Previous Page Next Page 
మూడుముళ్ళూ పేజి 2


    'మా ఇంటికి చుట్టాలు వస్తార్ట ఇవ్వాళ! మా సుబ్బక్క పట్టుపరికిణా కట్టుకుంది! మా అమ్మ కాఫీ కూడా చేస్తోంది!' గొప్పగా చెప్పాడు జగ్గూ.
    బెంచీమీద కూర్చున్న ఇద్దరు యువకులూ, ఫక్కుమని నవ్వారు. జగ్గూ వాళ్ళ వెంపు ఉడుకుమోత్తనంగా చూసాడు. నల్ల కళ్ళజోడు పెట్టుకున్న అబ్బాయి సిగరెట్టు కాలుస్తోన్న అబ్బాయితో.
    'ఇవ్వాళ వాళ్ళింట్లో పెళ్ళివారు వస్తున్నారట! ఏం, అబ్బాయి అంతేనా?' అన్నాడు. అతనివయిపు బిక్కగా చూశాడు జగ్గూ. నల్ల కళ్ళజోడు పెట్టుకున్న అబ్బాయి పచ్చగా వుండి జగ్గూని ఆకర్షించేడు. సిగరెట్లు కాలుస్తోన్న అబ్బాయి ఎత్తుగా నల్లగా వున్నాడు.
    'ఏం బాబూ! కోపం వచ్చిందా!' సిగరెట్టు కాలుస్తోన్న అబ్బాయి మృదువుగా అన్నాడు. లేదన్నట్లు తల అడ్డంగా వూపి, కిళ్ళీలు తీసుకుని, ఇంటికి వెళ్ళిపోయేడు జగ్గూ.
    సుభద్ర హాలులో కొత్త జంబుఖానా పరిచింది. హాలులోంచి లోపలికి వెళ్ళే గుమ్మానికి 'వెల్ కం' అని ఎంబ్రాయిడరీ చేసిన కర్టెను వేసింది. హాలులో ఒక వయిపు డ్రాయరూ, దానిచుట్టూ నాలుగు కుర్చీలూ వేసింది. ద్రాయిర్ మీద కూడా ఎంబ్రాయిడరీ చేసిన టేబుల్ క్లాత్ పరచి దానిమీద, చిన్నగాజు ఏనుగు బొమ్మ పెట్టింది. అది తొండం ఎత్తిపెట్టినట్లు వుండి దానిమీద అగరువొత్తులు గుచ్చుకుందుకు వీలుగా చిల్లులున్నాయి. ఆ చిల్లుల్లో, అగరువత్తులు గుచ్చింది. ఒక సారి హాలు మధ్య నిలబడి, తన సవరింపు బాగా వుందో లేదోనని చూసి, తృప్తిగా చిన్న నవ్వు నవ్వుకొంది. సుభద్ర జగదాంబ కూడా, శుభ్రమయినపట్టుచీర కట్టుకుని, బొట్టూ కాటుకా పెట్టుకుని సిగ చుట్టుకొని తయారయి పోయింది. కామేశ్వరిని-
    'రావే జడవేస్తాను' అని పించింది.
    'అట్టే రేగలేదు జుత్తు!' అంది కామేశ్వరి. తెల్లని వాయిల్ చీర, తెల్లని చోళీ ధరించింది కామేశ్వరి.
    'అదేం చీర కట్టుకున్నావు! పరికిణీ వోణీ వేసుకో లేకపోయేవా?' అంది తల్లి.
    'వోణీలు వేసుకున్నంత మాత్రాన్న చిన్న పిల్ల ననుకుంటారా!' అంది కామేశ్వరి.
    'అది కాదే! చీర కట్టుకుంటే పాతికేళ్ళ దానిలా కన్పించుతావు! వోణీలు వేసుకుంటేనే చిన్నదాని లాగుంటావు! కాలు పొడుగుదానివి కదా!' అంది తల్లి కామేశ్వరి నిర్లిప్తంగా నవ్వుకొంది.
    'తను ఎల్లా అలంకరించుకుంటే పెళ్ళికొడుకులకి ఆకర్షణీయంగా కనపడుతుందో అని తల్లి ఆదుర్దా చెందుతోంది. అయిదారేళ్ళ నించీ ఈ పెళ్ళిచూపుల తతంగం జరుగుతోంది! అందరూ వస్తున్నారు, వెళ్ళుతున్నారు. విందులు చేస్తున్నారు. కొందరికి తను నచ్చలేదు. కొందరికి తమ డబ్బు నచ్చలేదు! తనూ, తమ డబ్బు నచ్చిన పెళ్ళివారు తమయింటి ఛాయల్లో లేరు! ఇంకా ఎన్నిరోజులు, ఇల్లా అలంకరించుకుని, పెళ్ళిచూపులకి తయారవ్వాలో!' అనుకొంది కామేశ్వరి.
    కామేశ్వరి, థర్డ్ ఫారం చదువుతూండగానే పెద్దమనిషైంది. తామున్న పరిస్థితిలో పిల్ల మరీ ఎదిగితే పెళ్ళి చేయటం కష్టమని జడిసి, పెళ్ళి సంబంధాలు చూస్తూ, చదువు మాన్పించేసింది జగదాంబ!
    చదువయితే మాన్పించారు కాని, పెళ్ళి సంబంధం మట్టుకు కుదరలేదు. ఈ లోపుగా, సుభద్ర కూడా ఎదిగి పోయింది. సుభద్ర ఎదిగాక ఇంకో చిక్కువచ్చిపడింది. కామేశ్వరిని చూసుకుందుకు వచ్చిన ప్రతీవాళ్ళూ, సుభద్రని చూసి, సుభద్రని ఇస్తే చేసుకుంటామనేవాళ్ళు.
    "అదెల్లా? పెద్దమ్మాయికి అవకుండా చిన్న పిల్లకి పెళ్ళిచేయచ్చా!' అనేవారు నరసయ్య దంపతులు.
    'అట్లయితే మీ పెద్దమ్మాయికి పెళ్ళి కుదరగానే మాకు తెలియచేయండి, రెండు పెళ్ళిళ్ళూ వకమారే చేసెయొచ్చును.' అనేవారు పెళ్ళివారు. ఇల్లా తర్జన భర్జనలు జరుగుతూనే కాలం గడిచిపో సాగింది. సుభద్ర ఫిఫ్త్ ఫారం ప్యాసయింది. చిట్టిబాబు యస్. యస్. యల్. సి. ప్యాసయి పి. యు. సి. లో జాయినయ్యాడు. కామేశ్వరికి తనుకూడా చదువుకుంటే బాగుండు ననిపించటం మొదలుపెట్టింది. అందులో ఈ మధ్య వచ్చే పెళ్ళి వారంతా-
    'ఏం చదువుతోంది? అనే ప్రశ్నలు వేయటం, థర్డ్ ఫారం ప్యాసయింది- అనే జవాబు విని-
    'ప్చ్ బొత్తిగా, వానాకాలం చదువు' అని పెదిమలు విరవటం కూడా జరుగుతోంది. దానా దీనా పెళ్ళివారికి నచ్చాలంటే కూడా, కొంత విద్య అవసరం అని తెలిసింది కామేశ్వరికి. అంచేత, మెట్రిక్ పుస్తకాలు తెప్పించుకుని, చిట్టి బాబువద్దా, సుభద్రవద్దా తెలియనివి చెప్పించుకుంటూ! చదువుకో సాగింది కామేశ్వరి వరసగా చదివేసుంటే ఈపాటికి బి.ఎ. ప్యాసయి వుందును కదా! అని విచారించేది కామేశ్వరి!
    అటు పెళ్ళి అవలేదు ఇటు చదువూ అవలేదు. చదువూ, పెళ్ళీ, రెండూ కూడా, కామేశ్వరికి ఆలస్యమయి పోయేయి! పెళ్ళి కుదిరినప్పుడే చేయొచ్చును! అని చదివిస్తే, ఆ పిల్లకి చదువన్నా వచ్చును. కామేశ్వరి విషయంలో జరిగిన ఆలస్యం గుర్తించి, సుభద్రని, చదువు మాన్పించలేదు జగదాంబ! చీర మార్చుకోకుండానే మల్లెపూలు జడలో పెట్టుకుంటున్న కామేశ్వరిని చూసి నిట్టూర్చింది జగదాంబ!

                             *    *    *

    జగ్గూకి అరికాళ్ళు మాడుతోన్నా అరుగు వదిలి లోపలకిరా బుద్ధి పుట్టటం లేదు. దూరంగా మిటమిటలాడే ఎండలో నురుగులు కక్కుతూ, వస్తోన్న గుర్రం బండీని చూడగానే, జగ్గూ మనస్సు సంతోషంతో ఉరకలు వేసింది.
    'అమ్మయ్య! చుట్టాలు వచ్చేస్తున్నారు! ఇంక అమ్మ, ఉప్మా కాఫీ ఇస్తుంది తనకి!' అనుకుంటూ నాలిక తడుపు కుంటూ చూస్తున్నాడు జగ్గూ. జగ్గూ అంచనా, తప్పుకాలేదు. ఆ గుర్రంబండి సరాసరి వాళ్ళింటి వద్దకే వచ్చి ఆగింది. అందులోంచి, ఇద్దరు నడివయస్సు స్త్రీలు, ఒక మధ్య వయస్కుడూ, దిగారు. జట్కా బండి, ఆగిన చప్పుడు విని, జగదాంబ సుభద్ర, వీధిలోకి వొచ్చారు.
    'రండి రండి! వొదినా! చాలా కాలానికి జ్ఞాపకాని కొచ్చేము.' అంటూ విస్మితు రాలైన జగదాంబ వారిని ఆహ్వానించింది.
    'ఒక రాచకార్యం మీద వొచ్చాను. మా నరసన్న వూళ్ళో లేడేమిటి!' అంది వచ్చిన స్త్రీలలో కాస్త పెద్ద తరహాగా వున్న స్త్రీ ఆమెపేరు సుందరమ్మ.
    'వున్నారు. ఆయనా ఒక రాచకార్యం కోసమే తిరుగుతున్నారు. ఇంక వొస్తారు. వచ్చే వేళయింది.' అంటూ వాళ్ళని లోపలికి తీసుకవెళ్ళింది జగదాంబ. వచ్చినవాళ్ళే పెళ్ళివారనుకున్న కామేశ్వరి లోపలి గదిలోనికి వెళ్ళిపోయింది. పెళ్ళికొడుకు లేకుండా వీళ్ళెందుకు వచ్చారా అని ఆలోచిస్తూ సుభద్ర హాలులోనే నిలబడిపోయింది. వచ్చిన ఇద్దరు స్త్రీలలో రెండో ఆవిడ ఫాషన్ గా నాజూగ్గా వుంది. ఆమెకేసి విస్ఫారితంగా చూసింది సుభద్ర.
    'పెళ్ళికూతురు ఈ పిల్లేనా!' అంది ఆ యువతి. ఆమె పేరు వసుంధర.
    సుందరమ్మ భళ్ళు మని నవ్వింది. గమ్మత్తుగా వుంది ఆమె నవ్వు.
    'ఈ పిల్ల పెళ్ళి కూతురయితే ఇన్ని రోజులు పెళ్ళికాకుండా వుంటుందా! పెద్దది ఉంకోర్తి వుంది. లోపలవుండి వుంటుంది!' అంది. సుందరమ్మ కూడా వచ్చినాయన, శివరామయ్య సుందరమ్మ భర్త! ఆయన హాలులో వున్న ఒక కుర్చీలో జారబడ్డాడు.
    'ఈమె ఎవరు వొదినా?' రహస్యంగా సుందరమ్మని వంటింట్లోకి తీసుకు వెళ్ళిఅడిగింది జగదాంబ.
    'మాతోటి కోడలు కూతురితోటి కోడలు! వాళ్ళన్నయ్యకు పెళ్ళి సంబంధాలు చూడాలంటేనూ, లాక్కొచ్చాను. మన పిల్లలు ఇద్దరు వున్నారు కదా అనీ! ఎవర్నీ నచ్చితే, వాళ్ళ నిచ్చి ముడిపెట్టే యొచ్చు! పెద్దదానిక్కుదిరిందా! ఏదీ కనబడదేం!' అంది సుందరమ్మ. సుందరమ్మ, నరసయ్య, అన్నతమ్ముల పిల్లలు. అయినా, స్వంత అన్నచెల్లెళ్ళ మాదిరి ప్రేమ గౌరవాలతో వుంటారు.
    'ఆగదిలో వున్నట్లు వుంది పెద్దది! ఇంకా దానికే ఎక్కడా కుదరలేదు. ఇవ్వాళ ఎవళ్ళో చూట్టానికి వస్తారన్నారు మీ అన్న! ఏమిటో, వచ్చి చూట్టమేకాని, ఒకళ్ళకీ నచ్చటంలేదు! మా ఖర్మ ఏమిటోగాని!' దీనంగా అంది జగదాంబ.
    'అంతా ఘటన! ఇంతకి దానికి ఏవూరు నీళ్ళు ప్రాప్తో!' అంది సుందరమ్మ.
    ఇంతలో హాలులో కలకలం బయలుదేరింది. నరసయ్యగారి గొంతు వినపడింది.
    'ఇల్లా దయచెయ్యండి. ఇల్లా దయ చెయ్యండి! అబ్బో, బావగారూ! ఇల్లా దిగబడ్డారేమిటి! బహుకాల దర్శనం! మంచి సమయానికి వచ్చారు!' అంటూ హైరాను పడుతూ, నరసయ్య అందర్నీ ఒకేసారి, పలకరించుతున్నాడు. అదె సమయానికి చిట్టిబాబు బిక్క మొహం వేసుకుని, చెమటలు కక్కుకుంటూ సైకిలుమీద ఇంటికి వచ్చేడు. అతనికి మైదారవ్వ బజారులో ఎక్కడా దొరక లేదు. రేషన్ లో, పర్మిషన్ వున్న వాళ్ళకే ఇస్తారుట! గోధుమరవ్వ, శనగపప్పు బయట ఎంత డబ్బు ఇచ్చినా దొరకటం లేదుట! తల్లి ఉత్తచేతుల్తో వచ్చినందుకు ఏం అవుతుందో అని భయపడుతూ వచ్చేడు చిట్టిబాబు. ఇంటికి వచ్చేసరికి ఇంటినిండా జనం గలగల్లాడుతూ తిరుగుతోంటం చూసిన చిట్టిబాబుకి ఇంకా కంగారెత్తి పోయింది. తల్లి తనతో ప్రొద్దుటనగా చెప్పింది గోధుమరవ్వ తెమ్మని. తాను నిర్లక్ష్యం చేసాడు. రవ్వ మధ్యాహ్నం దొరకలేదు. ప్రొద్దుటే, రవ్వ దొరకని సంగతి తేలిపోతే, తన తల్లి ఇంకేదయినా, టిఫిన్ తయారుచేసి ఉంచును. ఇంకా తను రవ్వతెస్తాడు. ఉప్మా తయారుచేయొచ్చు అనుకోమంటుంది! అది కాస్త దొరకలేదు.
    ఇప్పుడు ఒకర్తే ఇంత మందినీ ఎల్లా సవరించ కలదు?
    చిట్టిబాబుకి కంగారు ఎక్కువయి పోయింది. మరక్కడ నిలబడలేక అరుగు మీదకు వచ్చేడు! ఆవేదనతో అతని కళ్ళు చెమర్చాయి. జేబురుమాలుతో కళ్ళు తుడుచుకున్నాడు. జగ్గూ కూడా నెమ్మదిగా అన్న ప్రక్కకి వచ్చి నించున్నాడు. వాడికి చాలా ఆకలిగా వుంది. కాని అమ్మకానీ, అక్కలుకాని వాడ్ని గుర్తించే పరిస్థితిలో లేరు! పైగా ఇందాక తన్ని వెక్కిరించిన, కళ్ళజోడు, సిగరెట్టు అబ్బాయిలని, ఘనంగా కుర్చీలో కూర్చోపెట్టి, రాజోపచారాలు చేస్తున్నారు. దాంతో జగ్గూకి ఆకలి మరింత జోరు అయ్యింది. అన్న దగ్గరగా వచ్చి-
    'నీకు కాఫీ ఇచ్చిందా అమ్మ!' అన్నాడు.
    'లేదు. నీకో!' అన్నాడు. చిట్టిబాబు.
    'నాకు ఉప్మాయేనా పెట్టలేదు.' అన్నాడు. జగ్గూ.
    'ఉప్మాచేసిందా అమ్మ!' అన్నాడు. చిట్టిబాబు.
    'వూఁ! బూందీ చేసింది. ఏమీ పెట్టలేదు. వాళ్ళు ఎల్లా, బొక్కేస్తున్నారో చూడు! మనకు మిగులుతాయో లేదో!' కసిగా అన్నాడు జగ్గూ.
    'తప్పు వెధవా!" అన్నాడు చిట్టిబాబు.    
    'అమ్మయ్య! అమ్మ ఎల్లానో అతి ధులకి టిఫిన్స్ తయారు చేసిందన్న మాట! అనుకుని తృప్తిగా నిట్టూర్చాడు చిట్టిబాబు అదే సమయంలో.
    'ఎండలో నిలబడుతారేమర్రా! లోపలికి రండి!' అని శివరామయ్యగారు వాళ్ళని కేకలేసారు. దానితో వాళ్ళుకూడా హాలు లోకి వచ్చారు. కామేశ్వరి గది కిటికీలో కూర్చుని పెరట్లోకి చూస్తూంది. పెరట్లో నూతిగట్టు దగ్గరగా వున్న రాచ వుసిరి చెట్టు మీద, బంగరు పిచ్చిక గూళ్ళు వున్నాయి. పచ్చని పసుపురంగు రెక్కలతోవున్న చిన్నచిన్న పిచ్చుకలు నూతి దగ్గర నీళ్ళుతోడుకునే చిన్న బాల్చీ చుట్టూచేరి కిచకిచ మంటూ ముక్కులతో పొడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాయి. వాటి స్నేహశీలతని తదేకంగా చూస్తూన్న కామేశ్వరి తను కూర్చున్న గదిలోనికి, వసుంధరా, సుందరమ్మ రావటం గమనించలేదు. వెనక్కి తిరుగున్న కామేశ్వరి వీపుమీంచి నున్నగా జారుతోన్న, జెర్రిగొడ్డులాంటి జడ వసుంధరని మురిపించింది.

                               *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS