Previous Page Next Page 
విశాలి పేజి 3

                              
    "అమ్మా! అమ్మా! అక్కొస్తూంది" అంటూ తల్లితో చెప్పేందుకు లోపలికి పరుగెత్తింది చిట్టి, గుమ్మంలో విశాలిని చూస్తూనే.
    "ఓ పక్క చీకటి పడుతుంటే ఇప్పుడా పేరంటానికి రావడం? పక్కింటికి పేరంటానికి రావడానికి కూడా ఇంత సేపు చెయ్యాలా? అంత తీరని పనులూ, తల మునిగే పనులూ ఏముంటాయి గనకా? బెట్టుసరి కాక పోతే?" చిట్టి వాళ్ళమ్మ లోపలనుంచి విసిరే బాణాలు సూటిగా గుండెల్లో గుచ్చుకున్నాయి విశాలికి. తెల్లబోయి, అవమానాన్ని అదిమిపట్టి, మునిపంటితో క్రింది పెదవి నొక్కిపట్టి, అడుగు లోపలికి వెయ్యడంకూడా మరిచిపోయి అలాగే నిలబడిపోయింది.
    తను వినాలనే అంత గట్టిగా అంటూందా ఆవిడ? లేకపోతే తనింకా గుమ్మంలోకి రాలేదనుకుని అంత గట్టిగా అనేసిందా? భోధపడలేదు విశాలికి. ఏది ఏమైనా మొత్తానికి ఆవిడ ఉద్దేశమేమిటో అర్ధమై పోయింది. పెందలాడే తను పేరంటానికి రానందుకు ఆవిడకి మంటగా ఉంది. కానీ.....బెట్టుసరి చూపించ వలసిన అవసరం ఏముంది తనకి? అయినా ఇందులో 'బెట్టు' ఏముంది? అర్ధంలేని మాటలు కాకపోతే?    
    పేరంటానికి రావడం, ఎవరికైనా ఒక అడుగు ముందో వెనకో కావచ్చు. అంతమాత్రానికే వచ్చిన పేరంటాళ్ళ మీద విసుక్కుంటే అది పొరపాటు కాదా? ఆటువంటప్పుడసలు పేరంటం పిలవడమెందుకు?
    "లోపలికి పదండి. నిలబడి పోయారేం?" ఉలిక్కి పడి వెనక్కి తిరిగింది విశాలి. ముకుందరావు ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తున్నాడు. నేలచూపులు చూస్తూ లోపలికి నడిచింది. వెనకే వచ్చాడతను. లోపలికి వస్తున్న విశాలినీ, భర్తనీ చూస్తూ ముఖం చిట్లించుకుంది చిట్టి తల్లి అంబుజాక్షి.
    ఏదో తప్పు చేసిన వాడిలా భార్య ముఖంలోకి ఒకసారి చూచి పక్కగదిలోకి వెళ్ళిపోయాడు ముకుందరావు.
    మొదట విశాలిని కూర్చోమనైనా అనకుండా భర్త వెనకే గదిలోకి వెళ్ళింది అంబుజాక్షి.
    "ఎలాగైతేనేం? ఆ అమ్మాయి పేరంటానికి వచ్చే టైముకే ఇల్లు చేరుకున్నారే? మాట్లాడుకున్నారా లేదా ఇద్దరూ, పాపం!" అంబుజ గొంతులో అనుమానం, ఈర్ష్య, అసూయ అన్నీ పెనవేసుకున్నాయి.
    "ఛీ! ఛీ! నీకు వెయ్యి దండాలు పెడతాను. అవతలికి వెళ్ళు. నలుగుర్లో నా పరువు నిలబెట్టు" ముకుంద రావు గొంతులో బాధ, కోపం.
    విసురుగా ఇవతలికి వచ్చింది అంబుజ.
    "కూర్చోండి" అంది మాటలో ఏమాత్రం మర్యాద తొణక్కుండా.
    కొయ్యబొమ్మలా నిలబడిపోయిన విశాలి చాపమీద చతికిలపడింది.
    భూమిలోకి కుంచుకుపోతున్నట్లుగా బాధ పడింది. తలెత్తి ఆవిడ ముఖం చూడటానికికూడా అసహ్యం వేసింది.
    తనంటే అంత అనుమానం ఉన్న మనిషి, అసహ్యం ఉన్న మనిషి పేరంటానికి రమ్మని పిలవడం ఎందుకు? వాళ్ళు పక్కింట్లోకి కాపరానికి వచ్చి ఇన్నాళ్ళయింది. ఒక్కసారికూడా ఏ సందర్భంలోనూ తనూ, ముకుందరావూ మాట్లాడుకో లేదు. ముఖాముఖి ఎదురుపడనుకూడా లేదు. అటువంటప్పుడు ఎలా తమ ఇద్దర్నీ అనుమానించగల్గుతూంది?
    గుండె దహించుకుపోతున్నా కుదురుగా కూర్చుంది విశాలి. నఖశిఖపర్యంతం విశాలిని పరీక్షగా చూసింది అంబుజ. తల దించుకుంది విశాలి. తను కట్టుకున్న వాయిల్ చీరమీదే ఆవిడ దృష్టి నిలిచిందని కనిపెట్టగలిగింది. ఆవిడ కట్టుకున్న పట్టుచీర ముందు తన వాయిల్ చీర వెలవెలబోతూందని తనకి తెలుసు. అయితే మాత్రం తన చీరవంక ఆవిడ అంత అసహ్యంగా ఎందుకూ చూడటం?
    అంబుజ గర్వంగా విశాలి ముఖంలోకి చూసి తన పట్టుచీర రెండు మూడు సార్లు సద్దుకుంది.    
    నవ్వొచ్చింది విశాలికి.
    ఆ చీరని మాటిమాటికీ అలా సద్దుకోకపోతే తనకా చీర కనిపించదా?
    కొంచెంసేపు మౌనంగా ఉన్న తరవాత, ఆవిడ మాట్లాడినా మాట్లాడకపోయినా తనైనా ఏదో ఒకటి మాట్లాడకపోవడం భావ్యం కాదనిపించి, "చిట్టి మాటలు బలే ముద్దొస్తాయండి" అంది చివరికి చిరునవ్వుతో.
    "చెప్పిన మాట ఒక్కటీ వినదు. ఉత్త పెంకిది. నే నెవరింటికి వెళ్ళద్దంటానో వాళ్ళింటికే వెళ్ళి ఆడుతూ కూచుంటుంది. వాళ్ళ నాన్నని చూసుకునే ఆ మొండితనం చేస్తుంది. మొగాళ్ళకేమిటి - వాళ్ళు పాడయ్యేదే కాక పిల్లల్ని కూడా పాడుచేస్తారు." అంబుజ మాటల్లో కఠినత్వంతో కూడిన కోపం గోచరించింది.
    ఆ మాటలకి తెల్లబోయింది విశాలి.
    ఒక్క క్షణం ఈవిడకూడా ఒక గృహిణేనా అని అనిపించి ఆశ్చర్యపోయింది.
    లేకపోతే ఎవరో పరాయివాళ్ళ ముందు తన భర్తని తక్కువచేసి మాట్లాడుతుందా?
    ఎంత హాస్యాస్పదం!
    ఇంతలోనే బయట ఆడుకుంటున్న చిట్టి లోపలికి పరుగెత్తుకొచ్చింది.
    "అమ్మా! ఇంకా ఎవరో వస్తున్నారే పేరంటానికి." చిట్టి మాట పూర్తవగానే గుమ్మంలో అడుగు పెట్టింది రాఘవరావుగారి భార్య శాంతమ్మ.
    ఎంతో సంతోషం ప్రకటిస్తూ, "రండి, రండి" అంది అంబుజ లేస్తూ.
    ఉన్నవాళ్ళు కాబట్టి, రాఘవరావు గారి భార్య తన కంటే ఆలాస్యంగా పేరంటానికి వచ్చినా అంబుజకి ఏమాత్రం కోపం కలగలేదని గ్రహించింది విశాలి. ఆ భావంతో మెల్లిగా నవ్వుకుంది.
    విశాలి కెదురుగా కూర్చుంది శాంతమ్మ. "ఏమమ్మా, విశాలీ? కులాసానా?"
    రాఘవరావుగారికీ, శాంతమ్మకీ కూడా విశాలంటే చాలా ఇష్టం.
    బలరామయ్య స్నేహితుడే రాఘవరావుగారు.
    శాంతమ్మ ప్రశ్నకి వినయంగా సమాధానం చెప్పి తల దించుకుంది విశాలి.
    "అక్కా!" అంటూ విశాలి పక్క చేరింది చిట్టి. కాసేపు ఈ కబుర్లూ ఆ కబుర్లూ చెప్పి, "నీ పాట విని చాలా రోజులైంది. ఓ పాట పా డీ వేళ" అంది శాంతమ్మ విశాలి కన్నుల్లోకి చూస్తూ.
    నల్లగా నిగనిగలాడే విశాల నయనాలు కదిలించి నవ్వింది విశాలి. "ఇంకో సా రెప్పుడైనా పాడతానులెండి."
    "ఇంకో సారంటే మళ్ళీ ఎప్పుడో ఏమో? ఇప్పుడొకటి పాడవలసిందే" అంటూనే అంబుజ వైపు తిరిగిందావిడ.
    "విశాలి చాలా చక్కగా పాడుతుంది. వినే ఉంటారు మీరు."
    "లేదు. వినలేదు" ముక్తసరిగా అంది అంబుజ.
    ఆశ్చర్యపోయింది శాంతమ్మ.
    "పక్క పక్క ఇళ్ళేగా మీవి? ఒక్కనాడైనా విశాలి చేత పాట పాడించుకు వినలేదా మీరు?"
    ఆ మాటతో ముఖం మాడ్చుకుంది అంబుజ.
    ఆ తరవాత అట్టే బతిమాలించుకోకుండానే పాడింది విశాలి.
    "పాట పాడుమా కృష్ణా.
    పలుకు తేనెలొలుకు నటుల..."
    మధురంగా పాడుతూంది "విశాలి.
    ముగ్ధురాలై వింటూంది శాంతమ్మ.
    మై మరిచి విశాలి ముఖంలోకి, చూస్తూంది చిట్టి.
    ముళ్ళమీద కూర్చున్నట్టుంది అంబుజకి.
    విశాలి అంత మధురంగా పాడుతుంటే మనసంతా అసూయతో మండిపోతూంది.
    పక్క గదిలో ముకుందరావుకూడా శ్రద్ధగా వింటున్నాడా పాట.
    పాట పూర్తవగానే, దాని కోసమే కాచుకున్నట్టుగా చరాలున లేచి లోపలికి వెళ్ళి వాయినం ప్లేటులో తీసుకొచ్చి విశాలి రుమాల్లో ఒక్క విసురున పంపింది అంబుజ.
    ఎంతో నిగ్రహంమీద బాధని అణిచి పెట్టుకుని లేచింది. విశాలి, "వెళ్ళొస్తా"నని చెపుతూ.
    "విశాలీ, మా ఇంటి కప్పుడప్పుడొస్తూ ఉండమ్మా!" ఆప్యాయత ధ్వనించింది శాంతమ్మ స్వరంలో.
    "అలాగేనండీ." ముందుకి నడిచింది విశాలి.
    
                               *    *    *

    దగ్గుతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు బలరామయ్య. కుడిచేయి గుండెలమీద వేసుకుని ఆయాస పడుతున్నాడు.
    తాతయ్య పరిస్థితి చూసి కళ్ళనీళ్ళ పర్యంతమైంది విశాలికి. మెల్లగా మెడకింద చేయి వేసి పట్టుకుంది.
    "ఎలా ఉంది, తాతయ్యా? మంచినీళ్ళివ్వనా?" దుఃఖాన్ని గొంతులో అదిమిపట్టింది.
    మాట్లాడలేకపోతున్నాడు బలరామయ్య.
    పది నిమిషాలకి దగ్గు తగ్గింది. కానీ, ఆయాసంతో మాట్లాడే స్థితిలో లేడు.
    ఏదో చెప్పాలని ప్రయత్నం.
    చెప్పలేక విచారం.
    భయంతో వణికింది విశాలి.
    అన్నయ్యకూడా ఇంట్లో లేడు. ఏం చెయ్యాలి?ఎవరు పిలుచుకొస్తారు డాక్టర్ని?
    హడావిడిగా వీధిలోకి పరుగెత్తింది.
    అప్పుడే ఇంట్లోంచి బయటికి వచ్చిన ముకుందరావు దేవుడులా కనిపించాడు.    
    ఆ సమయంలో, తమ ఇద్దరిమీదా అనుమానం పెంచుకున్న అంబుజ గుర్తు రాలేదు.
    "ఏమండి!" అంది ఇంకేమీ ఆలోచించకుండా. వెనక్కి తిరిగాడు ముకుందరావు.
    మనసులో బాధ కళ్ళలో కదులాడుతుండగా కంగారుగా చూస్తూంది విశాలి.    
    "ఏం కావాలండీ?" రెండడుగులు విశాలి వైపు నడిచాడు ముకుందరావు.
    "మరి....మా తాతయ్య పరిస్థితి బాగులేదండీ. డాక్టర్ని పిలవడానికి అన్నయ్యకూడా ఇంట్లో లేడు..." ఇంక అంతకంటే ఏం చెప్పాలో తెలియలేదు విశాలికి. ఇంకేం మాట్లాడినాకూడా ఏడుపు పైకే వచ్చేస్తుందేమో ననిపించి, మునిపంటితో క్రింది పెదవి నొక్కి పెట్టింది.    
    "అలాగే డాక్టర్ని పిలుస్తాను. అసలే పరిస్థితిలో ఉన్నారో నన్నొకసారి చూడనివ్వండి."
    ఇద్దరూ లోపలికి నడిచారు.
    మనవరాల్ని దగ్గిరకి రమ్మన్నట్టు సైగ చేశాడు బలరామయ్య.
    కన్నీరు దాచుకుందుకు వ్యర్ధ ప్రయత్నం చేస్తూ తాతయ్య మంచం పక్కన మోకాళ్ళమీద కూర్చుంది విశాలి.
    ఆశీర్వదిస్తున్నట్టుగా విశాలి తలమీద తన బలహీన మైన చెయ్యి వేశాడాయన.
    అప్పుడే లోపలికి అడుగుపెట్టాడు రామం.
    ముకుందరావుని చూస్తూనే ముఖం ముడుచుకున్నాడు.
    మోకాళ్ళలో తల దూర్చి ఏడుస్తున్న విశాలి ఏదో అనుమానం గోచరించగా చటుక్కున తల ఎత్తింది.
    మంచంమీద తాతయ్య లేడు.
    బయట ముకుందరావు రామంతో ఏదో  మాట్లాడుతుండటం వినిపించింది.
    తల్లీ, తండ్రీ తానే అయి పెంచుకొచ్చిన తాతయ్య ఇక లేదన్న సత్యం విశాలి కన్నుల్లో కాంతి నార్పింది. మనసులో మూగబాధ మండింది.
    మంటల కాహుతి అయ్యే మనసుమీద చల్లని నీరు చిలకరిస్తూంది అన్నయ్య అండగా ఉన్నాడన్న ఆశాకిరణం. రామంతో మాట్లాడటం అయ్యాక ఇంట్లోకి వెళ్ళిన ముకుందరావు విశాలిని ఓదార్చి రమ్మని భార్యతో చెప్పాడు.
    చిర్రెత్తుకొచ్చింది అంబుజకి.
    వాళ్ళిద్దరూ చాలాసేపు ఘర్షణపడ్డారు.
    "నన్నెందు కర్ధం చేసుకోవు?" అన్నాడు నెలకి రెండు తెలుగు సినిమాలు చూసే ముకుందరావు. నిజానికి నెలకి రెండు సినిమాలు చూడటం తప్పించి ఇంకే చెడు అలవాట్లూ ముకుందరావుకి లేవనే చెప్పాలి. చివరి కేమనుకుందో ఏమో తనలో తనే ఏదో సణుక్కుంటూ విశాలి దగ్గిరికి వెళ్ళింది అంబుజ. నమ్మలేని నిజాన్ని ఎదురుగా పెట్టుకుని నలిగిపోతున్న విశాలి ఆవిడ రావడం గమనించలేదు. అదే తనకి అవమానంగా భావించింది అంబుజ. పొడిదగ్గు దగ్గింది తన రాకని తెలియజేస్తూ, నీళ్ళు నిండిన కన్నుల్ పైకెత్తింది విశాలి. గుండెల్లో పొంగుతున్న బాధకి ప్రతిగా ఉన్నాయా కన్నులు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS