Previous Page Next Page 
విశాలి పేజి 2


    "అయితే ఇంకనించీ నా కా పిల్లతో బాగా కాలక్షేపం అవుతుందేమో? నువ్వు కాలేజీ కెళ్ళినప్పుడేమీ తోచదు నాకు. ఆ పిల్లతో ఆడుకుంటూ వికసించీ."
    "నన్ను మరిచిపోతావేమో!" నవ్వింది విశాలి.    

                            *    *    *

    పనిలో చేరిన వారానికే రామం అ పనికి తిలోదకా లిచ్చాడు.
    ఆ రోజు రుసరుసలాడుతూ, చిందులు తొక్కుతూ ఇంటికి చేరాడు.
    అన్నయ్య ముఖం చూసి భయపడిన విశాలి 'ఏమి' టని అడగలేకపోయింది.
    అదే తెలుస్తుందిలే అని ఊరుకున్నాడు బలరామయ్య కూడా.
    ఎవరూ అడగకుండా తనంతట తనే చెప్పుకోవలసి వచ్చినందుకు చిరాకనిపించినా చెప్పుకోక తప్పలేదు రామానికి.
    అదయినా మెల్లిగా చెప్పలేదు. ఉరుము లేని పిడుగులా హుంకరించాడు.        
    "చస్తే ఇంక నేను వాడి కొట్టు ముఖం చూడను. ఆ పనీ అక్కలేదు. ఆ సొమ్మూ అక్కర్లేదు."
    శ్రోత లిద్దరూ కూడా అసలేం జరిగిందని అడగక పోయేసరికి మళ్ళీ తనే అన్నాడు: "పనిలోకి వేళకి రావటంలేదు, పద్దులు తప్పులు రాస్తున్నావు అంటూ నలుగుర్లోనూ నాకు చెపుతాడా? నన్ను అవమానించాలని కాకపోతే!"
    నవ్వొచ్చింది బలరామయ్యకి.
    నవ్వితే వాడు మరింత రెచ్చిపోతాడని తెల్లని మీసాల సందులో తన నవ్వు నొక్కిపెట్టాడు.
    "ఇందులో అవమానం ఏముందిరా? పని సక్రమంగా చెయ్యకపోతే కూర్చోపెట్టి ఊరికే ఇస్తాడా జీతం? ఏమైనా లోటుపాట్లుంటే చెప్పే హక్కూ, బాధ్యతా ఆ షావుకారుకి లేవూ?"
    తాతయ్య మాటలకి తారాజువ్వలా లేచాడు.
    "ఇచ్చాడులే బోడిజీతం. నాకేం అక్కర్లేదు. నీ పనీ వద్దు, నీ డబ్బూ వద్దు, నీ కో సలాం అని చెప్పి చక్కావచ్చాను."
    'అఘోరించావ్! నీలాంటి సోమరిపోతులు ఇంటి కొకడుంటే చాలు, పరువు గంగలో 'కలవడానికీ, దేశం గోతిలో దిగడానికీ." మనసులోనే అనుకుంటూ మౌనంవహించాడు బలరామయ్య.
    "పొరపాటు చేశా నన్నయ్యా! అంతమాత్రానికే పని వదులుకోవడం అవివేకం. అయినా, తప్పు నీదై నప్పుడు షావుకారు మీద ఎగిరితే నష్టం నీకేగాని ఆయనకేం లేదుగా? నీ లాంటి వాళ్ళని పది మందిని పోషించగల డాయన. నువ్వు పని వదిలి వచ్చిన మరు నిమిషంలో ఇంకొకడిని తెచ్చి ఆజాగా నింపగలడు." గుండెల్లో బాధ తోసుకురాగా ఉండబట్టలేక, ముఖంలో ఏ భావమూ కనిపించనీయకుండా మెల్లిగా అంది విశాలి.
    ఉక్రోషంతో ఉడికిపోయాడు రామం. "చాల్లే! నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు."            మరొక్క మాట కూడా అనకుండా అక్కడినించి వెళ్ళి పోయింది విశాలి. తిన్నగా పెరట్లోకి వెళ్ళిపోయింది.
    జాజిపూలు వాసనలు వెదజల్లుతున్నాయి. అందిన పువ్వు తుంచి అలాగే చూస్తూ నిలబడింది. అన్నయ్య ప్రవర్తన తలుచుకుని బాధపడింది. అన్నయ్య పరిస్థితి ఎందుకని అర్ధం చేసుకోరు? ఇంకా చిన్న పాపాయినే అనుకుంటున్నాడా? చదువూ లేక, ఉద్యోగమూ చేసుకోక ఊరికే కూర్చుంటే ముందు ముందు రోజు లెట్లా గడుస్తాయి? ఆమాత్రం అర్ధం చేసుకునే వయసుకాదూ?
    ఇంతలో మనసులో ఏదో ఆశాకిరణం తళుక్కు మనగా కొంచెం ఊరట పొందింది విశాలి. అదే ఈ ఏటితో తన చదువు పూర్తయి డిగ్రీ చేతికి వస్తుందన్న ఆలోచన.
    అవును. చదువు పూర్తవగానే ఉద్యోగం చూసుకోవాలి.
    'తాతయ్యకి మంచి మంచి మందులు కొనాకానీ, అన్నయ్యకూడా ఏదైనా ఉద్యోగం చేసుకుంటే, అప్పుడే నిజమైన తృప్తి తనకి.
    "అన్నయ్యా!" చిన్నగా మనసులో గొణుక్కుంది విశాలి. "మనల్ని కంటికి రెప్పలా కాచిన తాతయ్య మనసు పాడుచెయ్యకు. తాతయ్య చెప్పినట్టు నడుచుకో, అన్నయ్యా! నీ మంచి కోరేకదా తాతయ్య చెపుతున్నది? అర్ధం చేసుకో వెందుకని!" గుండెల్లో బాధ కరిగికన్నుల్లో నిలిచింది విశాలికి.
    "అమ్మా, విశాలీ!" తాతయ్య పిలుపుతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది.
    "వస్తున్నా" అంటూ చెంగుతో కన్ను లద్దుకుని లోపలికి నడిచింది.
    
                              *    *    *

    తరవాత వరసగా రెండు మూడు కొట్లలో పనికి కుదరడం, అక్కడకూడా దెబ్బలాట పెట్టుకుని పనికి స్వస్తి పలకడం అయి ప్రస్తుతం ఊరికే తిరగడంలో కాలాన్ని వ్యర్ధంగా వెళ్ళబుచ్చుతున్నాడు రామం.
    ఆ రోజు ఏదో డిటెక్టివ్ నవల చదువుతూ పడక కుర్చీలో కూర్చునుండగా చిట్టి వచ్చింది లోపలికి.
    ఒకసారా పిల్ల వంక చూసి మళ్ళీ తన పుస్తక పఠనంతో మునిగిపోయాడు.
    అక్కడే మంచంమీద పడుకుని ఏమీ తోచక అవస్థ పడుతున్న బలరామయ్యకి చిట్టిని చూడగానే ప్రాణం లేచి వచ్చింది.
    "రా, అమ్మా! చిట్టీ, రా!" నవ్వుతూ పిలిచాడు. మంచం పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుంది చిట్టి.
    ఏవో కబుర్లు చెపుతూ మధ్యలో ఉన్నట్టుండి, "నీకు జరం ఎప్పుడు తగ్గిపోతుంది, తాతయ్యా?" అంది చిట్టి ముఖం సీరియస్ గా పెట్టి.
    నవ్వొచ్చింది బలరామయ్య కి. "ఏం?" అన్నాడు నవ్వు దాచుకుంటూ.
    "మరేమో! ఎన్ని మందులో వేసుకుంటున్నావు కదా? ఇంకా ఎందుకు తగ్గలేదు నీకు? తొందరగా తగ్గిపోతే చక్కగా మనిద్దరం కలిసి బొమ్మలపెళ్ళి చెయ్యచ్చు. ఆడుకోవచ్చు." కళ్ళు తిప్పుతూ ముద్దుగా చెప్పింది చిట్టి.
    "అసలు నేను చదువుకుని డాక్టర్నయిపోతాను. అప్పుడు నీకు మంచి మంచి మందు లిస్తాను. అప్పుడు నీకు తగ్గిపోతుంది. కదూ?" తల గట్టిగా ఆడించి ముచ్చటగా చెపుతున్న చిట్టినీ, చిట్టికి తలమీద ఉన్న ప్రేమనీ చూస్తుంటే ఏదో పరవశత్వం కలిగింది బలరామయ్యకి.
    చటుక్కున స్టూల్ మీంచి దిగి రామం దగ్గరికి వెళ్ళింది చిట్టి.
    "ఏమిటి చదువుతున్నావన్నయ్యా?" రామం చేతిలో పుస్తకం చూస్తూ అడిగింది.
    "ఏదో కథల పుస్తకం చదువుతున్నాడమ్మా!" రామం ఎంతకీ మాట్లాడకపోవడంతో తనే జవాబిచ్చాడు బలరామయ్య.
    "ఎప్పుడూ కథల పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటావేం టన్నయ్యా నువ్వు? అక్కయ్యలాగా కాలేజీ కెళ్ళవా? చదువుకోవా?" అమాయికంగా అడిగింది చిట్టి.
    ఈర్ష్య, అసూయ, కోపం, ఉడుకుమోత్తనం ఒకదాన్ని మించి ఒకటి మనసులోంచి ఉబికి పైకి రాగా - "నీ కెందుకు? పో అవతలికి" అంటూ చేతిలో పుస్తకంతో చిట్టి నెత్తిమీద ఒక్కటి వేసి అక్కడినించి వెళ్ళిపోయాడు రామం.
    నెత్తిమీద తడుముకుంటూ, బిక్కముఖంతో బలరామయ్య దగ్గరికి వచ్చింది చిట్టి.
    ఆయన ఏదో అనేంతలోనే - "మా అమ్మలాగే అన్నయ్యకూడా మంచివాడు కాదా, తాతయ్యా?" అంది అదోలా చూస్తూ.
    భ్రుకుటి ముడిచాడు బలరామయ్య.
    "అదేమిటమ్మా! తప్పు, అలాఅనకూడదు, అందరూ మంచివాళ్ళే, మీ అమ్మని మాత్రం మంచిది కాదని ఎవరన్నారు?"
    "నేనే." కళ్ళు గుండ్రంగా తిప్పింది చిట్టి.
    "విశాలక్కయ్య చాలా మంచిది? అవునా? కాదా? మా అమ్మకి విశాలక్కయ్యంటే ఎంత కోపమో నీకు తెలియదు. మా నాన్నతోకూడా అస్తమానం దెబ్బలాడుతూ ఉంటుంది. అందుకే మా అమ్మ మంచిది కాదు."
    బాధగా నిట్టూర్చాడు బలరామయ్య.
    అంత చిన్న పిల్లముందుకూడా చులకనై పోయిన వాళ్ళమ్మ ప్రవర్తనకి తలుచుకుని జాలి పడ్డాడు.
    "చూడు, చిట్టీ! మీ అమ్మని గురించి నువ్వలా మాట్లాడకూడదు. ఇంకెప్పుడూ అలా ఎవరి దగ్గిరా అనకేం, అమ్మా?" అనునయంగా అన్నాడు.
    భయం భయంగా ఆయన ముఖంలోకి చూస్తూ సరేనన్నట్టు తల ఆడించింది చిట్టి.

                             *    *    *

    ఆ రోజు మధ్యాహ్నం చిట్టి వాళ్ళమ్మ తమ ఇంట్లోకి వస్తూండటం చూసి ఆశ్చర్యపోయింది విశాలి.
    ఎప్పుడూ ఇంతవరకూ ఆవిడ తమ ఇంటికి రాలేదు పక్క ఇల్లే అయినాకూడా.
    మాట్లాడటంకూడా అంతంతమాత్రమే.
    ఏ ఒకటి రెండుసార్లో తనని పలకరించిందంతే. అదయినా సోలెడు కందిపప్పుంటే ఇమ్మని ఒకసారీ, మా చిట్టి మీ ఇంట్లో ఉందా అనొకసారీనూ. కాలేజీకి వెళ్ళబోతున్న విశాలి, చేతిలో పుస్తకాలు పక్కన బల్ల మీద పడేసి చిరునవ్వుతో "రండి"  అంది మూలనున్న చాప తీసి పరుస్తూ - అప్పుడు చూసింది ఆవిడ చేతిలో కుంకంభరిణ.
    నుదుట కుంకంబొట్టు ఉంచుతూ ఎందుకోగాని ముఖం చిట్లించుకుని ముభావంగా సాయంత్రం పసుపూ కుంకానికి రమ్మంది. ఏదో నోము నోచుకుందిట. ఆ నోము పేరేమిటో అప్పుడే మరిచిపోయింది విశాలి. అసలావిడ సరీగ్గా చెపితేగా అర్దమయ్యేందుకు? రెండోసారి అడిగేందుకు భయం వేసి ఊరుకుంది విశాలి.
    "కూర్చోండి."
    "అబ్బే! వెళతాను." గది నాలుగు వైపులా పరీక్షగా చూసి మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయిందావిడ.
    సాయంత్రం రాగానే పుస్తకాలు అలమారలో దాచి, కాళ్ళు కడుక్కుని తాతయ్య దగ్గరికి వెళ్ళింది విశాలి.
    ఆయనకి వెయ్యవలసిన మందులు వేసి, మంచినీళ్ళందించింది. "ఇంకా మంచినీళ్ళు కావాలా, తాతయ్యా?"
    వద్దన్నట్టుగా సైగ చేశాడాయన.
    మన సదోలా అయిపోయింది విశాలికి ఆయన ముఖం చూస్తుంటే, ఏవో బాధపడుతున్నట్టు తోచింది ఆ ముఖం చూస్తుంటే.
    మంచినీళ్ళ గ్లాసు పక్కనే బల్లమీద ఉన్న మర చెంబు మీద పెట్టేసి, తాతయ్య పక్కన కూర్చుంది.
    అసలీ రోజు వంట తొందరగా చేసి, తయారయి పక్కవాల్లింటికి పేరంటానికి వెళ్ళాలనుకుంది. ఇప్పుడు మాత్రం పోయిందేముంది? కొంచెం ఆలస్యం అయితే కావచ్చు పేరంటానికి వెళ్ళడం. అయినా ఈ రోజుల్లో చీకటి పడ్డాకకూడా పేరంటాళ్ళు వస్తూ పోతూనే ఉంటారు. తను వెళ్ళడం కొంచెం ఆలస్యం అయినా ఫర్వాలేదు. తప్పేముంది? తనకి తనే సర్ది చెప్పుకుంది విశాలి.
    అసలింతకీ తన మనసు చెదరడానికి కారణం, రోజూ తను రాగానే ప్రేమగా పలకరించి, కాలేజీ గురించి ఏవో ప్రశ్నలు వేసి ఆ తరవాతే తనిచ్చే మందులు వేసుకునే తాతయ్య, కాలేజీనుంచి తను రాగానే ఈ వేళ పలకరించకపోవడమే కాక దేన్ని గురించో ఆలోచిస్తూ బాధపడుతున్నాడు.
    తాతయ్య బాధేమిటో తెలుసుకోకుండా వంటలోకి ఎలా వెళ్ళగలదు తను? "ఒంట్లో ఎలా ఉంది, తాతయ్యా?" ఆత్రతగా ఆయన కళ్ళలోకి చూసింది.
    "బాగానే ఉంది, తల్లీ. నీ గురించే ఆలోచిస్తున్నాను."
    "నా గురించా?" కళ్ళు మరింత పెద్దవి చేసింది విశాలి. ఆప్యాయంగా మనమరాలిచేతి నందుకున్నాడాయన.
    "అవునమ్మా! నిన్నో ఇంటిదాన్ని చెయ్యకుండానే వెళ్ళిపోతానేమోనని బెంగగా ఉంది."
    "ఏం మాటలు, తాతయ్యా, అవి!" వినలేకపోయింది విశాలి.
    "అవును, తల్లీ! నిజం వినడానికి ఎప్పుడూ భయం గానే ఉంటుంది. కానీ, జరిగేది జరగక మానదు.... మీ అమ్మా, నాన్నే కనక ఉంటే నిన్నీ పాటికి ఓ ఇంటిదాన్ని చేసేవారు కాదూ?"
    "ఇప్పుడు నా పెళ్ళికి తొందరొచ్చిందా?" విశాలి మనసులో ఏ లోకాన్నో ఉన్న తను ఎరగనైనా ఎరగని అమ్మ, పదేళ్ళవరకూ ముద్దుగా పెంచిన నాన్న మెదిలారు. కన్నుల్లో నీరు సుళ్ళు తిరిగింది. అమ్మా, నాన్నా ఉంటే ఎంత బాగుండేది! కొందరికి చిన్నతనాన్నే అమ్మా, నాన్నల్ని కరువు చేస్తాడెందుకు భగవంతుడు? బాధగా, నిట్టూర్చింది విశాలి.
    "నువ్వెందుకోగాని ఇలాంటి ఆలోచనలతో అస్తమానం మనసు పాడు చేసుకుంటూ ఉంటావు. ఎలా జరగవలసి ఉంటే అలాగే జరుగుతుంది. రెస్టు తీసుకో" అంది చివరికి ఇంకేం మాట్లాడాలో తోచక.
    "ఎందుకేమిటమ్మా? బాధ్యత లెక్కడికి పోతాయి మరి?" నన్నగా తనలో తనే అనుకుంటున్నట్టుగా అన్నాడాయన.
    ఒక నిమిషం అలాగే కూర్చుండిపోయింది విశాలి.
    భారంగా నిట్టూర్చి మెల్లిగా వంటఇంట్లోకి నడిచింది.
    మనసేదోలా అయిపోగా పరధ్యానంగానే వంట పూర్తి చేసి, స్నానం చేసి వచ్చింది.
    చిన్నఅద్దం చేతిలోకి తీసుకుంది బొట్టు పెట్టు కుందుకు.
    ఎప్పుడో తను స్కూల్లో చదివేరోజుల్లో ఎందులోనో ప్రైజుగా వచ్చిన అద్దం అది.
    స్కూల్లో తనకి ప్రతి ఏడాది ఎన్నిటల్లోనో బహుమతులుగా ఎన్ని పుస్తకాలో వచ్చాయి.
    ఆ పుస్తకాలు, ఆ పుస్తకాలే కాదు, నిజం చెప్పాలంటే ఏ పుస్తకమైనా తనకి ప్రాణంతో సమానం. వాటితో సమానంగా చూసుకుంటూంది ఈ అద్దాన్ని. అద్దంలో ప్రతిబింబం అందంగా నవ్వింది.
    "ఏ అలంకారం చేసుకోకుండానే నీ ముఖం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది." తన బుగ్గమీద చిటికె వేసి మొన్న సువర్ణ అన్న మాటలు గుర్తుకొచ్చి సిగ్గుతో ఎరుపెక్కాయి విశాలి చెంపలు. కిటికీపక్క ముద్దమందారం తొంగిచూసింది. పెరటి తలుపూ, వంటింటి తలుపూ వేసి ఇవతలికి వచ్చేటప్పటికి రామం వచ్చాడు.
    తాతయ్యతోనూ, రామంతోనూ చెప్పి పక్కింటికి బయలుదేరింది విశాలి.
    నాలుగు మూలలా సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి.
    ఆకాశంలో అక్కడక్కాడా వింత కాంతిలో ఎర్రరంగు వెలుగుతూంది.
    ఎప్పుడూ పక్కింట్లో అడుగు పెట్టని విశాలి ఆలోచిస్తూ బెరుకుగా గుమ్మం ఎక్కింది.

                                  *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS