Previous Page Next Page 
ఉదాత్తచరితులు పేజి 2


    
    వీణకు ఇది హెల్ లాగా ఉంది.
    డాక్టర్స్! లేడీ డాక్టర్స్! అంతా ఇక్కడినుంచి వచ్చిన వాళ్ళేనా? తను ఎంతగానో ఊహించింది. కుర్చీపై కాళ్ళు పెట్టుకొన్నారు. అలాగే తింటున్నారు కూడా.
    తను చదివిన కాలేజీలో హాస్టల్ అమ్మాయిలు భోజనం చేశాక పళ్ళెం కడిగి పైపులో నీళ్ళు అందులో పట్టుకొని తాగుతారు. రూమ్సునుండి గ్లాసులు తెచ్చుకోవటానికి బద్ధకం చేసి. మొదట అసహ్యించుకొన్న వాళ్ళుకూడా తరవాత అలాగే చేసేవాళ్ళు.
    ఆ డైనింగ్ హాల్, ఈ డైనింగ్ హాల్ ఒక్కటిగానే ఉన్నాయి.
    ఆ మాటే జుబేదాతో ఆ తరవాత అంటే, "అక్కడి వారే ఇక్కడివారు" అంది జుబేదా.
    రూమ్సుకి వెళ్ళాలంటే భయంగా ఉంది. సోఫియా అడుగులో అడుగు వేసి నడుస్తున్నారు.
    నవ్వులు. కేరింతలు, ఓ కొత్త అమ్మాయి పుర్రె, కొన్ని పొడుగాటి ఎముకలు పట్టుకొని డాన్సు చేస్తూ ఉంది. మరో అమ్మాయి చిప్పపట్టుకొని అడుక్కొంటున్నట్లు అభినయిస్తూ ఏడుస్తున్నది. ఆ సీను ఎంతో జాలిగా ఉంది.
    ఎటో చూస్తున్న వీణ కెవ్వుమని కేక పెట్టింది. ఎదురుగా నల్లని ఆకారం. నిక్కరు, బనియనుతో ఉన్నాడు.
    "మేడమ్! మీ పేరు?" అని గొణిగాడు.
    సోఫియా నవ్వుతున్నది.
    "బ్రదర్! నీ పేరు చెప్పు" అని ఆ అబ్బాయిని అమ్మాయిలు చుట్టివేశారు.
    "రాము!" అంటూ బాయిస్ హాస్టల్ వైపు పరుగుతీశాడు.
    కొత్తగా వచ్చిన అబ్బాయిల, అమ్మాయిల మీద ప్రతీకారం తీర్చుకొన్నట్లుంటుంది పాత విద్యార్ధినీ, విద్యార్ధుల ప్రవర్తన!
    లావుగా ఉన్న అమ్మాయిల దగ్గరకు వచ్చి, "మీడయట్ ఏమిటమ్మా!" అంటారు నవ్వు దాచుకొంటూ.
    మరునాటి నుంచే క్లాసులు మొదలు.
    గుండె బితుకు బితుకు మంటున్నది.
    కొత్త అబ్బాయిని ఏదో ఒక పేరుతో. "రాంబాబూ! నీకు గరల్ ఫ్రెండ్ ఉందా?"అంటారు.
    "లేదు, సార్!"
    "ఛీ! ఏం మగాడివోయ్! ఫ్రెండ్ షిప్ చేసుకొని రా!" అని అమ్మాయిల దగ్గరకు పంపుతారు.
    విలువైన వస్తువులు పాడు చేస్తారు. సర్టిఫికెట్స్ కూడా చించిననా రున్నారు. మసి పూస్తారు ఒంటికి. ఆముదం తాగమంటారు. అర్ధనగ్నంగా చేస్తారు.
    అమానుష కృత్యాలు చేస్తూ మానసికానందాన్ని పొందుతారు. జలిపడుతూ దూరంగా ఉండేవాళ్ళూ ఉంటారు.

                            *    *    *

    కాలేజీ ముందు కొత్త అమ్మాయిలను సీనియర్ అబ్బాయిలు అడ్డగించారు.
    "మిస్ జుబేదా! ఎమ్. బి. బి. ఎస్ అంటే ఏమిటి?"
    తప్పించుకొని పోజూస్తున్న వీణను చూసి అటకాయించి, "మిస్..... వైవిక్టోరియాస్ బోటమ్ ఈజ్ ఆల్ వేస్ వెట్!" అని  తల వంచి నిల్చున్న వీణను చూస్తూ, "పోనీ! మీ ఊర్లో ఏం పండుతాయి?" అన్నాడు ఓ సీనియర్.
    'నీ తలకాయ!' అందామనుకొంది వీణ.
    కాని, అంతకు మునుపు ఇలాగే వసుంధరకు ఒళ్ళు మండి ఏదో సమాధానం చెప్పితే ఆడా మగా అందరూ ఏకమై 'హెడ్ వెయిట్' అంటూ భోరుమని ఏడ్చేంత వరకు వదలలేదు.
    "వీణ! చక్కని పేరు. వీణ వాయిస్తావా?"
    "...."
    వీణ ఎంతకీ మాట్లాడకపోతే, "ఆర్ యు డంబ్!?" అన్నారు.    
    క్లాసుకు పోతున్న సోఫియా అటుగా పోతూ వారి దగ్గరకు వచ్చి వీణ, జుబేదాలను టీజ్ చేస్తున్న అబ్బాయితో, "మీ నోట్స్ ఒకసారి ఇస్తారా!" అంటూ మాటల్లోకి దింపి, వీణ, జుబేదాలకు వెళ్ళిపొమ్మని సైగ చేసింది.
    వారి కళ్ళకి సోఫియా ఓ దేవతలా కనపడింది. కారిడార్ లో ఎంత నడుస్తున్నా క్లాసు రానట్లే ఉంది. నలుగురు బాయిస్ ఒక ప్రెషర్ ని పట్టుకొని తోస్తున్నారు. బాలుతో ఆడినట్లు ఒకరి దగ్గర నుండి మరొకరి దగ్గరికి తోస్తున్నారు. ఏడుపు ముఖంతో నెట్టిన వైపు కల్లా వెళుతున్నాడు.
    తక్కిన ప్రెషర్సు దీనంగా నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు చూస్తున్నారు.    
    మెట్లు దిగుతూ వచ్చిన అతను లెక్చరర్ కాబోలు. "ఇక వారిని క్లాసుకు పోనివ్వండి" అన్నారు.
    వారిని వదిలి వెళ్ళిపోతున్న సీనియర్స్ భుజాలపై చేతులు వేసుకుని, అంతవరకు వారి మధ్య బంతిలా తిరిగిన అబ్బాయికూడా వెళ్ళాడు నవ్వుతూ.
    చకితులై చూశారు ప్రెషర్స్! ఆ అబ్బాయి కొత్తవాడు కాదన్న మాట! ఎంత నాటకం!
    హైస్కూలు పిల్లల్లా ఒకరి కొకరు రాచుకొంటూ క్లాసురూములోకి వెళ్ళారు.
    వీణ, జుబేదాలు కలుసుకొన్న కొన్ని గంటలకు స్నేహితులై పోయారు. ఒకరిని విడిచి మరొకరు ఎక్కడికీ వెళ్ళటం లేదు.
    క్లాసురూము పెద్ద హాలు. గాలరీలా ఉన్న సీట్ల కూర్చున్నారు. స్టూడెంట్సు దాదాపు వందమంది అబ్బాయిల వంక చూడాలంటే బెరుకుగా ఉంది, ఆ వరకు గరల్స్ స్కూల్లో చదివిన అమ్మాయిలకు.
    కళ్ళెత్తి చూడలేని వీణ చూపులను క్రింద ఉంచింది. అన్ని జతల బూట్లను చూడగానే గుండె దడదడలాడింది.
    మాస్టారు వచ్చారు. అందరూ లేచి నిలుచున్నారు.
    తెల్లని బట్టల్లో తెల్లగా ఉన్న మాస్టారు మాట్లాటం మొదలుపెట్టారు. అతని ఇంగ్లీషు మొదట అర్ధం చేసుకోలేకపోయారు. సంవత్సరమంతా ఆ బాధ తప్పదేమో! ఇంగ్లీషు సబ్జెక్ట్ మొదలు పెట్టుతున్నఏమేమి బుక్స్ కావాలో, సిలబస్, పేపర్ మోది ఏమిటో చెప్పుతూ, స్టూడెంట్స్ ఎలా ప్రవర్తించాలి రెగ్యులర్ గా క్లాస్ కి అటెండ్ అవాలని మెడికల్ కాలేజ్ రూల్సు తెలియపరిచారు. అప్పటికి ఆ పీరియడ్ ముగిసింది. తరవాత ఫిజిక్స్ క్లాసు.
    మాస్టారు వచ్చారు. పరిచయాలు జరిగాయి.
    అంతలో క్లాసు బయట ఒక స్టూడెంట్, "సర్ మిస్ వీణ, జుబేదాలను పంపండి!" అన్నాడు.        
    మాస్టారు "ఎస్!" అనగానే, 'ఎందుకో! ఏమిటో అనుకొంటూ మనస్సులు చిక్కబట్టుకొని బయట వచ్చారు. మరిద్దరు అబ్బాయిలు చాటుగా ఉన్నారు.
    "రండి!" అంటూ వారిని వెంట పెట్టుకోక్లాసులు దాటుకొని కాలేజీ బయటకు వచ్చారు.
    కాలేజీ ఆవరణలో మరి కొంతమంది గరల్స్ కలిశారు. అందరు కలిసి కాంటీన్ లోకి వెళ్ళారు. కసాయి వెనక గొర్రెల్లా వస్తున్నా వీణ, జుబేదాలను చూచి నవ్వింది సోఫియా.
    సోఫియాను చూసి గ్రీష్మర్తువులో వానజల్లు పడినట్లు తేలికైన మనస్సులతో సోఫియా దగ్గర కూర్చున్నారు. అబ్బాయిలలో ఒకడు పుస్తకాల బల్లమీద పడేస్తూ, "తెచ్చేశాము, గురూ!" అన్నాడు.
    అప్పుడు చూశారు వీణ, జుబేదాలు పేపర్ చదువుతున్న అతన్ని! అతను కూర్చుని ఉన్నా, పొడవై అతనని చెప్పవచ్చును. సన్నని యువరాజు మీసం క్రింద ఉన్న పెదాలు నవ్వుతున్నట్లున్నాయి. అతడి కళ్ళు మంచివాడి కళ్ళవలే ఉన్నా పొడుగాటి ఆ ముక్కు తీరు అనుకున్నది చేయక మానడు అన్నట్లు దృఢత్వాన్ని తెలుపుతున్నవి. వత్తైన వెంట్రుకలతో చక్కని క్రాపుగల రాజీవ్ లో అందం కంటే ఆకర్షణ ఎక్కువగా ఉంది.
    అంతవరకు చదువుతున్నట్లు నటిస్తున్న పేపరు ముడుస్తూ వీణ, జుబేదాలను పరీక్షిస్తున్నాడు. వీణ నల్లని కన్నులలో బెరుకుతనం ఇట్టే కనిపిస్తున్నది. చూసే కొలది వీణలో శుక్లపక్ష చంద్రునిలా అందం, ఆకర్షణ ఎక్కువవుతున్నది.    
    జుబేదాకూడా అందంగా ఉంది. కాని, వీణను చూడగానే అతని హృదయం కొత్తగా స్పందిస్తున్నట్లుంది. తక్కిన అమ్మాయిలు రాజీవ్ ని తమ వైపు ఆకర్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఏదో మాట్లాడుతున్నారు. నవ్వుతున్నారు.
    సీనియర్స్ ఎంతో నిర్భయంగా, ఫ్రీగా నవ్వుతూ, అబ్బాయిలతో మెలుగుతున్నారు.
    "ఈ భయం, పిరికితనం పోయి తనుకూడా అలా మెలుగుతుందా!' అని వీణ, జుబేదాలు ఎవ్వరికి వారే అలా తలుచుకొన్నారు.
    సోఫియా రాజీవ్ నే చూస్తూ ఉంది. అతని కళ్ళలో కనుపించిన మెరుపును చూసింది.
    తనకి అందనివాడని తెలిసినా, ఏదో తెలియని బాధ అనిపించింది. ఇన్నాళ్ళూ అతను ఎవ్వరి సొత్తూ కాదు. అదో తృప్తి. కొత్తగా, బిడియంగా తనే ఆధారంగా అన్నట్లు చూస్తున్న వీణ స్వీట్ సెవెన్ టీన్ పై క్షణంలో కలిగిన ఈర్ష్యను మొదటిలోనే తుంచివేసింది, విచక్షణాజ్ఞానం గల సోఫియా, సాదరంగా వారివైపు చూసింది.
    కొత్త అమ్మాయిలను ఏవేవో ప్రశ్నలు వేస్తాడని, కళ్ళలో నీరుబికితే చూసి ఆనందిద్దామని అనుకొంటున్న వారికి నిరాశ కలిగింది. అందరికీ కూల్ డ్రింక్స్ తెప్పించాడు. సిగ్గు పడుతూనే అందుకొన్నారు కొత్త అమ్మాయిలు.
    రాజీవ్ సోఫియాను చూశాడు. పరిపూర్ణత చెందిన స్త్రీ గోచరించింది. తిరిగి క్లాసుకి వెళ్ళేటప్పుడు ఓ కొత్త అబ్బాయిని చొక్కా తీసివేసి పులి ఆట ఆడమంటున్నారు. గడుగ్గాయి బనియనుకూడా తీసి, ట్యూన్ పలుకుతూ పులి ఆట మొదలుపెట్టాడు.
    చప్పట్లు, నవ్వులు.
    వీణ తనూ కొత్త అని మరిచి హాయిగా నవ్వుతున్నది. కనీ కనపడని పలువరస, రెండు బుగ్గలమీద సొట్టలు-నవ్వుకు మరింత అందాన్ని చేకూర్చాయి. ఆ నవ్వులో చిలిపితనం, పసితనం మిళితమయ్యాయి.
    వీణ వైపే దృష్టి ఉంచిన రాజీవ్, "సోఫీ! షీ ఈజ్ మై గర్ల్!" అన్నాడు.
    "లక్కీ గర్ల్!" అంది సోఫియా.
    ఆ సంభాషణ విన్న జుబేదాకి అర్ధం కాలేదు.
    తిరిగి ఎవ్వరి క్లాసుల్లోకి వారు వెళ్ళారు.
    ఆ క్షణం మంచి  తానొక కొత్త వ్యక్తి అయినట్లు భావించాడు రాజీవ్! వీణకంటే అందమైన అమ్మాయిలు ఉన్నారు. వారివైపు ఆకర్షింపబడ్డాడు. కాని, హృదయం మెత్తబడటం, ఈ స్పందన ఎన్నడూ కలగలేదు!
    రాజీవ్ ఫైనల్ ఇయర్. ఎత్తుకు తగిన లావుకు ఉన్న వయస్సుకంటే పెద్దగా కనిపిస్తాడు. కలిగిన కుటుంబంలో పుట్టి డబ్బు ఖర్చు చేయగల తాహతు ఉంది. ఆడ, మగ స్నేహితులకు కొదువ లేదు.
    చదవకపోయినా, పరీక్షలలో ఉత్తీర్ణుడై పోతూంటే అతనికే సిగ్గేసి, చదివి స్వయంకృషి వలన పై సంవత్సరం లోకి వచ్చాడు. మరి ఎలా వచ్చిందో కాని 'రౌడీ' అని పేరు వచ్చింది. అతనంటే భయం ఉన్న మాట నిజం!
    సోఫియా లాటివారు అతని అండన చేరి సుఖంగా జీవించేస్తుంటారు!
    'వీణ. వీణ వచ్చిందని లక్ష్మిగారికి చెప్పాలి' అనుకొంటూ వెళ్ళాడు రాజీవ్.

                                             *    *    *

    ప్రాక్టికల్స్ కు ఫిజిక్స్ లాబ్ దగ్గర అందరూ గుమిగూడారు. బాచెస్ డివైడ్ చేసి కొందరిని ఫిజిక్స్ కి, కొందరిని కెమిస్ట్రీకి, కొందరిని బాటనీకి, మరికొందరిని జువాలజీకి పంపారు.
    వీణ, జుబేదాల పేర్లు ఆల్ఫబెట్ ప్రకారం దూరంగా వచ్చాయి. ప్రాక్టికల్స్ లో విడిపోయారు.
    జువాలజీ ప్రాక్టికల్స్ ఎంతో ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. మొదటిసారిగా జువాలజీ డిపార్టు మెంటులోకి వెళ్ళగానే ఏమీ కొత్తగా అనిపించలేదు. పి. యు. సి. లో కప్పల్ని, కాక్ రోచెస్ ని డిసెక్ట్ చేయటం వలన అంతా మామూలుగా ఉంది. కప్పల్ని తెచ్చే అటెండర్లు కొందరు మాస్టార్ల లాగానే ఉన్నారు. ఒక అటెండరును చూసి, విశాల- "నమస్కారం, సార్!" అంది.
    "అతను అటెండరు" అంది వీణ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS