియదు కానీ, మెలకువ రాగానే లేచి తడుముకుంటూ గోడ దగ్గరకువెళ్ళి లైట్లు వేసి , వెళ్ళి తలుపు తీశాను.
"మంచి నిద్రలో వున్నట్లున్నావు" అన్నాడాయన. నాకు పరిచయమైన ముఖమే. అయన పేరు కామరాజు. నాకు దూరపు బంధువు. దగ్గర్లో వున్న పల్లెటూరాయనది. అప్పుడప్పుడు పట్నం వచ్చి మొదటాట సినిమా చూసి, మా యింటికి వచ్చి పడుకుని, మళ్ళీ ఉదయమే లేచి వెళ్ళి పోతూంటాడాయన.
నేను టైము చూసుకుని, "తొందరగా నిద్రపోయే అలవాటు కదా. లేకపోతె మంచి నిద్రలో వుండాల్సిన టైం కాదిది. "సినిమా నుండా" అన్నాను.
"అవును- "అన్నాడు కామరాజు.
"పదండి - కాళ్ళు కడుక్కుని భోం చేద్దురు గాని...' అంటూ తలుపులు వేశాను. భోం చేయడని నాకు తెలుసు. అతను హోటల్లో భోం చేసి వస్తాడు. అయినా మర్యాదకు అలాగన్నాను.
తను భోం చేసినట్లు చెప్పాడు కామరాజు.
వరండాలో నేను పడుకున్న మంచం మీద దుప్పటి తీసి ఒకసారి విదిలించి మళ్ళీ వేసాను. "చాలా రాత్రి అయింది కదా - మీరు వెళ్ళి పడుకోండి-" అన్నాడు జమరాజు మంచం మీద కూర్చుని.
అక్కణ్ణించి కదిలాను.
పిల్లలు దొడ్డి వసారాలో నిద్రపోతున్నారు. అనసూయ ఒక్కత్తి గదిలో పెద్ద మంచం మీద నిద్రపోతుంది.
ఈ నగరంలో అరవై రూపాయల అద్దెకు ఇంత పెద్ద యిల్లు దొరకడం నా అదృష్టం. కాస్త పాతదే అయినప్పటికీ నాబోటీ వాడికి చాలా సదుపాయంగా ఉంటుంది. ఈ ఇంట్లో నేను సుమారు ఇరవై ఏళ్ళ క్రితం ప్రవేశించాను. పదిహేను రూపాయల అద్దెకు, మళ్ళీ ఇల్లు వదలవలసిన అవసరంరాలేదు. మూడు పురుళ్ళు నా భార్య ఈ ఇంట్లోనే పోసుకుంది. నా జీవితం మూడు పువ్వులూ ఆరు కాయలుగా నడుస్తోంది యింట్లో.
గది తలుపులు వేసి అనసూయ పక్కలో చేరాను. ఎంత మంచి నిద్రలో ఉన్నా నేను పక్కలోకి రాగానే అనసూయ కు మెలకువ వస్తుంది. "పిల్లలు నిద్రపోయారా?" అంది అనసూయ. నేనా గదిలోకి రాగానే అనసూయ ఎప్పడు అడిగే మొదటి ప్రశ్నే అది.
"ఆ అయినా కామరాజు గారొచ్చారు. అందు గురించి ఇక్కడకు రావడం తప్పని సరయింది...."
"మిమ్మల్ని కారణం ఎవ్వరడిగారూ...." అంటూ అనసూయ నాకు దగ్గరగా జరిగింది.
5
ఏదో పెద్ద కేక వినపడి మెలకువ వచ్చింది. అనసూయ నన్ను కౌగలించుకుని పడి ఉంది. తనకు మెలకువ వచ్చినట్లు లేదు. నేను తట్టి లేపాను.
"ఊ" అంది బద్దకంగా.
"ఏదో కేక వినపడలేదు" అన్నాను.
"లేదు" అని మళ్ళీ నిద్రకు పడిపోతోంది. నేనామెను విడిపించుకుని లేచాను. మంచం దిగాను. లేచి తలుపులు తీశాను. వరండా లోని వెలుగు గదిలోకి కూడా పడింది.
వరండా లో పిల్లలందరూ ఉన్నారు. వీధి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. ఇంకాస్త ముందడుగు వేస్తె నాకు మంచం మీద కామరాజు కనిపించాడు. పరుగెత్తుకు వెళ్ళాను.
"ఏమైంది?"
"కామరాజు ఆయాసపడుతున్నాడు.
రామావతి చెప్పింది "ఈయన కేక వినపడి పరుగెత్తుకు వచ్చాం!"
కామరాజు తమాయించు కున్నాడు "బహుశా దొంగాడను కుంటాను. నన్ను చంపడానికి ప్రయత్నించాడు" అన్నాడు. ఒక్క క్షణం అగేక అయన చెప్పిందాన్ని బట్టి నాకర్ధమైంది.
ఒకరాత్రి వేళ అల్పాచమానాని కని కామరాజు లేచి వీధి తలుపులు తీసుకుని బయటకు వెళ్ళి వచ్చాడు. తర్వాత తలుపులు వేసి వచ్చి మంచం మీద పడుకున్నాడు. ఏదో అలికిడైనట్లు తోచి కళ్ళు తెరిచాడు. అయన కళ్ళు చీకటికి అలవాటు పడ్డానికి కొద్ది క్షణాలు పట్టింది. అప్పటికో నల్లటి ఆకారం తాన వైపు నడిచి వస్తున్నట్లు గుర్తించాడాయన.
"ఎవరది?" అన్నాడు కామరాజు.
ఆకారం ఒక్కదుటున మంచం మీద దూకి కామరాజు నోరు మూసింది. రెండో చేత్తో కత్తి ఎత్తింది. కామరాజు ఒకచేత్తో కత్తి వున్న ఆ ఆకారం చేతిని పట్టుకుని ఆపాడు. కానీ ఎంత సేపటికీ తన నోటి మీద చెయ్యి తొలగించ లేకపోయాడు. కొంతసేపు ప్రయత్నం అనంతరం కామరాజులో శక్తి క్షీణించింది. ఆకారం కత్తి కామరాజు గుండెల మీదకు తీసుకువస్తోంది. ఆ జీవనమరణ మధ్యలో కామరాజు సర్వశక్తులూ వినియోగించి ఆకారాన్ని వెనక్కు తోసి గట్టిగా కేక పెట్టాడు. ఆకారం తలుపులు తీసుకుని పారిపోయింది.
నా గుండెలదిరాయి. సాయంత్రం నా యింటికి డిటెక్టివ్ రామారావు వచ్చి శివరావు హత్య విషయం ప్రస్తావించి నా దగ్గర్నుంచి నిజం రాబట్టుకుని వెడుతూ అందుకు ప్రతిఫలం ఉంటుందని చెప్పాడు. అతను డిటెక్టివ్ రామారావు కాదని రామవతి చెప్పింది. రాత్రి ఇంటికి వచ్చిన కామరాజు మీద హత్యా ప్రయత్నం జరిగింది.
ఆ హత్యా ప్రయత్నం కామరాజు మీదనా లేక నా మీదనా? న్యాయాని కిక్కడి కామరాజు స్థానంలో నేనుండాల్సుంటుంది. కామరాజు దృడ కాయుడు . అయన కాకుండా నేనాయన స్థానంలో ఉండి ఉన్నట్లయితే నా ప్రాణాలు పోయుండేవి. అయితే నన్ను చంపాలని అనుకుంటున్నదెవరు?
6
మర్నాడు ఆదివారం కాబట్టి స్కూలుకు సెలవు. ఒక పర్యాయం పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఆ మోహన్ ని డిటెక్టివ్ రామారావు నీ చూడాలని పించింది. అవసరమైన పక్షంలో పోలీసుల రక్షణ కూడా కోరాలనుకున్నాను. నా ప్రాణాలిప్పుడు అపాయంలో పడ్డట్టు తోస్తోంది. రాత్రి దేవుడిలా వచ్చి రక్షించాడు కామరాజు. లేకపోతె.....
ఊహించుకోలేక పోయాను, నా కళ్ళముందు కత్తి పిడి మీద జేబురు మాలుతో తుడుస్తున్న శేషగిరి కనిపించాడు.
నేను బజర్లో రాగానే ఎవరో వెనక నించి పేరు పెట్టి పిలిచారు. ఎవరా అని వెనక్కు తిరిగి చూస్తె అతను గవర్రాజు!
"మేష్టారు ఎక్కడికో బయల్దేరి నట్లున్నారు?" అన్నాడతను.
నేనేం మాట్లాడలేదు.
"మీరు నా హెచ్చరిక మరిచిపోయారు" అన్నాడు గవర్రాజు.
"ఏ హెచ్చరిక ?" అన్నాను.
"పదండి , పార్కులో మాట్లాడుకుందాం" అంటూ అతను దగ్గర్లో ఉన్న పార్కు వైపు నడిచాడు.
ఇద్దరం వెళ్ళి పార్కులో ఒక మూల బెంచీమీద కూర్చున్నాం.
"నిన్న మీయింటికి డిటెక్టివ్ రామారావు వచ్చేదా" అన్నాడు గవర్రాజు.
"అవును మీకెలా తెలుసు?"
"ప్రశ్న లోద్దు. నేనడిగిన దానికి సూటిగా జవాబు చెప్పండి. అతనికి మీరు శివరావు హత్య గురించి పూర్తీ వివరాలు చెప్పేశారా , లేదా?"
'అతను నన్నిరుకులో పెట్టి నిజం చెప్పించేశాడు" అన్నాడు భయపడుతూ.
గవర్రాజు కళ్ళు ఎర్రగా అయ్యాయి. "పంతులుగారూ మీకు నేను మొదటే చెప్పాను. శేషగిరి గారి స్నేహితులంతా నా స్నేహితులని , నా స్నేహమున్న వాడి ఒంటి మీద ఈగ నైనా వాలనివ్వను మీరు అనవసరంగా భయపడ్డారు"అన్నాడతడు కాస్త తీవ్రంగా.
'అవన్నీ నాకేం తెలుస్తాయి. నేను చాలా సామాన్యుణ్ణి " అన్నాను.
"మేస్టారూ. గవర్రాజు సామాన్యులతో స్నేహం చేయడు. నా స్నేహం దొరికిన మీరు సామాన్యుడెలాగౌతారు.అందులోనూ శేషగిరి లాంటి గొప్పవాడి ప్రాణాల్ని కాపాడగల శక్తి ఉన్న మీరు సామాన్యుడేలా గౌతారు. మీరు నిస్సందేహంగా గొప్పవారే అన్నాడు గవర్రాజు.
నేను మాట్లాడకుండా అతని వంకే చూస్తూ ఉండిపోయాను.
గవర్రాజు మళ్ళీ అన్నాడు. "శేషగిరి గారి శత్రువులు నాకు శత్రువులు. శత్రుత్వమంటే నేనెంత కైనా తెగిస్తానని ఇదివరలో మీకు చెప్పి ఉన్నాను. అందులోని నిజాన్ని నిన్నరాత్రి మీరు చవి చూశారు. నిన్నరాత్రి మిమ్మల్ని బెదిరించడానికి మాత్రమే హత్య ప్రయత్నం జరిగింది. అంతే కానీ చేతకాక వదిలేసి వెళ్ళిపోలేదు. నా మాటల్లోని నిజమెంతో తెలియడం కోసం నిన్న రాత్రి మచ్చు చూపించాను. ఇంకోసారి మరి బెదిరింపు ఉండదు" అని ఒక్క క్షణం ఆగి "శత్రుత్వం విషయంలో నిజాన్ని చవి చూశారు గదా , స్నేహం విషయంలో నిజం కూడా అంతేనని గ్రహించి ధైర్యంగా ఉండండి" అన్నాడు.
నాకేదోలా గుంది. అనవసరంగా ఇబ్బందుల్లో పడుతున్నాని భయంగా ఉంది. "అసలు నేను డిటెక్టివ్ రామారావుకి రహస్యం చెప్పెసినట్లు మీకెలా తెలుసు?' అనడిగాను.
'ఆ మాత్రం రేలుసుకోలేనా పంతులు గారూ, నిన్న రాత్రి మీ దగ్గరకు వచ్చినది డిటెక్టివ్ రామారావు కాదు. నేను పంపిన మనిషి. మీరు నా మాటల నెంతగా లక్ష్య పెడతారో చూడ్డానికీ, మీవల్ల శేషగిరి గారికి ప్రమాదమున్నదీ లేనిదీ తెలుసుకునేటందుకూ, నేనతన్ని పంపాను. అలా చేయడం మంచిదే అయింది. మీరెంత భయస్తుడో , మీ భయంలో శేషగిరి కెంత ప్రమాదం తీసుకు రాగలరో తెలిసింది" అన్నాడు గవర్రాజు.
అయితే రామావతి చెప్పినది నిజమే నన్నమాట. రాత్రి డిటెక్టివ్ రామారావు పేరుతొ అతనెందుకుకొచ్చాడో తెలిసింది. శేషగిరి నన్ను పరీక్షించాడు. ఆ పరీక్షలో నేనోడిపోయాను. ఫలితంగా నా ప్రాణం తీయాలని ప్రయత్నించాడు. కామరాజు కారణంగా నేను రక్షించ బడ్డాను. కానీ, తన మనిషికిబెదిరించే ఉద్దేశ్యమే కానీ, హత్య చేసే ఉద్దేశ్యం లేనట్లు గవర్రాజు చెబుతున్నాడు. కామరాజు కాకా ఆ స్థానంలో నేనున్నట్లయితే ఆ హత్య జరిగి ఉండేదా.
అంతా అయోమయంగా ఉంది. కానీ శేషగిరి ఘటికుడని అతను నన్నో కంట కనిపెట్టి ఉన్నడనీ అర్ధమవుతోంది. శేషగిరి ఈవిధంగా నన్ను పరీక్షిస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. అతను ఆరితేరిన మోసగాడు లాగున్నాడు. అతనితో భేటీ నా ప్రాణాలకే ప్రమాదం. అత్యంత సామాన్యుణ్ణి నేను. కానీ, గవర్రాజు స్నేహం నన్ను సామాన్యుణ్ణి స్థాయి నుంచి పైకి తీసుకుపోయినట్లు చెబుతున్నాడతడు .
