Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 2

 

    అతన్ని నేనాశ్చర్యంగా చూస్తూ --"ఎవరు కావాలండీ?" అనడిగాను.
    "శివశంకరం గారూ మీరేనా?" అనడిగేడతను.
    ఆశ్చర్యపోతూ -"అవును - నేనే!" అన్నాను.
    'అయితే మీరే కావాలి-' అన్నాడతను.
    "రండి - కూర్చోండి- " అన్నాను , అతను వచ్చి కుర్చీలో కూర్చుని ఒకసారి మా యింటిని పరీక్షగా చూశాడు. అతని ముఖంలో రవంత తిరస్కార భావం కనబడింది.
    "బడి పంతులట కదా మీరు-" అన్నాడతడు.
    అతనడిగిన పద్దతి నాకు నచ్చలేదు- "మీరెవరో తెలుసుకోవచ్చా?"
    "నేనేవర్నంటారా - "అతను అర్ధం లేకుండా నవ్వాడు - "పచ్చి నెత్తురు తాగేవాడ్ని -"
    ఉలిక్కిపడ్డాను. అతను పచ్చి నెత్తురు తాగేరకమని చూస్తుంటే అనిపిస్తుంది. కానీ అతనికి మా యింట్లో పనేముంది? నాకు కాస్త భయం కూడా వేసింది. మా ఇంటిలో పచ్చి నెత్తురు దొరకదని - ఎలా చెప్పగలను-" మొత్తం అయిదగురం మనుషులున్నాం!
    "మీమాటలు సరిగా అర్ధం కావడం లేదు. మీకు నాతొ పనేమిటో కూడా తెలియడం లేదు...." అన్నాను వీలైనంత వినయంగా.
    'ఆ అవసరం మీకేం లేదు లెండి. నేను మాములుగా నాటు సారా తాగుతుంటాను. అవసరమైనప్పుడు మాత్రమే పచ్చి నెత్తురు తాగు తుంటాను. ఖర్చు గురించి భయపడే రకం కాదు నేను. ఎంత ఖర్చయినా నా గురించి భరించే పెద్ద మనిషి ఉన్నాడు...." అతను ఆగాడు.
    నేనేమీ మాట్లాడకుండా అతని వంకే చూస్తున్నాను.
    "ఆ పెద్దమనిషి పేరు శేషగిరి. అయన ధర్మాత్ముడు , లేని వాళ్ళ కివ్వడానికి కాయన చేతికి ఎముకుండదు. ఎవరింట్లో నైనా పెళ్ళి అంటే అయన అయిదు వేలు దానం కూడా ఇస్తుంటాడు...."
    'అలాగా?" అన్నాను ఏమనాలో తెలియక.
    "పచ్చి నెత్తురు తాగే నేను శేషగిరి రావంటే ప్రానమిస్తాను. అయన స్నేహితులంతా నాకు స్నేహితులు. అయన శత్రువులంతా నాకు శత్రువులు. శత్రుత్వమంటే నేనంత కైనా తెగిస్తాను. ఎందుకంటె నాకు జైలు, పోలీసులు అంటే భయం లేదు...." అన్నాడతను.
    "మీపేరు తెలుసుకోవచ్చా...." అడిగాను.
    "గవర్రాజు ...." అన్నాడతను.
    "చూడండి గవర్రాజు గారూ - మీరీ విశేషాలన్నీ నా కెందుకు చెబుతున్నారో తెలియదు...."
    "ఇంకా చెబుతాను వినండి...." అన్నాడు గవర్రాజు. "నా కెవ్వరూ లేరు నాకు నేనే , ఈ లోకంలో అందుకే నేనేమై పోతానన్న భయం లేదు నాకు. శేషగిరి గారేదైనా అయిపోతారని అనుమానం కలిగినప్పుడు నేనేమైనా అయిపోతాను...."
    'అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ వివరాలు తెలుసు కోవడం వల్ల నాకు ప్రయోజనమేమిటి?"
    'చాలా ప్రయోజనముంది. ఎప్పుడైనా శేషగిరి  గురించి ఆలోచించినప్పుడు -- మీ ఆలోచనల్లోకి నన్నుకూడా రానివ్వండి. అప్పుడు మీ ఆలోచనలు సక్రమైన దారిలో పడతాయి...." అతను లేచి "వస్తాను మరి . చాలా శ్రమనిచ్చినట్లున్నాను. నన్ను మాత్రం మరచి పోకండి...." అన్నాడు.
    అతను వెళ్ళిపోయాడు.
    అర్ధమైంది. నా బుద్ది పెడత్రోవలు పడుతుందేమోనని శేషగిరి నాకు హెచ్చరిక పంపాడు.

                                    3   

    వరలక్ష్మి అత్తారింటికి వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళు గానో అలవాటైపోయింది నా పెద్దకూతురు ఇంట్లో లేకపోవడంతో ఇల్లు బాగా చిన్నబోయింది.
    సాయంత్రం ఒక్కణ్ణి నడవ లో కూర్చున్నాను. ఆ రోజు ప్రయివేటు లేదు. కాస్త దాహం వేస్తె అలవాటు ప్రకారం 'అమ్మాయ్ వరలక్ష్మీ" అని పిలిచి నాలిక్కర్చుకున్నాను. ఇంకెక్కడి వరలక్ష్మి - అది హాయిగా కాపురానికి వెళ్ళిపోయింది.
    "ఏం నాన్నా!" అంటూ పరుగెత్తుకు వచ్చింది. నా రెండో కూతురు రామావతి. దానికేసి చూడ్డానికి భయం వేసింది. ఎవరు మాత్రం నా దగ్గర శాశ్వతంగా వుంటారు. ఈనాడనుబంధాల్ని పెంచుకుంటే రేపది ఆ బంధాలు తెంచుకుని భర్తతో ఎగురి పోతుంది. అయినా నెమ్మదిగా రామావతి క్కూడా సంబంధాలు చూడాలనుకున్నాను.
    "ఏం నాన్నా"అంది మళ్ళీ రామావతి.
    "కాస్త దాహంగా ఉందమ్మా" అన్నాను. రామావతి లోపలకు పరుగెత్తింది. మరుక్షణంలోనే చేతిలో గ్లాసుతో మంచినీళ్ళు తీసుకువచ్చి నాకిచ్చింది. సరిగ్గా అప్పుడే ఎవరో తలుపు తట్టారు.
    "ఎవరో చూడమ్మా" అని మంచినీళ్ళు తాగి గ్లాసు కుర్చీ పక్క నేలమీద పెట్టాను.
    రామావతి తలుపు తీసింది. సుమారు పాతికేళ్ళ యువకుడు లోపల అడుగు పెట్టాడు. మనిషి చాలా ఫేషన్ బుల్ గా ఉన్నాడు. "శివశంకరరావు గారి ఇల్లేదానాండీ!" అన్నాడతను మర్యాదగా.
    ఆ యువకుణ్ణి చూసి రామావతి సిగ్గుపడింది. "ఆయనే శివశంకరం గారు, మా నాన్న" అని తను ఇంట్లోకి వెళ్ళిపోయింది. అతను నెమ్మదిగా నా దగ్గరకు నడుచుకుంటూ వచ్చి, "నమస్కారమండీ" అన్నాడు.
    అతన్ని నేను పరీక్షగా చూశాను. మనిషి నెక్కడా చూసిన గుర్తు లేదు. ఎప్పుడూ పరిచయమున్నట్లు స్పురించడం లేదు. ఇప్పుడే మొదటి సరిగా చూస్తున్నట్లుంది. సంశయంగా చూస్తూ, 'అలా కూర్చోండి . మీరెవరో ఎంత ప్రయత్నించినా గుర్తు రావడం లేదు" అన్నాను.
    "ఎలా వస్తాన్లెండి. ఇదే మన తోలి పరిచయం" అన్నాడతను నవ్వి.
    అతను మాట్లాడ్డం లో వినయం, మర్యాద, గౌరవం అన్నీ ఇమిడి ఉన్నాయి.
    "నన్ను రామారావంటారు. నేనొక ప్రయివేట్ డిటెక్టివ్ ని" అన్నాడతను మళ్ళీ.
    ఆశ్చర్యంగా అతని వంక చూసి , "ప్రయివేట్ డిటెక్టివ్ లకు నాతొ ఏం పని?" అన్నాను.
    "ఒక హత్య కేసు విషయంలో మీ దగ్గర్నుంచీ కొంత సమాచారం లభిస్తుందని తెలిసి వచ్చాను."
    "హత్య కేసా?" భయంగా అన్నాను.
    'అవును. శివరావు హత్య కేసు!" అన్నాడతను.
    "శివరావంటే ఎవరు?"
    "శివాలయం వీధిలో సుబ్రహ్మణ్యం గారింట్లో గతనెలలో హత్య చేయబడ్డాడు శివరావు " రామారావు చెప్పాడు.
    నాకు అర్ధమైంది. ఆ హత్యకు నేను ప్రత్యక్ష సాక్షిని. అప్పట్లో పేపర్లో పడిన వివరాలను బట్టి హతుడి పేరు తెలియలేదు. ఆతర్వాత ఆ కేసు గురించి పూర్తిగా మరిచిపోయాను. అందులోనూ గవర్రాజు వచ్చి హెచ్చరించాడు. కాబట్టి ఇంకా అసలా విషయం పట్టించుకోదల్చలేదు. అయితే ఆ హత్య గురించి నాకు తెలుసునన్న విషయం ప్రయివేట్ డిటెక్టివ్ రామారావు దాకా ఎలా వచ్చింది?
    'అవును, అ హత్య గురించి పేపర్లో చదివాను. అప్పట్లో హతుడి పేరు తెలియదని రాశారు...."
    రామారావు నవ్వాడు. "ఏ కేసయినా ముందుగా అలాగే ఉంటుంది. కానీ, పోలీసులు చేతులు మూసుక్కుర్చోరు. వెంట్రుక నుంచి మొదలు పెట్టి మనిషిని సాధిస్తారు. ఆ తర్వాత కేసు చాలా దూరం వెళ్ళింది. హతుడి పేరు శివరావు. అతడొక బ్లాక్ మెయిలర్. ఈ ఊళ్ళో ని ధనవంతులు చాలామంది ప్రాణాలతని గుప్పెట్లో వున్నాయి. అందర్నీ బెదిరించి డబ్బు గుంజడం అతడి వృత్తి. అతడు డబ్బు  తీసుకుందుకు సుబ్రహ్మణ్యం యింటిని ఎన్నుకున్నాడు.
    సుబ్రహ్మణ్యానిది ఊరు కాదు. కానీ, అతనికీ ఊళ్ళో ఇల్లుంది. ఆ ఇంటి నతను  శివరావు కద్దే కిచ్చాడు. నెలనెలా టంచనుగా అద్దె డబ్బులు మనియార్డరు రూపంలో చేరుతుండడం వల్ల అతను ఇంటి గురించి పట్టించుకోలేదు. శివరావు బ్లాక్ మెయిల్ చేయబడుతున్న ఒక ధనవంతుడు డబ్బుతో వచ్చినట్టే వచ్చి శివరావుని హత్య చేసి వెళ్ళిపోయాడు. ఆ హంతకుడెవరో మీరు చెప్పాలి...."
    నేనాశ్చర్యంగా అతని వంక చూశాను. "మీరు చెప్పిన వివరాలు చాలా ఆసక్తి కరంగా వున్నాయి. కానీ ఆ హంతకుడేవరో నన్ను చెప్పమనడం భావ్యంగా లేదు. ఇది పూర్తిగా నాకు సంబంధించని విషయం."
    "మేష్టారూ , మీరాబద్ధమాడుతున్నారు. ఆ హంతకుడెవరో మీకు తెలుసు. మీకు తెలిసిన నిజాన్ని మీరు బయటపెట్టి తీరాలి. అలా చేయకపోతే ఒక నిర్దోషి అన్యాయంగా బలై పోతాడు " అన్నాడు రామారావు.
    ఉలిక్కిపడ్డాను. "నిర్ధిషి బలికావడమా, కాస్త వివరంగా చెప్పండి!"
    "చెప్పడానికి కేమీ లేదు. మామూలు కధే. శివరావును హత్య చేశాడన్న ఆరోపణ పై అమాయకుడు మోహన్ అరెస్ట య్యాడు." అన్నాడు రామారావు నిట్టూర్చి.
    'అదేల్లా జరిగింది?"
    "మోహన్ -- భాగ్యవంతుల బిడ్డ. మాధవరావు గారు మీకు తెలిసే వుంటారు. అయన ఏకైక పుత్రుడు. ఉన్నవాడు కాబట్టి , కాస్త విలాసంగా తిరుగుతాడు. తనెలాగుంటే నేం, ఎవర్నీ భాదించడతడు. మనసు చాలా మంచిది. హత్యాస్థలం లో - హత్య పరిశోధించినపుడు పోలీసుల కోక ప్రత్యేక పరిమళం సోకింది. ఆ పరిమళం అక్కడున్న కుర్చీలోంచి వస్తోంది. మంచి పరిమళం గల సెంటు రాసుకున్న వ్యక్తీ ఆ కుర్చీలో కూర్చుని వుండాలని పోలీసులు అభిప్రాయ పడ్డారు. ఆ కుర్చీ చేతుల మీద యేవరివో వెలి ముద్రలుంటే ఫోటోలు తీశారు. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి, పోలీసులు రహస్యంగా వుంచారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS