Previous Page Next Page 
విశాలి పేజి 4


    ఏవో నాలుగు ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళిపోయింది అంబుజ.
    సువర్ణ వచ్చింది. స్నేహితురాలి బాధలో తనూ భాగం పంచుకుంది. కొన్నాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటిలో ఉండమని కోరింది.
    "ఒక్కదానివీ ఉంటే జ్ఞాపకాల తరంగాలు నిన్ను మరింత ముంచెత్తుతాయి. బెంబేలు పడతావు. నా మాట విను. కొంచెం ఈ పరిస్థితి అలవాటయ్యే వరకైనా మా ఇంట్లో ఉందువు గాని రా. నీకు మీ ఇల్లొకటీ, మా ఇల్లొకటీ కాదు" అంటూ ఆప్యాయతతో విశాలిని పెనవేసుకుంది.
    ఆ కౌగిట్లో ప్రపంచాన్నే జయించే ధైర్యంపొందింది విశాలి.
    వెచ్చని కన్నీటిలో సువర్ణ పయ్యెద తడిసింది.
    చల్లని ఓదార్పుతో విశాలి హృదయం శమన పొందింది.
    నీరు నిండిన కళ్ళతో నిర్మలంగా నవ్వింది విశాలి.
    "ఎందుకులే, సువర్ణా! మళ్ళీ అన్నయ్య మాత్రం ఒక్కడే ఉండద్దూ? అయినా అన్నయ్య ఉండగా నాకు మాత్రం భయం ఎందుకూ? నువ్వు మరోలా అనుకోకు."
    కాసేపు విశాలికి ధైర్యం చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది సువర్ణ.
    
                             *    *    *

    కుంపటి మీద బియ్యం పెట్టి కూర తరుగుతూంది విశాలి.
    "అక్కా" అంటూ వచ్చింది చిట్టి.
    "రా! చిట్టీ! బడికెడుతున్నావా? మీ బళ్ళో విశేషాలేమిటి?" చిట్టితో బాగా కాలక్షేపం అవుతుంది విశాలికి.
    చిట్టి ఉన్న కాసేపూ కథలు, కబుర్లతోటి కాలం దొర్లిపోతుంది.    
    కానీ ఆ రోజు చిట్టి తన సందేహాన్ని తీర్చుకోదలుచుకుంది. అందుకే సూటిగా విశాలి కళ్ళలోకి చూస్తూ భయం భయంగా అడిగింది: "అక్కా! మరి, ఆ రోజేమో నేను తాతయ్య ఎక్కడికెళ్ళాడని అడిగితే ఊరెళ్ళాడు, వస్తాడని చెప్పావుగా? మరి ఇంకా రాలేదేం?"
    విశాలి చేతిలో తరుగుతున్న బెండకాయ జారి పడింది. అలాగే చిట్టివైపు చూస్తూ కూర్చుండి పోయింది. ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యం తో ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయింది చిట్టి. తరవాత మెల్లిగా బెదురుచూపులు చూస్తూ చెప్పింది:
    "అమ్మని.....అడిగితే.....మరేమో తంతా నవతలికి పో అంది. అందుకని నిన్నే అడిగితే చెపుతావని వచ్చాను."
    ఉబికివస్తున్న కన్నీటిని కొంగుతో అద్దింది విశాలి.
    "ఏడుస్తున్నావా, అక్కా? పోనీలే, ఇంకెప్పుడూ అడగనుగా?" చిన్నారి హృదయం క్క కన్నుల్లో నీరు చూడలేకపోయింది.    
    "తాతయ్య దేవుడి దగ్గిరి కెళ్ళాడమ్మా! ఇంక రాడు. అందరంకూడా ముసలాళ్ళం అయ్యాక దేవుడి దగ్గిరి కెళ్ళవలసిందే!" తాతయ్య మళ్ళీ వస్తాడని చెప్పి ఆ పిల్లని మభ్యపెట్టవలసిన అవసరం కనిపించలేదు విశాలికి. తను ఒకటి చెపితే, ఇంకొకరు అదే విషయం గురించి ఇంకోలా చెప్పవచ్చు. నిజాన్ని దాచినందువల్ల ఆ పిల్ల మనసులో అర్ధంకాని ఆలోచనలు రేకెత్తించినట్టు అవుతుంది తప్ప మరేమీ కాదు. అందుకని ఆ చిన్నారి మనసు కర్ధమయ్యే భాషలోనే సరళంగా ఉన్న మాట చెప్పడమే మంచిది. మళ్ళీ మళ్ళీ దాన్ని గురించిన ప్రశ్నలు తలెత్తవు. అందుకే తాతయ్య మరి రాడన్న సత్యాన్ని ఆ విధంగా బయట పెట్ట గలిగింది విశాలి.
    సరిగ్గా అర్ధం కాకపోయినా బొత్తిగా తెలియకుండా మాత్రం ఉండిపోలేదు చిట్టికి.
    "మరైతే, అక్కా, నువ్వొక్కదానివే ఉంటావా?"
    చిట్టి బుగ్గమీద చిన్నగా దెబ్బ వేసింది విశాలి.
    "ఒక్కదాన్నే ఏమిటీ? అన్నయ్య ఉన్నాడుగా? ఆఁ ఇంక నువ్వెళ్ళి కాసేపు ఆడుకో వంట అయిపోయాక నేను నిన్న నీకు సగం కథ చెప్పాను చూడు, ఆ కథ పూర్తిగా చెపుతాను." మాట మార్చింది విశాలి.    
    "ఓ. అలాగే!" తుర్రుమంది చిట్టి.

                                *    *    *

    ఆ రోజు ఆదివారం.
    ప్రైవేట్ క్లాసుందని తయారై చెప్పులు తొడుక్కుని బయలుదేరింది విశాలి.
    "ఆగు! ఎక్కడికి బయలుదేరావ్?" ఖంగున మ్రోగింది రామం గొంతు.
    "కాలేజీకి."
    "నీ లాగా కాలేజీచదువులు వెలగ చెట్టనంత మాత్రాన ఈ వేళ ఆదివారం అనీ, ఆదివారం కాలేజీ ఉండదనీ తెలియనంత వెధవని కాను."
    "ఏమిటన్నయ్యా ఆ మాటలు? ఈ వేళ మాకు ప్రైవేట్ క్లాసుంది. లేకపోతే అబద్ధాలు చెప్పి వెళ్ళవలసిన ఆగత్యం నాకు లేదు."
    "ఆ! తెలుస్తూనే ఉంది అమ్మాయిగారి నాటకం. ఎన్నాళ్ళనించీ వేస్తున్నా వీ వేషాలు?"
    "చదువుకోవడానికి వెళుతున్నాను గానీ, వేషాలు వెయ్యడానిక్కాదు. నువ్వలా ఎందుకు మాట్లాడుతున్నావో నా కర్ధం కావటం లేదు." చాలా నెమ్మదిగా జవాబు చెప్పింది విశాలి.    
    "ఎందుకర్ధం కాదూ? ఆ సత్యం నీ క్లాస్ మేట్ కాదూ? వాడీ వేళ హాయిగా మార్నింగ్ షోకి వెళ్ళాడు. ప్రైవేట్ క్లాస్ ఉంటే ఎందుకెళతాడూ? నేను కాలేజీలో చదవటంలేదు గానీ, కాలేజీకుర్రాళ్ళు చాలామంది నాకు తెలుసు. నువ్వు నా దగ్గిర నాటకం ఆడలేవు." చాలా గర్వంగా జవాబు చెప్పి విశాలి కళ్ళలోకి చూశాడు రామం.
    బాధగా నిట్టూర్చింది విశాలి. "ఆ సత్యం గురించి నీకు తెలుసో తెలియదో గానీ, అన్నయ్యా, అతను కాలేజీకి వచ్చేది చదువుకోసం కాదు, కాలక్షేపానికి. ఒక రోజు వస్తే నాలుగు రోజులు ఎగేస్తాడు. అతనెప్పుడూ ఏ ప్రైవేట్ క్లాస్ కీ రాగా నేను చూడలేదు. చదువుకుంటే ఆ పిక్చర్ మీదే మనసుంది కాబోలు. వెళ్ళాడు. అటువంటివాడిని తీసుకుని నన్ను మాట లనడం..." మరి మాట్లాడలేకపోయింది విశాలి. గబగబా కాలేజీ వైపు దారి తీసింది.

                             *    *    *

    ఆ రోజు చిట్టి మెట్లవరకూ వచ్చి ఆగిపోయింది. లోపలికి రాకుండా అక్కడినించే విశాలిని చూస్తూ నించుంది.
    చిట్టిని చూసినప్పుడల్లా "అయితే ఇంకనించీ నా కా పిల్లతో బాగా కాలక్షేపం అవుతుందనుకుంటాను" అన్న తాతయ్య మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటాయి విశాలికి.
    తాతయ్యని గురించిన జ్ఞాపకాలు మనసులో మెదిలాయి. కళ్ళలో నీళ్ళు కదిలాయి.
    పక్కకి తిరిగి కొనగోటితో కన్నీటిని విదిలించి, చిరునవ్వుతో చిట్టివైపు చూసింది. "రా! చిట్టీ! లోపలికి."
    "ఊఁ! ఊఁ! రాను. నువ్వే ఇక్కడికి రా, అక్కా! ఇక్కడెంత గాలేస్తోందో!" చేతులు తిప్పుకుంటూ చెప్పి అక్కడే మెట్లమీద చతికిలబడింది చిట్టి.
    "ఏదీ? ఎంత గాలేస్తోందో చూడనీ!" నవ్వుకుంటూ వచ్చి మెట్లమీద చిట్టి పక్కనే కూర్చుంది విశాలి.
    "ఏదన్నా కథ చెప్పు, చిట్టీ, నాకు." ఆ పిల్ల కథచెపుతుంటే బలే సరదా విశాలికి.    
    "నాకు రావు. నువ్వే చెప్పక్కా. నేను చెపితే నువ్వు నవ్వుతావు."
    "ఎప్పుడూ నే నేనా చెప్పడం! అప్పుడప్పుడు నువ్వు కూడా చెప్పుతుండాలని చెప్పానా లేదా?" 'ఊఁసరే...మరేమో ఓ రాజూ, రాణీ ఉన్నార్ట, వాళ్ళకి కూతురు పుట్టిందట. అప్పుడేమో వాళ్ళేమో పెళ్ళి చేసుకున్నార్ట. అంతవరకూ చెప్పి ఆయాసం తీర్చుకుందుకు ఆగింది చిట్టి. కథ చెప్పడం అంటే మాటలా మరి!
    "ముందు కూతురు పుట్టిందా? తరవాత పెళ్ళి చేసుకున్నారా?"
    "అవును. ఏం?" బుంగమూతి పెట్టింది చిట్టి.
    "ముందు మా అమ్మకి నేను పుట్టలేదా? తరవాతేగా మా నాన్న వచ్చాడూ? అలాగన్న మాట." అర్ధం అయిందా అన్నట్టుగా విశాలి వైపు చూసింది చిట్టి.
    నవ్వాపుకోలేకపోయింది విశాలి.    
    అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో చూడ'టానికి అప్పుడే బయటికి వచ్చిన ముకుందరావు కూతురు మాటలు విని తనుకూడా నవ్వకుండా ఉండలేకపోయాడు.
    అప్పుడే గేటు తీసుకుని లోపలికి వస్తూన్న రామానికీ దృశ్యం కంటపడింది.
    వాళ్ళ గుమ్మంలో నిలబడి ముకుందరావు నవ్వు తున్నాడు.
    ఇక్కడ మెట్లమీద కూర్చుని విశాలి నవ్వుతూంది.
    చెల్లెలిమీద ఎగరడానికి ఇంతకన్నా మంచి ఘట్టం ఇంకేం కావాలి?
    విసురుగా లోపలికి వెళ్ళాడు.
    ఉరుము లేని పిడుగులా హుంకరించాడు: "విశాలీ!"
    "ఏమిటన్నయ్యా?"
    విశాలి లోపలికి రాగానే విరుచుకుపడ్డాడు.
    "ఇది కొంపా కాదా ముందు నాకు చెప్పు?"
    తెల్లబోయింది విశాలి.
    చుట్టూ పరికించి చూసింది.
    శుభ్రంగా రెండు పూటలా ఊడుస్తూనే ఉంది కదా? చెత్తా చెదారం ఏమీ లేదు.
    ఉన్న కొద్ది సామానూ ఎప్పుడూ నీటుగానే ఉంచుతుందాయె! ఇంకేమిటి లోపం?
    "మాట్లాడవేం?" అన్నయ్య గద్దింపుతో మరింత ఆశ్చర్యపోయింది.
    "ఏమిటన్నయ్యా నువ్వనేది?"
    "పాపం! ఏమీ తెలియదే! ఆ పిల్ల పేరు చెప్పుకుని మీ రిద్దరూ కబుర్లు చెప్పుకోవాలనుకుంటున్నారా?"
    కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది విశాలికి.
    "అన్నయ్యా! నువ్వు..."
    "నేను నేనేలే. ముందీ సంగతి చెప్పు. లేకపోతే అక్కడ నిలుచుని వాడి నవ్వు లేమిటి? ఇక్కడ నీ పకపక లేమిటి?"
    రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని లోపలికి వెళ్ళిపోయింది విశాలి.
    అన్నయ్యే అపనిందలు వేస్తుంటే తన బ్రతుకెందు కింక?
    గుండెల్లో మండే బాధని గరళంలా మింగి ఊరుకుంది చేసేది లేక.

                                *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS